పాలకుల పక్కలో బల్లెం!

643

సర్కారుపై తమిళ ‘సై’
కుముద్‌బెన్‌జోషి, చెన్నారెడ్డి దారిలోనే..
ఎన్టీఆర్, జయలలితను ఇబ్బంది పెట్టిన ఆ ఇద్దరు
కేసీఆర్ సర్కారు కంట్లో నలుసులా గవర్నర్
త్వరలో ప్రజాదర్బార్?
          (మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

తెలంగాణ సర్కారుకు గవర్నర్ వైఖరి ఒక పట్టాన మింగుడుపడటం లేదు. కరోనా కాలం ముందు వరకూ,  కేసీఆర్ సర్కారు పనితీరును ప్రశంసించిన గవర్నర్ తమిళ సై.. ఇప్పుడు దాదాపు సమాంతర పాలనకు సిద్ధమవుతుండటం పాలక పార్టీకి కలవరం కలిగిస్తోంది. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యశాఖ ముఖ్య కార్యదర్శిని పిలవడం, గంటన్నర సేపు ట్విట్టర్‌లో గంటన్నర పాటు నెటిజన్లతో సంభాషించడం, నేరుగా ప్రైవేటు ఆసుపత్రుల యజమానులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించడం వంటి చర్యలన్నీ.. కేసీఆర్ సర్కారుకు సమాంతర పాలన సంకేతాలను సూచిస్తున్నాయి. ఈ పరిణామాలు సహజంగానే ఆమె దూకుడు పాలక పార్టీకి రుచిండం లేదు.

తమిళ సై రూటే వేరు..

తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల నియంత్రణకు.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించేందుకు, రాజ్‌భవన్‌కు రావాలని సీఎస్, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి ఇచ్చిన ఆదేశాలు వారిద్దరూ బేఖాతరు చేయడం సంచలనం సృష్టించింది. గవర్నర్ తీరుపై కేసీఆర్ సర్కారు ఎంత ఆగ్రహంతో ఉందో ఈ ఘటన  స్పష్టం చేస్తోంది. నిజానికి గైనకాలజిస్టు అయిన తమిళ సై రాష్ట్రానికి గవర్నర్‌గా వచ్చినప్పుడు, ఓ మంత్రి ‘మేడమ్.. మా రాష్ట్రం పసిబిడ్డను జాగ్రత్తగా చూసుకోవాల’ని వ్యాఖ్యానించినప్పుడు.. ‘ఫర్వాలేదు. నేను  డాక్టర్‌ను. పిల్లలను ఎలా పెంచాలో నాకు తెలుస’ని అంతే సమయస్ఫూర్తితో వ్యాఖ్యానించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ తర్వాత చాలా నెలలు ఆమె ప్రభుత్వ విధానాలను మెచ్చుకున్నారు. కానీ, కరోనా కాలం రావడం, బీజేపీ కూడా కేసీఆర్ సర్కారు వైఫల్యంపై సమరశంఖం పూరించడంతో కథ మారింది.

గవర్నర్‌ను కలిసిన ప్రొఫెసర్‌పై బదిలీ వేటు..

ఆ మధ్యలో గవర్నర్ చాన్సలర్ హోదాలో, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ ప్రొఫెసర్‌ను తమిళసై  పిలిపించారు. ఆ సందర్భంలో ఆయన, ఉన్నత విద్యకు సంబంధించి ఒక రోడ్‌మ్యాప్‌ను ఇచ్చారు. ఇది తెలిసిన సీఎంఓ,  ఆయనను అశ్వారావుపేటలోని కాలేజీకి బదిలీ చేసింది. అంటే తమిళ సై తీరు తెరాసకు నచ్చడం లేదని అర్ధమవుతూనే ఉంది. పైగా.. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇప్పటివరకూ ఒక్కసారి కూడా విపక్షాలతో భేటీ కాలేదు. వారికి అపాయింట్‌మెంట్లు కూడా ఇవ్వడం లేదు. అనేక సమస్యలపై అఖిలపక్షం పెట్టాలని కోరినా ఖాతరు చేయలేదు. అలాంటిది తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూ.. తెలంగాణకు  గవర్నర్‌గా వచ్చిన తమిళ సై..  ఇప్పటివరకూ దాదాపు 25 సార్లు విపక్షాలకు సమయం ఇచ్చి, తానేమిటో స్పష్టం చేశారు. ప్రతిపక్ష  పార్టీలు సమయం అడిగిన వెంటనే ఇచ్చేస్తుండటం కూడా,  కేసీఆర్ సర్కారుకు కంటగింపుగా మారడానికి మరో ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

కేసీఆర్ కంటే ముందుగానే..

తాజాగా చైనాతో యుద్ధంలో అశువులు బాసిన,  సూర్యాపేట బిడ్డ కల్నల్ సంతోష్  భౌతికకాయం హకీంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చినప్పుడు, అక్కడికి సీఎం కేసీఆర్ రాలేదు. అదే సమయంలో అక్కడికి వచ్చిన తమిళసై, సంతోష్ మృతదేహానికి సెల్యూట్ కొట్టడంతో, సోషల్‌మీడియాలో కేసీఆర్ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా సమయంలో రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై నివేదికలివ్వాలని, గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను కేసీఆర్ సర్కారు బేఖాతరు చేసింది. దానితో ఆమె స్వయంగా రంగంలోకి, సీసీఎంబీ డైరక్టర్ రాకేష్‌మిశ్రాతో భేటీ అయి, వివరాలు తెలుసుకోవలసి వచ్చింది. కరోనా విజృంభిస్తున్న సమయంలో.. కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ, విపక్షాలు విరుచుకుపడుతున్న సమయంలో, ఆమె హటాత్తుగా నిమ్స్‌కు వెళ్లి డాక్టర్లకు ధైర్యం చెప్పడం సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో కరోనా టెస్టులు పెరగాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

సంప్రదాయానికి విరుద్ధంగా..

సహజంగా ఓ గవర్నర్.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులను పిలిస్తే తప్పనిసరిగా హాజరుకావాలి. వారికి మరో సమావేశాలు ఉంటే, వారి బదులు మరొక  అధికారిని పంపించడం సంప్రదాయం. కానీ కేసీఆర్ ఆ సంప్రదాయం కూడా పాటించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బహుశా ఈ కారణంతోనే ఆమె.. సీఎస్,వైద్య శాఖ అధికారిని పిలిపిస్తున్నానని ట్విట్టర్ ద్వారా వెల్లడించినట్లు కనిపిస్తోంది. సహజంగా ఏ గవర్నర్ కూడా ఈవిధంగా సమావేశ వివరాలను, ముందుగానే ట్విట్టర్‌లో వెల్లడించరు. భేటీ తర్వాత వివరాలను పీఆర్వోలు మీడియాకు విడుదల చేస్తుంటారు. అయితే..  కేసీఆర్ ప్రభుత్వ తీరు అందరికీ తెలియాలన్న ఉద్దేశంతోనే,  ఆమె అలా ట్వీట్ చేసినట్లు కనిపిస్తోంది.  గవర్నర్ మనోభావాలు దెబ్బతినడానికి ఇలాంటి అంశాలు కూడా, ప్రధాన కారణమన్న చర్చ జరుగుతోంది.

గత గవర్నర్‌తో సత్సంబంధాలు..

అయితే, ప్రస్తుత గవర్నర్ తీరుతో ఇబ్బందిపడుతున్న కేసీఆర్ ప్రభుత్వం.. గత గవర్నర్ నరసింహన్‌తో మాత్రం, సత్సంబంధాలు నిర్వహించారు. ఆయన కాళ్లకు సైతం మొక్కారు. తరచూ ఆయనతో భేటీ అయ్యేవారు. నరసింహన్ కూడా కేసీఆర్‌ను, పుత్రవాత్సల్యంతో చూసేవారు. రాజకీయ సలహాలిచ్చేవారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు-కేసీఆర్‌కు మధ్యవర్తిగా వ్యవహరించేవారు. ఏపీలో నాటి సీఎం చంద్రబాబును ఇబ్బందిపెట్టినప్పటికీ, తెలంగాణలో కేసీఆర్‌తో మాత్రం సఖ్యతగా వ్యవహరించేవారు. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉండటం, సహజంగానే కేసీఆర్ సర్కారుకు మింగుడపటం లేదు.

కరోనా కట్టడిలో చేతులెత్తేసిన సర్కారు..

ప్రస్తుతం తెలంగాణలో కరోనా కట్టడిలో ప్రభుత్వం  దాదాపు చేతులెత్తేసింది. రోజూ కరోనా పాజిటివ్ కేసులు తారాజువ్వలా పెరిగిపోతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేసే వారెవరూ లేకుండా పోయారు. తాజాగా.. మహాటీవీ అధినేత, ప్రభుత్వ మాజీ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ ‘‘ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో తొమ్మిదిరోజులకు పదిన్నర లక్షల రూపాయల బిల్లులు వేసింది. 12 గంటల సమయం అడిగితే ఆక్సిజన్ తీసేస్తామని బెదిరిస్తున్నార’ని చేసిన ట్వీట్.. తెలంగాణలో కరోనా చికిత్స పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు చేస్తున్న దోపిడీకి, నిలువెత్తు నిదర్శనంగా మారింది.  గతంలో కరోనా అంశంపైనే ప్రెస్‌మీట్లు పెట్టిన కేసీఆర్ గానీ, వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గానీ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. వైద్యశాఖ అధికారులే మాట్లాడుతున్నారు. పైగా పక్కనే ఉన్న ఏపీ సర్కారు పదిలక్షల టెస్టులు చేయడం, తెలంగాణలో టెస్టులు చేయకపోవడంపై ప్రజలు, ప్రతిపక్షాల ఆగ్రహానికి కారణమయింది.
ఈ దశలో రంగంలోకి దిగిన గవర్నర్ తమిళ సై సమాంతర పాలన చేస్తూ,  ఆమేరకు పోషిస్తున్న క్రియాశీల పాత్రపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

జోషి, చెన్నారెడ్డి దారిలోనే తమిళ సై..

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా వచ్చిన కుముద్‌బెన్ జోషి, ఇక్కడ నుంచే తమిళనాడు గవర్నర్‌గా వెళ్లిన,  మర్రి చెన్నారెడ్డి పోషించిన పాత్రను తమిళ సై గుర్తు చేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు, గవర్నర్‌గా ఉన్న కుముద్‌బెన్ జోషి ఆయనకు సమాంతరపాలన సాగించారు. దర్బార్లు నిర్వహించేవారు. తరచూ కాంగ్రెస్ నాయకులకు అపాయింట్‌మెంట్లు ఇచ్చేవారు. ప్రభుత్వ అధికారులను పిలిపించి మాట్లాడేవారు.  తమిళనాడు గవర్నర్‌గా వెళ్లిన మర్రి చెన్నారెడ్డి, అక్కడి సీఎం జయలలితను నీళ్లు తాగించారు. పివి ప్రధానిగా ఉన్న సమయంలో జయలలిత అవినీతిపై, సుబ్రమణ్యస్వామి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణకు ఆదేశించి సంచలనం సృష్టించారు. ఆరోజు చెన్నారెడ్డి విచారణకు ఆదేశించకపోతే, తర్వాతి కాలంలో జయలలిత జైలుకు వెళ్లవలసి వచ్చేది కాదు. తమిళనాడులో ప్రజాదర్బార్లు నిర్వహించడం ద్వారా, చెన్నారెడ్డి క్రియాశీల రాజకీయాలు కొనసాగించారు. జయలలిత తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించడం ద్వారా, ఆమెను ముప్పుతిప్పలు పెట్టారు. ఇప్పుడు తమిళ సై కూడా.. వారిద్దరి బాటలోనే నడుస్తున్నట్లు కనిపిస్తోందని, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

త్వరలో ప్రజాదర్బార్లు..?

కాగా తెలంగాణలో సీఎం కేసీఆర్,  ప్రజలను కలిసే సంప్రదాయం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలకూ ఆయన దర్శనం కరవే. అధికార వికేంద్రీకరణ తర్వాత, ఇక సీఎం ప్రజలను కలిసే అవసరం లేదన్నది మంత్రుల వాదన.  గతంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న వైఎస్, తన క్యాంపు ఆఫీసులో రోజూ ఉదయమే ప్రజలను కలిసేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. దీనితో ప్రజలు తమ సమస్యలు వివరించేందుకు ఎవరిని కలవాలో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో.. కొద్దిరోజుల్లో తమిళ సై ప్రజాదర్బార్లు నిర్వహించి, ప్రజల సమస్యలు వినాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆమె ప్రజాదర్బార్లు నిర్వహిస్తే.. తన దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖలకు పంపించిన సందర్భాల్లో, వాటిపై తీసుకున్న చర్యలేమిటో అధికారులు తప్పనిసరిగా జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. అదే జరిగితే.. కేసీఆర్ సర్కారుకు, గవర్నర్ నిజమైన ‘పక్కలో బల్లెం’గా మారక తప్పదంటున్నారు.

1 COMMENT

  1. […] కాగా కరోనా చికిత్సలు అందిస్తున్న, హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులను ఇప్పటివరకూ సీఎం కేసీఆర్ సందర్శించకపోవడం, అదే సమయంలో గవర్నర్ తమిళసై నిమ్స్, కేంద్రమంత్రి కిష్‌న్‌రెడ్డి మూడు ఆసుపత్రులను సందర్శించడం చర్చనీయాంశమయింది. ఇదే అంశంపై గతంలో రేవంత్‌రెడ్డి అనేకసార్లు ప్రశ్నించారు. సీఎం ప్రగతిభవన్, ఫాంహౌస్‌కే పరిమితమయితే ప్రజారోగ్యం ఎవరు చూసుకుంటారని విమర్శల వర్షం కురిపించారు. అటు బీజేపీ చీఫ్ సంజయ్ కూడా, కరోనాలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమయినందుకే గవర్నర్ నిమ్స్‌ను సందర్శించాల్సి వచ్చింద న్నారు.  కరోనా సమస్యను జనాల ఖర్మకు వదిలేసి, కేసీఆర్ మాత్రం రాజభవనంలో విశ్రాంతి తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ పరిణామాలన్నీ.. బీజేపీ మాత్రమే కరోనా కట్టడిపై శ్రద్ధ వహిస్తోందన్న అభిప్రాయం, జనంలో బలపడేందుకు కారణమవుతోంది. ఇది కూడా చదవండి.. పాలకుల పక్కలో బల్లెం! […]