గలగలా గోదారి .. విలవిలా రాదారి!

224

తరలిపోనున్న వూళ్లు..ఉబికివస్తున్నాయ్ కన్నీళ్లు!!

జన్మభూమితో రుణానుబంధం తీరిపోయింది! గోదారమ్మతో పవిత్ర బంధం తెగిపోయింది!! నిలువునా ముంచేసే దుర్ముహూర్తం శరవేగంగా తుపానులా దూసుకొస్తోంది. గుండె పగిలిన మట్టి మనుషులు బిత్తర చూపులతో తలో దిక్కు చూస్తున్నారు. గూడు చెదిరిన ఎవరిని ఏ దిక్కుకు పంపాలో అంతుబట్టక దిక్కులేని ఆ రహదారి తెల్లబోయి దిక్కులు చూస్తోంది. ఇప్పుడు అన్ని అడుగులూ వేలేరుపాడు వైపు పడుతున్నాయి. తెగిపోయే దారులు ఏ “దారి” చూపుతాయో తెలియక అయోమయంలో కూరుకుపోతున్నాయి. నిర్మల ప్రశాంతంగా, ధీర గంభీరంగా ప్రవహిస్తూ వేదంలా ఘోషించే గోదావరి తనకు సంబంధమే లేని మరణ శాసనమేదో లిఖిస్తోంది. కలలోనైనా వూహించలేని ఘోర విపత్తును సృష్టించబోతోంది. “ఈ గాలీ, ఈ నేలా, ఈ వూరు, సెలయేరూ .. ” అంటూ హేపీగా ఆలపించే పాటలకు ఇక్కడ ఇక కాలం చెల్లింది. పుట్టుక నుంచి గిట్టేదాకా అడవి తల్లినే నమ్ముకుబతికే గిరిపుత్రులు, నేలతల్లినే ఆసరా చేసుకొని బతుకులు వెళ్ళదీసిన బహుజనం, బడుగు జీవుల మౌనరోదన ఇక మరో ఆనకట్టకు సరిపడా కన్నీటి వరదను పోటెత్తిస్తోంది!!

చరిత్ర పుటల్లో వేలేరుపాడు స్థానం అంత గొప్పదేం కాకపోవచ్చు. అయితే విస్మరించదగినది మాత్రం కానేకాదు. రేఖామాత్రంగా చరిత్రను తడిమి చూస్తే.. మండలంలోని రుద్రమకోట గ్రామం ఒకనాటి కాకతీయ వీరనారి రాణీ రుద్రమదేవి తిరుగాడిన పుణ్యభూమి. రుద్రమకోట గ్రామ సమీప కొండపై నేటికీ కాకతీయ మహారాజుల కాలం నాటి స్మృతి చిహ్నాలు దర్శనమిస్తాయి. మన మన్యం విప్లవ వీరసింహం అల్లూరి సీతారామరాజు నడయాడిన అడుగుజాడలు మండలంలోని కొండకొనల్లో అగుపిస్తాయి. ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా అల్లూరి స్ఫూర్తితో ఆంగ్లేయులతో తలపడిన స్వాతంత్ర్య సమరయోధులు ఈ ప్రాంతంలో ఉండేవారని పెద్దలు చెపుతారు. వారంతా చరిత్రకెక్కని, పింఛన్లు ఆశించని దేశభక్త అజ్ఞాత పోరాట యోధులు. నాటి నిజాం నిరంకుశ పాలనపై, పెత్తందారీ భూస్వామ్య వ్యవస్థ పై, ముష్కర మూక రజాకార్ల పై వీరోచిత పోరాటాలు చేసిన కమ్యూనిస్టు అన్నలూ ఈ ప్రాంతంలో ఆశ్రయం పొందిన వీరులే.

ఎదురుగానే ఆధ్యాత్మిక సిరి .. శ్రీరామగిరి!

అల్లంత దూరాన వూరికి అభిముఖంగా గోదావరి ఆవలి వొడ్డున కొండపై వెలిగే పుణ్యక్షేత్రం శ్రీరామగిరి. సీతా లక్ష్మణ సమేతంగా శ్రీరాముడు వుత్తరాభిముఖంగా స్వయంభువుగా వెలసిన ఆధ్యాత్మిక కేంద్రం. వందకు పైగా గుడిమెట్లు ఎక్కితే గానీ ఇక్కడ కళ్యాణ రాముడు దర్శనమీయడు. శ్రీరామ నవమి వేడుక ఇక్కడ పెద్ద ముచ్చట. తొలుత ఇక్కడ సీతమ్మ మెడలో శ్రీరాముడు తాళి కట్టాకే దక్షిణ అయోధ్య భద్రాచల రాముని పెళ్లి వేడుక ప్రారంభం అవుతుంది. అంతటి విశిష్టత, మహిమ కలిగిన ఈ పుణ్య క్షేత్రానికి వెనుకనే గంభీరంగా నిలిచిన వాలీ – సుగ్రీవ గుట్టలు. గోదావరి గట్టుకు ఆనుకొని నీటి ప్రవాహం వెంట పెద్ద బండ రాళ్లపై భక్తులు కొలిచే శ్రీరాముని పాదముద్రలు. అక్కడి నుంచి సుమారు పాతిక కిలోమీటర్లు గోదావరి దిగువకు వెళితే పకృతి వడిలో జోలపాడే పర్యాటక సౌందర్యం పెరంటాలపల్లి.

పచ్చదనాల కోన

తూర్పున వీఆర్ పురం, పడమర కుక్కునూరు, వుత్తరాన కూనవరం, దక్షిణాన అశ్వారావుపేట సరిహద్దులుగా వున్న వేలేరుపాడు ప్రశాంతంగా వుండే సంపద్వంతమైన ఏజెన్సీ మండలం. సమైక్యాంధ్ర రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలోని మారుమూల పల్లె. రాష్ట్రం విడిపోయాక పోలవరం ప్రాజెక్ట్ ఏడు ముంపు మండలాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లాలో చేరింది. మండలానికి చుట్టూ పచ్చగా కళకళలాడే పర్వతాలు, దట్టమైన అడవులు. మెజారిటీ గిరిపుత్రుల గ్రామాలే. ప్రకృతి ఒడిలో సహజ సుందరంగా ఆవాసాలు ఏర్పాటు చేసుకొని అడవి తల్లి ఆధారంగా బతుకులీడ్చే కోయలు, కొండరెడ్లు (గిరిజనులు) కల్లాకపటం ఎరుగని అమాయక జీవులు. మండల జనాభాలో వీరి సంఖ్యే అధికం. వారికే కాకుండా మరెక్కడా కానరాని వారిదైన సంస్కృతీ సంప్రదాయాలకూ ముప్పు తలపెట్టింది పోలవరం ప్రాజెక్టు.

సహజ వనరులే సిరిసంపదలు

మండలం అంతా ఆహార, వాణిజ్య పంటలు పండించే పచ్చని నేలలే. వరి, చెరకు, జొన్న, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు .. ఒకటనేమిటి? ఇలా బంగారు సిరులు కురిపించిన ప్రాంతం. నాణ్యమైన వర్జీనియా పొగాకు దిగుబడులకు ఒకప్పుడు కేరాఫ్ వేలేరుపాడు. తలపండిన దేశ, విదేశీ కంపెనీలు, దిగ్గజ వ్యాపారులనెందరినో ఆకర్షించిన బంగరు భూమి. పొగాకు, పత్తి, మిర్చి విక్రయాల ద్వారా కోట్లు ఆర్జించిన కుగ్రామం. అటు పరవళ్ళు తొక్కే గోదావరి గట్టంట సారవంతమైన లంక భూములు, ఇటు పెదవాగు ప్రవాహానికి ఆనుకొని కళకళలాడే పచ్చని పంటచేలు. వర్షాధార ప్రాంతమైనా సహజ వనరులెన్నో దీని సిరిసంపదలు.

“వర”ద ప్రదాయిని ఆ తల్లి!

నిజానికి గోదారమ్మ తల్లే ఈ ప్రాంతానికి వరప్రదాయిని. వరదల కాలంలో అష్టకష్టాలు పడే నిరుపేద, సామాన్య జనం ఆ నాల్రోజులు తిట్టిపోసినా, తేరుకున్నాక ఆ తల్లి చేసిన మేలు చూసి వేనోళ్ళ పొగిడేవారే. ప్రతి ఏటా గోదావరి వరద ఒక్కసారిగా వూర్ల మీదపడి నెమ్మదిగా వెనక్కు తీసిందంటే, ఆనక పొలాల యవ్వన మెరుపుల్ని చూసితీరాల్సిందే. అరచేతి మందం నుంచి మోకాటి లోతంత మందపాటి అట్టు పోసినట్టుండే వొండ్రు మట్టి పొరలు .. రైతుకు సిరులు పండించే అరలే! పొలంలో కలియదున్నే అన్నదాతకు అదే బలమూ, ఆదాయ పరిమళమూ! అదేదో పాత ఎరువుల కంపెనీ ప్రచార ప్రకటనలో చెప్పినట్టు .. గోదారమ్మ చల్లని కౌగిలి ” చేనుకు చేవ – రైతుకు రొక్ఖం” కురిపిస్తుందన్నమాట!

పరిమళించిన పూలవనం

డాలర్ల కోసం ఎందరో అమెరికా వెళ్ళినట్లే, సంపద కోసం మరెందరో వేలేరుపాడు వలస వచ్చారు. వారూ, వీరూ అని తేడాలు చూడకుండా అన్ని వర్గాలనూ ఆదరించిన ఊరిది. అందరినీ సమానంగా అక్కున చేర్చుకొని లాలించి పాలించిన మనసున్న మారాజు. బడా రైతుల నుంచి బడుగు జీవుల వరకు కలిసిమెలసి బతికేలా దారులు చూపిన పువ్వుల తోట. ఇక్కడి నేలతల్లిని నమ్ముకొని వచ్చిన నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల రైతులు, పొగాకు ముఠా కూలీలను అక్కున చేర్చుకుంది. వారి ఆలనా పాలనా చూసుకుంది. వారి జీవనానికి ఆదరవుగా నిలిచింది.

నాడంతా ఒకటే సందడి!

నాకు వూహ తెలిసినప్పటి 70ల దశకం నుంచీ దాదాపు 90ల చివరి వరకూ వ్యవసాయ సీజన్ వచ్చిందంటే చాలు వూరు వూరంతా ఒకటే సందడి. ఎటు చూసినా రైతులు, కూలీలు, విత్తనాలు, నారుమడులు, ఎరువులు, దుక్కిటెడ్లు, నాగళ్ళు, ఎడ్లబళ్లు, గొర్రెలు, మేకల మందలు కనువిందు చేస్తుండేవి. ప్రతి ఇంటా కొత్త కళ వుట్టిపడుతుండేది. కులం లేదు, మతం లేదు. పేద లేదు, గొప్ప లేదు. వూరంతా బంధువులే. అన్నా – వదినా, తమ్ముడూ – మరదలూ, బాబాయ్ – పిన్నీ, అత్తా – మామా, పెద్దమ్మ – పెదనాన్నా .. అన్నీ వరసల పిలుపులే. స్థానిక చిరపరిచితులే కాకుండా బజారులో కొత్త కొత్త మొహాలు! ఇక్కడి నేలను నమ్ముకొని ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చిన ఆశావహులు. వారిలో సామాన్యులు, మధ్యతరగతి కుటుంబీకులు, బడా బాబులు. పెద్ద రైతుల వద్ద డ్రైవర్లుగా, వంటవారిగా వచ్చిన బడుగు జీవులు కొందరిని కాలక్రమంలో రైతులుగా మార్చిన ఘనత కూడా వేలేరుపాడు సొంతం. వూరెళ్లేవారూ తాళం లేకుండా తలుపుకి గొళ్ళెం పెట్టి వెళ్లేంత ప్రశాంతతకు నెలవు. వివాదాలు, ఘర్షణలు ఏమైనా జరిగి వుంటే రాజకీయ ప్రేరేపితమే కానీ వ్యక్తిగత ద్వేషాల్లేవు.

నిజమే .. రాష్ట్రానికి జీవనాడే..!

ఏడాది క్రితం నాటి, నేటి పాలక పార్టీలు తెలుగుదేశం, వైవీపీ నేతలు పదేపదే ప్రకటించినట్టు మెగా ప్రాజెక్టు పోలవరం నిజంగానే నవ్యాంధ్రకు జీవనాడి. లక్షలాది ఎకరాలకు సాగునీరిచ్చి, వేలాది గ్రామాలకు తాగునీరిచ్చి, వేలాది పరిశ్రమలకు జీవజలం అందించే వరప్రసాదినే. దీనికోసం వేలాది ఎకరాల బంగరు భూములిచ్చిన, వున్నపళంగా ఇళ్ళు వదిలేయాల్సి వచ్చిన నిర్వాసితులు త్యాగధనులే. ఇది ఎవరూ కాదనలేని సత్యం. ప్రతిఒక్కరూ సానుభూతి కురిపించే వాస్తవం. అయితే ఇదంతా ఎవరికి మేలు చేసినట్టు?

మొసలికన్నీరేనా ..!

దీర్ఘకాలంలో రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చేసే అద్భుత దీపం పోలవరం. అటు విశాఖపట్నం వరకు ఎడమ కల్వగా సాగి, ఇటు కుడికాల్వ ద్వారా కృష్ణా నదిలో కలిసి కడప జిల్లా వరకూ నీరందించే జలాశయం. మరోవైపు రాష్ట్రానికి వెలుగులు పంచనున్న జలవిద్యుత్ కేంద్రం. ఇదంతా బాగానే వుంది. మరి సర్వస్వం కోల్పోయే నిర్వాసితుల బతుకుల్లో చిమ్మచీకట్లను పారదోలే ఆశాజ్యోతులెక్కడ? ఇదిగో.. మీకు అండగా మేమున్నామని తోడుగ నిలిచే దయార్ద్రహృదయులెక్కడ? పాలకుల “భరోసా” మాటలు వట్టి నీటిమూటలేనా? నిర్వాసితుల పట్ల వగచేవి మొసలికన్నీరేనా? న్యాయం చేసే వారేరీ? పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్న వాడికి అందే ఆపన్న హస్తమేదీ?

మా హక్కులు మాకివ్వండి..
బాధ్యతలు మేం నెరవేరుస్తాం..

పాలకులారా .. దయగల ప్రభువులు మీరు. ఓట్ల కోసమే బట్టీపట్టే వట్టి మాటలిక కట్టిపెట్టండి. మమ్మల్ని నిండా ముంచే రోజులు మా ముంగిట్లోకి వచ్చేశాయ్. ఇక ఊపిరాడని గడ్డు స్థితిలో నలిగిపోతున్నాం. అడవిజనమే కదా అని మమ్మల్ని అవమానించకండి. కర్రుచ్చుకు బందెల దొడ్లోకి తరిమే ఏ పాపం ఎరుగని మూగజీవాల్లా చిన్నచూపు చూడకండి. తట్టుకునే గుండె దిటవు లేదు మాకు. భరించే శక్తి అసలే లేదు. మీరు గతంలో చెప్పిందే చేయండి. మాకేమీ గొంతెమ్మ కోర్కెలు లేవు. మీరిచ్చిన హామీలే నెరవేర్చండి. మా హక్కు భుక్తాలు మాకివ్వండి. ఆకాశాన్ని కిందికి దించి మాకు పంచమని మేమేమీ అడగటం లేదు. మేమూ సగటు మనుషులమే. నాలుగు రోడ్ల కూడలిలో రిక్తహస్తాలతో నిలబడి ఉన్నాం. కష్టాల సుడిగుండంలో చిక్కుకుపోయాం. మీ చేతి ఆసరా ఇచ్చి కాస్త గట్టెక్కించండి. ఆనక మీ ఆదేశానుసారమే మా బాధ్యతలన్నీ మేం నెరవేరుస్తాం. చివరిసారిగా మరోమారు వేడుకుంటున్నాం. మా మాటలు ఆలకించండి. కొంచెమైనా మానవతను ప్రదర్శించండి!!

– పాషా

(పోలవరం ప్రాజెక్టు వల్ల వూరు మునిగి పోతుందని తెలిసి గుండె పగిలిన వేదనతో 15 ఏళ్ల క్రితం నేను రాసుకున్న కవిత)

కలవరం

పోలవరంతో మనం
బావుకునేదేమో కాని
ఇప్పుడు ఉరిశిక్ష పడ్డ
నిరపరాధి నా ఊరు
వేలేరుపాడు..

నా స్వప్న సౌందర్యానివా నువ్వు
నా యవ్వన మాధుర్యమా నువ్వు!

సుక్కపొద్దుకు ముందే సద్దిబువ్వ కట్టే
అమ్మ అడుగులు స్పృశించిన నేలలో
కలల్లోను పొలంవైపు చూసే
నాన్న పాదముద్రలు శ్రమించిన జాడలో

నా చెదిరిపోని తీపిజ్ఞాపకానివా. నువ్వు
నా తిరిగిరాని తాజా స్నేహమాలికవా నువ్వు!

పోలవరంతో ఎవరు
బాగుపడేదేమో కాని
నిండా మునుగుతున్న
నవ చరిత్ర నా ఊరు
వేలేరుపాడు..

గిరిజనం పాదధూళికి పరవశించే
నిండు శుక్రవారపు సంతవా నువ్వు
మలితరం కలవరింతల్లో పలవరించే
పండువెన్నెల అతుకుల బొంతవా నువ్వు!

ధనవంతులు, బలవంతుల
ఆస్తిపాస్తుల ముచ్చటకేం గానీ
బహుజనం, బడుగుజీవుల
‘సల్లబువ్వ’ కదా నా ఊరు
వేలేరుపాడు ..

ఆత్మహత్యల దారిచూపే అగ్నిగోళమా నువ్వు
అంతలోనే గొంతుమార్చిన భగ్నగీతమా నువ్వు!

నేతలు వల్లించటానికి
ఘన చరిత్రలకేం కానీ
ఘోరంగా జలసమాధి అవుతున్న
దగాపడ్డ ప్రకృతి నా ఊరు
వేలేరుపాడు ..!!

1 COMMENT