వైఎస్ నావాడు.. అన్న వైఎస్సార్ కాంగ్రెస్ నాదే!

227

నాకు జగన్ అనుచరుల నుంచి ప్రాణభయం
రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే
కోర్టులో న్యాయం కోసం కొట్లాడతా
అన్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాషా
‘సూర్య’తో వైఎస్ అనుభవాలు పంచుకున్న నేత
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఆయనో పర్వతాన్ని ఢీ కొంటున్నారు. అంగ-అర-అధికార- అర్ధబలం ఉన్న పాలకుడితో యుద్ధం చేస్తున్నారు. ఆయన లేవనెత్తిన అంశాలు పాలక పార్టీకి చిక్కులు తె స్తున్నాయి. వైఎస్ ఫొటో, ఆయన పేరు వాడుకుంటున్నారంటూ, అదే వైఎస్ కొడుకుపైనే తొడకొట్టి సమరానికి సిద్ధమవుతున్నారు. ఏమైనా రాజీ పడే అవకాశం ఉందా అంటే.. ససేమిరా అంటున్నాడు. పైగా ‘నాదీ కడపే.. నేను సాయిబును. ఏమవుతుందో నేనూ చూచ్చా. నేను దేనికయినా రెడీనేనప్పా’అంటున్న అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ బాషా..దివంగత వైఎస్‌తో తనకున్న అనుబంధం, రవీంద్రనాధ్‌రెడ్డి దానిని చెడగొట్టిన తీరు, పోలింగ్ బూత్‌ల కబ్జా పేరుతో తనను అప్పటి ఎస్పీ కొట్టిన అనుభవాలు ‘సూర్య’వెబ్‌సైతో పంచుకున్నారు. జగన్‌తో యుద్ధం చేస్తున్నారు. భయపడటం లేదా? అని ప్రశ్నిస్తే.. మా కడపలో నాకూ బలం ఉంది. నన్నేం చేస్తారప్పా? అంటున్నారు. వైఎస్ వల్ల బాగానే సంపాదించుకున్నానన్న బాషా… తనను వైవీ సుబ్బారెడ్డి మోసం చేశారని చెప్పిన  అనుభవాలు ఆయన మాటల్లోనే..

‘‘మా తాతకు  వైఎస్ రాజారెడ్డితో సావాసం. ఆయనతోనే కలసి ఉండేవాడు. ఆ నాన్న రైల్వే ఉద్యోగి. చాలా ఊళ్లు తిరిగాం. చదువంతా గుంటూరులోనే సాగింది. ఆయన రిటైరయిన తర్వాత కడపకొచ్చిన. మధ్యలో నంద్యాల యూత్‌కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్‌గా చేసిన. కడపకొచ్చినంక బీజేపీలో చేరా. మళ్లీ రాజశేఖర్‌రెడ్డితో కలసి పనిచేశా. నాతో ఆయన చాలా బాగా ఉండేవాడు. ఆ రవిరెడ్డి అదే రవీంద్రనాధ్‌రెడ్డి పెత్తనం ఎక్కువగా ఉండేది. వైఎస్ ఎంపీగా ఉన్నా పెత్తనం రవిరెడ్డి దగ్గరే ఉండేది. వైఎస్ కూడా చాలాసార్లు తలపట్టుకున్నా, ఆయనను ఏమీ అనేవాడుకాదు. నన్ను వైఎస్‌తో కట్ చేసేందుకు ప్రయత్నాలు చేశాడు. నేను సాయిబును. ఎవరికీ భయపడేదిలే. ఆయన కూడా సాయిబుతో ఎందుకులేనని నన్ను చూసి భయపడేవాడు’’

‘‘ 1999లో నేను ఎంపీ సీటు కావాలని వైఎస్‌ను అడిగిన. సాయిప్రతాప్ సెటిలయిపోయాడు. ఆయనకు పెన్షన్ వస్తాది అని కొట్లాడిన. వైఎస్ మాత్రం  వద్దులే గానీ, మనిసిపల్ చైర్మన్ ఇస్తా తీసుకో అన్నాడు. పీసీసీ మైనారిటీ సెల్ పోస్టు ఇప్పించాడు. ఆ కోపంతో బీజేపీలో చేరా. అక్కడ సాయిబులను తిడుతున్నారని బయటకొచ్చి, తులసీరెడ్డితోపాటు అన్న టీడీపీలో చేరా. రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేస్తే 32 వేల ఓట్లొచ్చినయ్. నేను గెలవకపోయినా సాయిప్రతాప్ ఓడిపోయాడు. ఆ త ర్వాత, వైఎస్ నన్ను పిలిపించుకున్నాడు. ఎమ్మెల్సీ ఇప్పిస్తానన్నాడు. సరే ఆయన పోయారనుకోండి’’

‘వైఎస్ సీఎంగా ఉన్నప్పుడే సోనియాతో ఆయనకు కొంచెం తేడాలొచ్చినయ్‌లెండి. రిలయన్స్ గ్యాస్ కొట్లాట కారణంగా, వైఎస్ ఇబ్బందిపడేవాడు. దానితో అన్నా.. మనం పార్టీ పెడదాం అని వైఎస్‌కు చెప్పిన. ఒప్పుకోలేదు. సరే అయితే, నేను నీ పేరుమీద పార్టీ పెడతానన్నా. దానికీ ఒప్పుకోలేదు. తర్వాత మళ్లీ చెప్పా. నీ ఇష్టం అన్నాడు. దురదృష్టం. తర్వాత ఆయన చనిపాయె!  వైఎస్ చనిపోయిన మూడో రోజునే నేను, ఆయన పేరుతో 2009 సెప్టెంబర్ 5న అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో  ఈసీకి దరఖాస్తు ఇచ్చా’

‘వైఎస్ ఉన్నప్పుడు నేను బాగానే సంపాదించుకున్నా. రైల్వే కాంట్రాక్టులు చేశా. నేను ఇప్పుడు బాగానే ఉన్నా. మధ్యలో నాపై కోపం వచ్చినా సాయిబుతో ఎందుకులే అని ఏమనేవాడు కాదు. మా కడపలో సాయిబులెక్కువ కదా? అందుకు. వైఎస్‌కు, జగన్‌కు ఎక్కడా పోలికనే లేదు. అసలు వైఎస్ పేరెత్తే అర్హత, హక్కు వాళ్లకు లేదు. వైఎస్ ఎంపీగా కందులోళ్ల మీద పోటీచేసినప్పుడు నేను చాలా కష్టపడ్డా. 15వందలతో బయటపడ్డారు. అప్పుడేదో మేనేజ్ చేశారనుకోండి. అది వైఎస్ స్వయంగా చూసి నన్ను బాగా అభిమానించాడు. కడప టౌన్‌లో పది పోలింగ్ బూత్‌లలో రిగ్గింగ్ చేశానన్న ఆరోపణలతో, అప్పటి ఎస్పీ ఉమేష్‌చంద్ర నన్ను కుళ్లబొడిచాడు. అయినా నేను ఆరోజు వైఎస్ గెలుపు కోసం పనిచేశా. మరి జగన్ గానీ, ఆయన మేనమామ గానీ వాళ్ల నాయన కోసం ఏం చేశారు? మా లాంటి వారిపై పెత్తనం చేశారు’

 

‘నేను పార్టీ పెట్టిన తర్వాత, జగన్ కూడా పార్టీ పెట్టే ప్రయత్నాలు చేశాడు. మధ్యలో నన్ను వైవి సుబ్బారెడ్డి హైదరాబాద్ పిలిపించుకుని, వారం ఉంచాడు. పార్టీ పేరు జగన్ అడుగుతున్నాడు. ఇచ్చేయమన్నాడు. నేను ముందు ఒప్పుకున్నా. అయితే రాజంపేట ఎంపీతోపాటు, నాలుగైదు అసెంబ్లీ సీట్లు కావాలన్నా. సరే నన్నాడు. ఆ ఈసీ పేపర్లు అడిగి తీసుకున్నాడు. కానీ, ఆ పేరుతో వాళ్లే పార్టీ పేరు కాపీకొట్టి  నన్ను మోసం చేశారు. ఇదని నిజమో కాదో సుబ్బారెడ్డిని అడగండి. లైవ్ డిబేట్‌కు రమ్మని చెప్పండి. వాళ్లంతా మోసగాళ్లు. వైఎస్ లెక్క కాదు. అందుకే వాళ్లకు దూరంగా ఉన్నా’

‘ఇప్పుడు జగన్ సీఎం కావచ్చు. పెత్తనం ఉండవచ్చు. కానీ నేను వెనక్కి తగ్గను. అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు, వైఎస్ పేరు, ఫొటో వాడుకునే మోరల్, టెక్నికల్ రైట్స్ వాళ్లకి లేదు. అది నా సొంతం. దానికోసమే న్యాయ పోరాటం చేస్తున్నా. మీడియా వాళ్లు నాకు బాగా సహకరిస్తున్నారు. నా వెనుక ఎవరూ లేరు. నాకు జగన్ అనుచరుల నుంచి ప్రాణహాని ఉంది. కాకినాడ నుంచి వాడెవడో నాకు బెదిరిస్తూ మెస్సేజ్‌లు పెట్టాడు చూడండి. మీకు పంపిస్తున్నా! అందుకే నాకు  రక్షణ కావాలి. దానికోసం కూడా పిటిషన్ వేశా. నాకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే.

నేను వైఎస్ కోసం ఆయన బతికున్నప్పుడే ఆయన పేరుతో పార్టీ పెడతానని వైఎస్‌కే చెప్పా. ఇప్పుడు వీళ్లు ఆయన ఫొటో పెట్టుకుని బతుకుతున్నారు. వాళ్ల పార్టీ పేరు కూడా పూర్తిగా తెలియని, పలకలేని  వాళ్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లున్నారు. ఏం జేద్దాం చెప్పండి? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు వాడవద్దని ఎన్నికల కమిషన్ కూడా చెప్పినా, వాళ్లు దానిని లెక్కచేయడం లేదు. దీనిపై నేను మళ్లీ ఢిల్లీ  హైకోర్టులో కేసు వేశా. అది సోమవారం విచారణకు వస్తుంది’

ఇవి కూడా చదవండి..
వైఎస్సార్ కాంగ్రెస్‌లో రాజుగారి రచ్చ!
జగన్ పార్టీని రద్దు చేయండి
వైఎస్ఆర్‌సీపీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్