అక్కడ..  జగన్ కంటే  రాజుగారే జననేత!

135

వారిద్దరే అభ్యర్ధులయితే విజేత రఘురాముడేనట
ఐవిఆర్‌ఎస్ పోల్ సర్వే ఫలితం ఇదే
నర్సాపురం ప్రజల నాడిలో తేలిన నిజం
‘సూర్య’కు ప్రత్యేకం
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఒకరు రాష్ట్రంలో సమ్మోహనశక్తిగల యవనేత. మరొకరు ఆయనను ఎదిరించి నిలబడిన మరో పార్లమెంటు స్థాయి నేత. ఒకరు సీఎం. మరొకరు ఎంపీ. ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారే. అయితే వారిద్దరి మధ్య ఇప్పుడు ఆసక్తికర యుద్ధానికి తెరలేచింది. ఒకరు తనను ఎదిరించిన సదరు ఎంపీ సీటు కిందకు నీళ్లు తీసుకురావాలని, ప్రత్యేక విమానాలతో ప్రయత్నిస్తున్న సీఎం. ఇంకొకరు ఢిల్లీ దర్బారు ఆశీస్సులతో, దేనికైనా రె’ఢీ’ అంటున్న ఎంపీ. మరి ఈ పరిస్థితిలో, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..? పోనీ తర్వాత వచ్చే ఎన్నికల్లో, వారిద్దరే అక్కడ అభ్యర్ధులయితే..? పోటీ ఎలా ఉంటుంది? మహారంజుగా ఉండదూ?! అదే జరిగితే.. అసలు ఆ నియోజకవర్గంలో జనం ఎవరికి జై కొడతారు? ఎవరిని నై అంటారు?.. రాష్ట్రం మొత్తం అటువైపు చూస్తున్న ఆ నియోజకవర్గంలో, ఇద్దరు జగమొండిల మధ్య యుద్ధం జరిగితే విజేతలెవరు? పరాజితులెవరు? ఈ ఒక్క అంశంపైనే జరిగిన సర్వేలో.. ఫలితం ఎవరివైపు మొగ్గింది? విజయలక్ష్మి ఎవరిని వరించింది?.. జగన్మోహనం అక్కడ కూడా పనిచేసిందా? రామబాణం ఫలించిదా?…. చూద్దాం రండి.

నర్సాపురం వైఎస్సార్‌సీపీ.. అదేనండీ.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడయిన కె.రఘురామకృష్ణంరాజు,  ఇప్పుడు ఆ పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు. ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ సభ్యులను, జగనన్న ప్రత్యేక విమానం వేయించి మరీ ఢిల్లీకి పంపించారు. పార్టీని ధిక్కరించినందున, రాజుపై వేటు వేయాలన్నది జగనన్న పురమాయించిన బృందం, లోక్‌సభ స్పీకర్ ఎదుట చేసిన వాదన. సరే.. ఒకవేళ అయితే గియితే.. జగనన్న ప్రయత్నాలు, ఢిల్లీబాద్‌షాలపై చేస్తున్న ఒత్తిళ్లు, పరోక్ష రాజకీయ ప్రాయోజిత రాయబేరాలు ఫలించి.. రఘురాముడిపై అనర్హత వేటు వేస్తే..? అప్పుడు జరిగే ఉప ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుంది? జనం ఎవరికి జై కొడతారు? ఇది కదా.. అసలు మజా కలిగించే యవ్వారం! అదిగో.. ఆ ఆలోచనతోనే హైదరాబాద్‌లో ఉండే, భీమవరానికి చెందిన ఓ పారిశ్రామికవేత్త ఐవిఆర్‌ఎస్ పద్ధతిలో ఓ సర్వే చేయించారు.

ఓకే.. ఓకే.. మరి అభ్యర్ధులెవరు? అసలు రాజు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? ఇంతకూ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి ఎవరు?..అది తెలియకుండా,  బస్సులో కూర్చుని ‘మా ఊరికి టికెట్టు ఇవ్వమంటే’ ఎలా? అందుకే ఈ పితలాటం ఎందుకనుకున్నారో ఏమో.. అసలు అభ్యర్ధులుగా వాళ్లిద్దరే.. అంటే జగన్ వర్సెస్ రఘురామకృష్ణంరాజు ఉంటే పోలా? ఆ ఆలోచనతోనే సదరు పారిశ్రామికవేత్త, రెండురోజులు ఫోన్ల ద్వారా నర్సాపురం పార్లమెంటు పరిధిలోని, ఏడు  అసెంబ్లీ నియోజకవర్గాలలో సర్వే చేయించారు. ఆ ప్రకారంగా ఐవిఆర్‌ఎస్‌లో.. అదేనండీ.. ‘ఇంటారిక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం’ ద్వారా ఓట్లు వేసిన ప్రజలు, చివరాఖరకు రఘురామకృష్ణంరాజుకే జై కొట్టారు. అర్ధం కాలేదా?.. నర్సాపురంలో ఒకవేళ ఉప ఎన్నికలు జరిగినా, లేదా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా, అక్కడ జగన్మోహన్‌రెడ్డి వర్సెస్ రఘురామకృష్ణంరాజు అభ్యర్ధులయితే.. విజయం రఘురాముడిదేనన్నమాట.

ఠాట్.. అదెలా కుదురుద్దీ? తనతో సహా 151 మంది ఎమ్మెల్యేలను, ఒంటిచేత్తో గెలిపించిన జగన్మోహన్‌రెడ్డి అంతటి నాయకుడు పోటీ చేస్తే , గెలవకుండా ఉంటాడా? ఈ పిచ్చి అంచనాలు నమ్మడానికి మేమేం వెర్రి పుష్పాలమనుకుంటున్నారా లేక ఎకసెకపాలెం అనుకుంటున్నారా అని వాదించవచ్చు! కానీ.. నర్సాపురం ప్రజలు మాత్రం..  మా నర్సాపురంలో ఇంతేనంటున్నారు. ఏం చేద్దాం మరి?! అందుకే సర్వే చేయించిన సదరు పారిశ్రామికవేత్త, అభ్యర్ధులుగా వాళ్లిద్దరి పేర్లే సర్వేలో ఎంచుకున్నారు. అఫ్‌కోర్స్.. జనం కూడా జగన్మోహన్‌రెడ్డి వచ్చి అక్కడ పోటీ చేస్తారనేమీ అనుకోరు. ఆయన పార్టీ అభ్యర్ధి ఉన్నాడంటే, అక్కడ నైతికంగా జగన్మోహన్‌రెడ్డి ఉన్నట్లే లెక్క.  బహుశా ఈ కవి హృదయంతోనే, ఆ పారిశ్రామికవేత్త.. ‘వాళ్లిద్దరూ పోటీ చేస్తే’ అని సర్వే చేయించినట్లున్నారు కామోసు!

సరే.. ఇక నర్సాపురంలో చేయించిన ఆ ఐవిఆర్‌ఎస్  సర్వే లెక్కలేమిటి? అందుకు ఎంచుకున్న పద్ధతేమిటన్నది చూద్దాం. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని.. ఉండి, భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, ఆచంట, తణుకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే సాగింది. జులై 1, 2వ తేదీల్లో.. రెండురోజుల పాటు ఫోన్ల ద్వారా, ఈ అభిప్రాయసేకరణ జరిగింది. తొలిరోజు 18 వేల మంది, రెండో రోజు లక్షమంది అభిప్రాయాలు సేకరించారు. అందులో కొందరు స్పందించలేదు.  ‘‘ఇప్పుడు ఎన్నికలు జరిగితే మీ ఓటు ఎవరికి వేస్తారు? రఘురామకృష్ణంరాజయితే ఒకటి, జగన్మోహన్‌రెడ్డి అయితే రెండు నొక్కండి’’ ఇదీ ఐవిఆర్‌ఎస్ ప్రశ్నించిన విధానం.

ఆ ప్రకారంగా.. తొలి రోజు దాదాపు 18 వేల మందికి ఫోన్లు చేయగా, అందులో 11,452 ఫోన్లకు స్పందించారు. వారిలో  5969 మంది రఘురామకృష్ణంరాజుకు, 5483 మంది జగన్మోహన్‌రెడ్డికి ఓటు వేస్తామని చెప్పారు. ఆ ప్రకారంగా ఓట్ల శాతం పరిశీలిస్తే.. రఘురామకృష్ణంరాజుకు 52.12 శాతం, జగన్మోహన్‌రెడ్డికి 47.9 శాతం ఓట్లు వచ్చాయన్నమాట. మొత్తంగా తొలిరోజు ప్రజాభిప్రాయ సేకరణలో రఘురాముడు.. జగన్మోహన్‌రెడ్డి కంటే 4.24 శాతం ఓట్లు అధికంగా సాధించారన్నమాట.

ఇక రెండో రోజయిన జులై 2న.. దాదాపు లక్షమందికి ఫోన్లు చేయగా..  63,946 మంది స్పందించారు.  అందులో 34,810 మంది రఘురామకృష్ణంరాజుకు జైకొట్టారు. అంటే 54.43 శాతం మంది రాజును సమర్థించారన్న మాట. 29,136 మంది జగన్మోహన్‌రెడ్డికి జై కొట్టారు. ఆ ప్రకారం ఆయనకు 45.6 శాతం ఓట్లు వచ్చాయన్న మాట. మొత్తంగా రెండో రోజు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో రఘురామకృష్ణంరాజుకు.. జగన్మోహన్‌రెడ్డి కంటే 8.87 శాతం ఓట్లు ఎక్కువగా వచ్చాయన్నమాట! ఏతావతా ప్రజాభిప్రాయసేకరణలో వచ్చిన మొత్తం 75,398 ఓట్లలో..  రఘురామకృష్ణంరాజుకు 40,779 ఓట్లు, జగన్మోహన్‌రెడ్డికి 34,619 ఓట్లు లభించినట్లు స్పష్టమవుతోంది. అంటే దాదాపు ఏడు శాతం ఓట్ల తేడాతో  6,160 ఓట్ల తేడాతో  రఘురామకృష్ణంరాజు విజే తగా నిలిచినట్లన్నమాట! బహుశా..నర్సాపురం ఓటర్లు ఇలాంటి అభిప్రాయానికి రావడానికి, స్థానికత.. తమవాడిని వేధిస్తున్నారన్న సానుభూతి కూడా కారణం కావచ్చేమో?! దాన్ని పక్కకుపెడితే.. నేరుగా జగన్మోహన్‌రెడ్డి అభ్యర్ధి అయితేనే 6 వేల ఓట్లు మెజారిటీ వచ్చింది.  అదే ఏ గంగరాజో, సుబ్బరాజో, మరో రాయుడో అయితే ఎంత మెజారిటీ వస్తుందన్నదే  ఇక్కడ చర్చ.