నార్ల తాతారావు వారసుడొచ్చేశారు… !

దేవులపల్లి అమర్‌కు జెన్కో సలహాదారు
ప్రతిభకు పట్టం కట్టిన జగనన్న
విద్యుత్‌రంగ నిపుణుడికి వెలుగునిచ్చిన వైసీపీ సర్కారు
జమిలి పదవులిచ్చి గౌరవించిన జగన్
(మార్తి సుబ్రహ్యణ్యం- 970 5311144)
అది 1970 నాటి రోజులు. ఉత్తరప్రదేశ్‌లో హటాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచి, చిమ్మచీకటయిపోయింది. ఈ విషయం తెలిసిన ఇందిరాగాంధీ, నాటి మంత్రి కెసి పంత్‌కు ఫోన్ చేశారు. ‘తాతారావుజీని కాంటాక్టు చేయండి’. ఇదీ ఆమె నుండి అందిన సందేశం! వెంటనే పంత్.. తాతారావుకు ఫోన్ చేయడం, ఆ తర్వాత రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరింపబడటం జరిగిపోయింది. దటీజ్ నార్ల తాతారావు!! అలాంటి తాతారావును ఈ తరం మర్చిపోయింది.. కానీ.. ఆయన వారసుడు ఇప్పుడు జెన్కో సలహాదారు రూపంలో వచ్చేశారు. ఇక అంతా అద్భుతాలే!!!
ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని వెలిగించి, తన విశేషానుభవంతో విద్యుత్తు రంగాన్ని ఉన్నతస్థానంలో నిలబెట్టిన నార్ల తాతారావు తర్వాత.. అంతటి అనుభవం ఉన్న నిపుణుడు, ఇప్పుడు తెలుగుప్రజల ముందుకొచ్చారు. విద్యుత్‌రంగంలో విశేషానుభవం ఉన్న పూర్వ జర్నలిస్టు దేవులపల్లి అమర్‌కు, జగనన్న సర్కారు జెన్కో సలహాదారు పదవి ఇచ్చింది. ఆవిధంగా… ఆలస్యంగానయినా, ఒక విద్యుత్‌రంగ నిపుణుడి ప్రతిభకు పట్టం కట్టింది. ప్రస్తుతం ఏపీ సర్కారు జాతీయ మీడియా సలహాదారుగా ఉన్న దేవులపల్లి అమర్‌కు, ఏపీ జెన్కో సలహాదారు పదవి కూడా ఇచ్చి గౌరవించిన జగనన్న సర్కారుకు, విద్యుత్‌రంగ నిపుణులు కృతజ్ఞతలు చెబుతున్నారు.ఇది కూడా చదవండి.. సీఎస్ జీతం రెండున్నర..అమర్ జీతం మూడున్నర లక్షలట!
[pdf-embedder url=”http://35.226.7.53/wp-content/uploads/2020/07/2020-21-159.pdf”]
జర్నలిస్టు నుంచి జెన్కో సలహాదారు వరకూ..
దేవులపల్లి అమర్.. ఒక ప్పటి చేయితిరిగిన జర్నలిస్టు. పైగా జర్నలిస్టు సంఘ జాతీయ నాయకుడు కూడా. ఆంధ్రప్రభ, సాక్షి చానెల్లో సుదీర్ఘకాలం పనిచేశారు. అనేక జర్నలిస్టు ఉద్యమాలను ముందుండి నడిపించిన మహానేత. జనాలకు ఆయన గురించి అంతవరకే తెలుసు! కానీ, ఆయనలో దాగున్న విద్యుత్‌రంగ నిపుణుడిని గుర్తించింది మాత్రం ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి మాత్రమే. విద్యుత్‌రంగం గురించి సంపూర్ణ అవగాహన, దాని పుట్టుపూర్వోత్తరాలను పుక్కిట పట్టిన అమర్‌లోని విద్యుత్‌రంగ అనుభవశాలిని గుర్తించడం.. ఇప్పటివరకూ ఉమ్మడి, విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రులకు సాధ్యం కాలేదు. ఆ ఘనత జగనన్న ఒక్కరికే దక్కింది! అందుకే మట్టిలోని మాణిక్యాన్ని వెలికితీసినట్లు.. అమరన్నలోని విద్యుత్‌రంగ వైభవాన్ని జెన్కోకు వినియోగించుకోవాలన్న మహత్తర ఆలోచనతో, ఆయనకు ఆ సంస్థ సలహాదారు పదవి కట్టబెట్టారు. ఇప్పటివరకూ జెన్కో పుట్టిన తర్వాత బయట వ్యక్తులెవరికీ సలహాదారు పదవి ఇచ్చిన దాఖలాలు ‘జనరేటర్లు’ వేసినా కనిపించవు. ఏదేమైనా.. ప్రపంచానికి తెలియని విద్యుత్‌రంగ నిపుణుడిని పరిచయం చేసిన జగనన్నకు, తెలుగు ప్రజలు రుణపడి తీరాల్సిందే. అమరన్న విద్యుత్‌రంగ నిపుణుడని తెలిస్తే.. బహుశా సొంత రాష్ట్రమైన తెలంగాణ సర్కారు ఆయనను వదులుకునేది కాదేమో?! ఏదేమైనా, అలాంటి అవకాశం ఇప్పుడు ఆంధ్రాకు దక్కడం ప్రజల అదృష్టం.ఇది కూడా చదవండి.. అమరన్నను తొలగించాలా? రామయ్యా.. అత్యాశ పనికిరాదయ్యా?
ప్రశంసలతోపాటు.. విమర్శలు కూడా..
సరే.. ప్రతి విషయంలోనూ ప్రశంసలతోపాటు, విమర్శలు కూడా వినిపిస్తుంటాయనుకోండి. ఆ విషయం జర్నలిస్టుగా పనిచేసిన అమరన్నకూ తెలియనిది కాదు. ఆ ప్రకారంగా.. అసలు విద్యుత్ రంగం గురించి ఏమాత్రం అవగాహన లేని దేవులపల్లి అమర్‌కు జెన్కో సలహాదారు పదవి ఇస్తారని అటు విద్యుత్‌శాఖ అధికారులు, ఇటు ఇతర వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. సలహాదారంటే, ఆయా రంగంలో అనుభవం ఉన్న వారని అర్ధం. మిగిలిన విభాగాల్లో సలహాదారులుగా ఎవరిని నియమించినా పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ, విద్యుత్, సాగునీటి, పర్యాటక, న్యాయ, విద్యాశాఖల్లో చేసే నియామకాలు మాత్రం.. ఆయా రంగంలో అనుభవం ఉన్నవారే కనిపిస్తారు. సీఎంసీపీఆర్‌ఓ, సమాచారశాఖ, వీటితోపాటు విద్యుత్ సంస్థలకు ఇప్పటికే పీఆర్వోలు ఉన్నారు. వీరు కాకుండా జెన్కో సీఎండీ సాయిప్రసాద్, ఎండి శ్రీధర్ ఉండనే ఉన్నారు. జెన్కో గురించి వీరు తరచూ మీడియా సమావేశాలు, పత్రికా ప్రకటనలు విడుదల చేస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు సలహాదారుగా వచ్చిన అమర్ కొత్తగా చేసేదేమిటి? జెన్కో తయారుచేసిన విద్యుత్‌ను, కొంత లాభానికి ట్రాన్స్‌కోకు అమ్మేస్తుంది. ట్రాన్స్‌కో మరికొంత లాభాలు చూసుకుని డిస్కంలకు ఇస్తుంది.ఇది కూడా చదవండి.. జై తెలంగాణ.. జైజై జగన్!
జెన్కోకు మాత్రమే ఎందుకు..?
అసలు జెన్కోకు నేరుగా వినియోగదారులతో సంబంధం ఉండదు. టారిఫ్, చెల్లింపులు, విద్యుత్ కోతల వివరాలన్నీ ఎలాగూ ట్రాన్స్‌కో ప్రకటిస్తూనే ఉంది. వాటికి సంబంధించిన వివరాలతోపాటు.. విద్యుత్‌రంగంలో ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మకమార్పులు, పొదుపు, సోలార్ వంటి నూతన విధానాలు, ఒప్పందాలు, సెమినార్లు, సంస్థకు వస్తున్న అవార్డుల వివరాలన్నీ ఒక సీనియర్ అధికారి, రెండున్నర దశాబ్దాల నుంచి మీడియాకు అందిస్తున్నారు. ఆయన, వైఎస్ సీఎంగా ఉన్నప్పటి నుంచీ అటు ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తూనే, ఇటు విద్యుత్‌రంగ వివరాలకు సంబంధించిన కథనాలు అందిస్తూనే ఉన్నారు. వైఎస్ ప్రత్యేకించి విద్యుత్‌రంగ వ్యవహారాలను ఆయనకే అప్పగించారు. చివరకు చంద్రబాబు సీఎంగా ఉన్న గత ఐదేళ్ల కాలంలోనూ, ఆ బాధ్యత ఆయనకే అప్పగించారు. విద్యుత్‌రంగంలో చీమచిటుక్కుమన్నా, వాటి విశేషాలను కథనం రూపంలో అందించడంలో ఆ అధికారి నిష్ణాతుడు. ప్రత్యేకించి ప్రతి ఆదివారం ముఖ్యమంత్రులతో.. విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్సులు ఏర్పాటుచేయడం, దానిని ఓ కథనం ద్వారా మీడియాకు విడుదల చేయడం ఒక ఆనవాయితీగా ఉండేది. వీటితో జెన్కోకు ఏమాత్రం సంబంధం ఉండదు. దాని పని కేవలం విద్యుత్ ఉత్పత్తిమాత్రమే.ఇది కూడా చదవండి.. గిరీశానికే గురువులు!
కొత్తగా వచ్చి ఉద్ధరించేదేమిటి?
పైగా జెన్కో పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. కొన్ని కంపెనీలకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఆర్టీపీపీని అమ్మేసే ఆలోచనలో ఉంది. ఇన్ని సినిమా కష్టాలు ఎదుర్కొంటున్న జెన్కోను, దేవులపల్లి వారు వచ్చి కొత్తగా ఉద్ధరించేదేమిటి? అంటే జెన్కోను లాభాలబాట నడిపించేందుకు, తన ‘విద్యుత్‌రంగ విశేషానుభవాన్ని’ రంగరించి సలహాలిస్తారా? విద్యుత్ ఉత్పత్తికి మెరుగైన సలహాలు ఇస్తారా? ఆర్టీపీపీని అమ్మకుండా అడ్డుచక్రం వేస్తారా? అసలు ఈ అదనపు పదవిలో ఆయన వేతనం తీసుకుంటారా? కేవలం భత్యాలతో సరిపుచ్చుకుంటారా? లేక పూర్తి ఉచిత సేవనా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే, ఇదంతా ఆయనను ట్రాన్స్‌కోలో మాదిరిగా.. బయట నుంచి డైరక్టర్‌గా నియమించేందుకు జరుగుతున్న, ముందస్తు ప్రణాళికేనని అంటున్నారు. నిజం ‘జగన్నా’ధుడికెరుక?