భీకర యుద్ధమా? బంతిపూల సమరమా?

389

కేంద్రంతో దోస్తీ.. రాష్ట్రంలో కుస్తీ
విజయసాయిని వారించని జగన్
జగన్ దన్నుతోనే కన్నాపై విజయసాయి విమర్శలు?
చంద్రన్న బీజేపీ.. జగనన్న బీజేపీ.. అసలు బీజేపీ
ఏపీ రాజకీయాల్లో ‘జగన్నా’టకం?
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఎప్పుడైనా తోలుబొమ్మలాట చూశారా? ఈ తరం వారికి తెలిసి ఉండకపోవచ్చు. ఒక చిన్న తెర. లోపల  లాంతర్ల వెలుగు. అక్కడో రెండు పాత్రలు భీకర యుద్ధం చేసుకుంటుంటే.. తెరముందున్న ప్రేక్షకులు ఆనందంతో చప్పట్లు కొడతారు. లోపల  సూత్రధారులు, రెండు బొమ్మలు పట్టుకుని ఈ తమాషా చేస్తుంటారు. ఈ సూత్రధారుడు ప్రేక్షకుల ఆదరణ- విసుగును గమనిస్తూ, సమయానుకూలంగా మార్పులు చేస్తూ, కొత్త పాత్రలను ప్రవేశపెడుతుంటాడు. అందులో కేతిగాడి పాత్ర కీలకం. కాసేపు నవ్విస్తుంటాడు. కాసేపు ఏడిపిస్తుంటాడు. అంతా వాడే! ఆంధ్ర రాజకీయ రంగస్థలంపై బీజేపీ- వైసీపీ ఆడుతున్న దొంగాటకు, ఈ తొలుబొమ్మలాటకు పెద్దగా తేడా కనిపించదు!!

ఇందిరాగాంధీ జీవించి ఉన్న సమయంలో ఆమెను ఎదిరించి బయటకు వెళ్లిన వారంతా తమ పేర్లతో కాంగ్రెస్ పార్టీని స్థాపించుకున్నారు. ఆ రకంగా ఏ టు జడ్ వరకూ అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలు వెలిశాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒక కాంగ్రెస్ పుట్టింది. పేరు ముందు వైఎస్ ఉన్నా, చివరలో మాత్రం కాంగ్రెస్ పార్టీనే ఉండటాన్ని విస్మరించకూడదు. ఇదొక తరహా రాజకీయం. ఏపీలో గత ఆరేళ్ల నుంచి మరో విచిత్ర రాజకీయాలు కనిపిస్తున్నాయి. జాతీయ పార్టీ అయిన బీజేపీ పేరు మారకపోయినా, అందులోని నాయకులు మాత్రం, రెండు ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా చీలిపోయారు. ఫలితంగా.. ఇప్పుడు ఏపీ బీజేపీ ‘చంద్రన్న బీజేపీ-జగనన్న బీజేపీ’గా మారింది. టీడీపీని మానసికంగా ప్రేమించే వాళ్లను టీడీపీ బీజేపీ, వైసీపీని అభిమానించే నేతలను జగనన్న బీజేపీగా పిలుచుకుంటున్న పరిస్థితి.

కమలంపై కస్సుమంటున్నా జగనన్న మౌనం..

రాష్ట్రంలో విజయసాయిరెడ్డి బీజేపీ నేతలపై యుద్ధానికి నాయకత్వం వహిస్తున్నారు. కమలదళపతి కన్నాపై ట్వీట్లలో విరుచుకుపడుతున్నారు. మళ్లీ అదే విజయసాయి, కేంద్రంలోని పెద్దలతో టచ్‌లో ఉంటారు. మొన్ననే.. ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్‌కు ఏమీ తెలియదని విమర్శించిన  సలహాదారు అజయ్ కల్లం, మూడురోజుల క్రితమే ఢిల్లీకి వెళ్లి, ఆమెతో భేటీ అయి వచ్చారు. విజయసాయి ట్వీట్లతోపాటు, జగనన్న పాలనపై కమలదళాలు విరుచుకుపడుతున్నాయి. ఇంత జరుగుతున్నా..వైసీపీ అధినేత, సీఎం జగన్ నోరు విప్పరు. విజయసాయిని కమలంతో కలహం వద్దని వారించరు. బీజేపీ నేతలపై విమర్శలు చేయవద్దని బహిరంగ ప్రకటన చేయరు. అంటే ఏమిటీ అర్ధం? బుర్ర-బుద్ధీ ఉన్న వారికి ఈ మౌనం ఏం సంకేతాలిస్తున్నాయి? ఇదీ.. ఏపీ రంగస్థలంపై  వైసీపీ-బీజేపీ మధ్య జరుగుతున్న ఆసక్తిక ర ‘జగన్నా’టకం! దీనికి కథ, మాటలు, పాటలు, దర్శకత్వం ఎవరన్నది.. కిందిస్థాయిలో ఉన్న కమలం కార్యకర్తలకు ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.

హమేషా.. తమాషా..

ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, రాజకీయంగా రాను రాను  నిర్వీర్యమవుతోందన్న  సంకేతాల నేపథ్యంలో.. ఆ స్థానం భర్తీ చేయాలని తాపత్రయపడుతున్న బీజేపీ.. అసలు తాను రాష్ట్రంలో వైసీపీకి మిత్రపక్షమో, శత్రుపక్షమో తెలియని గంగరగోళ పరిస్థితిలో ఉంది. టీడీపీ నుంచి వలసలను ప్రోత్సహించి, బలపడాలనుకుంటున్న బీజేపీ.. అసలు తాను వైసీపీతో భీకర యుద్ధం చేస్తున్నానో, లేక బంతిపూల యుద్ధం చేస్తున్నానో సంకేతం ఇవ్వలేని అయోమయంలో ఉంది. నిజానికి బీజేపీలోనే.. రెండు వర్గాలున్న విషయం తెలిసినా,  ఢిల్లీ నాయకత్వం తమాషా చూస్తుందే తప్ప, స్పష్టత ఇవ్వని మరో వైచిత్రి. కమల దళపతి కన్నా లక్ష్మీనారాయణపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి తరచూ  ఒంటికాలితో లేస్తున్నారు. అదే విజయసాయి కేంద్ర పెద్దలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.

విజయసాయి ఆరోపణలపై ఢిల్లీ మౌనరాగం..


ఆ సందర్భంలో కూడా బీజెపీ దళపతి కన్నాపై, విమర్శలు వద్దని ఢిల్లీ పెద్దలు చెప్పలేకపోవడం ఒక విచిత్రమయితే… రిలయన్స్ మిత్రుడైన నత్వానీని వైసీపీలోకి తెచ్చి, రాజ్యసభ సీటు ఇప్పించే బాధ్యతను, అదే విజయసాయికే అప్పగించింది. చివరకు… కన్నా లక్ష్మీనారాయణ,  టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి 20 కోట్లు లంచం తీసుకున్నారని, అందుకు బీజేపీ ఎంపీ సుజనాచౌదరి మధ్యవర్తిత్వం వహించారని, ఎన్నికల సమయంలో నిధుల దుర్వినియోగం జరిగిందని విజయసాయి ఆరోపించినప్పుడూ.. అటు బీజేపీ జాతీయ దళపతి నద్దా గానీ, ఇటు రాష్ట్ర రాజకీయాల్లో తలదూర్చే జీవీఎల్ నరసింహారావుగానీ, రాష్ట్రానికే చెందిన రాంమాధవ్‌గానీ, విమర్శలకు గురైన  సుజనా చౌదరి గానీ ఖండించకపోవడం బహు విచిత్రం.

ఇన్చార్జి సునీల్ దియోధర్ కూడా.. ‘మా పార్టీ అంతర్గత వ్యవహారాలు మీకెందుకని’ ప్రశ్నించారే తప్ప, కన్నాపై విజయసాయి చేసిన తీవ్రమైన ఆరోపణలను మాత్రం ఖండించకపోవడం,  పెద్ద తమాషా! స్థానిక సంస్థల ఎన్నికల్లో.. వెంకయ్యనాయుడు మండలంలో పోటీ చేసిన, బీజేపీ అభ్యర్ధి చేతిని వైసీపీ నేతలు నరికినా, మిగిలిన ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్ధులపై దాడులు చేసినా, దానిని ఢిల్లీ నాయకత్వం సీరియస్‌గా తీసుకోకపోవడం చూస్తే.. ‘బీజేపీ-వైసీపీ యుద్ధం’ ఎంత చిత్ర విచిత్రంగా జరుగుతుందో,  మెడమీద తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది.

మిడతలదండుపై కేంద్రం మౌనం..

ఈ పరిస్థితిలో బీజేపీలో టీడీపీ నుంచి మిడతల దండు చేరిందంటూ..విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్, మరోమారు దుమారం రేపింది. ఈ మిడతవ దండు నుంచి బీజేపీ ఎలా కాపాడుకుంటుందోనన్న ఆయన వ్యాఖ్య, కొద్దిరోజుల పాటు ‘ఉద్రిక్తత సృష్టించినట్లు కనిపించింది’. సునీల్ దియోధర్, విష్ణువర్దన్‌రెడ్డి, ఆర్‌డి విల్సన్ వంటి అగ్రనేతలు తీవ్రస్థాయిలోనే, ఆ వ్యాఖ్యలపై  ఎదురుదాడి చేసినా,  వాటిని విజయసాయి అండ్ అదర్స్ పెద్దగా పట్టించుకోలేదు. అసలు జగన్, విజయసాయి నుంచి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతల వరకూ..  బీజేపీ రాష్ట్ర నాయకులను గడ్డిపరకగానే భావిస్తున్నారు. వారి విమర్శలను పట్టించుకోనవసరం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా.. బీజేపీ నేతల ఎదరుదాడి, టీవీ చానెళ్ల చర్చలు, పత్రికా ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ఇదంతా చూస్తుంటే.. రెండు పార్టీలు,  ఉత్తుత్తి యుద్ధాలు చేసుకుంటున్నారనే అనుమానాలకు తెరలేపింది.

బాబు దారిలోనే జగన్..

ఈ విషయంలో జగన్ కూడా, చంద్రబాబు దారిలోనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. బాబు కూడా గతంలో,  బీజేపీ రాష్ట్ర నేతలు తనపై చేసే విమర్శలు ఖాతరు చేసేవారు కాదు. అప్పట్లో కన్నా, పురంధీశ్వరి, కావూరి సాంబశివరావు, సోము వీర్రాజు, విష్ణువర్దన్‌రెడ్డి తనపై ఎన్ని ఆరోపణలు చేసినా పెదవి విప్పేవారు కాదు. నేరుగా మోదీ- అమిత్‌షాతోనే సంబంధాలు నెరిపేవారు. అయినా బాబును విమర్శించవద్దని, బీజేపీ నాయకత్వం రాష్ట్ర నేతలను వారించలేదు. అదే సమయంలో రాష్ట్ర పార్టీ నేతలను గౌరవించాలని అటు బాబుకూ చెప్పలేదు. కానీ, బీజేపీకి చెందిన నలుగురు ప్రముఖులు.. బాబు హయాంలో బాగా పైరవీలు చేసి, ఆర్ధికంగా స్థిరపడ్డారన్న విమర్శ అప్పట్లో వినిపించింది.

సీమలోని ఓ జిల్లాలో ఓ మంత్రి, మరో బీజేపీ అగ్రనేత కలసి రియల్‌ఎస్టేట్ వ్యాపారాలు చేశారన్న చర్చ కూడా జరిగింది. ఈ నలుగురిలో కొందరు,  లోపల బాబు వద్దకు వెళ్లి పనులు చేయించుకోవడం, బయట మీడియా వద్దకు వచ్చి, మళ్లీ బాబు ప్రభుత్వాన్ని విమర్శించడం ఆశ్చర్యపరిచేది. అమెరికాలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఓ బీజేపీ నేత.. లోకేష్‌తో పనులుంటే చెప్పండి.. చేసి పెడతానని బంపర్ ఆఫర్లు కూడా ప్రకటించిన వైనం, అప్పట్లో  రాష్ట్ర బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశమయింది.

బీజేపీ అభ్యర్ధిపై  వైసీపీ నేతల హత్యాయత్నంపైనా మౌనమే..

అంతకుముందు… సమైక్య రాష్ట్రంలో, తనకు మద్దతునిచ్చిన సీపీఎం, సీపీఐకి చెందిన  రాష్ట్ర నాయకులను కూడా  బాబు ఇలాగే ఖాతరు చేసేవారు కాదు. దానిపై సీపీఐ నారాయణ, అసెంబ్లీ లాబీల్లో మీడియా వద్ద, తన అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భం కూడా లేకపోలేదు. అయితే, అప్పట్లో తమకంటే వామపక్షాలకే బాబు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న అసంతృప్తి టీడీపీ ఎమ్మెల్యేలలో ఉండేది. అప్పట్లో సీపీఎంకు చెందిన  ఖమ్మం-నల్గొండ జిల్లాకు ముగ్గురు సీపీఎం ఎమ్మెల్యేలు, ఆర్ధికంగా బాగా స్థిరపడ్డారన్న ప్రచారం జరిగింది.

ఇప్పుడు జగన్ కూడా, రాష్ట్ర బీజేపీని అసలు ఖాతరు చేయకుండా,  నేరుగా ఢిల్లీ నాయకత్వంతోనే సంబంధాలు నెరుపుతున్న వ్యూహం కనిపిస్తోంది. ఈ పరిణామాలను ఢిల్లీ నాయకత్వం.. తంపులు పెట్టి తమాషా చూస్తుందే తప్ప, తమ నాయకుల విలువ-గౌరవం పెంచే నిర్ణయాలు తీసుకోకపోవడమే విచిత్రం. తాజాగా విజయనగరం జిల్లాలో.. బీజేపీ నేతపై, వైసీపీ నేతలు హత్యాప్రయత్నం చేసిన వైనం సంచలనం సృష్టిస్తోంది. దీనిపై బీజేపీ జాతీయ నేతలెవరూ, ఇప్పటివరకూ మాట్లాడిన దాఖలాలు లేవు. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిపై, విపక్ష పార్టీ దారుణమైన ఆరోపణలు చేస్తేనే, మౌనంగా ఉన్న జాతీయ నాయకత్వం.. ఒక సాధారణ కార్యకర్తపై హత్యాయత్నం జరిగితే, స్పందిస్తుందనుకోవడం కార్యకర్తల పిచ్చి  భ్రమ.

ఎవరి బీజేపీ వారిది!

రాష్ట్రంలో బీజేపీ సీనియర్లు రెండుగా చీలిపోయారన్నది, మనం మనుషులం అన్నంత నిజం. టీడీపీ నుంచి వెళ్లిన నేతలు, వైసీపీని శత్రువుగా భావిస్తున్నారు. చంద్రబాబును తొలి నుంచీ వ్యతిరేకిస్తున్న వారంతా వైసీపీని ప్రేమిస్తున్నారు. తొలి నుంచీ బీజేపీలో ఉన్న సంప్రదాయ నేతలు, వీరిలో ఎటువైపు మొగ్గాలో తెలియని అయోమయంలో ఉన్నారు. వ్యాపార అవసరాల కోసం బీజేపీలో చేరిన వారు, అటు ఇటు కాకుండా మిగిలిపోయారు. ఈ ముగ్గురు ఫక్తు వ్యాపారులు. రాజకీయ నేతలు కాకపోవడం వల్ల, ఎవరెలా కొట్టుకుఛస్తే మనకెందుకని మౌనంగా ఉన్నారు. పార్టీ దళపతి.. కన్నా లక్ష్మీనారాయణ మొదటి నుంచీ బాబు వ్యతిరేకి. కోట్ల విజయభాస్కరరెడ్డి నుంచి వైఎస్ వరకూ.. సభలో-బయట, టీడీపీపై విమర్శలకు కన్నానే ప్రధానాస్త్రంగా ప్రయోగించే వారు. అలాంటి కన్నాపైనే విజయసాయిరెడ్డి ఆరోపణలు చేయడం, వైసీపీలోని పాత కాంగ్రెస్ నేతలకు రుచించడం లేదు. బాబుకు బద్ధశత్రువైన కన్నా- అదే బాబుతో ఎలా మిలాఖత్ అవుతారన్నదే వారి విస్మయానికి కారణం.

కన్నా తప్ప.. చాలామంది జగన్‌ను కలసిన వారే..


ఇప్పటివరకూ కన్నా రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో, కనీసం ఒక్కసారి కూడా జగన్‌ను కలవలేదు. అదే రాష్ట్రానికి చెందిన జాతీయ నేతలు రాంమాధవ్, జీవీఎల్, సీఎం రమేష్, రాష్ట్ర నేత సోము వీర్రాజు సీఎంను వివిధ సందర్భాల్లో కలిశారు. వీరిలో రాంమాధవ్ వైసీపీకి అనుకూలమయినా- కాకపోయినా, టీడీపీకి మాత్రం విరోధి. రాంమాధవ్ గతంలో కూడా జగన్ పాలనకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇక జీవీఎల్ మాత్రం ఇప్పటివరకూ జగన్‌ను విమర్శించకపోయినా, బాబుపై ఇంకా ధ్వజమెత్తుతూనే ఉన్నారు.విజయసాయి,తన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన కన్నాపై దారుణమైన ఆరోపణలు చేస్తే, ఇప్పటిదాకా దానిని జీవీఎల్ ఖండించలేదు. ఆయన కూడా జగన్ కంటే, బాబును విమర్శించేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అంటే ఆయన ఎటువైపన్నది సుస్పష్టం.

వీరిదో తరహా విమర్శలు..


ఇక సోము వీర్రాజు, గత సంకీర్ణ సర్కారులోనే బాబుపై విమర్శనాస్త్రాలు సంధించేవారు. ఇప్పుడు ఆయన అప్పుడప్పుడూ, వైసీపీ పాలనపై విమర్శలు చేస్తున్నప్పటికీ.. అదే సందర్భంలో, గత టీడీపీ అవినీతిని కూడా ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. విజయసాయి తాజా ట్వీట్‌లో కూడా, సోము వీర్రాజు చేసిన విమర్శను ప్రస్తావించడం విశేషం. మరో అగ్రనేత విష్ణువర్దన్‌రెడ్డి సర్కారుపై విమర్శలలో ముందున్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేష్, ఈ విషయాల్లో మౌనం వహిస్తున్నారు. అయితే సుజనాచౌదరి మాత్రం, సందర్భానుసారం స్పందిస్తున్నారు. సుజనాను లక్ష్యంగా చేసుకుని, విజయసాయి అండ్ కో చేస్తున్న దాడులను, మిగిలిన బీజేపీ నేతలెవరూ ఖండించకపోవడం మరో విచిత్రం. పేరుకు చాలామంది అధికార ప్రతినిధులున్నా, వారిలో చాలామంది హైదరాబాద్‌లో స్థిరపడిన వారే. మాజీ అధికారులైన వీరంతా అసలు పార్టీలో ఉన్నారో, లేదో కూడా ఎవరికీ తెలియదు. అసలు రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దియోధర్ వైఖరేమిటో, ఎవరికీ అంతుపట్టదు. అమరావతిపై ఆయన వేసిన పిల్లిమొగ్గలు విమర్శకు గురయ్యాయి.  ఇదీ… ఏపీ కమలదళంలో కనిపించే కనువిందు దృశ్యాలు.