ఢిల్లీ కోర్టుకు వైసీపీ పేరు  పంచాయితీ

371

నేడు హైకోర్టులో విచారణ
ఢిల్లీకి చేరిన విజయసాయి, సుబ్బారెడ్డి
అక్కడే రఘురామకృష్ణంరాజు కూడా
బాషా పక్షాన ఈసీ మాజీ లాయర్ మీనాక్షి అరోరా
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. వైఎస్సార్ పార్టీ.. అబ్బబ్బ… ఏమిటీ కాంగ్రెస్‌లు? పేర్లపై ఏమిటీ కిరికిరి పంచాయతీ? ఇన్ని కాంగ్రెస్‌లు ఉన్న రాష్ట్రం ఏ  కేరళనో అనుకుంటే, ఖచ్చితంగా త(ప్పు)లో కాలేసినట్లే. అచ్చంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ అయోమయం, ‘జగన్నా’ధమంతా! ఒక పార్టీకి మరొకరు ఓనరు. మరో పార్టీ ఈసీ వద్ద రిజిస్టరయినా, అసలు అది పనిచేస్తుందో లేదో  తెలియదు. మరో పార్టీ అధినేత, అసలు పార్టీ నాదేనని వాదిస్తున్నారు. ముగ్గురూ మహానేత పేరే పెట్టుకున్నారు. అందరిదీ  కామన్ టైటిలే. ముందు-వెనుక పేర్లే మార్పు. అందుకే ఈ లొల్లి పంచాయతీ అంతా! అసలీ పితలానికి ఒక ఎంపీ విజయసాయిరెడ్డి నారు పోస్తే, మరొక ఎంపీ రఘురామకృష్ణంరాజు నీరు పోశారు. విజయసాయి షోకాజ్ నోటీసులిచ్చి మరీ, రఘురామకృష్ణంరాజును కెలికారు. అసలు రఘురామకృష్ణంరాజు కనుక ‘మీది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాదు, నాది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ’ అని చెప్పకపోతే.. ఈ పంచాయతీలో ‘అన్న వైఎస్సార్ కాంగ్రెస్’ పార్టీని రఘురాముడు లాగకపోతే..  ఇప్పుడీ గొడవ ఉండేదే కాదు. రఘురామకృష్ణంరాజు లేవనెత్తిన లాజిక్కుతో,  బాషా అప్రమత్తమయి ఢిల్లీ హైకోర్టు వరకూ వచ్చే వారే కాదు. ఇది కూడా చదవండి.. వైఎస్సార్ కాంగ్రెస్‌లో రాజుగారి రచ్చ!

నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పేరుపై విచారణ..

వైఎస్సార్ కాంగ్రెస్ పేరు వాడవద్దని చెప్పినా, జగన్ నాయకత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆ పేరుతోపాటు, వైఎస్ ఫొటోను వాడుతున్నందున, ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ.. అన్న వైఎస్సార్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్, సోమవారం విచారణకు రానుంది. ఐటెం నెం 2గా ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును ఎక్కడా వాడవద్దని,  తాను చేసిన ఫిర్యాదుపై సీఈసీ స్పందించినా..  జగన్ నాయకత్వంలోని ఆ పార్టీ,  అదే పేరు వాడుతోంది కాబట్టి.. ఇకపై ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని, బాషా ఢిల్లీలో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.  ఇదికూడా చదవండి..‘వైఎస్ నావాడు.. అన్న వైఎస్సార్ కాంగ్రెస్ నాదే’దీనితో జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైసీపీ అప్రమత్తమయింది. ఫలిత ంగా ఆ పార్టీ కీలక నేతలు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఆదివారం  ఢిల్లీ చేరినట్లు సమాచారం. కాగా, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఢిల్లీలోనే మకాం వేయటం ప్రస్తావనార్హం.  ఇది కూడా చదవండి.. రాజు గారు వైసీపీ సభ్యుడేనా?

గతంలో ప్రతివాదులుగా..  మీనాక్షి అరోరా- గల్లా సతీష్

ఈ కేసులో అనేక చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. గత 18 సంవత్సరాల నుంచీ ఎన్నికల కమిషన్‌కు స్టాండింగ్ కౌన్సిల్‌గా ఉన్న, ప్రముఖ న్యాయవాది మీనాక్షీ అరోరా, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు, స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేసిన మరో ప్రముఖ న్యాయవాది అనితా షినాయ్..ఇప్పుడు ‘అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ జాతీయ అధ్యక్షుడు బాషా పక్షాన వాదించనున్నారు. గతంలో జగన్  నేతృత్వంలోని.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి కామన్ సింబల్ కేటాయించాలని కోరుతూ వేసిన కేసులో, మీనాక్షి అరోరా ఈసీ పక్షాన వాదించడం విశేషం. ఆ సందర్భంగా జగన్ పార్టీకి కామన్ సింబల్ ఇవ్వడానికి వీల్లేదని, ఏ నియోజకవర్గానికి  ఆ నియోజకవర్గంలో అభ్యర్ధులు.. వేర్వేరు గుర్తులతో పోటీ చేసుకోవచ్చని వాదించారు. అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పక్షాన వాదించిన  ప్రముఖ తెలుగు న్యాయవాది గల్లా సతీష్, దానిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దానివల్ల ప్రజలు అయోమయంలో పడే అవకాశం ఉన్నందున, కామన్ సింబల్ ఇవ్వాలని కోరారు. దానితో.. ఉమ్మడి రాష్ట్రంలోని 90 శాతం నియోజకవర్గాలలో అభ్యర్ధులను నిలబెట్టినట్టయితే.. కామన్ సింబల్ ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని, ఆ మేరకు అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశించింది. ఫలితంగా నాడు.. జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కామన్ సింబల్ వచ్చింది. ఇది కూడా చదవండి.. జగన్ నిర్లిప్తతకు కారణం అదేనా?

ఇప్పుడు బాషా న్యాయవాదిగా అరోరా..

నాడు జగన్ పార్టీకి వ్యతిరేకంగా, ఈసీకి అనుకూలంగా వాదించిన మీనాక్షి అరోరా.. ఇప్పుడు ఈసీ-జగన్ పార్టీకి వ్యతిరేకంగా బాషా పక్షాన, కోర్టులో వాదిస్తుండటం విశేషం. ఆమె రేపు దీనిపై ఎలా వాదిస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. అయితే, ఇప్పటిదాకా జగన్ పార్టీకి కోర్టు నోటీసులివ్వలేదని చెబుతున్నారు. హైకోర్టులో జరగనున్న ఈ కేసుపై.. ఈసీ కేసులు వాదించే గల్లా సతీష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఇది హైకోర్టులో నిలుస్తుందో లేదో చూడాలి. ఎందుకంటే బాషా తొలుత ఈసీ వద్దకు వెళ్లి వినతిపత్రం ఇస్తే, అక్కడే ఆయనకు న్యాయం జరిగే అవకాశం ఉండేది. కానీ ఆయన దానిని ఎంచుకోకుండా, నేరుగా హైకోర్టుకు వచ్చారు. ఈసీలో ఫిర్యాదుచేసే అవకాశం ఉన్నా, ఇక్కడిదాకా ఎందుకు వచ్చారని కోర్టు ప్రశ్నించే అవకాశాలు కొట్టివేయలేం. అలాకాకుండా, ఈసీ ఆదేశాలను ఎందుకు ఉల్లంఘించారని జగన్ పార్టీనీ ప్రశ్నించే అవకాశం కూడా లేకపోలేదు’ అన్నారు. కాగా సుప్రీంకోర్టు న్యాయవాది గల్లా సతీష్.. గతంలో ప్రజారాజ్యం పార్టీకి రైలింజన్, ఆ తర్వాత విజయకాంత్ పార్టీకి ఢమరుకం, జగన్ పార్టీకి పార్టీ రాజ్యాంగంతో పాటు ఫ్యాన్ గుర్తు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు.