నీటి జగడాలన్నీ ‘బంతిపూల’ యుద్ధాలేనా?

163

అపెక్స్ కౌన్సిల్‌కు సిద్ధం కాని కేసీఆర్-జగన్
అధికారుల మధ్య పెరుగుతున్న లేఖలు, మాటల యుద్ధం
 (మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఏపీలో జగన్మోహన్‌రెడ్డి సర్కారు.. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యం పెంచుతూ ఇచ్చిన ఉత్తర్వు,  తెలంగాణ సర్కారుతో తగాదాకు తెరలేపింది. జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ విపక్షాలు యాగీ చేసిన తర్వాత, తెలంగాణ సర్కారు స్పందించాల్సి వచ్చింది. జగన్ సర్కారు నిర్ణయం వల్ల దక్షిణ తెలంగాణ ఎడారి అవుతోందంటూ బీజేపీ-కాంగ్రెస్ విరుచుకుపడ్డాయి. అసలు కేసీఆర్-జగన్ బంతి భోజనం సమయంలోనే జగన్ జీఓకు ప్రాణం పోసుకుందని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. జగన్‌తో ఉన్న వ్యాపార బంధం వల్లనే, పోతిరెడ్డిపాడుకు జగన్ పొక్క పెడుతున్నా కేసీఆర్ మౌనంగా ఉంటున్నారని విరుచుకుపడ్డారు. కేసీఆర్-జగన్ మ్యాచ్‌ఫిక్సింగ్ వల్ల దక్షిణ తెలంగాణ ఎడారవుతోందని బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. అంతటితో ఆగకుండా ఆయన ఈ అంశంపై, కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. అటు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కూడా, కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రెండుపార్టీలు ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించాయి.  దానితో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా సహించేది లేదని, ఏపీతో తాడోపేడో తేల్చుకుంటామని తెరాస సర్కారు ప్రకటించింది.

బోర్డు ఎదుట  ఏపీ-తెలంగాణ అధికారుల మాటల యుద్ధం..

ఆ తర్వాత రంగంలోకి దిగిన తెరాస సర్కారు.. ఏపీ సర్కారుపై కృష్ణా-గోదావరి బోర్డుకు ఫిర్యాదు చేసింది. దానికి ప్రతిగా.. ఏపీ సర్కారు కూడా తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులన్నీ అక్రమమేనని, వాటికి ఎలాంటి అనుమతులూ లేవని ఫిర్యాదు చేసింది. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా.. తెలంగాణ నిర్మించే ప్రాజెక్టులు సక్రమమయితే, తాము కడుతున్నవీ సక్రమ ప్రాజెక్టులేనని, తమ హక్కును మాత్రమే వినియోగించుకుంటున్నామని స్పష్టం చేసింది. అక్కడి నుంచి ఆంధ్రా-తెలంగాణ ప్రభుత్వ అధికారులు, నిరంతరం ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం, బోర్డు కూడా ఇరు రాష్ట్రాల నీటి వినియోగానికి సంబంధించి ఆదేశాలివ్వడంతో, రెండు రాష్ట్రాల నడుమ జలజగడం, పతాక స్థాయికి చేరిందన్న భావన ఏర్పడింది. ఆ క్రమంలో గత నెల 4,5వ తేదీల్లో కృష్ణా-గోదావరీ నీటి యాజమాన్య బోర్డు సమావేశాలు నిర్వహించాయి. అందులో   ఏపీ-తెలంగాణ ప్రభుత్వాలు డాక్యుమెంట్ల ద్వారా వినిపించిన వాదనలన్నీ, రెండు బోర్డులూ కేంద్రమంత్రిత్వశాఖకు పంపించాయి. ఆ ప్రకారంగా.. కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షన ఏర్పడిన అపెక్స్ కౌన్సిల్,  రెండు రాష్ట్రాల జల వివాదాలు పరిష్కరిస్తారని అంతా భావించారు.ఇది కూడా చదవండి: ఆంధ్రా-తెలంగాణ మధ్య ‘పానీ’పట్టు యుద్ధం?

నాడు ఉమాభారతి సమక్షంలో కేసీఆర్-బాబు భేటీ..

అక్కడి నుంచే అసలు కథ ప్రారంభమయింది. ఏవైనా  రాష్ట్రాల మధ్య అంత ర్రాష్ట జలవివాదాలు త లెత్తినప్పుడు,  కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన ఉన్న అపెక్స్ కౌన్సిల్, రెండు రాష్ట్రాల సీఎంలను పిలిచి సమస్య పరిష్కరిస్తుంటుంది. అయితే, అంతకంటే ముందు.. ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు సమావేశం తేదీ, అందులో చర్చించాల్సిన అంశాలకు సంబంధించిన మినిట్స్‌ను, కేంద్రజలశక్తి శాఖకు పంపించాల్సి ఉంటుంది. అది అందిన తర్వాతనే, కేంద్రమంత్రి ఆ తేదీన వారిని పిలిపించి, సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తారు. గతంలో ఉమాభారతి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో, కేసీఆర్-చంద్రబాబు సమక్షంలో అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించారు.ఇది కూడా చదవండి: ఒక ప్రాజెక్టుతో.. అన్ని పిట్టలను కొట్టిన జగన్ 

అపెక్స్ కౌన్సిల్‌కు హాజరయ్యే ఆలోచన లేదా..?

కానీ.. జలజగడంపై ఇప్పటివరకూ అధికారుల స్థాయిలో, ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్న రెండు రాష్ట్రాలు.. కీలకమైన అపెక్స్ కౌన్సిల్‌కు మినిట్, భేటీ కావలసిన తేదీని మాత్రం ఖరారు చేయకపోవడం బట్టి… ఆంధ్రా-తెలంగాణ మధ్య జరుగుతున్న జలజగడం అంతా బంతిపూలయుద్ధంగానే స్పష్టమయిపోయింది. నిజంగా తమ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై తాడోపేడో తేల్చుకోవాలనుకుంటే, అపెక్స్ కౌన్సిల్ ముందుకెళ్లి తీరాలి. మరి రెండు రాష్ట్రాల పాలకులలోనూ, అలాంటి సీరియస్‌నెస్ కనిపించడం లేదంటే.. ఈ పంచాయతీలు, ఆరోపణలు, పరస్పర ఫిర్యాదులన్నీ.. ఎవరికీ దెబ్బలు తగలకుండా జరుగుతున్న‘బంతిపూల యుద్ధం’గానే  అర్ధం చేసుకోవలసి ఉంటుంది. సమావేశం జరిగి నెలరోజులయి, జలవివాద వివరాలను నీటి యాజమాన్య బోర్డులు కేంద్రజలశక్తి మంత్రిత్వ శాఖకు నివేదించినా.. ఇప్పటివరకూ ఇద్దరు ముఖ్యమంత్రులు అపెక్స్ కౌన్సిల్ మినిట్స్ తేదీలను అందించడం లేదంటే.. కౌన్సిల్ ఎదుట హాజరయ్యే ఉద్దేశం లేదన్న అనుమానాలు విపక్షాల నుంచి వ్యక్తమవుతున్నాయి.ఇది కూడా చదవండి: ఏపీలో జగన్‌ను..  హీరోను చేసే ఎత్తుగడ? 

పోతిరెడ్డిపాడుపై పిడికిలి బిగించరేం..?

ఒకవైపు తెలంగాణ ప్రతిపక్షాలన్నీ పోతిరెడ్డిపాడుకు సంబంధించి, జగన్ ప్రభుత్వం ఇచ్చిన 203 జీఓపై కారాలు మిరియాలు నూరుతున్నాయి. జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ అనుమతి మేరకే ఆ జీఓ ఇచ్చారని ఆరోపిస్తున్నాయి. మరోవైపు రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు.. కృష్ణా-గోదావరి నదీ జల యాజమాన్య బోర్డుల వద్ద అటు ఇటు కూర్చుని, వాదనలతో పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. కానీ అసలు విషయం మాత్రం వ్యూహాత్మకంగా, లౌక్యంగా విస్మరిస్తుండటమే విస్మయం కలిగిస్తోంది. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ సర్కారు అంత తీవ్రంగా విరుచుకుపడి, బోర్డులకు ఫిర్యాదు చేస్తున్నప్పుడు.. ఆ అంశాన్ని ప్రతిష్టాత్మంగా భావించి, అపెక్స్ కౌన్సిల్ ఎదుటే పోతిరెడ్డిపాడుపై తాడోపేడో తేల్చుకోవాల్సిన కేసీఆర్ సర్కారు.. మౌనంగా ఉండటంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.ఇది కూడా చదవండి: ‘జలజగడం’ వార్తలకు ‘అధికారమీడియా’లో జాగా లేదా?

జగన్ సర్కారుపై ఫిర్యాదుకు జంకెందుకు?: లక్ష్మణ్

అపెక్స్ కౌన్సిల్‌కు మినిట్స్, తేదీ ఖరారు చేయకుండా, కేసీఆర్-జగన్ కుమ్మక్కయి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ కోవా లక్ష్మణ్ విరుచుకుపడ్డారు. ఇద్దరూ మీడియా ముందు ఉత్తుత్తి యుద్ధం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.  ‘పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని.. కేసీఆర్ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ ముందు వివరించి, ఏపీ ప్రభుత్వాన్ని ముద్దాయిగా నిలబెట్టకుండా, ఎందుకు మౌనంగా ఉందో  అర్ధం కావడం లేదు. ఆంధ్రా ప్రభుత్వం నిర్మించే పోతిరెడ్డిపాడు వంటి అక్రమ ప్రాజెక్టుల వ ల్ల, దక్షిణ తెలంగాణ ఎడారవుతోంది. దానిని ఆపకపోతే, దక్షిణ తెలంగాణ జిల్లాల ప్రజలు వలస వెళ్లిపోవలసిన దుస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ సీఎం కేసీఆర్, మీడియా ముందు ఏపీ ప్రభుత్వ అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడుతున్నారే తప్ప, అపెక్స్ కౌన్సిల్ ముందు వెళ్లేందుకు భయపడటం చూస్తే అనేక అనుమానాలు వస్తున్నాయి. అధికారులను పంపించి వాదిస్తున్న కేసీఆర్.. తానే స్వయంగా కేంద్రమంత్రి సమక్షంలో జరిగే అపెక్స్ కౌన్సిల్‌కు హాజరయి, తెలంగాణ ప్రయోజనాల కోసం ఎందుకు పోరాడటం లేదు? అపెక్స్ కౌన్సిల్ కోసం ఇప్పటిదాకా మినిట్స్, తేదీని ఎందుకు ఖరారు చేయలేకపోతున్నారు? అంటే కేంద్రం వద్ద పంచాయితీ జరిగితే, ఆంధ్రా సీఎం జగన్‌తో తనకున్న సంబంధాలు, వ్యాపార లావాదేవీలు దెబ్బతింటాయని భయపడుతున్నారా? లేక ఇద్దరూ సమస్యను, సొంతంగా పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తున్నారా? ఒకవేళ అదే నిజమైతే తెలంగాణ ప్రజలు దానిని అంగీకరించరు. ఇది కేసీఆర్ సొంత వ్యవహారం కాదు. తెలంగాణ ప్రజల చావుబతుకుల సమస్య. దక్షిణ తెలంగాణ జీవనపోరాటానికి సంబంధించిన సమస్య. పోతిరెడ్డిపాడు వల్ల, దక్షిణ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకునేందుకు.. కేసీఆర్ ఎందుకు అపెక్స్ కౌన్సిల్‌కు మినిట్స్, తేదీని ఖరారు చేయడం లేదో తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాల’’ని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ అంశంపై తమ పార్టీ, కేంద్రజలశక్తి శాఖ మంత్రికి ఫిర్యాదు చేసిందని,  ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎందుకు ఆ  ధైర్యం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.ఇది కూడా చదవండి: కాళేశ్వరం కష్టాల్లో జగన్!