వైయస్సార్‌ సతీమణి  వైయస్‌ విజయమ్మ రాసిన ‘‘నాలో… నాతో… వైయస్సార్‌’’ పుస్తకాన్ని, మహానేత 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. తన మాతృమూర్తి రాసిన ఈ పుస్తకాన్ని మహానేత తనయుడు  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. డాక్టర్‌ వైయస్సార్‌గారి సహధర్మచారిణిగా  విజయమ్మ 37 ఏళ్ళ జీవితసారం ఈ పుస్తకం. 2009 సెప్టెంబరు 2న ఆనూహ్యంగా డాక్టర్‌ వైయస్సార్‌ మరణించిన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారం ఈ పుస్తకం.

మహానేత గురించి లోకం ఏమనుకుంటున్నదీ తాను ప్రజలనుంచి తెలుసుకున్నానని; ఆయన గురించి ప్రజలకు తెలియని కొన్ని విషయాలు తెలిపేందుకే ఈ పుస్తకాన్ని తీసుకువచ్చానని విజయమ్మ తన తొలి పలుకుల్లో తెలిపారు.

డాక్టర్‌ వైయస్సార్‌ ఒక తండ్రిగా, భర్తగా, ఎలా ఉండేవారో ఈ పుస్తకం ఆవిష్కరించింది. కొడుకుగా, తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా, భర్తగా, అల్లుడిగా, మామగా, స్నేహితుడిగా, నాయకుడిగా… నిజ జీవితంలో వైయస్సార్‌గారు ఈ వేర్వేరు పాత్రల్లో ఎలా ఉండేవారో, ప్రతి ఒక్కరితో ఎంత ఆత్మీయంగా మెలిగేవారో… ఉన్నది ఉన్నట్టుగా విజయమ్మ వివరించారు.

మహానేత వేసిన ప్రతి అడుగు వెనకా ఉన్న ఆలోచనను; అనుభవాల నుంచి ఆయన నేర్చుకున్న పాఠాలను ఈ పుస్తకంలో విశ్లేషించారు. ఆయన, ఇంట గెలిచి రచ్చ గెలిచిన తీరును; ఇంట్లోవారి అవసరాలను అర్థం చేసుకున్నట్టే ప్రజలను కూడా కుటుంబ సభ్యులుగా భావించి వారి అవసరాలను కూడా అర్థం చేసుకున్న విధానాన్ని వివరించారు. కుటుంబ సభ్యుల ప్రగతిని కోరినట్టే రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ప్రగతినీ కోరుకుని, అన్ని ప్రాంతాల్లో ఇంటింటా అందరికీ మేలు చేయబట్టే తమ కుటుంబ సభ్యుల మాదిరిగానే రాష్ట్ర ప్రజలంతా డాక్టర్‌ వైయస్సార్‌ను ఇప్పటికీ ఆరాధిస్తున్నారని పుస్తకం ముందుమాటలో ఆమె వివరించారు. డాక్టర్‌ వైయస్సార్‌ తన జీవితమంతా పెంచి, పంచిన మంచితనమనే సంపద తన పిల్లలూ మనవలకే కాకుండా… ఇంటింటా పెరగాలనే సంకల్పంతోనే ఈ పుస్తకాన్ని సవినయంగా సమాజం ముందుంచుతున్నానని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు.

ఆయన్ను ప్రేమించిన తెలుగు ప్రజలందరికీ ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్నాని విజయమ్మ అన్నారు.

తమ వివాహం, ఆ నాటి పరిస్థితులు, పేదల డాక్టర్‌గా వైయస్సార్, రాజకీయాల్లో ఆయన రంగ ప్రవేశం, చిన్ననాటినుంచి వైయస్సార్‌ నాయకత్వ లక్షణాలు, పేదల పట్ల కరుణ, రాజకీయాల్లో ఆటుపోట్లు, కుటుంబంలో ఆత్మీయతలు, పిల్లల చదువులు, వివాహాలు, దైవం పట్ల భక్తి శ్రద్ధలు, అందరివాడిగా గడిపిన జీవితం, పీసీసీ అధ్యక్షుడిగా మొదలు ముఖ్యమంత్రి వరకు ఎదురైన ఒత్తిడులు, చారిత్రక ప్రజా ప్రస్థానం, వైయస్‌ జగన్‌;  షర్మిలలతో.. వారి కుటుంబాలతో మహానేత అనుబంధాలు; మహానేత మరణంతో ఏదురైన పెను సవాళ్ళు, శ్రీ వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేవరకు పరిణామాలు… ఇవన్నీ ఈ పుస్తకంలో రేఖామాత్రంగా కొన్ని, వివరంగా మరి కొన్ని తెలిపారు. ఉన్నది ఉన్నట్టుగా తెలియజేశారు.

మరణం లేని మహానేత గురించి, తాను మరణించినా తన పథకాల్లో ఎప్పటికీ జీవించి ఉన్న మరణం లేని మహానేత గురించి, తెలుగువారంతా తమ కుటుంబమే అనుకున్న మహానేత గురించి రాబోయే తరాలకు కూడా స్ఫూర్తి ఇవ్వాలన్న సత్సంకల్పంతో ఈ పుస్తకాన్ని ప్రజలముందుంచుతున్నానని  విజయమ్మ అన్నారు. ఆయన జీవితమే తెరిచిన పుస్తకమని; ఆయన ప్రజాప్రస్థానంలో ప్రతి అడుగూ ప్రజల జీవితంతోనే ముడిపడి ఉందని శ్రీమతి విజయమ్మ వివరించారు.

–ఎమెస్కో పబ్లికేషన్స్‌ ద్వారా ఈ పుస్తకం లభ్యం.

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner