‘కల్ల’ ం చెదిరింది.. కథ మారింది!

562

అజేయుడికి అంత అవమానమా?
ఆంధ్రాలో మరి అంతేగా.. అంతేగా!
                (మార్తి సుబ్రహ్మణ్యం – 9705311144)

ఆయన పేరు అజయ్ కల్లం. మాజీ ఐఏఎస్. పేరు చివరలో కల్లం ఉంది కదా అని.. ఆయనెవరో ఉత్తరాదివాడనుకునేరు! అచ్చంగా బాపట్ల పెద్దారెడ్డిగారేనండోయ్!! నీతి, నిజాయితీ గల కొద్దిమంది అధికారులలో ఆయనొకరు. అడ్డదారులు తొక్కడం, ఆస్తులు పోగేసుకోవడం ఆయనకు తెలియదు. తెలిసిందల్లా ముక్కుసూటితనమే. అందుకే ఆయనంటే చాలామందికి గౌరవం. అభిమానం. అసలు అజయ్ కల్లం బాపట్ల పెద్దా‘రెడ్డి’గారని రాష్ట్రం విడిపోయిన తర్వాత, అది కూడా సర్వీసు నుంచి రిటైరయి, జగన్మోహన్‌రెడ్డిపార్టీ కోసం పనిచేసిన తర్వాతగానీ జనాలకు తెలియలేదు.”

ఆయన రెడ్డి కాబట్టే.. తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ, అప్పట్లో తెలుగుదేశీయులు కల్లం అజయ్‌రెడ్డి గారూ అని ప్రత్యేకించి, పేరు చివర ఉన్న పదాన్ని నొక్కివక్కాణించేవారు. ఏమాటకామాట! కల్లం పెద్దారెడ్డి గారు కూడా ఆరోజుల్లో.. విశ్వామిత్రుడు, వశిష్ఠుడి మాదిరిగా, శిష్యుడయిన జగన్మోహన్‌రెడ్డి కోసం తమ మేధస్సునంతా ధారపోశారు.  దానికోసం ఆయన ఎక్కని వేదికలు లేవు. తిరగని ఊరు లేదు. మాట్లాడని మైకు లేదు. చివరకు భోగాపురం భూములపై.. తెలుగుదేశీయుల దుర్మార్గాన్ని ఫినాయిల్, డెట్టాల్‌తో కడిగేసి.. అందులో బోలెడంత అవినీతి జరిగిపోందని టముకేసి మరీ చెప్పారు.

గురువు రుణం తీర్చుకున్న శిష్యుడు..

మరి అంత లావు పెద్దారెడ్డిగారిని.. జగనన్న సీఎం అయిన తర్వాత, పెద్ద పదవితో గౌరవించాలి కదా? అవును. జగనన్న అదే పనిచేశారు. ‘కల్లం అన్న’ను తన సలహాదారుగా నియమించుకుని, సీఎంఓ పెత్తమనంతా ఆయన చేతికి ఇచ్చి రుణం తీర్చుకున్నారు. ఎవరొచ్చినా ‘కల్లం అన్నను కలవండని’ పురమాయించేవారు. అంతలా ‘కల్లం అన్న’ను ప్రేమించారన్నమాట! ఒక గురువుకు శిష్యపరమాణువు అంతకుమించి ఇచ్చే రాజకీయ గురుదక్షణ, గౌరవం  ఇంకేం ఉంటుంది చెప్పండి? ఆమాటొస్తే విపక్షంలో తనకోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేసిన ఒక లక్ష్మణరెడ్డి, ఇంకో లక్ష్మణరెడ్డి, మరో ఆంజనేయరెడ్డి.. ఇలా చాలామంది, అంటే  ఒక నాలుగయిదు డజన్ల పెద్దారెడ్లకు.. జగనన్న పెద్దపీటనే వేశారనుకోండి. ఆ ప్రకారంగా ప్రతిపక్షంలో ఉండగా, తనకు కరసేవ చేసిన తమవారికందరికీ, కులమతాల తేడా లేకుండా,  తాంబూలాలిచ్చి రుణం తీర్చుకున్నారు. ఇక జగనన్నకు ఆ విషయంలో రుణశేషం మిగలలేదన్నట్లే లెక్క. ఎటొచ్చీ.. ఎన్నికల ముందు, జెండా మోసిన నేతలే మిగిలిపోయారు. అది వేరే విషయం!  

కల్లం కలలు చెదరిపాయె..

పాపం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చేసిన, బాపట్ల పెద్దారెడ్డి గారు కూడా అంతమాత్రానికే ఉబ్బితబ్బిబ్బయి, శిష్యపరమాణువిచ్చిన అపూర్వ, అద్భుత అవకాశ పురస్కారానికి మురిసిముక్కలయ్యారు. ఇక అక్కడి నుంచి సీఎంఓలో, కదలకుండా కూర్చుని చాలా శ్రమదానం చేశారు. పనిచేయడం, చేయించడంలో నిష్ణాతుడయిన ఆయన..  పాలనను గాడిలో పెట్టి, సంస్కరించేందుకు తన వంతు కృషి చేశారు. తనకు కొలువిచ్చిన శిష్యుడికి ‘మంచి శబ్బర్లు’ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, అది శిష్యపరిమాణువుకు సుతరామూ నచ్చలేదు. అలాగని గురువును పొమ్మనలేరు. మరెలా?.. అందుకే తనలాంటి, అచ్చం తన లక్షణాలున్న మరో జూనియర్ అధికారినే సీఎంఓలోకి తీసుకువచ్చారు. ఆయన అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న! మాట వినకపోతే సీతయ్యకు అన్నయ్యే. అంటే అచ్చం తనకు కొలువిచ్చినాయన టైపేనన్నమాట!!

పాపం.. పొగనే తట్టుకోలేని ఎల్వీ

ఆయన ఊపు, ఉత్సాహానికి..  పాపం సీఎస్‌గా ఉన్న, ఎల్వీ సుబ్రమణ్యం కూడా శుభ్రంగా పెట్టే బేడా సర్దుకుని బయటకు రావలసి వచ్చింది. ఆయనంటే నోరూ వాయీ లేని పిచ్చి  బ్రాహ్మడు కాబట్టి.. తనకు జరిగిన అవమానాన్ని దిగమింగుకుని, కల్లం రెడ్డి మాదిరిగా బయటకొచ్చి సెమినార్లేవీ పెట్టకుండా, నోరు విప్పకుండా నోట్లో గుడ్డలు కుక్కుకొని.. అంతా దేవుడే చూసుకుంటాడు. ఎవరి ఖర్మ వారనుభవిస్తారనుకుని, మళ్లీ ఆ శాపం పాలకులకు వినిపిస్తే.. ఎక్కడ ప్రమాదం ముంచుకు వస్తుందన్న భయంతో,  మనసులోనే శపించి మనకెందుకని మౌనంగాఇ నిష్క్రమించారు. మరి ‘రాజమండ్రి రాజకీయ సిద్ధాంతి’ ఉండవల్లి వారు చెప్పినట్లు.. ‘అందరూ ఎల్వీ సుబ్రమణ్యాలుండరు. ఏబీ వెంకటేశ్వరరావులు, నిమ్మగడ్డ రమేషులు కూడా ఉంటారు’! వాళ్లకు పాలన అంతా కొట్టినపిండి కాబట్టి, సదరు ఆచంట మల్లన్నకు ఎదురుతిరిగి, కోర్టుకెక్కారనుకోండి. అది వేరే ముచ్చట!!

పొగపెట్టకుండానే బయటకు..

ఇప్పుడు ఉన్నట్లుండి.. అంత లావు పెద్ద మనిషయిన కల్లం రెడ్డిగారిని.. చెప్పా పెట్టకుండా, సీఎంఓ నుంచి పొగ పెట్టకుండానే పంపేయడంపై బోలెడుమంది నోరెళ్లబెట్టారు. ఇప్పటివరకూ సీఎంఓలో ఆయన చూసిన సబ్జెక్టులన్నీ ప్రవీణ్ ప్రకాష్ అనే గౌరవనీయులైన, అత్యంత సీనియర్ అధికారికి దఖలు చేశారు. సీనియర్లను గౌరవించడం, చాలా శాంతమూర్తిగా పేరున్న ప్రకాష్‌కు.. సీఎంఓను నడిపించే ‘ప్రావీణ్య’ం ఉందనే  విషయం, ఎల్వీని సాగనంపినప్పుడే ప్రపంచానికి తెలిసింది మరి! కల్లం రెడ్డిగారితో పాటు, రిటైరయిన మరో ఐఏఎస్ అధికారి రమేష్‌కుమార్‌నూ.. గౌరవంగా సాగనంపేసిన సిత్రం కూడా, చూచు వారలకు చూడముచ్చట!! రమేష్‌కుమార్ కూడా విపక్షంలో ఉండగా, జగనన్న  అధికార వెలుగు కోసం కష్టపడి  కొవ్వొత్తులు వెలిగించిన వారే. ఇప్పుడు కల్లం గారికి సబ్జెక్టులన్నీ తీసేసినా, సలహాదారు పదవొకటి ఉంచారు. బానే ఉంది!  మరి ఆయనకు సీఎంఓలో సీటు ఉండదు. సలహాదారులకు సీఎంఓ చాంబరులో  సీటెలా ఇస్తారు? అదో అవమానం.  ఏం చేస్తాం?.. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ! హేమిటో.. అప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్తానన్న ఆ ‘రేరా’ చైర్మన్ పదవేదో ఇచ్చేసి ఉంటే,  కల్లం గారికి ఈ కష్టాలొచ్చేవి కావు.

భజన చేస్తేనే బంతిభోజనం..

అసలు తనకు కొలువిచ్చిన శిష్యపరమాణువుతోపాటు.. ఆయన ఏరికోరి సీఎంఓలో తెచ్చిపెట్టుకున్న,  ఆచంట మల్లన్న గుణగణాలు గుర్తించకుండా, ఇప్పటివరకూ అక్కడ కొలువుదీరడమే,  మర్యాదరామన్న లాంటి కల్లం రెడ్డి గారు చేసిన తప్పు! పాలకులు వెళుతున్న దారిని తప్పు పడితే, వారికి మహా చెడ్డ చిరాకేస్తుంది. అలా కాకుండా.. వారు చేసేది అద్భుతం, అపరూపం, అనన్య సామాన్యమని భట్రాజులు కూడా ఈర్ష్యపడేలా భజన చేస్తేనే, కొలువులు భద్రంగా ఉంటాయి. అది జగనన్న కాలంలోనయినా, చంద్రన్న కాలంలోనయినా సరే. పొగుడు పొగిడించు.. మా నవ్వులు పండించమని కోరుకునే,  పాలకుల మనసెరిగిన భృత్యులే  కలకాలం ఏ ప్రభువు వద్దనయినా రాణిస్తారు.

సతీష్‌చంద్రను చూసి నేర్చుకోవలసిందే..

ఇప్పుడు సతీష్‌చంద్ర అనే అధికారినే చూడండి. ఆయన చంద్రబాబునాయుడు కొలువులో సీఎంఓను శాసించారు. బాబు చెప్పిన వాటిని కుదరదని చెప్పకుండా,  తేల్చకుండా విజయవంతంగా  నాన్చేవారు. ఉప ముఖ్యమంత్రులు కూడా, సతీష్‌చంద్ర దర్శనం కోసం గంటలపాటు వేచిచూసిన మధుర స్మృతుల గురించి ఎంత చెప్పినా తక్కువే.  బాబు దగ్గర ఉంటూ, తన పార్టీ ఎమ్మెల్యేలతో బేరసారాలాడారని స్వయంగా జగనన్న, విజయసాయి ఇదే సతీష్‌చంద్రపై అప్పడు టన్నులకొద్దీ బురదపోశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సతీష్‌చంద్ర.. ఆరేడు నెలలు పోస్టింగ్ వియోగం అనుభవించినా, తర్వాత ఏకంగా ఉన్నతవిద్యాశాఖలో సెటిలయిపోయారు. ఇప్పుడు జగనన్నతో కూడా ఫొటోలో క నిపిస్తున్నారు. కాలం, ఖర్మం కలిసొస్తే..  రేపో మాపో, ఆయనే సీఎస్ కావచ్చేమోనంటున్నారు. తెలివంటే అదీ. లౌక్యం అంటే అదీ!  స్థితప్రజ్ఞత, ప్రాప్తకాలజ్ఞత కలగలసి ఉండే  ఉత్తరాది అధికారులకు ఉండే తెలివి, మన తెలుగు అధికారులకు ఎక్కడ తగలబడింది? పాపం.. కల్లం రెడ్డిగారికి, ఆ రెండూ లేకపోవడంతోనే దెబ్బతిన్నారు.

సబ్జెక్టులు లేని  సలహాదారుగా ఉంటారా?..

అయితే, సీఎంఓ నుంచి సబ్జెక్టులేవీ లేకుండా చేసి,  సగౌరవంగా  సాగనంపినప్పటికీ, తన శిష్యుడు సలహాదారు పదవిని మాత్రం,  గురువుగారికి  ఊడకొట్టకుండా ఉంచారు. అదొక్కటే సంతోషం!  ఇక కల్లం రెడ్డి గారు కూడా హాయిగా డజన్ల మంది సలహాదారుల్లో ఒకరిగా ఉండి, ఎంచక్కా ఇంటిపట్టునే ఉంటూ జీతం తీసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది సలహాదారులు చేస్తున్నది అదే కాబట్టి, కల్లం గారు కూడా నిక్షేపంగా ఆ పని చేయవచ్చు. అలాకాకుండా, ఠాఠ్.. పనిలేకుండా పుణ్యానికి జీతం తీసుకునేందుకు,  నేనేమైనా వారందరిలా ఆత్మాభిమానం లేని వాడినా అనుకుని, ‘నాకొద్దీ కొలువ’ని పౌరుషంతో రాజీనామా చేస్తానన్నా చేయవచ్చు. అన్నట్లు.. గతంలో చంద్రబాబు ఇస్తానని, ఇవ్వకుండా ఉన్న ‘రేరా’ చైర్మన్ పదవిని.. ఇప్పడు కల్లం అన్నకు ఇస్తానని జగనన్న హామీ ఏదో ఇచ్చినట్లు వినికిడి.

ఈ లెక్కన..  ‘ప్రకాషన్న’ కూడా ఎన్నాళ్లో..

సీఎంఓలో ఎప్పటినుంచో అమలవుతున్న అంతేగా.. అంతేగా సిద్ధాంతం,  కల్లం వంటి పెద్దాయనను కూడా అవమానిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కల్లం అన్న అంటూ నోరారా ఆప్యాయంగా పలకరించిన నోరే, తనకు పనిలేకుండా చేస్తుందని పాపం ఆ గురువుగారు ఊహించి ఉండరు. ఒకరకంగా తన గురువు కల్లంజీకి శిష్యుడైన జగనన్న గురుపూజోత్సవం సెప్టెంబర్ 5వ తేదీ కాకుండా, జులై 8న చేసినట్లు లెక్క!  మరి.. తొలి సంతకం చేసిన తొలిరోజుల్లో ‘ఎల్వీ అన్న’.. నిన్నటి వరకూ  ‘కల్లం అన్న’ అంటూ ఆప్యాయంగా పలకరించిన జగనన్న,  ఎప్పుడు  ప్రకాషన్న అని పిలుస్తారో చూడాలి?! ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం మూడో కృష్ణుడి వార్త కోసం చూస్తోంది మరి!