ప్రభాస్‌ 20 ఫస్ట్‌లుక్‌

121

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్‌ కొత్త చిత్రం ఫస్ట్‌లుక్‌ రానే వచ్చింది. సాహో తర్వాత ప్రభాస్‌ ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో తన 20వ సినిమా చేస్తున్నాడు. ప్రభాస్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఇందులో ప్రభాస్‌, పూజా హెగ్డే రొమాంటిక్‌గా నిలబడిన తీరు ఆకట్టుకుంటోంది. సినిమాకి ‘రాధే శ్యామ్‌’ టైటిల్‌ పెట్టినట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అదే పేరును చిత్ర బృందం ఖరారు చేసింది. ఈ చిత్రంలో ప్రభాస్‌ ‘ఫ్యూచర్‌ టెల్లర్‌’గా.. పూజా యువరాణిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇందులో ప్రియదర్శి, బాలీవుడ్‌ నటి భాగ్యశ్రీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
యూవీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం యూరప్‌ నేపథ్యంలో పీరియాడికల్‌ ప్రేమకథగా తెరకెక్కుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. లాక్‌డౌన్‌కు ముందు ఈ చిత్రబృందం షూటింగ్‌ కోసం జార్జియా వెళ్లింది. అక్కడి షూటింగ్‌ పూర్తి చేసుకొని భారత్‌కు రాగానే కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో చిత్రబృందం షూటింగ్‌ను నిలిపివేసింది. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ప్రభాస్‌ ‘మహానటి’ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.