రాజకీయాల నుంచి.. రుద్రాక్షల  వరకూ..!

615

వ్యవసాయక్షేత్రంలో అద్భుతాలు పండిస్తున్న కాట్రగడ్డ ప్రసూన
(మార్తి సుబ్రహ్మణ్యం)

అనర్గళ ప్రసంగం ఆమె సొంతం. విషయ పరిజ్ఞానానికి కొదువలేదు. ఆర్ధిక శాస్త్రంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌నే మెప్పించిన ఒకప్పటి అర్ధశాస్త్ర విద్యార్ధిని. పిన్న వయసులోనే ఝంఝామారుతం లాంటి ప్రసంగంతో, నందమూరి తారకరాముడిని మెప్పించిన మహిళా నేత. తెలుగురాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన తెలుగుదేశం పార్టీలో, ఒకప్పటి ఫైర్‌బ్రాండ్ ఆమె. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైన తొలి తెలంగాణ మహిళా శాసనసభ్యురాలు. సాహిత్య, కళా రంగాల్లో ప్రావీణ్యం ఉన్న ఆమె ఇప్పుడు.. తన వ్యవసాయక్షేత్రంలో అద్భుతాలు పండిస్తున్నారు. రాజకీయాల్లో పనిచేస్తూ వివిధ చానెళ్లలో తెలుగుదేశం పార్టీ వాణి వినిపిస్తూనే, మరోవైపు వ్యవసాయక్షేత్రంలో అరుదుగా లభించే ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, పంచముఖి రుద్రాక్షలు పండిస్తున్న ఆమె.. ఇప్పుడు, తెలంగాణలో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఒకప్పటి ఆ ఫైర్‌బ్రాండ్ పేరే సనత్‌నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన.

చిన్నవయసులో పెద్ద బాధ్యతలు..

రెండు పదుల వయసులోనే.. లెక్చరర్‌గా పనిచేస్తున్న ప్రసూన, ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరారు. తన అద్భుత ప్రసంగంతో అన్న గారిని ఆకట్టుకున్న ఆమె, 1983 ఎన్నికల్లో  సనత్‌నగర్ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో కాట్రగడ్డ ప్రసూన, నన్నపనేని రాజకుమారి, గ్రంధి మాధవి, గంటెల సుమన, త్రిపురాన వెంకటరత్నం, సక్కుబాయి, ఝాన్నీలక్ష్మి, కత్తుల శ్యామల, ప్రతిభాభారతి వంటి మహిళా ఎమ్మెల్యేలంటే విపక్షాలకు హడల్. వీరిలో ఒకరిద్దరు మినహా మిగిలినవారంతా ఉన్నత విద్యావంతులే.

రాజధాని నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఫైర్‌బ్రాండ్ కాట్రగడ్డ ప్రసూనది వీరందరికల్లా విభిన్న శైలి. అర్ధశాస్త్రంలో పట్టభద్రురాలైన ఆమె, మన్మోహన్‌సింగ్ ప్రొఫెసర్‌గా పనిచేసిన ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో ఇంటర్నల్‌షిప్ చేశారు. కుమారమంగళం, హరీష్‌రావత్, లలితమకేన్‌లతో కలసి కార్మిక ఉద్యమాలు నిర్వహించారు. నగరంలోని భెల్, ఆల్విన్, ఏపి స్కూటర్, బేక్‌లెట్‌హైలెమ్, అంబికాపెట్రో కెమికల్స్, ఉషా శ్రీరాం కంపెనీలలో కార్మిక నేతగా పనిచేశారు.  విదేశాంగ విధానం, వ్యవసాయం, కుల వ్యవస్థపై సంపూర్ణ అవగాహన ఉన్న ఆమె ప్రతిభకు ఎన్టీఆర్ అచ్చెరొందేవారు. ప్రధానంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతోపాటు, భారతదేశంలో కమ్మ సామాజిక పుట్టుపూర్వోత్తరాలు, చరిత్రపై ప్రసూనకు మంచి పట్టు ఉంది. ఆచార్య ఎన్జీరంగా ఆలోచనలపై అనేక వ్యాసాలు రాశారు. మంత్రి కాకపోయినా వివిధ పెద్ద దేవాలయాలకు పట్టువస్త్రాలు సమర్పించిన ఘనత ఆమెది.

ప్రతిభ ఉన్నా లభించని గుర్తింపు..

రాష్ట్ర విభజనకు ముందు జరిగిన తెలంగాణ ఉద్యమంలో ప్రసూన ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆంధ్రా తమ పుట్టినిల్లయితే, తెలంగాణ తమ మెట్టినిల్లని, తెలంగాణలో స్థిరపడిన ప్రతి ఆంధ్రుడూ తెలంగాణవారేనని విస్పష్టంగా ప్రకటించిన ధీశాలి ఆమె. ఇంత ప్రతిభ ఉన్న ప్రసూనకు వయసు కారణంగా అప్పట్లోనే రాజ్యసభ అవకాశం తప్పిపోయింది. ఎన్టీఆర్ హయాంలో రాణించిన ఆమె, తర్వాత కాంగ్రెస్‌లో అధికార ప్రతినిధి, బీజేపీలో ప్రత్యేక ఆహ్వానితురాలుగా పనిచేశారు. కారణం తెలియదు గానీ.. చంద్రబాబునాయుడు సారధ్యంలోని టీడీపీలో,  ఆమెకు రావలసినంత గుర్తింపు, అవకాశాలు దక్కలేదు. కారణం కమ్మ సామాజికవర్గానికి చెందడమే అప్పట్లో ఆమె అవకాశాలు దెబ్బతీశాయంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరేళ్లకు గానీ, ఆమెకు తెలంగాణ టీడీపీ కమిటీలో స్థానం దక్కలేదంటే.. ప్రతిభ కూడా ఒక్కోసారి ప్రతిబంధకమవుతుందని అర్ధమవుతోంది. ప్రస్తుతం తెలంగాణ టీడీపీ రాష్ట్ర కమిటీలో ఉన్న వారిలో 90 శాతం, ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన వారే.

రుద్రాక్ష..లిచీ పెంపకంతో వార్తల్లో వ్యక్తిగా మారిన ప్రసూన..

అయితే.. వ్యవసాయరంగంపై ఉన్న ఎక్కువ మక్కువతో, ప్రసూన చేసిన ఆలోచన ఇప్పుడు ఆమెను తెలంగాణలో వార్తల్లో వ్యక్తిని చేసింది. దుండిగల్‌లోని తన వ్యవసాయక్షేత్రంలో, ఆమె పండిస్తున్న అరుదైన రుద్రాక్ష పంటకు ఇటీవలి కాలంలో మీడియా విపరీతమైన ప్రచారం కల్పించింది.  దానితో అంతా ఆ వ్యవసాయక్షేత్రం వైపు అడుగులు వేస్తున్నారు. సమీకృత వ్యవసాయంలో భాగంగా, సేంద్రీయ వ్యవసాయం జోడించి ఆమె..  నేపాల్ రుద్రాక్ష, లవంగాలు, యాలకులు, స్టార్‌ఫ్రూట్, లిజీ, అవకాడో పంట పండిస్తున్నారు. రుద్రాక్షలు నేపాల్‌లో ఎక్కువగా పండుతుండగా, లిచీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తుంటారు. యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు ఇప్పుడు ప్రసూన పెంచుతున్న వ్యవసాయక్షేత్రంలో కనిపిస్తుంటాయి. ఇక్కడ పండుతున్న లిచీ ఉత్తరప్రదేశ్‌లో పండే లిజీ కన్నా తియ్యగా ఉంటుందన్న  పేరుంది.  ప్రస్తుతం ఈ వ్యవసాయ క్షేత్రంలో ప్రతి ఏటా 150 కిలోల లిచీ దిగుబడిస్తోంది. ఒక్కో చెట్టు నుంచి 10 కిలోల రుద్రాక్ష దిగుబడి వస్తుంది. పైగా అంజీర్‌లా కనిపించే ఈ రుద్రాక్షలు పండ్లుగా మారి మంచి సువాసనలిస్తాయి.

సీఎం కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో..

‘సీఎం కేసీఆర్ వ్యవసాయ అనుకూల నిర్ణయాలతో యువత కూడా ఇప్పుడు ఈ రంగంవైపు వస్తోంది. నా కూతురు కరణం అంబికాకృష్ణ కూడా విభిన్నరకాల మొక్కలు తెచ్చి పెంచుతోంది. మాది వ్యవసాయ కుటుంబం కావడం, నేను అగ్రి ఎకానమిస్టును కావడంతో రుద్రాక్ష, లిచీ వంటి పంటలపై దృష్టి సారించా. యువత సమయం వృధా చేసుకోకుండా ఇలాంటి సరికొత్త వ్యవసాయంపై దృష్టి పెడితే, మనం వేటినీ ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవలసిన అవసరం లేదు. తెలంగాణ భూమి ఎలాంటి పంటకయినా అనుకూలంగానే ఉంటుంది.  తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకుంటున్న వ్యవసాయ అనుకూల విధానాలు ఫలితాలిస్తున్నాయి. ప్రభుత్వాలు పారిశ్రామిక విధానానికి ఇచ్చే ప్రాధాన్యాన్ని వ్యవసాయం వైపు మళ్లిస్తే, ఆర్ధిక పురోగతి అద్భుతంగా ఉంటుంద’ని కాట్రగడ్డ ప్రసూన చెప్పారు. తన వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్న ఈ పంటల గురించి ఇటీవలి కాలంలో మీడియాలో రావడంతో, అనేకమంది ప్రముఖులు తనకు ఫోన్లు చేసి అభినందించి, వివరాలు అడుగుతున్నారని చెప్పారు. వ్యవసాయం చేస్తున్నప్పటికీ, రాజకీయాలలో క్రియాశీలకంగానే ఉన్నానని, తనకు రాజకీయ జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీని, తెలంగాణలో కీలక స్థానంలో నిలపాలన్నదే తన ఆశయమని చెప్పారు. ఆల్ ది బెస్ట్!