అమ్మో… ఆ ఆసుపత్రా?

207

దయ ‘దొర’కని కార్పొ‘రేటు’ అది
హడలిపోతున్న కరోనా రోగులు
లక్షల బిల్లులతో జేబులకు చిల్లు
హాస్య రచయిత విషాద మరణం
లక్ష ఇచ్చాకే మృతదేహం ఇచ్చార
బతికున్న రోగినీ చంపేశారు
(మార్తి సుబ్రహ్మణ్యం)

అది సికింద్రాబాద్ నగర నడిబొడ్డున ఉన్న ఓ  ‘పేద్ధ’ ఆసుపత్రి. పైగా పాల‘కుల’లకు అతి దగ్గర. మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా వచ్చినా.. గాంధీ ఆసుపత్రికే వెళ్లాలని, తెలంగాణ సీఎం కేసీఆర్ అనేకసార్లు ప్రెస్‌మీట్లలో హుకుం జారీ చేశారు. మరి అలాంటి గాంధీ ఆసుపత్రికి ఈ పేద్ధ ప్రైవేటు ఆసుపత్రి, ఓ రెండుకిలోమీటర్లే దూరం! అయినా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు గాంధీకి వెళ్లకుండా, ఈ ప్రైవేటు ఆసుపత్రికే వెళుతున్నారు.

మెడపై బిల్లుల కత్తి..

దాన్నలా పక్కనపెడితే.. సికింద్రాబాద్ క్లాక్‌టవర్‌కు, కూతవేటు దూరంలోనే ఉన్న ఈ ఆసుపత్రికి, కరోనా చికిత్స కోసం వెళ్లాలంటేనే రోగులు హడలిపోతున్నారు. వైద్యం విషయంలో కాదు.  బిల్లుల యవ్వారంలో! అక్కడికి వెళితే జేబుకు చిల్లుపడాల్సిందే. చావలేక బతకడమే. అందుకన్నమాట! చివరికి, బతికున్న వారినీ చ నిపోయారని బంధువులను హడలగొట్టడం, లక్ష ఇస్తే తప్ప డెడ్‌బాడీ ఇచ్చేదిలేదని, మెడపై బిల్లు కత్తి పెట్టడంతో.. ఎందుకొచ్చామురా దేవుడా అని తలపట్టుకోవలసిన దుస్థితి. చివరకు ఓ హాస్య రచయిత, అక్కడ విషాద స్థితిలో మరణించక ముందురోజు.. పరకాల ప్రభాకర్  ట్వీట్ చేసిన తర్వాతగానీ, సదరు ఆసుపత్రి బిల్లుల ఘనతేమిన్నది మీడియా ద్వారా లోకానికి తెలియలేదు.

మానవత్వం ‘దొర’కని ఆసుపత్రి అది..

సికింద్రాబాద్‌లో ఆ ‘పేద్ధ ఆసుపత్రి’కి మంచి ఫేం ఉంది. వైద్యం బాగా చేస్తారనే నేమూ ఉంది. వీటికిమించి.. అది పాలకులకు బాగా దగ్గర. వారికి ఆ ఆసుపత్రంటే పంచప్రాణం. పెద్దోళ్ల వైద్యమంతా అక్కడే.  అంతవరకూ ఓకే. కానీ కార్పొరేట్ ఆసుపత్రి కదా? ఎంతయినా పాలకులకు దగ్గరగా ఉండే ఆసుపత్రి. మరి ఫీజులు కూడా ఆ లెవల్లో లేకపోతే, ఆసుపత్రి ప్రిస్టేజీ ఏం కాను? అందుకే ముందు వెనుకా చూడకుండా.. వచ్చిన ఆ కరోనా రోగి పల్సు చూసి కాకుండా,  పర్సు చూసే వైద్యం చేస్తున్నారు. ముక్కుపిండకుండానే బిల్లులేసి, పిండినంత పనిచేసి మరీ వసూలుచేస్తున్న దారుణం అక్కడ దర్శనమిస్తోంది. మిగిలిన బడా ఆసుపత్రులు.. మంత్రులో, ఎమ్మెల్యేలో నచ్చచెబితే బిల్లుల్లో రాయితీలు ఇస్తారు. ఎంతో కొంత కనికరిస్తారు. కానీ సికింద్రాబాద్‌లో ఉన్న ఈ ‘పేద్ధ ఆసుపత్రి’ ముందు మాత్రం,  అలాంటి సిఫార్సులు పనిచేయవు. నిర్మొహమాటంగా మొత్తం బిల్లు కట్టి వెళ్లాల్సిందే. ఎందుకంటే అది పాలకులకు దగ్గర కదా? అందుకన్న మాట! మరి దేశంలో ఎక్కడెక్కడో రంధ్రాన్వేషణ చేసి, కథనాలు రాసే మీడియాకు, ఈ ఆసుపత్రి లీలలు తెలియవా అంటే… నిక్షేపంగా తెలుసు. కానీ రాయవంతే!  ఎందుకంటే.. యాడ్సు, ఆబ్లిగేషన్లు గట్రా ఉంటాయి కదా? ఒకవేళ తప్పనిసరిగా రాయాల్సి వస్తే.. ‘ఒక ప్రైవేటు ఆసుపత్రి’ అని రాస్తాయే గానీ, దాని పేరు చచ్చినా రాయవు. అదీ సంగతి!

హాస్య రచయిత విషాదం..

ఇటీవల హాస్య రచయిత, కళాకారుడైన బాపు సోదరుడు.. శంకరనారాయణ, ఆ ఆసుపత్రిలో కోవిడ్ చికిత్స కోసం చేరారు. అలా తొమ్మిదిరోజులకు పదిన్నర లక్షల రూపాయల ఖర్చయింది. అప్పటివరకూ ఆయనను డిశ్చార్జి చేయలేదు. కుటుంబసభ్యులు అడిగితే, మరికొంత డబ్బు చెల్లించాలని చెప్పారట. అది ఇవ్వకపోతే ఆక్సిజన్ కూడా తీసేస్తామని ఆ కరుణామయులు సెలవిచ్చారట. అయితే తమకు 12 గంటల సమయం కావాలని కుటుంబసభ్యులు కోరారట. ఈలోగా.. ఆసుపత్రి వారిచ్చిన ఈ అద్భుత ఆఫర్ గురించి,  ప్రభుత్వ మాజీ సలహాదారైన డాక్టర్ పరకాల ప్రభాకర్ ట్వీట్ చేశారు.


అది కాస్తా కలకలం, ఆసుపత్రి వారిలో కలవరం  సృష్టించింది. పరకాల ట్వీట్‌ను అందిపుచ్చుకున్న  ఓ ఇంగ్లీషు పేపరు, సదరు ‘ఆసుపత్రి ఔదార్యాన్ని’ చక్కగా ఫినాయిల్‌తో కడిగేసింది. అది సదరు ఆసుపత్రి వారికి ఆగ్రహం కలిగించింది. ‘పరకాల ప్రభాకర్‌కు ఎందుకు చెప్పారు? ఇంగ్లీషు పేపరుకు ఎవరు సమాచారం ఇచ్చారు? ఇలాగైతే మా డబ్బు కట్టేసి వెళ్లిపోండ’ని రచయిత కుటుంబసభ్యులను, చాలా ‘గౌరవప్రదంగా’ బెదిరించారట.  సీన్ కట్ చేస్తే.. ఆయన గురువారం కన్నుమూశారు. లబ్ధప్రతిష్ఠుడైన ఓ హాస్య రచయిత, ఆ పరిస్థితిలో మృతి చెందడం ఒక విషాదమయితే… లక్ష రూపాయలు ఇచ్చి గానీ, ఆయన మృతదేహం విడిపించుకోవడం మరో విషాదాంతం. చివరకు మీడియాలో మాత్రం సదరు రచయిత శ్వాసకోశ వ్యాధితో మృతిచెందినట్లు వార్త వచ్చింది.

బతికిన వారికీ చావువార్త..

ఇలాంటిది కాకపోయినా ఇదీ విషాద, విశేష ఘటనే. అంబర్‌పేట శంకర్ తెలుసుకదా? ఆయన సోదరుడు కూడా,  అదే ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్నారు. పదిరోజులకు పదిలక్షల బిల్లు వేసి, 6 లక్షల కట్టించుకున్నారు. బుధవారం రాత్రి ఫోన్ చేసి మీ మామయ్య చనిపోయాడు. మరో 3 లక్షల 75 వేలు కట్టి డెడ్‌బాడీ తీసుకువెళ్లమని చెప్పారట. దానితో ఖంగుతిన్న సదరు పేషెంటు బంధువులు.. మంగళవారం వరకూ బాగానే ఉన్న రోగి, ఎలా చనిపోతారో అర్ధం కాక తపట్టుకున్నారు పాపం అఆయన భార్యకయితే హార్టుస్ట్రోకు కూడా వచ్చిందట. తీరా అక్కడికి వెళితే రోగి నిక్షేపంగా బతికే ఉన్నారు.

లాంటి లీలలు ఎన్నో!

ఇటీవలి కాలంలో కరోనా చికిత్సకు చేరిన రోగులకు,  సదరు ఆసుపత్రి వేస్తున్న లక్షల రూపాయల బిల్లుల వ్యవహారం యాడ్సులు, ప్యాకేజీల  మొహమాంతో మీడియా బయటపెట్టకపోయినా..  సోషల్‌మీడియాలో వెలుగుచూస్తూనే ఉంది. శ్రీకృష్ణుడిని పెంచిన ‘యశోద’ చిన్నప్పుడే ఆయన లీలలు చూసి ఆశ్చర్యపోయేదట. ఇప్పుడు సికింద్రాబాద్‌లోని ఈ ఆసుపత్రి లీలలు చూసి కూడా,  రోగులు పరుగులు తీస్తున్నారట. ఇక రోగులను ఆ ‘శ్రీమన్నారాయణుడే’ కరుణించాలి!