రాజు గారిపై వేటు వెనుక… క్రైస్తవ కోణం?

776

మతమార్పిళ్లకు వ్యతిరేకంగా గళం విప్పినందుకేనా?
వెంకన్న భూముల అమ్మకాలను వ్యతిరేకించిన ఫలితమేనా
పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న కేఏ పాల్
తాను చెప్పిందే జరిగిందని పాల్ శాపం
కేఏ పాల్ బయటపెట్టిన నిజం
రఘురాముడి ఎపిసోడ్‌లో వెలుగుచూసిన మతకోణం
           (మార్తి సుబ్రహ్మణ్యం 9705311144)

వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వేటు వేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల వెనుక ‘క్రైస్తవ కోణం’ ఉందా? మతమార్పిళ్లకు వ్యతిరేకంగా గళం విప్పినందుకే రాజుపై జగన్ పార్టీ గరమవుతోందా? వెంకటేశ్వరస్వామి ఆలయ భూముల అమ్మకాలను ప్రశ్నించిన ఫలితమే, రఘురాముడిపై వేటు వేసే యత్నమా? తాజాగా అంతర్జాతీయ క్రైస్తవ ప్రచారకుడు కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలకు, రాజుపై చర్యలకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలకు లింకు ఉందా? మతమార్పిళ్లను వ్యతిరేకించిన రఘురాముడిని,  పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పాల్ డిమాండ్ చేయడం.. ఆ వెంటనే జగన్ పార్టీ అంతకంటే తీవ్రమైన చర్యలు తీసుకోవడం చూస్తే.. రఘురామకృష్ణంరాజు మెడపై అనర్హత కత్తి వేళ్లాడేందుకు క్రైస్తవ మతపెద్దల  ఒత్తిళ్లే కారణమా?.. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక రాజకీయ కోణం బదులు, హిందూ-క్రైస్తవ కోణమే దాగుందా?.. రఘురామకృష్ణంరాజును సమర్ధిస్తున్న హిందూవాదులు  దీనికి అవుననే జవాబిస్తున్నారు.

పాల్ చెప్పిందే.. జగన్ చేశారా?

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి విధానాలను తొలిసారి చూపుడువేలితో ప్రశ్నించి, జగన్ ఆగ్రహానికి గురయి షోకాజ్ నోటీసు అందుకున్న,  ఆ పార్టీ నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజు కధ వెనుక రాజకీయ అంశాల కంటే.. మతకోణమే ఉందని ఆయన వర్గీయులు, హిందూ సంస్థలు  అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ వాదనకు మద్దతుగా, అంతర్జాతీయ క్రైస్తవ మత ప్రచారకుడైన కి లారి ఆనందపాల్.. ఉరఫ్ కేఏ పాల్ విడుదల చేసిన వీడియోను సాక్ష్యంగా చూపిస్తున్నారు. అందులో మతమార్పిడి నిరోధ బిల్లు తీసుకురావాలని, మిషనరీలు డబ్బులు  వెదజల్లుతున్నాయంటూ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై పాల్ అగ్గిరాముడయ్యారు.

ఫలించిన పాల్ శాపం..

‘మతమార్పిళ్లను వ్యతిరేకిస్తూ, రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదు. సారీ చెప్పమని చెబితే ఆయన చెప్పలేదు. మార్పు చెందలేదు. తప్పుదిద్దుకోలేదు. బిజెపి, మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ ఎవరు సపోర్టు చేస్తున్నారో వాళ్లను చేయవద్దని చెప్పా.  మతమార్పిళ్లను వ్యతిరేకించినందుకు రఘురామకృష్ణంరాజును పార్టీ నుంచి డిస్మిస్  చేయాలని వైస్సార్‌సీపీని నేను డిమాండ్ చేశా. ఇప్పుడేమైంది?  మరి నేను చెబుతున్నవే జరుగుతున్నాయా? లేదా? ఇప్పటికయినా ఆయన మతమార్పిడి బిల్లు తీసుకురావాలని చేస్తున్న వాదనలో మార్పు రావాలి. ఆయన నన్ను బెదిరిస్తే నేను బెదిరిపోను’.. ఇదీ కేఏపాల్,  అమెరికా నుంచి రఘురామకృష్ణంరాజునుద్దేశించి పంపిన  వీడియోలో చేసిన వ్యాఖ్యలు.  అంతకుముందు..మతమార్పిడి నిరోధక బిల్లు తీసుకురావాలని రఘురామకృష్ణంరాజు ‘టైమ్స్‌నౌ’ చానెల్‌లో గట్టిగా కోరారు. విదేశీ మిషనరీల నుంచి భారీ స్థాయిలో నిధులు ప్రవహిస్తున్నాయని ఆరోపించారు. దానిపై మండిపడిన గోదావరి పాల్‌కు బోలెడంత  ‘కోపాల్’ వచ్చి, రఘురామకృష్ణంరాజును ఆవిధంగా శపించారు.

మతమార్పిళ్లపై మండిపడిన రాజు

ఇంతకూ  రఘురామకృష్ణంరాజు ఏమన్నారంటే.. ‘ఏపీలో క్రిస్టియన్ల శాతం 2.5 మాత్రమే. ఇది జనాభా లెక్కల ప్రకారం తేలిన నిష్పత్తి.  కానీ తెలుగు రాష్ట్రాల్లో వారి అనధికారిక సంఖ్య 25 శాతం. నిజం. ఇదెలా సాధ్యం? విదేశీ మిషనరీల నుంచి మతమార్పిళ్లకు లెక్కలేనంత డబ్బు వస్తోంది.  మతం మారిన  వారంతా ఆదివారం చర్చిలకు వెళుతున్నారు. ప్రార్ధనలకు వెళుతున్నారు.  పాస్టర్లకు విరాళాలు ఇస్తున్నారు. మతం మారిన వారు తాము మతం మారినట్లు ఎక్కడా చెప్పకుండా, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. వారు నిజంగా మతం మారితే, రాజ్యాంగం కల్పించిన అన్ని సౌకర్యాలు కోల్పోతారు. ప్రధానంగా వారికి రిజర్వేషన్లు వర్తించవు. అందుకే చెప్పడం లేదు. ఇది రాజ్యాంగ విరుద్ధం. వారంతా బీసీ సీ కేటగిరీ కిందకు వస్తారు. ఇలాంటి మతమార్పిళ్లు ఒక్క ఏపీ, తెలంగాణలోనే కాదు. దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఏపీలో అధికంగా జరుగుతున్నాయి. వాటిని నిరోధించాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వాల బాధ్యత.  మతం మారిన వారికి రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించకూడదన్న.. రాజ్యాంగ సూత్రాన్ని పకడ్బందీగా అమలు చేయాలంటే, మతమార్పిడి నిరోధక చట్టం తీసుకురావాలంటున్న   కోట్లాదిమంది భారతీయులు, హిందువుల్లో ఒకడిగా కోరుతున్నా.  నేను ఏ కులానికి, మతానికి వ్యతిరేకం కాదు. రాజ్యాంగం ప్రకారమే మాట్లాడుతున్నా’ అని స్పష్టం చేశారు.

వెంకన్న భూముల అమ్మకాలపై విరుచుకుపడ్డ వైనం..

ఆ తర్వాత.. తిరుమల తిరుపతి భూముల అమ్మకంపైనా రఘరామకృష్ణంరాజు గట్టిగా తన నిరసన గళం వినిపించాయి. వాటిని నిలిపివేయాలని సీఎం జగన్మోహన్‌రెడ్డిని కోరారు. ఎవరో భక్తులు వెంకన్నపై విశ్వాసంతో, విరాళంగా ఇచ్చిన భూములను అమ్మే హక్కు టీటీడీకి లేదని ఘంటాపదంగా స్పష్టం చేశారు. తాను వెంకటేశ్వరస్వామి భక్తుడిగా, ఓ హిందువుగా ఆవేదన చెంది, ఈ డిమాండ్ చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు.  వెంకటేశ్వరస్వామి జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు. దానితో, ప్రభుత్వం దిగివచ్చి ఆ ప్రతిపాదనను విరమించుకోవలసి వచ్చింది. ఆ తర్వాత కూడా రాష్ట్రంలో హిందూ ఆలయ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, హిందువుల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరించటం ఏ ప్రభుత్వానికీ మంచిదికాదని, జగన్మోహన్‌రెడ్డి సర్కారుకు పరోక్షంగా చురకలు అంటించారు. కాగా అమరావతిలో, అఖిల భారత హిందూ మహాసభ అయోధ్య తరహాలో నిర్మించతలపెట్టిన, రామాలయ  నిర్మాణ  ప్రకటన వెలువడిన వెంటనే.. దానికి లక్ష రూపాయల విరాళం కూడా ప్రకటించిన, తొలి నాయకుడు రఘురామకృష్ణంరాజు కావడం విశేషం.

క్రైస్తవ పార్టీలో చేరినా.. మారని రాజు హిందూ అనుకూల వైఖరి

దీనిని పరిశీలిస్తే.. రఘురామకృష్ణంరాజుపై సస్పెన్షన్ వేటు వెనుక కారణం ఏమిటన్నది మెడపై తల ఉన్న ఎవరికైనా సులభంగానే అర్ధమవుతోందని ఆయన వర్గీయులు స్పష్టం చేస్తున్నారు. స్వతహాగా హైందవ ధర్మం, సంస్కృతిని పాటించి, ప్రోత్సహించే రఘురామకృష్ణంరాజుకు జాతీయ హిందూ సంస్థలతో మొదటి నుంచీ సత్సంబంధాలున్న విషయం రహస్యమేమీ కాదు. తెలుగు రాష్ట్రాల్లోని అనేక దేవాలయాలు, హిందూ ధార్మిక సంస్థలు నిర్వహించే సేవా కార్యక్రమాలకు భారీగానే విరాళాలు ఇస్తుంటారు. అలాంటిది.. ఆయన ‘క్రైస్తవ పార్టీగా ముద్ర’ ఉన్న,  వైఎస్సార్‌సీపీలో చేరడమే ఆశ్చర్యమన్న వ్యాఖ్యలు అప్పుడే వినిపించాయి.

మతమార్పిళ్లు అడ్డుకుంటాం: జీవీఆర్ శాస్త్రి

దేశవ్యాప్తంగా ఒక పథకం ప్రకారం జరుగుతున్న మతమార్పిళ్లను అడ్డుకుని తీరతామని, ప్రముఖ విశ్లేషకుడు, ప్రముఖ ఆర్ధికశాస్త్రవేత్త, అఖిల భారత హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవీఆర్ శాస్త్రి స్పష్టం చేశారు. ‘‘కొన్ని రాజ్యాలు, రాష్ట్రాల్లో పూర్తిగా వ్యతిరేక ధోరణిలో, దేశ సార్వభౌమత్వాన్ని చాలెంజ్ చేయడం ఆందోళన కలిగించే అంశం. భిన్నత్వంలో ఏకత్వాన్ని సవాల్ చేసేందుకు, మతమార్పిళ్ల ద్వారా అధికారాన్ని దీర్ఘకాలం నిలబెట్టుకోవాలని, కొన్ని పార్టీలు తాపత్రయ పడుతున్నాయి. అలాంటి ప్రయత్నాలను హిందూ మహాసభ కొనసాగనివ్వదు. ఈ రకంగా జరుగుతున్న ప్రయత్నాలు రాజ్యాంగంపై నీళ్లు చ ల్లడమే. హిందూ సంస్కృతి ధర్మం, దేశ రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్న మతమార్పిళ్లను మేం నిలువరించి తీరతాం. హిందూ సమజాన్ని చైతన్యపరుస్తాం. మతం మారడం అంటే తల్లిని మార్చడమేనని భారతీయ సమాజానికి స్పష్టం చేస్తున్నాం’ అని జీవీఆర్ శాస్త్రి వ్యాఖ్యానించారు.

దీని వెనుక మతం కోణమే ఉంది: శ్రీధర్‌శర్మ

‘పార్టీ అధికారంలోకి వచ్చినందువల్ల, హిందూయిజంపై ఆయన వైఖరి, విధానం మార్చుకుంటార ని నాయకత్వం ఊహించినట్లుంది. కానీ ఆయన హిందుత్వ విధానం, ప్రధానంగా మతమార్పిళ్ల వ్యతిరేక విధానం కొనసాగించడం వాళ్లకు నచ్చినట్లు లేదు. ఆ టీవీ లైవ్ షో చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది.  మతమార్పిళ్లకు రాజుగారు వ్యతిరేకంగా మాట్లాడటం, అందుకు కేఏపాల్ ఆగ్రహించి.. ఆయనను పార్టీ నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేయడం, జగన్ గారు కూడా పాల్ ఆదేశాలు పాటించి.. రాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరడం చూస్తే.. హిందువుల మనోభావాలపై రాజు గళమెత్తుతున్నందుకే, ఆయనపై కక్షసాధింపు చర్యలు జరుగుతున్నాయని ఏ హిందువుకయినా అర్ధమవుతుంది. వైఎస్సార్‌సీపీలో ఉన్నంత మాత్రాన, హిందువులకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడకూడదా? మతమార్పిళ్లను వ్యతిరేకించిన మాత్రాన, వెంకటేశ్వరస్వామి భూముల అమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరతారా? ఇదంతా పార్టీ వ్యతిరేకంగా మాట్లాడినందుకు తీసుకుంటున్న చర్యలు కానే కాదు. ఆయన జగన్ గారికి వ్యతిరేకంగా గానీ, పార్టీకి వ్యతిరేకంగా గానీ మాట్లాడినట్లు ఒక్క ఆధారం కూడా కనిపించడం లేదు.  ఇదంతా ముసుగు మాత్రమే. అసలు విషయం ఏమిటంటే… రాజు గారు మతమార్పిళ్లకు వ్యతిరేకంగా, మిషనరీల నిధుల గురించి, హిందూ మతానికి అనుకూలంగా మాట్లాడుతున్నందుకే,  పార్టీ నుంచి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనివెనుక మతకోణం కచ్చితంగా ఉంద’ని రాష్ట్ర బ్రాహ్మణ చైతన్య వేదిక కన్వీనర్ శిరిపురపు శ్రీధర్‌శర్మ విశ్లేషించారు.

3 COMMENTS

  1. […] నిజమయిన రఘురాముడి ‘మతమార్పిళ్ల’ వాదన కాగా.. ఏపీలో జనాభా లెక్కల ప్రకారం.. 2.5 శాతం మాత్రమే ఉన్న క్రైస్తవుల సంఖ్య, ఏకబిగిన  25 శాతానికి పెరుగుతోందని.. ఇటీవలి కాలంలో గళం విప్పిన నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వాదనకు, కారణం ఇదేనని సష్టమవుతోంది. రాష్ట్రంలో గత ఏడాది కాలం నుంచీ జరుగుతున్న మతమార్పిళ్లపై,  రాజు బహిరంగంగానే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్లే ఆయన, మతమార్పిడి నిరోధక చట్టం తీసుకురావాలని గట్టిగా వాదిస్తున్నారని జరుగుతున్న ఘటనలు, వెలుగుచూస్తున్న నివేదికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీలో శరవేగంగా జరుగుతున్న మతమార్పిళ్లపై, లీగల్‌రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్రపతికి ఇచ్చిన నివేదిక.. రఘురామకృష్ణంరాజు అదే అంశంలో చేస్తున్న ఆందోళన పరిశీలిస్తే, రాజు ఆందోళనలో వాస్తవం ఉందన్న వ్యాఖ్యలు, హిందూ సంస్థల్లో  వ్యక్తమవుతోంది. మతమార్పిళ్లపై గళెమెత్తినందుకే, రాజుపై  వైసీపీ నాయకత్వం అనర్హత వేటు వేసేందుకు సిద్ధమవుతోందని, ఇటీవలే పలు హిందూ సంస్థలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి.. రాజు గారిపై వేటు వెనుక… క్రైస్తవ క… […]

  2. […] కాగా.. ఏపీలో జనాభా లెక్కల ప్రకారం.. 2.5 శాతం మాత్రమే ఉన్న క్రైస్తవుల సంఖ్య, ఏకబిగిన  25 శాతానికి పెరుగుతోందని.. ఇటీవలి కాలంలో గళం విప్పిన నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వాదనకు, కారణం ఇదేనని సష్టమవుతోంది. రాష్ట్రంలో గత ఏడాది కాలం నుంచీ జరుగుతున్న మతమార్పిళ్లపై,  రాజు బహిరంగంగానే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్లే ఆయన, మతమార్పిడి నిరోధక చట్టం తీసుకురావాలని గట్టిగా వాదిస్తున్నారని జరుగుతున్న ఘటనలు, వెలుగుచూస్తున్న నివేదికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీలో శరవేగంగా జరుగుతున్న మతమార్పిళ్లపై, లీగల్‌రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్రపతికి ఇచ్చిన నివేదిక.. రఘురామకృష్ణంరాజు అదే అంశంలో చేస్తున్న ఆందోళన పరిశీలిస్తే, రాజు ఆందోళనలో వాస్తవం ఉందన్న వ్యాఖ్యలు, హిందూ సంస్థల్లో  వ్యక్తమవుతోంది. మతమార్పిళ్లపై గళెమెత్తినందుకే, రాజుపై  వైసీపీ నాయకత్వం అనర్హత వేటు వేసేందుకు సిద్ధమవుతోందని, ఇటీవలే పలు హిందూ సంస్థలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి.. రాజు గారిపై వేటు వెనుక… క్రైస్తవ క… […]