కరోనా కదనంలో జగన్ తీరు శహభాష్!

206

10 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
తెలంగాణలో పరీక్షలు అతి తక్కువే
నిధులిచ్చి సహకరిస్తున్న కేంద్రం
కేంద్ర సహకారమే కారణమంటున్న కమలనాధులు
వాలంటీర్ల సేవలు ప్రశంసనీయం
ఇంటికొచ్చి వివరాలు సేకరిస్తున్న వాలంటీర్లు
                   (మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

తన ఏకపక్ష నిర్ణయాల, కోర్టులతో ఘర్షణ, ప్రత్యర్ధులపై కక్షసాధింపు వైఖరితో ఇటీవలి కాలంలో వరస వెంట వరస విమర్శలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి.. కరోనా పరీక్షల విషయంలో మాత్రం అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే, ఏపీలో జరుగుతున్న పరీక్షలే వేగంగా ఉన్నాయని విమర్శకులు సైతం అంగీకరిస్తున్న పరిస్థితి. నిజానికి, ఈ విషయంలో తొలుత జగన్ కంటే.. కేసీఆర్ అందరి అభినందనలు అందుకున్నారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో జగన్ కంటే, కేసీఆర్ సర్కారు బాగా పనిచేస్తోందన్న అభిప్రాయం హైదరాబాద్ వాసులలో ఏర్పడింది. హైదరాబాద్ లోని సీమాంధ్రులు కూడా దాదాపు అలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు.  తర్వాత రాను రాను ఈ అభిప్రాయం స్థానంలో.. కేసీఆర్ కంటే జగన్ సర్కారే కరోనా టెస్టులు ఎక్కువ చేస్తోందన్న భావన స్థిరపడింది. గాంధీ ఆసుపత్రిలో సౌకర్యాలు లేవంటూ కరోనా రోగులు విడుదల చేసిన వీడియోలు, గాంధీ ఆసుపత్రి పరిస్థితులపై విమర్శలు, ప్రైవేటు ఆసుపత్రులలో లక్షలకు లక్షల బిల్లులు వేసిన వైనం సోషల్ మీడియాలో రావడం కూడా దీనికి ప్రధాన కారణం. తెలంగాణకు చెందిన మీడియా సంస్థలు కూడా తెలంగాణ కంటే ఏపీలోనే ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తున్నారని, కంటైన్మెంట్ జోన్లకు కఠినంగా అమలుచేస్తున్నారన్న కథనాలు రాస్తుండటం మరో కారణం.

జగన్ వ్యాఖ్యలకు ముందు.. తర్వాత!

దేశంలో అత్యధిక సంఖ్యలో కరోనా పరీక్షలు చేస్తున్న మూడు రాష్ట్రాల్లో ఒకటిగా  ఏపీ రికార్డు సృష్టించింది. దీనిపై సీఎం జగన్మోహన్‌రెడ్డి మీడియా ముందుకొచ్చి హడావిడి చేయకపోయినా.. అధికారులు, యంత్రాంగాన్ని ఆ మేరకు రంగంలోకి దింపిన వైనం సత్ఫలితాలిస్తోంది. దీనికి దన్నుగా… కేంద్రంలోని మోదీ సర్కారు కూడా నిధులు భారీగా విడుదల చేయడంతో, ఏపీలో ఎక్కువ సంఖ్యలో కరోనా టెస్టులు చేయడానికి కారణమవుతోంది. తొలుత ఇది పారాసిట్‌మల్‌తో తగ్గిపోతుందని, కమ్ అండ్ గోస్‌లా వచ్చిపోతుందని, ఇకపై అందరూ కరోనాతో సహజీవనం చేయాలన్న జగన్ వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో ఎగతాళి ఎదురయింది.

జగన్ వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ, భారీ సంఖ్యలో ట్రోల్ అయ్యాయి. కానీ, డబ్ల్యుహెచ్‌ఓ, కేంద్ర ఆరోగ్యశాఖ  నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వరకూ అదేమాట చెప్పడంతో.. జగన్ చెప్పిందే నిజమయిందన్న భావన అందరిలో ఏర్పడింది. తెలంగాణలో కేసీఆర్ మాదిరిగా.. కరోనాపై తరచూ ప్రెస్‌మీట్లు నిర్వహించకపోవడం, కరోనాను ఎదుర్కొనే బదులు, కోర్టులతో ఘర్షణ, నియామకాలు, విపక్షాలపై కేసుల వంటి రాజకీయ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టడంతో.. జగన్ కరోనా విషయంలో సీరియస్‌గా లేరన్న అభిప్రాయం వ్యక్తమయింది. కరోనాపై ప్రచారంలో.. జగన్ వెనుకబడ్డారన్న వ్యతిరేక భావన ఏర్పడేందుకు ఇవన్నీ కారణమయ్యాయి.

శరవేగంగా కరోనా టెస్టులు..

అయితే, కరోనా పరీక్షల విషయంలో దేశంలోని మూడు  రాష్ట్రాలలో  ఏపీ ఒకటిగా  నిలిచిందన్న విషయం తెలిసిన తర్వాతనే.. కరోనాలో జగన్ సర్కారు పనితీరేమిటన్నది అందరికీ తెలిసొచ్చింది. ఇప్పటివరకూ పదిలక్షల కరోనా పరీక్షలు చేయడం మామూలు విషయమేమీ కాదు. నిజానికి ఏపీతోపాటు, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు మాత్రమే 10 లక్షల టెస్టులు నిర్వహించాయి. ఆ ప్రకారం ఏపీలో ప్రతిరోజూ 34 వేలకు పైగా పరీక్షలు నిర్వహించే స్థాయికి ఎదగడం అద్భుతమే. లక్ష టెస్టులు చేయడానికి 59 రోజుల సమయం తీసుకోగా, 10 లక్షల టెస్టులకు కేవలం నాలుగురోజులే తీసుకున్నారంటే..  పరీక్షలు ఎంత వేగంగా చేస్తున్నారో స్పష్టమవుతోంది. కరోనా అలజడి ఆరంభమైన తర్వాత ఏపీ.. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలోకి వైరాలజీ ల్యాబ్‌కు పరీక్షల ఫలితాల కోసం  పంపించింది. ఇప్పుడు ఆ స్ధాయి అధిగమించి, ఏపీలోనే సొంతంగా 17ల్యాబ్‌లు ఏర్పాటుచేశారు. దేశంలోనే ఇన్ని ల్యాబ్‌లు అధికంగా ఏర్పాటుచేసిన ఘనత కూడా జగన్ సర్కారుకే దక్కడం విశేషం. తెలంగాణలో ఇప్పటిదాకా కేవలం లక్షా పదివేల టెస్టులే చేయడం గమనార్హం.

వాలంటీర్ల సేవలు.. వారెవా!

అటు జగన్మోహన్‌రెడ్డి సర్కారు ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ కరోనా సమయంలో చేస్తున్న కరసేవ అందరి అభినందనలు అందుకుంటోంది. గత కొద్దికాలం నుంచి అక్కడకక్కడా వాలంటీర్లపై మద్యం అమ్మకాలు, వ్యభిచారం, హత్యాయత్నం, దాడుల కేసు నమోదవుతున్నప్పటికీ… మొత్తంగా కరోనా సమయంలో వారు చేస్తున్న సేవ మాత్రం, అందరి అభినందనలు అందుకుంటోంది. ప్రతి ఇంటి తలుపు తట్టి, కరోనా టెస్టులు చేయించుకునేందుకు ఆసక్తి ఉన్న వారి పేర్లు నమోదు చేసుకుంటున్నారు. తమ వద్ద ఉన్న ఆధార్‌కార్డు వివరాల ద్వారా  నేరుగా ఇళ్లకు వచ్చి, 60 ఏళ్లు దాటిన వారి వివరాలను  ఆరోగ్యశాఖకు అందిస్తున్నారు. దానితో ఆరోగ్య సిబ్బంది ఇంటికే వచ్చి పరీక్షలు చేసివెళుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దానికితోడు తమ వార్డు పరిథిలోని వాలంటీర్ల ఫోన్ నెంబర్లు ప్రజల వద్ద ఉండటంతో, టెస్టుల కోసం జనమే వాలంటీర్లకు ఫోన్ చేస్తుండంతో, ఎక్కువ టెస్టులు చేయడానికి అవకాశం ఏర్పడింది. ఏపీ పది లక్షల కరోనా టెస్టులు చేయడానికి ప్రధాన కారణం వాలంటీర్లేనన్నది నిర్వివాదం. కాబట్టి.. జగన్ సర్కారుకు ఈ విషయంలో ఎలాంటి ప్రశంసలు వచ్చినా, అది వాలంటీర్లకే దక్కడం ధర్మం.

కేంద్ర సహకారమే ప్రధాన కారణం!

ఏపీలో కరోనాపై యుద్ధం చేస్తున్న జగన్ సర్కారుకు, కేంద్రంలోని మోదీ సర్కారు శరవేగంగా సాయం చేయడం కూడా.. పదిలక్షల టెస్టుల రికార్డు సృష్టించడానికి మరో ప్రధాన కారణం. ఇప్పటివరకూ కేంద్రం నుంచి కరోనాపై యుద్ధానికి 8025 వేల కోట్లు మంజూరు చేశారంటే, ఏపీలో కరోనా నివారణకు కేంద్రం ఎంత ప్రాధాన్యం ఇస్తుందో స్పష్టమవుతోంది. ఇదే అంశంలో పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం తమకు కేంద్రం నిధులివ్వడం లేదని ఆరోపిస్తుండటం ప్రస్తావనార్హం.

మూడు మాస్కుల ముచ్చటేదీ?

కాగా కరోనా టెస్టులలో వేగంగా పనిచేస్తున్న జగన్ సర్కారు.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు ఉచిత ంగా పంపిణీ చేస్తానని హామీ ఇచ్చింది. అయితే, ఇప్పటివరకూ వాటిని పంపిణీ చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది. అటు వాలంటీర్లు కూడా, తమకు పూర్తి స్ధాయిలో మాస్కులు రాలేదని చెబుతున్నారు.  దీనిపై ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని చోట్ల స్థానికంగా బట్టలతో తయారుచేసిన మాస్కులు ఇచ్చారని, అదే తాము ఎన్టీఆర్ ట్రస్టు నుంచి ఇచ్చిన, మాస్కుల నాణ్యత అద్భుతంగా ఉందని విమర్శించారు.

మోదీ సాయం చెప్పరేం?: విల్సన్

‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కరోనా సాయం విషయంలో పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలో కరోనాను ఎదుర్కొనేందుకు మోదీ ప్రభుత్వం, ఇప్పటిదాకా రాష ్ర్ట ప్రభుత్వానికి 8025 వేల కోట్లు మంజూరు చేసింది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న కార్మికుల కోసం 3 శ్రామిక్ రైళ్లు ఏర్పాటు చేసింది. గుజరాత్‌లో చిక్కుకున్న శ్రీకాకుళం మత్స్యకారులకు బస్సు ఏర్పాటుచేసి, ఇళ్లకు పంపించింది. మా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రతిరోజు జిల్లా పార్టీ నేతతో మాట్లాడి, కరోనా పరిస్థితులపై సమీక్షలు నిర్వహించి, రాష్ట్రానికి ఏం కావాలో కేంద్రానికి నివేదికలు పంపిస్తున్నారు. రాష్ట్ర ఇన్చార్జిగా ఉన్న కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్లతో మాట్లాడి, కరోనా అంశంలో నిధులు సమకూరుస్తున్నారు. 7.83 కోట్ల మందికి బియ్యం, 2.71 కోట్ల మందికి కందిపప్పు,  61 లక్షల మంది మహిళలకు జన్‌ధన్ ఖాతాల్లో 13,611 కోట్ల రూపాయలు, రెండుకోట్ల మంది మహిళలకు వెయ్యి కోట్ల రూపాయలు ఖాతాలో వేసింది. ఇంతచేస్తున్నా, జగన్ ప్రభుత్వం మాత్రం కేంద్రం చేస్తున్న సాయం గురించి ఎక్కడా చెప్పకపోవడం దారుణం. చివరకు 104,108 వంటి వాహనాల కొనుగోలుకు కేంద్రం 70 శాతం నిధులిస్తే, వాటిపై కనీసం ప్రధాని మోదీ ఫొటో వేయకుండా, అదేదో జగన్ సొంత డబ్బు ఇచ్చినట్లు ఆయన ఫొటో మాత్రమే వేయడం ఆక్షేపణీయ’మని ఏపీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి  విల్సన్ వ్యాఖ్యానించారు.