కేసీఆర్ ప్రగతిభవన్‌లో.. కిషన్‌రెడ్డి ప్రభుత్వాసుపత్రులలో!

71

సారొచ్చారు, సమీక్ష పెట్టారు
కరోనాపై రంగంలో కిషన్‌రెడ్డి
మొన్న తమిళసై, నిన్న కిషన్‌రెడ్డి..
    (మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)
తెలంగాణలో కరోనా  రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రెండువారాల వరకూ ఫాంహౌస్‌కే పరిమితమయిన సీఎం కేసీఆర్ , తిరిగి ప్రగతిభవన్‌లో ప్రత్యక్షమయ్యారు. అదేరోజు ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్ వచ్చి, సర్కారు దవాఖానాలు సందర్శించి కరోనా చికిత్సలపై వాకబు చేశారు. కేసీఆర్ ఎక్కడున్నారో చెప్పాలని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌బులిటెన్లు విడుదల చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్‌రెడ్డి, బీజేపీ దళపతి సంజయ్ పదేపదే డిమాండ్లు చేస్తున్న నేపథ్యంలో.. సీఎం కేసీఆర్ ఎట్టకేలకు ప్రగతిభవన్‌లో ప్రత్యక్షమయ్యారు. సమీక్ష నిర్వహించడం ద్వారా, తాను ఆరోగ్యంగానే ఉన్నానన్న సంకేతాలిచ్చారు.

సమస్యల సుడిగండంలో సర్కారు..

తెలంగాణలో, ప్రధానంగా హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తున్న సమయంలో, ప్రభుత్వ నిర్లప్త వైఖరిని విపక్షాలు విస్తృత స్థాయిలో ఎండగడుతున్నాయి. ఈ విషయంలో బీజేపీ-కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. ఇది చాలదన్నట్లు.. సచివాలయ కూల్చివేతలో మందిర్-మసీదులు నేలకొరగడం, ఇటీవలి కాలంలో మీడియాతో తరచూ భేటీ అయిన సీఎం కేసీఆర్, ఫాం హౌస్‌కు పరిమితమవడం, ఇలాంటి ప్రతికూల పరిస్థితులు కట్టకట్టుకుని ఒకేసారి రావడంతో..  కేసీఆర్ సర్కారు పరిస్థితి, అడకతె్తరలో పోకచెక్కలా మారింది. చివర కు, మందిర్-మసీదు కూల్చివేతలపై సీఎం కేసీఆర్ స్వయంగా స్పందించాల్సి వచ్చింది. ఇది కూడా చదవండి.. విపక్షాల చేతికి.. మందిర్-మసీదు అస్త్రం

సారొచ్చారొచ్చారు..

ఈ నేపథ్యంలో.. కేసీఆర్ కనిపించడం లేదంటూ విపక్షాలు గత్తర చేస్తున్న సమయంలో.. ఆయన దాదాపు రెండు వారాల తర్వాత ఎట్టకేలకూ, శనివారం ప్రగతిభవన్‌లో రైతుబంధు పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. 25 కోట్లతో విత్తనాల నిల్వలకు కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తామని ప్రకటించారు. దీనితో  కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారని, దానికి సంబంధించి ఆయనపై వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని స్పష్టమయింది. ఇక ఆయన ఆరోగ్యంపై, ఆందోళన వ్యక్తం చేసే అవకాశం విపక్షాలకు లేనట్లే. ఇటీవలే కేసీఆర్  ఎక్కడున్నారంటూ ఓ కాంగ్రెస్ కార్యకర్త, ప్రగతిభవన్ వద్ద ప్లకార్డు పట్టుకున్న ఘటన సంచలనం సృష్టించింది.

కరోనా చికిత్సలపై కిషన్ నజర్

అయితే.. అదేరోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి, నగరంలో చేసిన సుడిగాలి పర్యటన చర్చనీయాంశమయింది. ఆయన వచ్చీ రాగానే నగరంలోని ప్రభుత్వాసుపత్రులలో జరుగుతున్న, కరోనా చికిత్సలను స్వయంగా పర్యవేక్షించి, వైద్యులు-రోగులలో ఆత్మస్థైర్యం నింపారు. నిమ్స్, కోరంటి, లాలాగూడ రైల్వే ఆసుపత్రిని సందర్శించిన ఆయన, అక్కడ క రోనా రోగులకు జరుగుతున్న చికిత్సను అడిగి తెలుసుకున్నారు. కరోనా నియంత్రణకు కేంద్రం 216 కోట్లు ఇచ్చిందని, 2లక్షల 40 వేల పీపీఈ కిట్లు, 688 వెంటిలేటర్లు, 7లక్షల 14 వేల ఎన్ 95 మాస్కులు ఇచ్చిందని వెల్లడించారు.

ప్రజాభిప్రాయం మారుతోందా..?

కాగా కరోనా చికిత్సలు అందిస్తున్న, హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులను ఇప్పటివరకూ సీఎం కేసీఆర్ సందర్శించకపోవడం, అదే సమయంలో గవర్నర్ తమిళసై నిమ్స్, కేంద్రమంత్రి కిష్‌న్‌రెడ్డి మూడు ఆసుపత్రులను సందర్శించడం చర్చనీయాంశమయింది. ఇదే అంశంపై గతంలో రేవంత్‌రెడ్డి అనేకసార్లు ప్రశ్నించారు. సీఎం ప్రగతిభవన్, ఫాంహౌస్‌కే పరిమితమయితే ప్రజారోగ్యం ఎవరు చూసుకుంటారని విమర్శల వర్షం కురిపించారు. అటు బీజేపీ చీఫ్ సంజయ్ కూడా, కరోనాలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమయినందుకే గవర్నర్ నిమ్స్‌ను సందర్శించాల్సి వచ్చింద న్నారు.  కరోనా సమస్యను జనాల ఖర్మకు వదిలేసి, కేసీఆర్ మాత్రం రాజభవనంలో విశ్రాంతి తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ పరిణామాలన్నీ.. బీజేపీ మాత్రమే కరోనా కట్టడిపై శ్రద్ధ వహిస్తోందన్న అభిప్రాయం, జనంలో బలపడేందుకు కారణమవుతోంది. ఇది కూడా చదవండి.. పాలకుల పక్కలో బల్లెం!

కరోనా లెక్కలపై ఇద్దరిదీ తలోదారి..

అదీకాకుండా.. ఇప్పటివరకూ కరోనా కోసం కేంద్రం ఎంత ఇచ్చింది? ఎంత ఖర్చు పెట్టారు? సీఎంరిలీఫ్ ఫండ్‌కు ఎంత విరాళాలు వచ్చాయని విపక్షాలు ప్రశ్నిస్తున్నా.. సర్కారు మౌనంగా ఉంది. అయితే అదే సమయంలో, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాత్రం.. కరోనా కోసం, కేంద్రం ఎంత ఇచ్చిందన్న వివరాలు ప్రకటిస్తుండటతో..కరోనా కట్టడిలో కేసీఆర్ ప్రభుత్వం కంటే, కేంద్రమే చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందన్న అభిప్రాయం, బలపడేందుకు మరో కారణంగా కనిపిస్తోంది.  ఇది కూడా చదవండి.. అమ్మో… ఆ ఆసుపత్రా?

1 COMMENT