‘కారు’తో యుద్ధానికి ‘కమలం’ సిద్ధం!

పదును పెంచుతున్న కమలదళం
కేసీఆర్ దారిలోనే తిట్ల పురాణం
దారుసలాం భుజం మీదుగా తెరాసపై తుపాకీ
కరోనా వేదికగా కమలదళాల  కదనం
అయినా కాంగ్రెస్‌కే ప్రాధాన్యమిస్తున్న కేసీఆర్ అండ్ కో
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

తెలంగాణలో తెరాసతో యుద్ధానికి భారతీయ జనతా పార్టీ  సిద్ధమవుతోంది. ఆ మేరకు పై నుంచి కిందిస్థాయి నేతల వర కూ, తెరాసపై విమర్శలకు పదును పెడుతున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు నద్దా, కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసి రాంమాధవ్, రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్‌కుమార్, మాజీ అధ్యక్షుడు కోవా లక్ష్మణ్ నలుచెరుగులా కేసీఆర్ సర్కారుపై విమర్శల దాడులకు దిగుతూ, రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. వీరంతా కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కారు వైఫల్యానే ప్రధానాస్త్రంగా సంధిస్తుండటం విశేషం. హటాత్తుగా తమపై దాడి చేస్తున్న కమలదళాలపై ఎదురుదాడికి, తెరాస శిబిరం ఉక్కిరిబిక్కిరవుతోంది. కరోనా కేసులు, మరణాలకు సంబంధించిన అంశాలనే కమలదళం ఎక్కువగా ప్రస్తావిస్తుండటం దానికి కారణం. అయితే.. మంత్రులు ఈటల, తలసాని, శ్రీనివాసగౌడ్ ముగ్గురే తెరాస శిబిరం నుంచి అస్త్రాలు సంధిస్తున్నారు. తమపై కమలదళాలు ఈ స్థాయిలో కత్తులు నూరుతున్నప్పటికీ.. కేసీఆర్ అండ్ కో మాత్రం,  కాంగ్రెస్ విమర్శలకే ప్రాధాన్యమిస్తుండటం ఆశ్చర్యకరం.

నద్దా నుంచి సంజయ్ వరకూ..

కరోనా కారణంగా సభలు నిర్వహించుకోలేకపోతున్న కమలదళం.. వర్చువల్ సభలను సమర్ధవంతంగా వినియోగించుకుంటోంది. ఇటీవల కాలంలో రెండు జిల్లాలకు కలిపి ఒక వర్చువల్ సభ నిర్వహిస్తోన్న బీజేపీ నేతలు, దానికి కేంద్ర నేతలను ఆహ్వానిస్తున్నారు. ఆ పార్టీ జాతీయ దళపతి నద్దా, తొలిసారి కేసీఆర్ పాలనపై విరుచుకుపడటం ద్వారా, రాష్ట్రంలో తెరాసతో యుద్ధానికి తెరలేపారు. ఆ తర్వాత హాజరైన రాంమాధవ్ కూడా కేసీఆర్ సర్కారుకు హెచ్చరిక సంకేతం పంపించారు. ఆ తర్వాత కిషన్‌రెడ్డి, సంజయ్, లక్ష్మణ్ కూడా శరపరంపరగా అస్త్రాలు సంధిస్తుండటంతో.. ఇక కేసీఆర్ సర్కారుపై భాజపా యుద్ధానికి పూర్తి స్థాయిలో సిద్ధమయినట్లు స్పష్టమయింది. ‘కేంద్ర నాయకత్వం తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది అసలు  యుద్ధమే కాదు. డిసెంబర్ నుంచి అసలైన యుద్ధం ఆరంభమవుతుంది. అప్పటికి రాష్ట్రంలో  చాలా రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇదంతా హైదరాబాద్ కేంద్రంగానే జరగబోతోంద’ని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

కేసీఆర్ ‘రామ’బాణం..

ఇటీవల వరంగల్ వర్చువల్ సభకు హాజరైన రాంమాధవ్ ప్రస్తావించిన అంశాలు నిశితంగా పరిశీలిస్తే.. తెలంగాణను బీజేపీ సమర వేదికగా వినియోగించుకునేందుకు సిద్ధమవుతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. ‘కేసీఆర్ అధికార, రాజకీయ కార్యకాలాపాలకు త్వరలో ముగింపు తప్పదు. హైదరాబాద్‌లో ఆయన ఇప్పుడు ఏకాకి, ఒంటరి. ఒక ప్రభుత్వం ఎలా ఉండకూడదన్న దానికి కేసీఆర్ ప్రభుత్వమే ఉదాహరణ. మీ ఏడాది పాలనపై రిపోర్టు ఇచ్చే ధైర్యం ఉందా? కేంద్ర బృందాలను మోసం చేయగలరు. కానీ కరోనా బారినపడ్డ తెలంగాణ ప్రజలను ఎంతకాలం మోసం చేస్తార’ని రాంమాధవ్ సూటిగా విమర్శనాస్త్రాలు సంధించారు. జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాంమాధవ్ విమర్శలను త్రోసిపుచ్చడానికి వీల్లేదు.

గంగాపురం గరం గరం..

అటు  కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి కూడా,  హైదరాబాద్ నగరంలో విస్తరిస్తున్న కరోనా వేదికగా.. కేసీఆర్ సర్కారుపై చేసిన మాట దాడిని తక్కువచేసి చూడలేం. ‘కేసీఆర్ ప్రభుత్వం దారుసలాం ఆదేశాలు పాటించడం వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయి. దానివల్ల హైదరాబాద్ ఎప్పుడు పేలుతుందో తెలియదు. ప్రైవేట్ ల్యాబ్‌లో చేసిన పరీక్షలో 71 శాతం పాజిటివ్ రిపోర్టు వ చ్చాయంటే, హైదరాబాద్‌లో పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్ధమవుతుంది. ప్రజలు కరోనాతో అల్లాడుతుంటే, కేసీఆర్ మాత్రం ఫాంహౌస్‌లో ఉంటే ఎలా? తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతిలో బందీగా మారింది. ఈ కుటుంబాలను పారద్రోలేందుకు బిజెపి క్యాడర్ సిద్ధం కావాలి.  దేశంలో ఎక్కడా లేని కరోనా మరణాలు, ఒక్క హైదరాబాద్‌లోనే ఎందుకు నమోదవుతున్నాయో కేసీఆర్ చెప్పాల’ని కిషన్‌రెడ్డి నిలదీసిన వైనం చూస్తే.. కరోనాపై కేసీఆర్‌తో ఇప్పటివరకూ, సహనం పాటించిన బిజెపి విధానం మారినట్లుగానే భావించాల్సి ఉంది.

కేసీఆర్ దారిలోనే సంజయుడి నడక..

ఇక బిజెపి రాష్ట్ర దళపతి బండి సంజయ్, మొదటి నుంచీ తీవ్ర పదజాలంతోనే కేసీఆర్ సర్కారుపై దాడి చేస్తున్నారు. ఈ విషయంలో ఆయన కేసీఆర్ దారిలోనే వెళుతున్నట్లు కనిపిస్తోంది. దిక్కుమాలిన ప్రభుత్వం, దరిద్రపు పాలన, సన్నాసి సీఎం వంటి పదాలు వాడుతున్నారు. మరో అడుగు ముందుకేసి,  కేసీఆర్ జైలుకెళ్లే రోజులు తొందర్లోనే ఉన్నాయనడం సంచలనం సృష్టించింది. ఇప్పటివరకూ కేసీఆర్‌ను ఈ తరహాలో ఎవరూ హెచ్చరించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. ఆయన ఇటీవలి కాలంలో చేస్తున్న విమర్శలు, ఆరోపణలు, వాడుతున్న పదజాలం చూస్తే.. కేంద్ర నాయకత్వం నుంచి, స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లే భావించాల్సి ఉంటుంది.

‘ మేం పేదల ప్రాణాల కోసం పోరాడుతుంటే, బిజెపి మతతత్వపార్టీ అని విమర్శించే స్థాయికి తెరాస దిగజారింది. అవును.. ధర్మాన్ని కాపాడేందుకు, అవసరమైతే మతాన్ని రాజకీయం చేసి తీరతాం. దేశమంతా లాక్‌డౌన్ పాటిస్తుంటే, పాతబస్తీలో రంజాన్ కోసం సడలించడం వల్లే కదా హైదరాబాద్‌లో కేసులు పెరిగాయి? మంత్రి కేటీఆర్ బుడ్డర్‌ఖాన్. కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పుడు రంగారెడ్డి జిల్లా భూములపై కన్నేసి అక్కడ ఫార్మాకంపెనీలు పెడుతోంది’ అని ఆరోపణలు గుప్పించారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఇప్పటివరకూ ఏ బీజేపీ నేత కూడా, మతం వేరు రాజకీయం వేరని ప్రకటించేవారు. కానీ, తొలిసారి సంజయ్ మాత్రం.. అవసరమైతే మతాన్ని రాజకీయాలకు వాడతామని విస్పష్టంగా, నిర్భయంగా చెప్పారంటే.. తెలంగాణలో, ప్రధానంగా రాజధాని నగరంలో.. బీజేపీ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటన్నది,  సులభంగానే అర్ధం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

తెరాస నుంచి ఆ ముగ్గురే..

అయితే.. కమలదళాల దాడికి తెరాస శిబిరం  పెద్దగా స్పందించినట్లు లేదు. మంత్రి ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాసయాదవ్, శ్రీనివాసగౌడ్ మాత్రమే వారిపై ఎదురుదాడికి పరిమితమయినట్లు కనిపించింది. కరోనా, కాల్వకు గండ్లు పడటం నుంచి కరోనా వరకు కమలదళాలు చేస్తున్న దాడిపై వారు మాత్రమే ప్రతిస్పందించారు. ‘కాల్వకు గండ్లు పడితే దానికి, కేసీఆర్‌కు ఏం సంబంధం? సరిహద్దులో భారత సైనికులు చనిపోతే, దానికి మోదీ కారణమని మేం విమర్శించలేదు కదా? రాంమాధవ్ రాజకీయ పర్యాటకుడిలా వచ్చి ఏదేదో మాట్లాడుతుంటారు. కేసీఆర్‌ను ఇంటికి పంపుతామంటున్న రాంమాధవ్, ఇప్పటికే బిజెపిని తెలంగాణ ప్రజలు ఇంటికి పంపించారని గుర్తుంచుకుంటే మంచిద’ని హెచ్చరించారు.

కాంగ్రెసే ప్రధాన  ప్రత్యర్ధి..

అయితే..  బీజేపీ చేస్తున్న దాడులను పెద్దగా పట్టించుకోని మంత్రులు, తెరాస నేతలు,  కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలపైనే ఎదురుదాడి చేస్తుండటం ప్రస్తావనార్హం. కాంగ్రెస్ నేతలు చేసే ఆరోపణలపై కేటీఆర్, హరీష్, తలసాని, శ్రీనివాస్‌గౌడ్ తరచూ ఎదురుదాడి చేస్తున్నారు. కానీ బీజేపీపై మాత్రం కేవలం ఇద్దరు ముగ్గురు మంత్రులు, నేతలు మాత్రమే ప్రతిస్పందిస్తున్నారు. వీరంతా బీసీ, ఎస్సీ నేతలే కావడం ప్రస్తావనార్హం.  దీన్నిబట్టి..  కాంగ్రెస్ పార్టీనే తెరాస తన ప్రధాన శత్రువుగా  భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
Close Bitnami banner
Bitnami