విపక్షాల చేతికి.. మందిర్-మసీదు అస్త్రం

404

సెక్రటేరియేట్ కూల్చివేతలో కూలిన ఆ రెండు
చింతించిన సీఎం కేసీఆర్
కస్సుమంటున్న కమలం, కాంగ్రెస్
హిందు-ముస్లిం కార్డులతో జనంలోకి?
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

‘నల్లపోచమ్మ గుడి కూలగొట్టారంటే కేసీఆర్ సర్కారు కూడా కూలబోతోంది. ఈ ప్రభుత్వానికి దినం దగ్గరపడింది. గుడిని కావాలనే కూలగొట్టి, తప్పిపోయి కూలిందని అబద్ధమాడుతున్నారు. ఎన్నికల ముందు తానే అసలైన హిందువునని కేసీఆర్ ప్రకటించుకున్నారు. కానీ ఈ దేవాలయ కూల్చివేతతో ఆయన గుడి మనిషి కాదని తేలిపోయింది’
-బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  మురళీధర్‌రావు

‘తెలంగాణ ఉద్యమానికి వేదికయిన నల్లపోచమ్మ దేవాలయం, మసీదును కూల్చడాన్ని ఖండిస్తున్నాం. వాటిని కూల్చివేసిన సీఎం కేసీఆర్, సీఎస్ సోమేష్‌ను బేడీలు వేసి చర్లపల్లి జైల్లో పెట్టాలి. దీనిపై కిషన్‌రెడ్డి, బండి సంజయ్ స్పందించాలి. పర్యావరణాన్ని కాపాడాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సీఎస్ సోషమ్‌కుమార్ పెడచెవిన పెట్టారు’
-తెలంగాణా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి.

‘మసీదు, మందిరాన్ని కూల్చిన రోజును బ్లాక్‌డేగా పాటించాలి. ప్రణాళికలో భాగంగానే మసీదు కూల్చివేతను ఒవైసీ స్వాగతించారు. సొంత దుకాణాలు నడుపుకునేందుకే మజ్లిస్, బీజేపీ మతం పేరుతో వేలాదిమంది ప్రాణాలు తీసుకున్నాయి. వైఎస్ సీఎం ఉన్నప్పుడు నేనే అక్కడ మసీదు కట్టించా. వాటిని కూల్చుతున్న సీఎస్, డీజీపీలపై క్రిమినల్ కేసులు పెట్టాలి’
– మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ

‘జరిగిన ఘటనకు విచారం వ్యక్తం చేస్తున్నా. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడమే తప్ప, ప్రార్ధనా మందిరాలకు ఇబ్బంది కలిగించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదు. అక్కడ ఇప్పుడు ఉన్న దానికంటే, ఎక్కువ విస్తీర్ణంలో ప్రభుత్వమే కొత్త ప్రార్ధనా మందిరాలు నిర్మిస్తుంది. దేవాలయం, మసీదు నిర్వహకులతో త్వరలో నేనే సమావేశమవుతా. వారి సలహాలు తీసుకుని కొత్త ప్రార్ధనా మందిరాలు నిర్మిస్తాం’
– తెలంగాణ సీఎం కేసీఆర్

కూల్చివేతతో కొత్త వివాదం..

తెలంగాణ సచివాయం.. పదహారుమంది ముఖ్యమంత్రులు కొలువుదీరిన చారిత్రక ప్రదేశం. వేలమంది ఐఏఎస్‌లకు నీడనిచ్చిన పాలనా భవనం. క్యాంటిన్లలో హడావిడి. చెట్ల కింద చర్చోపచర్చలు. పైరవీకారుల హంగామా.  మీడియా పాయింట్ దగ్గర రాజకీయ కోలాహలం. అక్కడ పనులు, పైరవీల కోసం ఉమ్మడి రాష్ట్రంలోని జిల్లాల నుంచి వచ్చి, పరిసరాల్లో ఉన్న హోటళ్లలో సేదదీరే, చోటా మోటా నేతల లాబీయింగ్. ఇవన్నీ ఇప్పుడొక తీపి జ్ఞాపికాలే. అలనాటి వైభవానికి ప్రతీకగా ఉన్న ఆ సెక్రటేరియేట్‌ను కూల్చి, కొత్త నిర్మాణానికి కేసీఆర్ సర్కారు బుల్డోజర్లెత్తింది. ఓకే!  కానీ, అప్పుడెప్పుడో రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు సచివాలయంలోనే నిర్మించిన మసీదును, అక్కడకు కొంచెం దూరంలోనే ఉన్న నల్లపోచమ్మ దేవాలయాన్ని కూడా కూల్చివేయడం,  కొత్త వివాదానికి తెరలేపింది. అది కూడా.. సీఎస్,డీజీపీ స్వయం పర్యవేక్షణలో జరగడం! ఈ వివాదం రాను రాను సెంటిమెంట్ అంశంగా మారే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్-బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలు సంకేతాలిస్తున్నాయి.

తెలంగాణ ఉద్యమానికి పోచమ్మ ఆలయమే వేదిక..


అక్కడి మసీదులో ముస్లిం ఉద్యోగులు శుక్రవారం ప్రార్ధనలు చేసుకునేవారు. ఉమ్మడి రాష్ట్రంలో విభజనకు ముందు తెలంగాణ ఉద్యోగుల పోరాటానికి  పోచమ్మ ఆలయ ప్రాంగణమే వేదికగా నిలిచింది. అక్కడ తెలంగాణ మహిళా ఉద్యోగులు బతకమ్మ ఆడేవారు.పూజలు, వ్రతాలు నిర్వహించేవారు.  హిందూ ఉద్యోగులు పూజలు చేసేవారు. ఇప్పుడు ఆ రెండూ కూల్చివేతలకు గురయి, విపక్షాలకు అస్త్రాలుగా మారాయి.  తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, బీజేపీ మందిర్-మసీదు అంశానికి పదునుపెడతుండటం, అధికార పార్టీకి ప్రాణసంకటంగా పరిణమించింది. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో, ముస్లింలకు ప్రతినిధిగా ప్రకటించుకున్న మజ్లిస్ మౌనవ్రతం పాటిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్,  మందిర్-మసీదు కూల్చివేతపై విచారం వ్యక్తం చేయడమే విశేషం.

విపక్షాలకు ఇప్పుడు ఆ రెండే అస్త్రాలు..

సచివాలయంలో  కూల్చివేతకు గురైన మందిర్-మసీదు.. ఇప్పుడు తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బ్రహ్మాస్త్రంగా మారింది. కాంగ్రెస్ మసీదీను, బీజేపీ మందిర సమస్యను తీసుకుని.. కేసీఆర్ సర్కారుపై దానిని సెంటిమెంటు అస్త్రంగా ప్రయోగించడంతో, తెలంగాణలో కొత్తగా మత రాజకీయాలకు తెరలేచినట్టయింది. దీనికి సీఎం, సీఎస్, డీజీపీలను బాధ్యులను చేస్తున్న వాదనను, బలంగా  తెరపైకి తీసుకువస్తుండటం గమనార్హం. కొత్త సచివాలయ నిర్మాణంలో, విపక్షాలపై ఎదురుదాడిలో విజయం సాధించిన తెరాస.. ఇప్పుడు మందిర్-మసీదు కూల్చివేతలపై మాత్రం మౌనంగా ఉండటం పరిశీలిస్తే, కేసీఆర్ సర్కారు ఆత్మరక్షణలో పడినట్లు స్పష్టమవుతోంది. చివరకు దీనిపై స్వయంగా, కేసీఆరే వివరణ ఇవ్వాల్సి రావడం ప్రస్తావనార్హం.

అడకత్తెరలో అధికారపక్షం..

సచివాలయ నిర్మాణానికి అనుకూలంగా మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు చేస్తున్న వాదనలు, రాజకీయంగా సమర్ధనీయంగానే కనిపించింది. ప్రజాధనం వృధా చేస్తున్నారన్న విపక్షాల ఆరోపణలు, కరోనా సమయంలో ఇది అవసరమా అన్న వారి ప్రశ్నలతోపాటు.. కొత్త సచివాలయం కూడా నిర్మించుకునే స్థితిలో తెలంగాణ లేదా అన్న తలసాని శ్రీనివాసయాదవ్ వంటి మంత్రుల ఎదురుదాడి కూడా, జనంలో చర్చనీయాంశమవుతున్నాయి. కానీ, సున్నితమైన మతపరమైన అంశమైన మందిర్-మసీదు కూల్చివేతలపై మాత్రం మంత్రులు, ఎమ్మెల్యేలు, అంతే ధైర్యంతో ఎదురుదాడి చేయలేకపోతున్నారు. మతపరమైన వ్యవహారంలో మాట్లాడితే, అది ఎటు తిరిగి ఎటు పోతుందోనన్న భయంతో మౌనం వహిస్తున్నారు. అందుకే బహుశా.. మతపరమైన అంశమైనందున, స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగి వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

ఇది బీజేపీ-కాంగ్రెస్ పార్టీలకు రాజకీయంగా లబ్ధి కలిగించే అంశంగా కూడా మారింది. ఈ ఘటనతో బీజేపీ హిందుత్వ కార్డును ప్రయోగిస్తోంది. మందిరాన్ని కూల్చటాన్ని ఆ పార్టీ త్వరలో ఓ అంశంగా తీసుకుని జనంలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. కూల్చివేతలకు నిరసనగా తెలంగాణలోని అన్ని దేవాలయాల ఎదుట నిరసన దీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిజంగా అదే జరిగితే, తెలంగాణలో బీజేపీకి దారులు బలపడినట్లే. ఈ అంశంలో మజ్లిస్ మౌనాన్ని కూడా బీజేపీ ప్రధానంగా ప్రస్తావిస్తుండటం గమనర్హం. మసీదును కూల్చినా మజ్లిస్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? మందిరాన్ని కూల్చే ముందు హిందూ పెద్దలను ఎందుకు సంప్రదించలేదు? అన్న ప్రశ్నలతో జనం ముందుకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. మొత్తంగా.. ఈ అంశంలో కేసీఆర్ సర్కారు-తెరాస పార్టీని హిందువులో ముద్దాయిగా నిలబెట్టడమే బీజేపీ లక్ష్యంగా స్పష్టమవుతోంది.

ముస్లింలకు చేరువయ్యే దిశగా కాంగ్రెస్..

ఇక కాంగ్రెస్ కూడా ఈ అంశంతో.. రాజధాని నగరంలోని ముస్లింలకు, చేరువయ్యే ప్రణాళికలు రచించే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ, వ్యూహత్మకంగా వెళుతున్నట్లు కనిపిస్తోంది. తెరాసకు మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్, ఒక రాజకీయపార్టీగా  మసీదు కూల్చివేతను ప్రశ్నించకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధానాంశంగా తీసుకోనుంది. దానివల్ల, ముస్లింల ముందు  మజ్లిస్‌ను ముద్దాయిగా నిలబెట్టి.. గతంలో పోగొట్టుకున్న ముస్లిం ఓటు బ్యాంకును, తిరిగి సంపాదించాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.

మజ్లిస్ వైఫల్యంపై కాంగ్రెస్ కన్ను..

ఈ మొత్తం వ్యవహారంలో.. రాజకీయంగా మజ్లిస్ పార్టీ నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. మసీదు కూల్చివేతను ఖండించి, ప్రశ్నించాల్సిన మజ్లిస్ పార్టీ.. మౌనంగా ఉండటం,  సహజంగానే అటు ముస్లింలనూ విస్మయపరుస్తోంది. కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నేతలు కూడా అదే అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు. మజ్లిస్ మౌనం తెరాస-మజ్లిస్ కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనమని ఇప్పటికే కాంగ్రెస్ ముస్లింలలోకి వెళుతోంది. షబ్బీర్ అలీ వ్యాఖ్యలు దానినే అద్దం పడుతున్నాయి.