ముద్రగడ ఇప్పుడేమి చేయవచ్చు?

640

1978 నుంచి రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్న ముద్రగడ పద్మనాభం….తాను కాపు ఉద్యమం నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. దీనిపై, ఎవరికి తోచిన…అర్ధమైన రీతిలో వారు స్పందించారు. ఎవరు ఏ విధంగా స్పందించినప్పటికీ…రాజకీయంగా ఆయన లక్ష్యం నెరవేరింది. తమ సామాజిక వర్గానికి… హామీల మీద హామీలు ఇచ్చి….అధికారంలోకి వచ్చాక , చంద్రబాబు వాటిని గాలికి వదిలేశారనే అసహనం కాపులలో పెల్లుబుకుతున్న అంశాన్ని సాధనంగా చేసుకుని…చంద్రబాబు గతంలో తనకు చేసిన అవమానానికి బదులు తీర్చుకోవాలని ముద్రగడ భావించారు.
చంద్రబాబు ఓడిపోయారు. ఆయన నమ్మలేంత ఘోరంగా ఓడిపోయారు. టీడీపీ 37 ఏళ్ల చరిత్రలో…23 సీట్లతో ఓడిపోవడం…యిదే మొదటి సారి.
ఎన్ టి రామారావు హయాం లో ఒకసారి, చంద్రబాబు హయాం లో రెండు సార్లు టీడీపీ గతంలో ఓడిపోయింది. కానీ 23 సీట్లతో ఓడిపోలేదు. ఈ సారే 23 వచ్చాయి.
కాపుల కడుపు మంట చల్లారింది. చంద్రబాబు కు తగిన శాస్తి చేయాలన్న ముద్రగడ పంతం కూడా నెరవేరింది. ఇప్పుడు…ఆ ఉద్యమం నుంచి వైదొలుగుతున్నట్టు ఆయన ప్రకటించారు.కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నారు పెద్దలు. టిట్ ఫర్ ట్యాట్ అన్నారు ఇంగ్లీషు వాళ్లు. ఎవరేమన్నా… ముద్రగడ బదులు తీర్చుకున్నారు.
చంద్రబాబు హయాం ముగిసింది, ఆంధ్ర రాజకీయాల్లో.
కానీ, ముద్రగడ రాజకీయ జీవితం ఇంకా ఉంది. అది ఇంకా ముగింపుకు రాలేదు.దానిని ఆయన అర్థవంతంగా కొనసాగించాలి. టెక్నికల్ గా ఆయన కాపు ఉద్యమంలో లేకపోయినప్పటికీ; కాపు సామాజిక వర్గ అభిలాషలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెడుతూనే ఉండాలి.
తమకు కావలసింది….విద్య,ఉద్యోగ అవకాశాల్లో తమ పిల్లలకు రిజెర్వేషన్లు;అది కూడా బీసీ ల అవకాశాలకు ఇబ్బంది ఏమీ కలగని రీతిలో అని కాపు సామాజిక వర్గం అంటున్నది. రాజకీయ రిజర్వేషన్లు అవసరం లేదని వారు చెబుతున్నారు.
ఇది ఎవటికీ ఇబ్బంది లేని కోరిక. ఈ కోరికను ప్రభుత్వం దృష్టికి పదే, పదే తీసుకువెళ్లే కృషిని ముద్రగడ కొనసాగించాలి. అందుకోసం, ఆయన వైసీపీ లో చేరడానికయినా వెనకాడ కూడదు.
గతం లో ఎం ఎల్ ఏ గా పని చేశారు, ఎంపీగా పని చేశారు. మంత్రిగా పని చేశారు. ఎక్సయిజ్, రవాణా , సివిల్ సప్లయిస్ వంటి కీలక శాఖలకు మంత్రిగా చేశారు. కిర్లంపూడి అనే గ్రామానికి రాష్ట్ర రాజకీయ చిత్రపటం లో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టారు. అన్నిటినీ మించి, చంద్రబాబు ఓటమి లో కీలక పాత్ర పోషించారు.
ఇక, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కొత్తగా సాధించవలసింది ఏమీ ఉన్నట్టు కనపడదు.
అందుకే…కాపుల చిరకాల వాంఛితమైన….విద్యా, ఉద్యోగ రిజెర్వేషన్ల ను వారి ముంగిట్లోకి తీసుకు రావడం కోసం ఆయన ….వైసీపీ ప్రభుత్వానికి దగ్గరగా రావాలి. అవసరమైతే వైసీపీ లో చేరాలి. కాల మాన పరిస్థితులకు అనుగుణంగా ఉద్యమ స్వరూపం మారుతుంటుంది అని ఆయనే చెప్పినట్టు….కాపు ఉద్యమం ఈ రూపం తీసుకుంటున్నదని కాపు సామాజికవర్గం సంతోషిస్తుంది.

-భోగాది వెంకట రాయుడు