చంద్రన్న లాగేసుకుంటే.. రాజన్న తిరిగి ఇచ్చారు!

490

మఠం భూములు మళ్లీ మఠానివే
జగనన్న నిర్ణయానికి భక్తుల జేజేలు
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

హిందూ ఆలయాల స్వాధీనం, కూల్చివేతల్లో అత్యుత్సాహం ప్రదర్శించే పాలకుల చేష్టలు ఎవరూ మర్చిపోరు. సందర్భానుసారంగా రాజకీయాల్లో, అవి తెరపైకి వస్తూనే ఉంటాయి. అందుకు ఉదాహరణ విజయవాడలోని ఓ మఠానికి చెందిన భూమి వ్యవహారం. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు స్థానిక ఎమ్మెల్యే ఒత్తిళ్లకు లొంగి ఆ మఠం భూమిని లాగేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తిరిగి ఆ భూమిని మఠానికే తిరిగి ఇచ్చేసి, స్థానికులను మెప్పించారు. తాజాగా దీనిపై తెలుగుదేశం నేతలు చేస్తున్న విమర్శలు, బ్రాహ్మణ సామాజికవర్గ ఆగ్రహానికి గురవుతోంది.

జగన్ నిర్ణయానికి జేజేలు..

విజయవాడలోని శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయానికి చెందిన 900 గజాల స్థలాన్ని,  శ్రీ భువనేశ్వరి పీఠానికి అప్పచెప్పిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. విజయవాడ సత్యనారాయణపురంలోని ఈ ఆలయ అభివృద్ధికోసం, కొన్నేళ్ల తమ భూములు దానం చేశారు. శ్రీ సీతారామ కల్యాణ మండపం నిర్మించారు. దానితో అది దేవాలయాల స్తిరాస్తిగా కొనసాగుతోంది. నిజానికి 2001 నుంచి, ఇది శ్రీ భువనేశ్వరి పీఠం అధీనంలోకి వెళ్లింది. దానికి ఈ భూమి ఇచ్చిన దమ్మాలపాటి చంద్రశేఖర్ ధర్మాధికారిగా కొనసాగుతున్నారు. అయితే, దీనిని స్వాధీనం చేసుకునేందుకు, తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ప్రయత్నించారు. శివాలయ కమిటీ వారితో తమపై కేసులు వేయించి, తామంతా ఇప్పటి వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుచరులమని ముద్ర వేసి, దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులతో, నోటీసులు ఇప్పించారని అక్కడి భక్తులు వెల్లడించారు.

55 రోజులపాటు నిరసన దీక్షలు..

నాటి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ కూడా, తొలుత తన పార్టీ వారి వైపే మొగ్గు చూపారు. ఈ ప్రయత్నాలను నిరసిస్తూ.. 55 రోజుల పాటు చేసిన సుదీర్ఘ నిరసన దీక్ష కార్యక్రమానికి శ్రీ భువనేశ్వరి పీఠాథిపతి కమలానందభారతి, విశాఖ శారదా పీఠాథిపతి స్వరూపానంద సరస్వతితోపాటు.. మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్, ఇప్పటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రస్తుత ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తెలంగాణ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, బీజేపీ నేత జూపూడి రంగరాజు, మాజీ ఎమ్మెల్యే  వంగవీటి రాధాకృష్ణ, వైసీపీ నేత గౌతంరెడ్డి, సీపీఎం నేత సీహెచ్ బాబూరావు, నాటి బీజేపీ నగర అధ్యక్షుడు డాక్టర్ ఉమామహేశ్వరరాజు తదితరులు స్వయంగా దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. ఈ ప్రతినిధి బృందం మాజీ గవర్నర్ వి.రామారావును కలసి తమ సమస్యను వివరించింది. దానికి స్పందించిన ఆయన.. నాటి మంత్రి మాణిక్యాలరావుతో మాట్లాడి, ఆ భూమి పీఠానిదే కాబట్టి దాని జోలికి వెళ్లవద్దని సూచించారు.


మండలి, సుజనాకు పరిష్కార బాధ్యత..

ఈ వివాదం తెలుసుకున్న తెలుగుదేశం నాయకత్వం… సమస్యను పరిష్కరించే బాధ్యతను మండలి బుద్దప్రసాద్, ఎంపి సుజనాచౌదరికి అప్పగించింది. ఆ నియోజకవర్గంలో బ్రాహ్మణ సామాజికవర్గం అత్యధిక సంఖ్యలో ఉండటం.. అక్కడ ఆ పార్టీ ఎమ్మెల్యేనే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో వివాదానికి తెరదించాలని, వారిద్దరికీ ఆ బాధ్యత అప్పగించింది. వారు పత్రాలు పరిశీలించి, ఆ భూమి పీఠానిదేనని తేల్చారు. ఈలోగా ఎమ్మెల్యేగా ఉన్న బోండా ఉమ సైతం తమ పొరపాటు గ్రహించారు. అంతకుముందు.. ఆయనే, ధర్మాధికారి చంద్ర శేఖర్‌ను పిలిపించి, తమ అనుచరులకు ఆలయ నిర్వహణ బాధ్యత ఇవ్వాలని కోరారు.  ఆయన తిరస్కరించారు. ఇది పీఠానికి చెందిన వ్యవహారం కాబట్టి, పీఠాథిపతితోనే మాట్లాడాలని కోరారు. తర్వాత జరిగిన పరిణామాలలో బోండా ఉమానే, ఆలయ భూమి పీఠానిదేనని ప్రకటించినట్లు ఆలయ పీఠం ప్రతినిధులు గుర్తు చేశారు.

ఆ భూమి పీఠానిదేనన్న కమిషనర్ జెఎస్వీ ప్రసాద్..

తమ పీఠం భూమిపై ఎండోమెంట్ అధికారులు చేస్తున్న దాష్టీకంపై.. ధర్మాధికారి దమ్మాలపాటి చంద్రశేఖర్ నాయకత్వంలో బ్రాహ్మణసంఘ నేత చక్రవర్తుల రాజగోపాలచార్యుల  బృందం, నాటి ప్రభుత్వ సలహాదారయిన డాక్టర్ పరకాల ప్రభాకర్‌తో భేటీ అయింది. దానికి స్పందించిన ఆయన, నాటి కమిషనర్ జెఎస్వీప్రసాద్‌తో మాట్లాడి, సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ వ్యవహారాలను తేల్చేందుకు రంగంలోకి దిగిన జెఎస్వీ ప్రసాద్.. పత్రాలు పరిశీలించి, డిప్యూటీ కమిషనర్‌ను నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దానితో క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన డీసీ.. నిజాలు తెలుసుకుని, ఈ భూమి పీఠానిదేనని తేల్చారు. దాని ఆధారంగా కమిషనర్ జెఎస్వీ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఆ భూమితో శివాలయ భూమికి సంబంధం లేదని తేల్చేశారు. 2001లోనే అది పీఠానికి అప్పగించినందున.. దేవాలయాల ఆస్తులు, కల్యాణమండపం అన్నీ పీఠానికే చెందుతాయని, ఈ వ్యవహారాల్లో ఎండోమెంట్ శాఖ జోక్యం చేసుకోవ ద్దని  స్పష్టం చేశారు.

వెల్లంపల్లి, మల్లాది చొరవతో మళ్లీ పీఠానికే..

ఈ ఎపిసోడ్ కొనసాగుతున్న సమయంలోనే ఎన్నికలు రావడం, వైసీపీ అధికారంలోకి వచ్చి.. గతంలో దీక్షల్లో పాల్గొన్న మల్లాది విష్ణు ఎమ్మెల్యే, వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రి అయ్యారు. ఫలితంగా, దేవదాయ శాఖ కూడా రంగంలోకి దిగి, పీఠానికి చెందిన ఆ భూమి, దేవాలయాన్ని తిరిగి శ్రీ భువనేశ్వరీ పీఠానికే అప్పగించింది. ఈ చర్యపై స్థానిక భక్తులు, బ్రాహ్మణ సంఘాలు హర్షం వ్యక్తం చేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాయి. ఈ విషయంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది, పీఠానికి సహకరించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కృతజ్ఞతలు చెప్పారు.  వారిద్దరి చొరవను స్థానికులు అభినందించారు. అయితే, ఓ దినపత్రికలో ఈ వ్యవహారంపై కథనం రావడంతో మళ్లీ కలకలం రేగింది. కోట్లాది రూపాయల భూమిని స్వాహా చేస్తున్నారంటూ వచ్చిన కథనం, స్థానిక భక్తులు, బ్రాహ్మణ సంఘాల ఆగ్రహానికి గురయింది.

పీఠం భూమి పీఠానికే దక్కింది: చంద్రశేఖర్

ఈ నేపథ్యంలో, మాజీ మంత్రి దేవినేని ఉమ చేసిన ట్వీట్‌ను బ్రాహ్మణ సంఘాలు ఖండిస్తున్నాయి. టీడీపీ హయాంలో చేసిన తప్పును, వైసీపీ ప్రభుత్వం సరిదిద్దినందుకు హర్షం వ్యక్తం చేయాల్సింది పోయి, వ్యతిరేకంగా ప్రకటనలివ్వడంపై సంఘాలు మండిపడుతున్నాయి. ‘ఇది ఒక పార్టీకో, ప్రభుత్వానికో సంబంధించింది కాదు. ఇది పీఠం ఆస్తి. గతంలో రాజకీయ ఒత్తిళ్లతో స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు వాస్తవాలు గ్రహించి, దానిని పీఠానికి స్వాధీనం చేశారు. ఇందులో రాజకీయలకు తావు లేదు. గత ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ నేతలు కూడా, పీఠం భూముల కోసం  పోరాడారు. కాబట్టి, వాస్తవాలు తెలియకుండా మాట్లాడటం మంచిదికాద’ని ధర్మాధికారి దమ్మాలపాటి చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.

దేవినేని ఉమాపై బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం

అసలే గత ఐదేళ్లలో టీడీపీ తమకు రాజకీయంగా  ఏమీ చేయలేదని..ఒక్క ఎమ్మెల్సీ, ఒక్క ఎమ్మెల్యే కూడా ఇవ్వకుండా.. అవమానించిందన్న ఆగ్రహంతో ఉన్న, బ్రాహ్మణ సామాజికవర్గానికి,  దేవినేని ఉమ ఈ ఆలయానికి సంబంధించిన చేసిన ప్రకటన పుండుమీద కారం చల్లినట్టయింది. ఓ పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా, పీఠానికి వ్యతిరేక ప్రకటన ఇవ్వడంపై ఆ వర్గం ఆగ్రహం  మండిపడుతోంది. ‘విజయవాడ ఆలయంపై మాట్లాడుతున్న దేవినేని ఉమ.. టీటీడీ వ్యవహారంలో ఎందుకు మాట్లాడటం లేదు? తాను మంత్రిగా ఉన్నప్పుడు, పుష్కరాల సమయంలో విజయవాడలోని 67 దేవాలయాలు కూల్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? సదావర్తి భూముల అమ్మకంపై ఎందుకు మాట్లాడలేద’ని బ్రాహ్మణ సంఘ నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీకే చెందిన మండలి బుద్ద ప్రసాద్, ఆ భూమి పీఠానిదేనని స్పష్టం చేసిన విషయాన్ని ఉమ విస్మరించడం దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తున్నారు.