‘సప్తగిరి’తో ‘సజీవ సువార్త’.. సహజీవనం?

956

హిందువులకు టీటీడీ బంపర్ ఆఫర్
హిందువుల పత్రిక కొంటే క్రైస్తవ పత్రిక ఉచితం
కవరులో వచ్చిన రెండు పత్రికలతో ఖంగుతిన్న చందాదారుడు
తప్పించుకుంటున్న అధికారులు
నిద్రపోతున్న నిఘా
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

శివుడాజ్ఞ లేనిదే చీమయినా కుడుతుందేమో గానీ.. పైవారి ఆజ్ఞ లేనిదే టీటీడీలో, దోమ కూడా కుట్టదు. అలా ఇప్పటికి పైవారి ఆజ్ఞలతో.. ఓ నాలుగుసార్లు చేసిన ‘పరమతభజన’ల ‘అక్షరకీర్తన’లు హడావిడిగా చెరిపేశారు. అచ్చొత్తిన వాటిని పక్కకుబెట్టారు. ఇప్పుడూ సేమ్ టు సేమ్. ‘సప్తగిరి’ పత్రికతో కలిపి, క్రైస్తవ ‘సజీవ సువార్త’ను పంపిన వైనమిది. కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని సీఎం జగన్ చెబితే.. టీటీడీ అధికారులు మాత్రం ‘సప్తగిరి’తో ‘సజీవ సువార్త’ను సహజీవనం చేయించే కొత్త ప్రయోగానికి తెరలేపినట్లున్నారు. వడ్డించేవాడు మనవాడైతే చాలు. ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదు మరి.

హిందూ పత్రికకు క్రైస్తవ పత్రిక ‘ఉచితమా’?

సాధారణంగా మీరు ఏదైనా షాపింగ్ మాల్‌కు వెళ్లారనుకోండి. అక్కడ బోలెడన్ని ఆఫర్లు కనిపిస్తాయి. ఒక ఫ్యాంటు కొంటే మరో ఫ్యాంటు, ఒక షర్టు కొంటే మరో షర్టు ఉచితమన్నమాట! అలాంటి బంపర్ ఆఫర్లు, మనమూ ఎందుకు ఇవ్వకూడదన్న ఆలోచన టీటీడీకి వచ్చినట్లుంది. వచ్చిందే తడవుగా.. తాను ముద్రించే పత్రికతో కలిపి, క్రైస్తవ మతానికి చెందిన పత్రికనూ పంపి, చందాదారులయిన వెంకన్న భక్తుల జన్మధన్యం చేసింది. దీనితో కవరు తెరచిన సదరు చందాదారులు.. మరో మతంలోని మహత్తును తెలిపే పత్రికను కూడా జమిలిగా పంపి, తమ జన్మను చరితార్ధం చేసినందుకు మురిసిముక్కలయిపోతున్నారు. నిజం… తిరుమల తిరుపతి దేవస్థానం.. హిందూ భక్తులకు ప్రేమతో, అనురక్తితో హిందూ పత్రికతో కలిపి పంపిన,  క్రైస్తవ పత్రిక కథ ఇది. చదివి తరించండి.

మాకు మాత్రమే ఎందుకీ అదృష్టం?

గుంటూరుకు చెందిన రత్నాకరం విష్ణు అనే భక్తుడికి సోమవారం మధ్యాహ్నం ఒక పోస్టు వచ్చింది. ఆ కవరుపైన ‘ది చీఫ్ ఎడిటర్, టిటిడి ప్రెస్ కాంపౌండ్, కెటి రోడ్, తిరుపతి-517507, ఫోన్ 0877-2264359, 2264543 చిరునామా ముద్రించి ఉంది. సదరు రత్నాకర్.. టీటీడీ ముద్రించే ‘సప్తగిరి’ చంద్రాదారుడు కావడంతో, ఆ పత్రికనే వచ్చింది కామోసని కవర్ విప్పిచూశారు. అంతే.. అద్భుతం. అనుకోని అవకాశం. ఊహించని వరంలా..  క్రైస్తవ మతానికి చెందిన ‘సజీవ సువార్త’ పత్రిక ఆయన చేతిలో ప్రత్యక్షమయింది. అదీ ఎలాగంటే.. ‘సప్తగిరి’తో పెనవేసుకుని మరీ, ‘రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు’ అన్న ఇండికేటర్ దర్శనమిచ్చింది. ఈ అద్భుతాన్ని చూసిన సదరు చందాదారుడికి నోట మాట రాలేదు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప దక్కని అదృష్టం, టీటీడీవారు తనకు జమిలిగా కల్పించినందుకు ఆ భక్తుడు జుట్టుపీక్కున్నాడు.

టీటీడీ లీలావిలాసం..

హిందూమతంతో పాటు క్రైస్తవ మత గొప్పతనాన్ని కూడా తెలుసుకోమని, స్వయంగా టీటీడీనే కాణీ ఖర్చు లేకుండా తనకు పత్రిక పంపించడాన్ని ఆయన.. పర లోకమునున్న యేసు ప్రభువే, తన వద్దకు పంపించాడేమోనని చేయి గిల్లుకున్నారు. తనకు పట్టిన ఈ అదృష్టాన్ని చూసుకుని, గంటవరకూ పాపం ఆ  భక్తశిఖామణికి నోట మాట రాలేదట. తేరుకున్న తర్వాత గానీ టీటీడీ లీలలేమిటో తెలిసిరాలేదు!

బయటపెట్టిన భక్తుడు

వెంకన్న భక్తుడైన తాను.. టీటీడీ ముద్రించే సప్తగిరి పత్రిక చందారుడినయితే, క్రైస్తవ మతానికి చెందిన పత్రిక తనకెలా వచ్చిందో పాపం, ఆ  భక్తుడికి అంతుబట్టలేదు. దానితో ఈ విషయాన్ని ఆయన, మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. టీటీడీ పంపిన కవర్‌లో ఉన్న రెండు పత్రికలనూ జతపరిచారు. టీటీడీ ‘సప్తగిరి’తోపాటు ‘సజీవ సువార్త’ రెండూ మడిచి, ఫోల్డింగ్ వేసిన తీరును బయటపెట్టారు. ఇంకేముంది? న్యూస్ చానెళ్లు తమ పని తాము చేసుకుంటున్నాయి. దానితో ఆగమాగమం. గందరగోళం! హిందూమతం ప్రమాదంలో పడిందన్న ఆందోళన!!WhatsApp Audio 2020-07-06 at 20.06.02
WhatsApp Audio 2020-07-06 at 20.09.11

 కడిగేసిన కమలదళం..

ఈ విషయం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సాయి దృష్టికి వెళ్లడంతో, ఆయన సప్తగిరి ఎడిటర్ చొక్కలింగానికి 08772264063 నెంబరుకు ఫోన్ చేసి కడిగేశారు. ‘హిందూమతంలో ఎవరంటే వారు వేలు పెడితే సహించేది లేదు. ఒకసారి ఏసు కీర్తనలు, మరోసారి ఊహ తెలియని తొమ్మిదో తరగతి విద్యార్ధి రాసిన అభూతకల్పనలతో ముద్రణ. హిందువులంటే అలుసయిపోయిందా? అసలు టీటీడీ పత్రికలో క్రైస్తవ పత్రిక ఎలా వచ్చింది? అప్పటిలా హిందూ సమాజం ఇప్పుడు మౌనంగా చేతులు ముడుచుకుని లేదు. మేం ఎందాకయినా వెళతాం. సాయంత్రంలోగా దీనిపై వివరణ ఇవ్వకపోతే.. బీజేపీ మిగిలిన హిందూ సంస్థలు, మిగిలిన ధార్మిక సంస్ధలతో ఆందోళన చేస్తుంది’ అని ఘాటుగా హెచ్చరించారు. అయితే, దానితో తమకు సంబంధం లేదని, పోస్టల్‌లో ఎలా వచ్చిందో కనుక్కుంటామని పత్రిక బాధ్యుడు సెలవిచ్చారు. వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది హిందూ మతంపై దాడి: కోట సాయి

‘ఇది కచ్చితంగా హిందూమతంపై జరుగుతున్న దాడే. ఇప్పటిదాకా టీటీడీ దృష్టికి వచ్చిన అన్యమత ప్రచారంపై ఎందుకు దర్యాప్తు చేయలేదు? విజిలెన్స్ అధికారులు నిద్రపోతున్నారా? సప్తగిరి మాసపత్రిక తో,  క్రైస్తవ పత్రికను కలిపి ఎలా పంపుతారు? ఇప్పటికయినా హిందూ సమాజం కళ్లు తెరిచి, టీటీడీనీ, వెంకన్న ఆస్తులను కాపాడుకోవసిన అవసరం ఉంది.  ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాల’ని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి కోట సాయి డిమాండ్ చేశారు.

ఇక్కడే ప్యాక్ చేస్తారు.. మరి ఎలా జరిగిందో..

‘సప్తగిరి’తోపాటు క్రైస్తవ  పత్రిక కూడా చందాదారుడికి పంపిన వైనంపై ‘సూర్య’.. సప్తపది ఎడిటర్ చొక్కలింగం వివరణ కోరింది. అయితే.. అందుకు ఆయన చెప్పిన సమాధానం పొంతన లేకుండా, గందరగోళంగా కనిపించింది. ‘ఆర్‌ఎంఎస్ వాళ్లు మా గోడౌన్‌లోనే పత్రికలను ప్యాక్ చేస్తారు. అక్కడి నుంచి చందాదారులకు పంపిస్తారు. మా దగ్గర అంతా హిందువులే పనిచేస్తారు. ఇది బయట నుంచి జరిగి ఉంటుందనుకుంటున్నాం. మేం ఇప్పటికి గుంటూరులో ఉన్న 10 మంది చందాదారులకు ఫోన్లు చేశాం. అందులో కొందరికి సప్తగిరి, బాలసప్తగిరి మాత్రమే వచ్చాయన్నారు. మిగిలిన వారు ఇంకా మాకు రాలేదని చెప్పారు. దీనిపై విజిలెన్స్ అధికారులు ఇంకా మా దగ్గరకు రాలేదు’ అని చెప్పారు.

అయితే.. మీ గోడౌన్‌లోనే పత్రికను, మీ కళ్లెదుటే  ప్యాక్ చేసి పంపించినప్పుడు, మిగిలిన మతానికి సంబంధించిన పత్రిక అందులో ఎలా వస్తుందన్న ప్రశ్నకు.. ఆయన నుంచి సమాధానం లేదు. గుంటూరులో మీరు మాట్లాడిన ఆ 10 మంది చందాదారుల ఫోన్ నెంబర్లు ఇవ్వమని కోరితే..ఒకసారి ఇస్తామని, ఇంకోసారి ఇవ్వవచ్చో లేదో కనుక్కొని చెబుతానని చెప్పారు.

నిఘా… నిద్రపోతోందా?

టీటీడీ ముద్రణ సంస్థలో ఇలాంటి లోపాలు చాలాకాలం నుంచీ జరుగుతున్నప్పటికీ.. విజిలెన్స్ విభాగం ఇప్పటిదాకా, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఇలాగే క్రైస్తవ అంశాలు బయటకు వచ్చినప్పుడు, అది పెను వివాదానికి దారితీసింది. తర్వాత వాటి పిడిఎఫ్‌లు తొలగించారు. తాజాగా చందాదారులకు.. సప్తగిరితో పాటు  క్రైస్తవ పత్రిక పంపించిన వైనం, మీడియాలో దుమారం రేపుతున్నా.. ఇప్పటిదాకా విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగకపోవడంపై, భక్తులలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

నిజానికి ఇలాంటి ఘటనలు వెలుగుచూసిన వెంటనే.. విజిలెన్స్ అధికారులు ముద్రణ సంస్థలో, తనిఖీలు చేయాల్సి ఉంటుంది. అక్కడ అందుబాటులో ఉన్న న్యూస్‌ప్రింట్, పత్రికకు ఉన్న ఆర్డర్ ప్రకారం అచ్చొత్తిన న్యూస్‌ప్రింట్, దానికోసం మిషన్ విభాగానికి ఇచ్చిన ఆర్డర్ తనిఖీ చేయాల్సి ఉంటుంది. అలాగే అక్కడ మిగిలిన పత్రికలేమైనా ప్రింటు చేస్తున్నారా అని కూడా విచారణ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే పత్రికను బట్వాడా చేసే, ఆర్‌ఎంఎస్ సిబ్బందిని విచారించాల్సి ఉంటుంది. కానీ వీటిలో ఇప్పటిదాకా, విజిలెన్స్ అధికారులు ఏదీ చేయకపోవడం సహజంగానే విమర్శలకు దారితీస్తోంది.

టిటిడి ఖండన

ఇది దురుద్యేశ చ‌ర్య– పోలీసుల‌కు ఫిర్యాదు
 స‌ప్త‌గిరి మాస ప‌త్రిక బ‌ట్వాడ సంద‌ర్బంగా గుంటూరుకు చెందిన ఒక పాఠ‌కుడికి స‌ప్త‌గిరితో పాటు అన్య‌మ‌తానికి చెందిన మ‌రో పుస్త‌కం బ‌ట్వాడా అయిన‌ట్లు మాదృష్టికి వ‌చ్చింది. టిటిడి ప్ర‌తిష్ట‌ను దెబ్బ తీయ‌డానికి కొంత మంది చేసిన చ‌ర్య‌గా భావించి దీనిపై నిజాల‌ను నిగ్గుతేల్చేందుకు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది.

స‌ప్త‌గిరి మాస ప‌త్రిక‌ల‌ను పోస్ట‌ల్ శాఖ వారే ప్యాక్ చేసి, బ‌రువు చూసి పాఠ‌కుడి చిరునామాలు అతికించి బ‌ట్వాడ చేస్తారు. ఇందుకోసం పోస్ట‌ల్ శాఖ‌కు పోస్టేజి చార్జీల‌తో పాటు ఒక్కో ప్ర‌తికి అద‌నంగా రూ. 1.05 టిటిడి అద‌నంగా చెల్లిస్తోంది. పోస్ట‌ల్ శాఖ స‌ప్త‌గిరి మాస పత్రిక‌ను బుక్ పోస్టులో పంపుతుంది క‌నుక ఎలాంటి సీలు ఉండ‌దు. స‌ప్త‌గిరి మాస ప‌త్రిక ప్యాకింగ్, డెలివ‌రి భాధ్య‌త మొత్తం పోస్ట‌ల్ శాఖ‌వారే చూస్తారు.
ఈ విష‌యంగా ప‌లు జిల్లాల‌కు చెందిన స‌ప్త‌గిరి పాఠ‌కుల‌కు ఫోన్ చేసి విచారించ‌గా అలాంటి అన్య‌మ‌త పుస్త‌కం త‌మ‌కు అంద‌లేద‌ని తెలియ‌జేశారు. దీనిని దురుద్యేశ చ‌ర్య‌గా భావిస్తూ టిటిడి తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంది.