రాజన్న అలా.. జగనన్న ఇలా..!

727

నడక, నడతలో తండ్రికి భిన్నం
కనిపించని రాజన్న ఆత్మీయులు
       ( మార్తి సుబ్రహ్మణ్యం 9705311144)

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. ఆ పేరే ఒక ప్రభంజనం. ఒక ఊపు, ఉత్సాహం. ఒక ఉద్రేకం. మరో భావోద్వేగం. మానవీయతకు మారుపేరు. నమ్ముకున్న వారికి హిమాలయమంత ఎత్తయిన  భరోసా. విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనం!  జేబులో డబ్బు లేనిరోజునా ఎంత సాయం చేశారో, డబ్బొచ్చిన తర్వాతా అదే ఉదారగుణం కొనసాగించారు. నాన్చుడు లేదు. రేపు చూద్దాం. మాహాడదాం. వర్కవుట్ చేద్దాం అనే ముచ్చటే లేదు. ఏదైనా బరాబర్ మాట్లాడటమే. మంచో-చెడో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడమే. మనసులో ఒకటి, లోపల మరొకటి ఆయన స్వభావానికి విరుద్ధం. కడుపులో కత్తులు పెట్టుకుని తిరగడానికి వ్యతిరేకం. పట్టుదలకు ఎంత మారుపేరో, పట్టువిడుపులకూ అంతే పేరు. ప్రత్యర్ధులయినా మన్నించే పెద్ద మనసు ఆయన సొంతం. కడుపు కొట్టడం ఆయనకు తెలియని లక్షణం. తెలిసిందల్లా  పదిమంది కడుపు నింపడమే. వారు ఎలాంటివాళ్లన్నది ఆయనకు అనవసరం.  సమిష్టి నిర్ణయం ఆయన ఆయుధం.  ఆయన ఉన్నారన్న ఊహనే అనుచరులకు కొండంత ధైర్యం. కులం లేదు. మతం లేదు. నమ్మకం.అంతే! మాట తప్పడం, మడమ తిప్పడం ఆయన రక్తంలో కనిపించదు.  ఎవరేమనుకున్నా సరే.. ఆయన దారి రహదారి!! అందుకే ఆయనంటే జనాలకు  రోమాలు నిక్కబొడుచునేంత క్రేజ్. ఇమేజ్.  ఇదీ.. రాజన్న ఈలోకం వదిలి ఇన్నేళ్లయినా, ఆయన గురించి జనహృదిలో నిలిచిన నిశ్చితాభిప్రాయం!!!

మరి ఆయన తనయుడు జగన్మోహన్‌రెడ్డి?… అందుకు  పూర్తి విరుద్ధం. రాజన్న నడక, జగనన్న నడకకు అసలు పోలికనే కనిపించవు. నమ్మకం, భరోసా, పట్టువిడుపులు, సమిష్టి నిర్ణయం-నాయకత్వం, సంపాదన,  వ్యక్తిత్వం.. ఇలా ఒకటేమిటి? అన్నింటా రాజన్నకు జగనన్న భిన్నం. తండ్రిది దక్షిణ ధృవమయితే, కొడుకుది ఉత్తర ధృవం. పాలన, నాయకత్వంలో వారిద్దరి మధ్య జమీన్ ఆస్మాన్ ఫరక్!  అదెలాగన్నది చూద్దాం.

బాబు-జగన్‌కు భిన్నంగా రాజన్న రాజసం..

వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై మరకలెన్నో, మెరుపులూ అన్ని! జనాలకు ప్రత్యక్షంగా  సంబంధం లేని రంగాలను దోచుకుని, వాటిని దృష్టి మళ్లించేందుకే.. జనాలకు సంక్షేమ పథకాలు అందించారన్నదే అప్పట్లో ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. దాన్నలా పక్కకుపెడితే, నమ్ముకున్న వారి కోసం ఎందాకయినా వెళ్లే వైఎస్ పోరాటతత్వం.. ఈ తరంలోనే కాదు, ఏ తరం నేతల్లోనూ టార్చిలైట్ వేసి వెతికినా కనిపించదు. అందుకే ఆయన పరలోకానికి వెళ్లి ఇన్నేళ్లయినా కోట్లాది మంది గుండెలో నిలిచిపోయారు. ఆయన సహచరుడైన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 14 ఏళ్లు సీఎంగా పనిచేసినా, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పినా.. ఆయనకే కాదు, ఇప్పుడు తన తనయుడు జగన్‌కూ లేనిది, వైఎస్‌కు ఉన్నదీ అదే. ఇది మనం మనుషులం అన్నంత నిజం!  వ్యాపార లావాదేవీలు, రాజకీయ అవసరాలు, కులం-మతంతో పనిలేకుండా వైఎస్ నా మిత్రుడు అని గర్వంగా చెప్పే వారి సంఖ్య బోలెడు. అదే చంద్రబాబు-జగన్ తమ మిత్రులని చెప్పే వారి సంఖ్య అత్యల్పం. అసలు ఉండరేమోనని కూడా చెప్పవచ్చు. ఆర్ధిక ఇబ్బందులెన్నో ఎదుర్కొన్న కాలం నుంచీ.. చేతిలో పుష్కలంగా సంపద ఉన్న కాలం వరకూ, వైఎస్ చేతికి ఎముక కనిపించలేదు. ఖర్చు విషయంలో ఆయనతో పోల్చదగిన నేతలు లేరు. బాబు-జగన్‌లో కనిపించనవీ ఆ రెండు లక్షణాలే. తెలంగాణలో మాత్రం,  ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ను  వైఎస్‌తో పోల్చవచ్చు.

విపక్షాలు, అధికారులపై నాడు వైఎస్ అలా..

అధికారులను అమానవీయంగా వేధించే తత్వానికి, పోస్టింగులివ్వకుండా మానసికక్షోభకు గురిచేసే నైజానికి  రాజన్న బహుదూరం. కాకపోతే ప్రాధాన్యం లేని పోస్టింగులిచ్చేవారు.  నచ్చని వారిని ఆదరించకపోయినా, అవమానించడం ఆయన హయాంలో కనిపించదు.  బాబు వైఖరి కూడా అంతే. బతుకు-బతికించు. ఇదే వైఎస్  సిద్ధాంతం. కానీ, ఈ లక్షణాలు ఆయన తనయుడైన జగన్‌లో, భూతద్దం వేసి వెతికినా కనిపించవు. అందుకు ఉదాహరణే నిమ్మగడ్డ రమేష్, ఏబీ వెంకటేశ్వరరావు వంటి అధికారులు. ప్రభుత్వాల దమననీతికి ముకుతాడు వేసేందుకు, వైఎస్ కోర్టులున్నాయని నమ్మేవారు.  ఆయన సహా, పార్టీ నేతలతోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులలో కేసులు వేయించేవారు. ఇప్పుడు ఆయన తనయుడైన జగన్, అదే కోర్టులపై పోరాడుతున్న వైచిత్రి. వైఎస్ హయాంలో ఇప్పటి మాదిరిగా విపక్షాలపై వేధింపులెప్పుడూ చూడలేదు. జగన్ జమానాలో మాదిరిగా..  పనికట్టుకుని అరెస్టు చేయడం, అక్రమ కేసులు బనాయించడం, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడాలేవీ రాజన్న హయాంలో ఎక్కడా కనిపించవు. చంద్రబాబుపై కేసులు, విచారణలకే పరిమితం చేసి, మిగిలినవి కోర్టు తీర్పులకు అప్పగించేవారు. ఇప్పుడు జగనన్న కోర్టులతో దాదాపు యుద్ధం చేస్తున్న పరిస్థితి. కోర్టులంటే లెక్కలేనితనం ప్రదర్శిస్తున్న వైచిత్రి.

సహచరులు, సీనియర్ల సలహాలు వినే రాజన్న..

సభలో కూడా ఒకే ఒక సందర్భంలో తప్ప, ఏనాడూ విపక్ష నేత చంద్రబాబును వైఎస్ తూలనాడింది లేదు. సభలో ఎంత ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పటికీ, సభ బయట పట్టువిడుపులు, కొన్ని అంశాల్లో ఫ్లోర్ కోఆర్డినేషన్ కనిపించేవి.  భావోద్వేగాలు, ఆవేశకావేశాలు వాదోపవాదనలు కనిపించినా, నాడు సభ ఆసక్తికరంగా, ఆహ్లాదకరంగా అనిపించేది. మొత్తంగా ఏ అంశాన్నయినా లాజికిల్ కన్‌క్లూజన్‌కు తీసుకువెళ్లి, విడిచిపెట్టేవారు. ఈ విషయంలో  వైఎస్-బాబు ఇద్దరివీ ఒకే లక్షణాలు! జగన్‌లో కనిపించనివి అవే. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉంటే సచివాలయం, సభలో ఉంటే సీఎం చాంబర్, పీసీసీ అధ్యక్షుడిగా ఉంటే గాంధీభవన్‌లోని ఆయన రూము, సీఎల్పీ నేతగా ఉంటే ఆయన చాంబరు  సీనియర్లతో కోలాహలంగా కనిపించేది. ఏ నిర్ణయం తీసుకున్నా, అందులో వారిని తప్పనిసరిగా భాగస్వాములను చేసేవారు. దానికి సంబంధించి పార్టీకి వచ్చే లాభ నష్టాలపై నిశితంగా చర్చించేవారు. సహచరుల సలహాలు తీసుకోవడాన్ని ఆయనెప్పుడూ అవమానం, స్థాయి తక్కువగా భావించలేదు. కొన్ని కీలక అంశాలపై సీనియర్, రిటైర్డ్ అధికారులతో చర్చించేవారు. అలాంటి సందర్భాల్లో తన సహచరులైనా, జూనియర్లయినా సరే, ఎవరినయినా  నిపుణులను తీసుకువస్తే,  వారితో ఆయా అంశాలపై  సుదీర్ఘంగా చర్చించేవారు.

రఘురాముడి సలహాతోనే మే 14న రాజన్న ప్రమాణం..

కానీ.. ఆయన తనయుడైన జగనన్నలో ఇలాంటి గుణాలు ఇసుమంతయినా కనిపించదు. ఆయన ఎవరితో చర్చించరు. ఎవరితో తన ఆలోచనలు పంచుకోరు. ఎవరి సలహాలూ తీసుకోరు. పైగా దాన్ని అవమానంగా భావిస్తారు. ఈ సందర్భంగా ఓ ఘటన ప్రస్తావించక తప్పదు. కాంగ్రెస్ పార్టీ గెలిచి, వైఎస్ సీఎంగా గద్దెనెక్కే ముందు.. ఎయిరిండియా విమానంతో తనతో ఉన్న  సీనియర్లతో, వైఎస్ పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు. అప్పటికే అధిష్టానం ఆయనను సీఎంగా ఖాయం చేసింది. ఆ సందర్భంలో ప్రమాణస్వీకార తేదీపై చర్చ జరిగింది. అప్పుడు ఈనాటి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా అక్కడే ఉన్నారు. ‘సార్ మీరేమనుకోనంటే నాదో సలహా. 2004, మే 14న చాలా బాగుంటుంది. ముహుర్తం కూడా బాగుంది. సార్.. ఎందుకంటే ఇందులో కొంచెం నా స్వార్ధం కూడా ఉంది. ఆ రోజు నా పుట్టినరోజు’’ అని చెప్పారు. ఒక సాధారణ వ్యక్తి కెవిపి, దివాకర్‌రెడ్డి లాంటి సీనియర్ల ముందు తనకు సలహాలివ్వడం, అందులో తన పుట్టిన రోజున ప్రమాణ స్వీకారం  పెట్టాలని చెప్పడాన్ని వైఎస్ సీరియస్‌గా తీసుకోలేదు. అవమానంగా భావించలేదు. పైగా.. ‘ఓకే. ఆ రోజు మంచి ముహుర్తం ఉంటే పెట్టేయండి’ అని స్పోర్టివ్‌గా తీసుకున్న వ్యక్తిత్వం రాజన్నది. అయితే.. అదే రఘురామకృష్ణంరాజుపై ఇప్పుడు రాజన్న తనయుడు జగనన్న కత్తులునూరుతుండటమే ఆశ్చర్యం.

వైఎస్సార్ తో నా అనుభవం- జంధ్యాల

‘నేడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి  71 వ జయంతి సందర్భంగా  ఆయనతో నేను పంచుకున్న అనుభవాలు,అనుభూతులు జ్ఞాపకం చేసుకునే మధుర క్షణాలు ఈరోజు వచ్చాయి’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్ష్యాత్తు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన ప్రముఖ లాయర్ జంధ్యాల రవి శంకర్.నేను చెప్పబోయే ఒక సంఘటన  డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారిలో ఉన్న మానవీయ కోణానికి ఒకే ఒక నిదర్శనం. తన వాళ్ళ కోసం తనను నమ్ముకున్న వారి కోసం తాను నమ్మిన వారి కోసం ఎంత దాకా అయినా వెళ్లే మనస్తత్వం రాజశేఖర్ రెడ్డి గారి సొంతం. తన సొంత పార్టీ శాసనసభ్యుడు ఎర్నేని రామ్ చందర్‌కు సంబంధించి తలెత్తిన ఒక సమస్యను పరిష్కరించడానికి 12 మంది ఐఏఎస్ అధికారులు మరో 12 మంది ఐపీఎస్ అధికారులు నిరంతరం చర్చలు జరిపి చట్టపరంగా న్యాయపరంగా మరి కొన్ని సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఇచ్చిన కొన్ని సలహాలను పాటించి…ఒక  జీవో జారీ చేసిన ఘనత డాక్టర్ రాజశేఖర్ గారిది .నేను ఈ విషయాన్ని చాలా గర్వంగా చెబుతున్నాను. ఆయనతో పనిచేయడం నాకు చాలా చాలా ఉపయోగపడింది .

ఒకపక్క డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు మరోపక్క ఉన్నతాధికారులు ఉన్న సమయంలో కూడా న్యాయవాదిగా నేను ఇచ్చే సలహాలను సూచనలను ఎంతో ఆలోచించి వాటిని అమలు చేసే దిశగా  డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు చర్యలు తీసుకునేవారు. ఎమ్మెల్యే రామచందర్ విషయంలో నిర్ణయం తీసుకున్న 14 రోజుల్లోనే ప్రభుత్వం తరఫున జీవో జారీ చేశారు.తన వాళ్ళ కోసం తనను నమ్ముకున్న వాళ్ళ కోసం తాను నమ్మిన వారి కోసం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారనేది ఈ సంఘటన. బహుశా అసెంబ్లీ చరిత్రలో ఒక న్యాయవాదిని సలహాదారుడిగా నియమించడం, ఆపైన ప్రత్యేకంగా ఒక ఛాంబర్ కేటాయించడం  నా అదృష్టం ఏమో. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో పని చేసినప్పుడు ఆయన కొంతమంది సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు సూచనలు చేస్తూ… న్యాయస్థానంకు సంబంధించి నా సలహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని  సూచించేవారు. అంతటి అవకాశం, అదృష్టం నాకు కలిగిందంటే అది రాజశేఖర్ రెడ్డి గారి గొప్పతనం. రాజకీయాలను రాజకీయంగాను , ఇతర విషయాలను, ప్రజల సమస్యలను మానవీయ కోణంలో చూసి తనదైన పరిష్కారాలు ఇవ్వడంలో రాజశేఖర్ రెడ్డి గారు ఒక నిలువెత్తు నిదర్శనంగాను, ఆదర్శప్రాయంగాను  ఉన్నారు. ఇలాంటి అరుదైన నాయకుడు మన రాష్ట్రంలో మరొకరు లేరు.మళ్లీ జన్మంటూ ఉంటే రాజశేఖర్ రెడ్డి గారిని మరోసారి ఈ రాష్ట్ర ప్రజలకు సేవచేసే మనిషిగా, మళ్ళీ ఈ లోకానికి పంపాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా నేను రాజశేఖర్ రెడ్డి గారితో పంచుకున్న అనుభవాలను అనుభూతులను వ్యక్తపరిచే అవకాశం లభించినందుకు సంతోషిస్తున్నాను.మానవీయ కోణానికి మరో కోణం మా రాజశేఖర్ రెడ్డి. జోహార్ వైయస్ఆర్.

రాజన్నకు భిన్నంగా జగనన్న..

నిజానికి జగనన్న  ఈ విషయంలో తండ్రికి పూర్తి భిన్నం. జగనన్న అసలు మంత్రులు, ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్లే ఇవ్వరు. ఇక ఎంపీల గురించి ఎంత తక్కువగా చెబితే అంత మంచిది. అంతా ఏకపక్షమే. జైలులో ఉన్నప్పుడు ఆయన, తనకు తాను ఓ దైవాంశ సంభూతిడినన్న భావనలో ఉండేవారని ఆయన పార్టీ నేతలే అప్పట్లో చెప్పేవారు. ప్రస్తుతం పాలకుడిగా ఉన్నందున అనివార్య పరిస్థితిలో, ఆ భ్రమల నుంచి కొంచెం బయటపడినట్లు కనిపిస్తోంది. అయినా, ఆయన రాజన్న మాదిరిగా అందరిలో ఒక్కడిగా కాకుండా.. ఒక్కడిగా, ఒంటరిగానే కనిపిస్తుంటారన్నది రాజన్న అభిమానుల మనోగతం. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు వైఎస్‌ను చిటికెలో కలుసుకునే వారు. సీఎంఓలో అడుగుపెడితే, వారి సమస్యలు పరిష్కారమయ్యేవి. ఇప్పుడు జగనన్నను కలుసుకోవడమంటే అదో పెద్ద ప్రహసనం. ప్రధానినయినా కలుసుకోవచ్చేమో గానీ, జగనన్నను కలవడం మాత్ర ం అంత సులభం కాదన్నది ఇప్పుడు వినిపిస్తున్న టాక్.

కోట్ల కుటుంబం విషయంలో వైఎస్ అలా..

పార్టీలో తనకు సరిపడని సీనియర్లున్నప్పటికీ, ఆయా జిల్లాల్లో వారి అనుచరులకు ప్రాధాన్యం ఇవ్వకపోయినా, వారి కుటుంబం వరకూ వైఎస్ గౌరవం ఇచ్చేవారు. నేదురుమల్లికి వైఎస్‌కూ పొసగకపోయినా, ఆయన భార్య రాజ్యలక్ష్మికి మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. ఇక కడపలో ప్రధాని పివి సమక్షంలోనే.. కోట్ల విజయభాస్కరరెడ్డిపై చెప్పులు వేయించిన మచ్చను, తన  రాజకీయ  చరిత్రలో శాశ్వతంగా మిగుల్చుకున్న వైఎస్.. అదే తన రాజకీయ ప్రత్యర్ధి అయిన కోట్ల కుటుంబంలో జరిగిన వివాహానికి దన్నుగా  నిలిచి విస్మయపరిచారు.

ఆరకంగా.. తాను చెప్పులు వేయించిన నాయకుడి కుటుంబంలో జరిగే వేడుకలో దన్నుగా నిలవడం  మానవీయతే కదా? ఇలాంటి లక్షణలేవీ జగనన్నలో అస్సలు ఏ కోశానా కనిపించవు. రాజకీయంగా, నైతికంగా, విలువల పరంగా  ఉన్నత శిఖరాలకు ఎదిగి, ఆ రోజుల్లోనే కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్న కోట్ల కుటుంబం.. ఇప్పటితరం నాయుకుల మాదిరిగా, ఆర్ధికంగా సంపాదించుకోలేకపోయింది. కోట్ల  వారసులకు ఇప్పుడున్న ఏకైక ఆస్తి, పేరు, ప్రతిష్ట అదొక్కటే! కోట్ల మాదిరిగానే.. మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి పదవులు అనుభవించిన కాసు కుటుంబం కూడా..  కోట్ల కుటుంబం మాదిరిగానే రాజకీయాల్లో సంపాదించుకున్నదేమీ లేదు.

బాలకృష్ణ కేసులో రాజన్న హుందాతనం..

ఇక తన రాజకీయ ప్రత్యర్ధి చంద్రబాబు ఓడిపోయిన తర్వాత.. హైదరాబాద్‌లోని బాలకృష్ణ నివాసంలో జరిగిన కాల్పుల ఘటన, సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దానిపై  పోలీసు కేసు కూడా నమోదయింది. అప్పుడు వైఎస్ సీఎం, బాబు విపక్ష నేత. అదే ఘటన ఇప్పుడు ఏపీలో జరిగిఉంటే, జగన్ వాయువేగంగా బాలకృష్ణపై కేసు పెట్టి అరెస్టు చేయించి, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర మాదిరిగా జైల్లో కూర్చోబెట్టేవారు. కానీ వైఎస్ ఆవిధంగా చేయలేదు. రాజకీయ ప్రత్యర్థి కుటుంబంపై కక్ష తీర్చుకునే అవకాశం వచ్చినా, ఆయన ఆ పనిచేయలేదు. హుందాగా వ్యవహరించారు. అందుకే బాలకృష్ణ జైలుకు, కనీసం పోలీసుస్టేషన్‌కూ  వెళ్లకుండా బయటపడ్డారు.  దటీజ్ వైఎస్! అంత హుందాతనం జగనన్న ప్రదర్శించగలరా మరి?!

కెవిపి.. ఉండవల్లి, వట్టి.. వీరంతా ఎక్కడ?

వైఎస్‌కు ఆత్మాహుతి దళం లాంటి అనుచరవర్గం ఉండేది.వారంతా నిరంతరం ఆయన ఉన్నతి కోసమే పనిచేసేవారు.  కెవిపి, ఉండవల్లి, కన్నా, ఆనం రామనారాయణరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, కాసు కృష్ణారెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి,  రఘువీరారెడ్డి,  వట్టి వసంత్‌కుమార్, సబ్బం హరి, లగడపాటి రాజగోపాల్, శైలజానాధ్, గిడుగు రుద్రరాజు వంటి నేతలంతా వైఎస్‌కు తిరుగులేని మద్దతుదారులుగా ఉన్నారు. వీరిలో ఆనం, ధర్మాన ప్రస్తుతం వైసీపీలో ఉన్నప్పటికీ, వారికి పెద్ద ప్రాధాన్యం లేదు. అదే రాజన్న వారికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లాల్లో వారి మాటకు ఎదురుండేది కాదు. ఇప్పుడు అనే ఆనం సర్కారు తీరును వేలెత్తిచూపే పరిస్థితి ఏర్పడింది.  వైఎస్ హయాంలో ఒక వెలుగువెలిగిన భూమన కరుణాకర్‌రెడ్డికి తర్వాత జగన్ ప్రాధాన్యం ఇచ్చినా, ఇప్పుడు ఆయన పరిధి తిరుపతి వరకే పరిమితం.

సభలో రాజన్న ప్రతిపక్షాలపై సంధించే ప్రధాన ఆయుధమైన కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు జగన్‌తో లేరు. సభలో జగన్‌పై పరిటాల హత్య కేసు ప్రస్తావన వచ్చినప్పుడు, జగన్‌కు అనుకూలంగా గళం విప్పిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్‌లోనే ఉన్నారు.  సీనియర్ నేత కాసు కృష్ణారెడ్డికి రాజన్న అత్యంత ఆప్తుడు, స్నేహితుడు. రెడ్డి కాంగ్రెస్ నుంచి రాజన్నకు టికెట్ కూడా ఇప్పించారు. రాజన్న కూడా కాసును క్యాబినెట్‌లో తీసుకున్నారు. ఇప్పుడు కాసు తనయుడు మహేష్‌రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, కృష్ణారెడ్డి మాత్రం జగన్‌కు దూరంగానే ఉన్నారు. రాజన్న ఆత్మ కెవిపి, ఉండవల్లి  సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు న్యాయసలహాదారుగా, అసెంబ్లీ న్యాయసలహాదారుగా పనిచేసిన జంధ్యాల రవిశంకర్ ఇప్పుడు.. ఆయన తనయుడైన జగన్ సర్కారుకు వ్యతిరేకంగా, కోర్టులలో గళం విప్పుతుండటం మరో విభ్రాంతికర అంశం.

ఆ ఇద్దరూ ఏరీ.. ?

వీరికి మించి.. రాజన్న నీడగా ఉంటూ, అంకితభావం, చిత్తశుద్ధితో.. అనుక్షణం ఆయన కోసమే పనిచేసి, వైఎస్ వ్యూహాల్లో పాలుపంచుకున్న ఆయన నమ్మినబంటు, ఓఎస్డీగా పనిచేసిన రవిచంద్.. కొద్దికాలం జగన్‌తో కలసి పనిచేసినా, తర్వాత ఎక్కువకాలం ఆయన వద్ద ఉండలేపోయారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు, ప్రెస్‌సెక్రటరీగా ఉన్న చంద్రశేఖర్‌రెడ్డి ఇప్పుడు జగన్ బృందంలో  కనిపించడం లేదు. జగన్ సీఎం అయిన తర్వాత వీరిద్దరికీ, పెద్ద పీట వేస్తారని రాజన్న అభిమానుల అంచనాలు, దారుణంగా దెబ్బతిన్నాయి.  రాజన్నకు అత్యంత కీలకమైన  వీరంతా  ఇప్పుడు జగన్ వద్ద లేరంటే,  రాజన్న-జగనన్న మనస్వత్తానికి ఎంత తేడా ఉందో,  ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వైఎస్‌కు వీర విధేయుడైన గిడుగు రుద్రరాజు కూడా ఇప్పుడు జగన్‌తో లేరు. ఇలా చెబుతూ పోతే, జగన్ వద్ద క నిపించని రాజన్న వర్గీయుల సంఖ్య చాంతాడవుతుంది. ఒక్కముక్కలో చెప్పాలంటే రాజన్నది మానవీయ కోణమయితే, జగనన్నది మనీకోణమన్నది అలనాటి వైఎస్ విశ్వాసపాత్రుల అభిప్రాయం!