ముద్ర‘గడబిడ’ లేకపోతే.. ఏపీ ఏం కానూ?

రిజర్వేషన్ల కోసం కంచాలు కొట్టేదెవరు?
కాపు జాతికి ఇక దిక్కెవరు నాయకా?
పాలకులకు లేఖలు రాసేదెవరు?
కిర్లంపూడి కినుక, కాపుల అలక
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)
ముద్రగడ పద్మనాభం. కేరాఫ్ కిర్లంపూడి. తూ.గో.జి!  లేఖలు రాయడం ఆయనకు మామూలే. కానీ ఈసారి ఆయన రాసిన లేఖ కాపుజాతి కింద కాళ్లు కంపించింది. ఆవేదన-ఆగ్రహం-అలక అన్నీ కలగలసి ఎదుటపడి చెప్ప‘లేఖ’, తెలుపుటకు భాష చేతకాక.. అన్నట్లు ముద్రగడ రాసిన లేఖ ఇప్పుడో హాట్ టాపిక్!ఆయన  సీతయ్య ఒక్కటే కాదు తిక్క శంకరయ్య. ఎవరిమాట వినరు. ఏం చేయబోతున్నారో పక్కన వాడికీ చెప్పరు. తునిలో మాదిరిగా! మనసులో అనుకున్నది చేసేస్తారంతే!! కాపుజాతికి ఇలవేల్పు. నడయాడే దేవుడు. అందుకే ఆయనంటే కాపులకు పంచప్రాణాలు. ఆయన పిలుపే ఓ ప్రభంజనం. పదవులు ఆయనకు గడ్డిపరక. నీతి నిజాయితీకి నిలువుటద్దం. కాపు రిజర్వేషన్ల కోసం స్పూన్లతో కంచాలు కొట్టిన యోధుడు. పోలీసులను రానీయకుండా, ఇంట్లోనే తలుపేసుకుని దీక్ష చేసిన నేత. ఆయనకు కోపం వస్తే పాదయాత్ర చేస్తారు. ఆమరణ నిరాహారదీక్షలు చేసేస్తారు. అసలాయన బతుకున్నదే కాపుల కోసం! మరలాంటి ఉద్యమపితామహుడు, ఉన్నట్టుండి ఒక్కసారి అలిగారు. ఎవరిమీద అనుకున్నారు? సొంత కులనేతలపైనే! తన జాతి పక్షులే తనను కాకుల్లా పొడుస్తుంటే, ఆయన మనసు వికలమయి.. ‘నాకొద్దీ ఉద్యమ’మని దండం పెట్టేశారు. దశాబ్దాల నుంచి పెనవేసుకున్న ఉద్యమ బంధాన్ని తెంచేసుకున్నారు.

కాపుజాతిని ఇక ఉద్ధరించేదెవరు?మా పరిస్థితేంటీ..?


కాపుజాతి  ముద్దుబిడ్డ హటాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంతో, కిర్లంపూడి అలిగింది. అటు కాపు జాతీ,  గోదావరి తీరాన్ని తాకే స్థాయిలో కన్నీరుమున్నీరవుతోంది. మాకిక దిక్కెవని పిక్కటిల్లేలా రోదిస్తోంది. ‘ఇలాగయితే  ఇక కంచాలపై ఎవరు చప్పుళ్లు చేస్తారు? పాదయాత్రలు, ఆమరణ నిరాహార దీక్షలెవరు చేస్తారు? జేఏసీకి మార్గదర్శి ఎవరు? మా రిజర్వేషన్ల గురించి మాట్లాడేదెవరు?  లోకులు పలు కాపులు. సీతమ్మకే నిందలు తప్పలేదు. ఆపాటిదానికే ముద్రగడ అంత నిర్ణయం తీసేసుకోవాలా? కష్టాలు మనుషులకు రాకపోతే మానులకొస్తాయా? ఇదేమీ బాగోలేదు. మమ్మల్ని నడిసంద్రంలో వదిలేసి, పెద్దాయన అస్త్రసన్యాసం చేసి, ఆయుధాలు జమ్మిచెట్టుపైకెక్కిస్తే మా బతుకులేం కావాలి? శరపరంపరగా లేఖలు రాసే ఆ చేతులు విశ్రమిస్తే,  మీడియా పరిస్థితి ఏమిటి? టీవీ చానెళ్లలో డిబేట్లు చేసే వారు ఏం కావాల’ని కాపునేతలు కుమిలిపోతున్నారు.

కాపులే కాకుల్లా  పొడుస్తున్నందుకే..

అవునండీ.. అవును. మీరు విన్నదీ, ముద్రగడ పద్మనాభమనే  మహానాయకుడు, కాపుజాతిపిత చెప్పింది నిజమే! ఇకపై కాపు ఉద్యమానికి దూరంగా ఉంటానని ముద్రగడ చేసిన ప్రకటనలో, అణువంతయినా అబద్ధం లేదు. ‘ము.ప’ అనే పొడి సంతకంతో, అచ్చతెలుగులో ఆయన రాసిన లేఖనే అందుకు సాక్ష్యం. కావాలంటే ఆ లేఖను మీరే చూడండి! అసలు ఉన్నట్లుండి ముద్రగడకు ఉద్యమ నిష్క్రమణ ఆలోచన ఎలా వచ్చిందో ఆయన అభిమానులకు అంతబట్టడం లేదు. గత కొద్దికాలం నుంచీ.. కొద్ది నెలల నుంచీ.. అబ్బ.. ముసుగులో గుద్దులాట ఎందుకుగానీ.. జగనన్న సీఎం అయిన నాటి నుంచి.. కాపుజాతిపిత నోటికి తాళాలు పడ్డాయని, కాపు రిజర్వేషన్లపై జగనన్నను ప్రశ్నించడానికే మహా మొహమాటపడున్నారని, కాపుసోదరులు సోషల్‌మీడియాలో పెడుతున్న  పోస్టులు, ‘గతంలో ఒంటికాలితో లేచేవాడు. ఇప్పుడు కాళ్లు పడిపోయాయా’ అని చేస్తున్న వెటకారాలు, కులద్రోహి, గజదొంగ వంటి దారుణమైన శాపనార్ధాలు.. నిష్కల్మషమైన  ముద్రగడ మనుసును వికలం చేశాయట.

ఎదుటపడి మనసు తెలుప‘లేఖ’

అందుకే.. ఈ పంచాయతీ నాకెందుకు? ఉత్తిపుణ్యానికి నిందలు మోయడం ఎందుకు? ఏళ్ల తరబడి ఉద్యమాలు చేసి, ఆర్ధికంగా-శారీరకంగా నష్టపోయింది చాలు. ఇకపై నా మానాన నేను కిర్లంపూడిలో, ప్రశాంత జీవితం గడపదలచుకున్నా అని కాపుజాతికి ఓ సందేశం ఇచ్చారు. ఆ ప్రకారంగా… చంద్రన్న పాలనపై ఒంటికాలిపైలేచి  శివాలెత్తిన తాను, జగనన్న వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్లు ఇవ్వకపోయినా,  నోరుకట్టుకుని ఎందుకు కూర్చున్నానంటూ కాపుజాతి నిలదీస్తున్నందుకే.. ముద్రగడ మనసు వికలమయి, ఉద్యమాలకు సెలవుతీసుకుంటున్నట్లు అర్ధమవుతుంది. అంతే కదా? కాకపోతే ఈ నిర్ణయాన్ని తునిలోనో, మరెక్కడో మీటింగు పెట్టి చెబితే బాగుండేమో?

జగనన్న నెత్తిన పాలు పోసిన నిర్ణయం

ఏదేమైనా ముద్రగడ లాంటి మహానాయకుడు ఉద్యమాల నుంచి నిష్క్రమించడం కాపుజాతికి కష్టం కలిగించే నిర్ణయమే. అయితే,  ఇది తమ నెత్తిన పాలు పోయడం లాంటి దేనన్న సంబరం జగనన్న పార్టీలో కనిపిస్తోంది. ఎందుకంటే.. ఎప్పుడు కోపం వస్తుందో తెలియని ‘పద్మనాభం అన్న’, ఏ క్షణాన మళ్లీ కంచాలు మోగిస్తారోనని, జగనన్నకు మనసులో బెరకుగానే ఉంది. పైగా కాపుజాతి పితామహుడైన ముద్రగడను విమర్శిస్తే, తన పార్టీలోని కాపునేతలూ సహించలేరు. అలాంటిది అనుకోకుండా.. దేవుడే వరమిచ్చినట్లు ‘ము.ప’గారే ముందుకొచ్చి, ఉద్యమాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించడం జగనన్న సర్కారుకు బోలెడంత ఊరట, ఉత్సాహమూనూ! ఎందుకంటే విపక్షమైన టీడీపీ ఒక కులం కోసం పోరాడలేదు. పోరాడే పద్మనాభం అస్త్రసన్యాసం చేశారు కాబట్టి!!

చివరాఖరి లేఖలోనయినా..

సరే.. ముద్రగడ పద్మనాభం ఎలాగూ ఉద్యమాల నుంచి నిష్క్రమిస్తున్నారు. ఆమేరకు రాసిన చివరి లేఖలోయినా.. గత ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించిన ఆ ఐదు శాతం రిజర్వేషన్లయినా అమలుచేసి, కాపుజాతిని ఉద్ధరించమని జగనన్నను కోరకపోవడమే జాతిజనులను బాధిస్తోంది. చంద్రబాబునాయుడంటే దుర్మార్గుడు. తన కుటుంబాన్ని నానా యాతనకు గురిచేశాడు. కాపులందరిపై కేసులు పెట్టించారు.  అయినా వాటిని జాతి కోసం భరించారు. మరి అదే జాతి కోసం.. అదే చంద్రబాబు సర్కారు తీర్మానించిన, ఐదుశాతం రిజర్వేషన్లు అమలుకాకుండా, జగనన్న సర్కారు ఏడాదిపాటు తొక్కిపెట్టినప్పుడయినా.. ముద్రగడ మునుపటి మాదిరిగా తమతో కంచాలెందుకు కొట్టించలేదన్న వివరణ, చివరాఖరి లేఖలో చెబితే బాగుండేదంటున్నారు. హు.. ఇకపై ముద్రగడ లేని కాపు ఉద్యమాన్ని ఎలా ఊహించుకోవాలో.. హేమో?!You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner
Bitnami