వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి గారితో…

740

అది 1991సెప్టెంబర్. అప్పుడు నేను కాకినాడలో ఆంధ్రభూమి రిపోర్టర్ గా ఉన్నాను. దానితో పాటు, APUWJ తూర్పు గోదావరి జిల్లా విభాగం అధ్యక్షుడు గా కూడా ఉన్నాను.
కడప కాంగ్రెస్ ఎం పీ- .వైఎస్. రాజశేఖర రెడ్డి గారు తూర్పు గోదావరి పర్యటనకు వచ్చారు.అప్పుడూ తెలుగుదనం ఉట్టిపడే పంచె కట్టే. చిరునవ్వే.రాజమండ్రి యూత్ కాంగ్రెస్ నాయకులు జక్కంపూడి రామ మోహనరావు, ఉండవల్లి అరుంకుమార్ మొదలైన వారు అప్పటికే వై ఎస్ గారి అభిమాన “కాంగ్రెస్ సైనికులు” గా తూర్పు గోదావరి అంతా సుపరిచితులు. ఆ పర్యటన లోనే…వై ఎస్ గారు రాజమండ్రి లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారింటికి బ్రేక్ ఫాస్ట్ కో…లంచ్ కో వెళ్లినట్టు గుర్తు.
తరువాత కాకినాడ వచ్చారు. అప్పటికే ఆయన నిత్య అసమ్మతి వాదిగా కాంగ్రెస్ లో ముద్ర పడి ఉన్నారు.
వై ఎస్ గారు కాకినాడ వస్తున్నారనే సమాచారం తో…ఆయన తో , కాకినాడ లో ‘మీట్ ది ప్రెస్’ కు అవకాశం ఇప్పించమని జక్కంపూడి రామమోహన్ రావు గారిని రిక్వెస్ట్ చేశాను. ఆయన ఓకే అన్నారు.
వై ఎస్ గారు కడప ఎం.పీ నే అయినప్పటికీ;ఒక సీ ఎం. వస్తున్నట్టుగా ఉండేది, కాంగ్రెస్ కార్యకర్తల కోలాహలం.
..ఓ వంద కార్లు..రెండు మూడొందలమంది కార్యకర్తలు…యువనేతలు ఆయనను అనుసరిస్తూ ఉండేవారు.
వై ఎస్ స్థాయి కి తగ్గ హాల్ కాకినాడ లో ఎలాగా అని ఆలోచిస్తుంటే…. కొత్తగా ఆధునీకరించిన జిల్లా పరిషత్ ఆడిటోరియం గుర్తుకు వచ్చింది.
ఏసీ, మంచి వేదిక, కుషన్ కుర్చీలు, ప్రతి సీట్ కు అసెంబ్లీ లో లాగా మైక్రోఫోన్ , కింద నడవడానికి కార్పెట్…మొత్తం అంతా అద్భుతం గా ఉంది. ఆడిగిందే తడవుగా…జిల్లా పరిషత్ చైర్మన్…జీ. ఎం. సీ. బాలయోగిగారు ఇచ్చారు. ఒక ప్రైవేట్ సమావేశానికి ఆ హాల్ ఇవ్వడం అదే మొదటి సారి.
తేదీ గుర్తు లేదు. వై. ఎస్ పరివారాన్ని జడ్. పీ. ఆడిటోరియం కు జక్కంపూడి బృందం తీసుకొచ్చింది. ఆయన కారు దిగగానే…నన్ను పరిచయం చేశారు. ఆయనకు స్వాగతం చెప్పి, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఆడిటోరియం లోకి వై ఎస్ గారిని తోడ్కొని వెళ్లాం.
ఆడిటోరియం మొత్తం…మా జిల్లా విలేకరులు, వై. ఎస్. గారితో వచ్చిన కార్యకర్తలతో నిండిపోయింది.
వేదిక మీద…జిల్లా యూనియన్ అధ్యక్ష హోదాలో నేను, ముఖ్య అతిధి…వై. ఎస్. రాజశేఖర రెడ్డి గారు, కడప ఎం.పీ.
సభికులలో..జక్కంపూడి రామమోహన్ రావు గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మల్లిపూడి పళ్ళం రాజు గారు, శ్రీకాకోళం శివరామ సుబ్రహ్మణ్యంగారు, కాకినాడ యూత్ కాంగ్రెస్ నేత మౌళి తదితరులు.
ఆ సమయం లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు.
“మీట్ ది ప్రెస్” కు నిజానికి పెద్ద అంశాలు ఏమీలేవు. నిత్య అసమ్మతి వాది అనే ముద్ర ఉన్నప్పటికీ…చాలా రోజులుగా నేదురుమల్లి జనార్ధన రెడ్డి ని ఆయన బహిరంగంగా ఎక్కడా పల్లెత్తు మాట అనడం లేదు కూడా.
కాకపోతే…అంత గ్లామరస్ లీడర్ కాకినాడ వస్తుంటే…దగ్గరనుంచి చూడవచ్చు అన్న సరదా తో ఆ కార్యక్రమం కోసమని జక్కంపూడిని రిక్వెస్ట్ చేశాను. ఆయన ఓకే అన్నారు.
‘మీట్ ది ప్రెస్’లో ఆయన మామూలుగా…ఒక కాంగ్రెస్ నాయకుడిగానే మాట్లాడారు.
చివరిలో…”రాజశేఖర రెడ్డిగా మీ లక్ష్యం ఏమిటి…”అని అడిగాను.
ఆయన పక..పకా నవ్వి, “జనార్ధనరెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసి, కాంగ్రెస్ ను కాపాడడమే…” అన్నారు. నాతో సహా,సభికులందరూ బిగుసుకు పోయారు, వై. ఎస్. గారు చాలా కాజువల్ గా అన్నట్టుగా అన్నప్పటికీ. ఒక నిముషం తరువాత …తేరుకున్న సభికులు.. తమ హర్షధ్వానాలతో …వై. ఎస్. ప్రకటనను స్వాగతించారు.
సీ. ఎం జనార్ధన రెడ్డి ని ముఖ్యమంత్రి పదవి నుంచి దించడమే…తన లక్ష్యమని వై. ఎస్. గారు మొదటిసారిగా ప్రకటించింది, కాకినాడలోనే. అదీ…. మా ” మీట్ ది ప్రెస్” వేదిక పైనే. మరుసటి రోజున…పత్రికల్లో పతాక శీర్షిక ఇదే.

-భోగాది వెంకట రాయుడు