ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులలో దివంగతనేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి ఉన్న ప్రాధాన్యత విశిష్టమైనది. పలు సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో నిల్చిన మహానేత ఆయన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులంతా ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం చేత నియమించబడి పాలించినవారే. కానీ రాజశేఖర్ రెడ్డి నియామకం ఇందుకు పూర్తిగా భిన్నమైనది. వై.యస్. రాజశేఖరరెడ్డి 2003 వేసవి కాలంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి 1,467 కిలోమీటర్లు పర్యటించారు.
ఈ పాదయాత్ర వలన వ్యక్తిగతంగా వైఎస్‌కు మంచి జనాదరణ లభించడమే కాకుండా ఆ తర్వాత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనను ముఖ్యమంత్రిగా నియమించితీరాల్సిన పరిస్థితి వచ్చింది. 2004 మే నెలలో జరిగిన 12వ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు సాధించడంతో అప్పటికే పార్టీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన వెంటనే తొలి సంతకం ఉచిత విద్యుత్తు ఫైలు పైనే చేశారు.
ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, మహిళలకు పావల వడ్డీ ఋణాలు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ల పెంపు, పేదలకు ఉచిత విద్యుత్ తదితర పథకాలను ప్రవేశపెట్టి పేదల గుండెల్లో వై.ఎస్. నిలిచిపోయారు. 2009 ఎన్నికలకు ముందు అన్ని ప్రతి పక్షాలు ఒకవైపు, మరోవైపు సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం ఇవి ఏవీ రాజశేఖర్ రెడ్డి ప్రాభవాన్ని అడ్డుకోలేక పోయాయి. మళ్ళీ 2009 ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించి తిరిగి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టారు.
2009 లో రెండవసారి ముఖ్యమంత్రి అయిన రాజశేఖర్ రెడ్డి అదే సంవత్సరం దురదృష్టశాత్తు సెప్టెంబరు 2వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డిపై ఎన్ని ఆరోపణలు, విమర్శలు ఉన్నప్పటికీ తాను చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాల ద్వారా ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని ఆయన ఏర్పరచుకున్నారు. ఆయన మరణానంతరం జరిగిన పలు రాజకీయ పరిణామాలలో రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ తదుపరి జరిగిన ఎన్నికల్లోనూ, 2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ పార్టీ పలు స్థానాలలో గెలుపొందడానికి అత్యధిక ఓట్లు సాధించడానికి అప్పట్లో జగన్మోహన రెడ్డి ఆకర్షణ కంటే రాజశేఖర్ రెడ్డి పైన తెలుగు ప్రజలకున్న అభిమానమే ప్రధాన కారణం.

–ఎన్. జాన్సన్ జాకబ్ , మచిలీపట్నం.

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner