కులానికీ.. కేసులకు ఏం సంబంధం బాబూ?

525

అచ్చెన్న, రవీంద్ర అరెస్టులపై కులం కోణం
నేరం ప్రధానమా? కులం ప్రధానమా?
అగ్ర వర్ణాలకు మాత్రమే కేసులు పరిమితమా?
జెసి అరెస్టులో కులం కార్డు వాడలేదేం?
కులంకోణం వదిలితేనే  టీడీపీకి భవిష్యత్తు
              (మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

‘‘అచ్చెన్నాయుడు బీసీ అయినందుకే ఆయనపై కేసులు పెట్టి జైలుకు పంపించారు’’
‘‘ కొల్లు రవీంద్ర బీసీ అయినందుకే ఆయనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు’’
‘‘ బీసీ నేతలపై జగన్‌రెడ్డి సర్కారు కక్ష సాధిస్తోంది. ఇది బీసీల వ్యతిరేక ప్రభుత్వం’’
–  ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలివి.


ఈఎస్‌ఐ కుంభకోణంలో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు, మచిలీపట్నం రౌడీషీటర్ హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరు మాజీ మంత్రులూ బీసీ వర్గానికి చెందిన వారే. కేవలం బీసీలయినందుకే వాళ్లిద్దరినీ అకారణంగా అరెస్టు చేసి, జైలుకు పంపించారన్నది టీడీపీ అభియోగం. నిజానికి ఈ ఆరోపణలలో పెద్దగా పస కనిపించడం లేదు. మందుల కొనుగోలుకు సంబంధించి అచ్చెన్నాయుడు సిఫార్సు చేశారని అధికారులు విచారణలో వెల్లడించారు. కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే, రౌడీషీర్‌ను హత్య చేశామని  నిందితులే బయటపెట్టారు. ఇక ఇందులో  ఇక్కడ కులం కోణం ఎక్కడుందన్నది సహజంగా వినిపించే ప్రశ్న.

అచ్చెన్నాయుడంటే, అసెంబ్లీలో-బయట సర్కారును నిలదీస్తున్నారన్న కక్షతో ఆయనను ఇరికించారనుకోవచ్చు. కానీ, కొల్లు రవీంద్ర ఇప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు. పరాజయం తర్వాత ఆయన పత్రికాప్రకటనలకే పరిమితమయ్యారు. జిల్లా రాజకీయాల్లో కూడా ఆయన పెద్దగా యాక్టివ్‌గా లేరు. మరి అలాంటప్పుడు, ఆయనపై అక్రమ కేసులు బనాయించినందు వల్ల, పాలకపక్షానికి వచ్చే లాభమేమిటన్నది మరో ప్రశ్న. అచ్చెన్నాయుడు వద్ద కార్యదర్శులుగా పనిచేసిన ఇద్దరి పాత్రలపై ఇంకా విచారణ జరుగుతోంది. మరి వారిద్దరివీ వేర్వేరు కులాలు. ప్రస్తుత ప్రభుత్వంలోనే వారు పనిచేస్తున్నారు. ఒకవేళ వారిని అరెస్టు చేస్తే, అప్పుడు కూడా వారి పక్షాన,  విపక్షాలు ఇలాగే  కులం కార్డు వాడతాయా?

ఎందుకంటే.. ఇప్పుడు ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్టయిన నాటి డైరక్టర్ల కులం గురించి ప్రతిపక్షం ఎక్కడా మాట్లాడటం లేదు.  సంఘటనలు, కేసుల కోణంలో చూస్తే.. మాజీ మంత్రుల  పక్షాన సంధిస్తున్న కులం కార్డు, ఆయా కులాలను తాకుతుందనుకోవడం భ్రమే అవుతుంది. గతంలో మోపిదేవి వెంకటరమణ అరెస్టయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన పోటీచేస్తే, మోపిదేవి సామాజికవర్గం వారు ఆయనను గెలిపించలేదు. నిజంగా కులం కార్డు వాడితే ఉపయోగం ఉందనుకుంటే.. అప్పుడు వైసీపీ కూడా బీసీ నేతను అకారణంగా అరెస్టు చేశారని ఆరోపించింది. మరి అవి నిజమైతే, ఆయన గెలిచితీరాలి కదా? మరెందుకు ఓడిపోయారన్నది ప్రశ్న. అయితే, ఈ వ్యవహారాల్లో  ప్రభుత్వ ఒత్తిళ్లు ఉండవని చెప్పలేం.

ఒకవేళ టీడీపీ వాడుతున్న కులం కార్డు నిజమైతే.. బీసీలను జగన్‌రెడ్డి  వేధిస్తున్నారనుకుంటే, హత్యకు గురైన వ్యక్తి కూడా బీసీనే. మరి ఆ ప్రకారంగా.. ఒక బీసీని హత్య చేయడాన్ని సమర్ధించకూడదు కదా? అతనిని హత్య చేసిన వారిని శిక్షించాలనే కదా, ఒక ప్రతిపక్షంగా డిమాండ్ చేయాలి? ఇప్పుడు మరి పోలీసులు అదే కదా చేసింది? అంటే మృతుడి కులం బీసీ అయినా.. అందుకు కారణమని ఆరోపించబడిన తమ పార్టీ బీసీనే నిజమైన బీసీ అని  భావించాలా? పార్టీలిచ్చే తీర్పులోనే ఇంత పక్షపాతం కనిపించకూడదు కదా? అదే నిజమైతే.. ఇటీవల పోలీసులపై కుక్కలు వదిలిన పీవీపీని, కమ్మ వాడయినందుకే వేధిస్తున్నారని కమ్మ సంఘాలు, గతంలో జగన్ రెడ్డి అయినందుకే ఆయనను అరెస్టు చేశారని రెడ్డి సంఘాలు యాగీ చేసి ఉండేవి. ఈ లాజిక్కులు, కులం కార్డులు ఎందుకూ పనికిరావు. గతంలో జగన్మోహన్‌రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో తనను కాంగ్రెస్-టీడీపీ అన్యాయంగా ఇరికించాయని ఆరోపించారే తప్ప, తాను అక్రమ ఆస్తులు సంపాదించుకోలేదని మాత్రం ఈనాటికీ చెప్పలేకపోతున్నారు. అదే అచ్చెన్నాయుడు ఈఎస్‌ఐ కుంభకోణంలో తాను ఎవరికీ సిఫార్సు చేయలేదని మాత్రం చెప్పలేకపోవడం చూస్తే.. అసలు విషయాలు కప్పిపుచ్చి, కొసరు విషయాలే తెరపైకి తెస్తున్నారని అర్ధమవుతోంది.

గతంలో చిలకలూరిపేట బస్సు దహనం కేసులో అమాయకులను చంపారన్న కారణంగా నిందితులను శిక్షించారే తప్ప, వారంతా ఫలానా కులం వారని కాదు కదా? నీరుకొండ, పదిరికుప్పం, కారంచేడు ఘటనలు కూడా ఇందుకు మినహాయింపు కాదు కదా? ఒక  హర్షద్‌మెహతా, మరో చార్లెస్ శోభరాజ్, ఇంకో జగన్మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి, సత్యం రామలింగరాజు, తిక్కవరపు వెంకట్రామిరెడ్డి.. ఇలాంటి వారంతా నేరం చేసినందుకు, జైలుకు పంపించబడిన వారే తప్ప, వారంతా ఫలానా కులం వారన్న కారణంతో అరెస్టు కాబడినవారు కాదన్నది.. ఈ ఆధునికయుగంలోనూ తెలుసుకోలేకపోవడమే పిచ్చితనం. నిజంగా అరెస్టు కాబడిన వారందరి పక్షాన కులం కార్డులు వాడుతూ పోతే.. ఇప్పుడు జైళ్లలో ఉన్న వారి కోసమూ రాజకీయ పార్టీలు పోరాడాలి. పోరాడతారా మరి?!

సరే.. బీసీలను వేధిస్తున్నారంటూ  కులం కార్డును తెరపైకి తెస్తున్న టీడీపీ నాయకత్వం.. అనంతపురంలో అరెస్టయిన జెసి ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడి వ్యవహారంలో అదే కులం కార్డు ఎందుకు వాడలేదన్నది ప్రశ్న. ఆ పాలిసీ ప్రకారమయితే, రెడ్లపై ప్రభుత్వం దాడులు చేస్తోందని ఆరోపించాలి కదా? పోనీ, టీడీపీలో ఉన్న రెడ్లను వేధిస్తుందని ఆరోపించాలి కదా? మరెందుకు ఆ పనిచేయలేదు?  కొద్దినెలల క్రితం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డికి సంబంధించిన భూ ఆరోపణలపై కులం కోణంలోనే ఎందుకు స్పందించలేదు? నిమ్మగడ్డ రమేష్ తొలగింపు వ్యవహారంలో కమ్మవారిపై వేధింపులకు దిగుతున్నారని ఎందుకు ఆరోపించలేదు? ఎల్వీ సుబ్రమణ్యంపై వేటు వేసినప్పుడు నిజాయితీగల అధికారి అని చెప్పారే గానీ, ఆయన బ్రాహ్మణుడయినందుకే తొలగించారని ఎందుకు ఆరోపింలేదు? సోషల్‌మీడియాలో పోస్టు పెట్టిందన్న కారణంతో ఒక వృద్ధురాలిపై కేసు పెట్టారు. ఆ సందర్భంలో ఆమెను ఒక వృద్ధురాలిగా ప్రచారం చేశారే తప్ప, కమ్మ వర్గానికి చెందిన వారిపై కక్ష సాధిస్తున్నారని ఎందుకు చెప్పలేకపోయారు? ఇలాంటి కేసులోనే గంటా శ్రీనివాసరావు ఆత్మ అయిన ఆయన  అనుచరుడిని అరెస్టు చేసినప్పుడు కూడా, కమ్మ వర్గంపై దాడులు చేస్తున్నారని ఎందుకు యాగీ చేయలేదన్న ప్రశ్నలు టీడీపీ నాయకత్వం ముందు నిలిచాయి.

అదే విశాఖలో డాక్టర్‌పై పోలీసులు దాడి చేసినప్పుడు, ఆయన దళితుడైనందుకే కేసులు పెట్టారని ఇదే టీడీపీ నాయకత్వం ఆరోపించింది. మాజీమంత్రులు యనమల, అయ్యన్నపాత్రుడుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు కూడా బీసీ కార్డు సంధించింది. యూనివర్శిటీ అధికారి విషయంలో కూడా, ఇదే వ్యూహం అనుసరించిన టీడీపీ నాయకత్వం.. అగ్రకులాలపై దాడులు, కేసులు పెట్టిన సందర్భంలో.. అదే కులం కార్డు ఎందుకు వాడటం లేదన్నది ప్రశ్న. అంటే అగ్రకులాల కార్డు వాడితే ఫలితం ఉండక పోగా, మిగిలిన కులాలు ఏమైనా అనుకుంటాయన్న భయమా? కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్డు వాడితేనే అంతా స్పందిస్తారన్న అంచనాయే నిజమయితే.. మరి రాజకీయాల్లో కొనసాగుతూ దాడులు, కేసులకు గురవుతున్న  అగ్రకుల నేతలు… వారి వాదన వారే  వినిపించుకుని, వారి చావు వారే చావాలన్నదేనా రాజకీయ పార్టీల సిద్ధాంతం? రాజకీయపార్టీల్లో కొనసాగుతున్న అగ్రకుల నేతలు సంధిస్తున్న ఈ ప్రశ్నలకు జవాబిచ్చే ధైర్యం పార్టీల నాయకత్వాలకు ఉన్నాయా?