గోదావరిలో ‘రాజు’కుంటున్న అసంతృప్తి!

485

రఘురామకృష్ణంరాజుకు బాసటగా గోదావరి రాజులు
గతంలో సత్యం రామలింగరాజునూ వేధించారు
వైసీపీ చర్యలపై రగులుతున్న ఆగ్రహం
పాలిమర్స్ ప్రతినిధులు, పీవీపీలకు అపాయింట్‌మెంటా?
వాస్తవాలు చెబితే వేటు వేస్తారా?
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపిస్తామంటున్న రాజులు
                        (మార్తి సుబ్రహ్మణ్యం)

నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వేటు వేసేందుకు శరవేగంగా అడుగులు వేస్తున్న వైసీపీ నాయకత్వంపై.. ఉభయ గోదావరి,  ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన రాజులు కారాలు మిరియాలు నూరుతున్నారు. లోక్‌సభ స్పీకర్‌ను కలసి రఘురామకృష్ణంరాజుపై వేటు వేయాలన్న వైసీపీ నాయకత్వం సిఫార్సు.. గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలలో అత్యంత  ప్రభావితమైన క్షత్రియ సామాజికవర్గం, ఆయనకు అనుకూలంగా ఏకతాటిపై వచ్చేందుకు కారణమయింది. తమ సామాజికవర్గంపై జగన్ కక్ష కట్టినట్లు వ్యవహరిస్తుండటాన్ని, సగటు క్షత్రియుడు సహించలేకపోతున్నట్లు క్షత్రియ సంఘాల నేతల ఆగ్రహం స్పష్టం చేస్తోంది. దీనిపై ఇప్పటికే భీమవరం వేదికగా రెండుసార్లు అంతర్గత సమావేశం జరిగినట్లు సమాచారం. లోక్‌సభ స్పీకర్‌కు రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదు ఇచ్చిన తర్వాత, మరోమారు భవిష్యత్తు కార్యాచరణపై భేటీ కావాలని తీర్మానించుకున్నట్లు తెలిసింది.

ఆ జిల్లాలలో వారే రా‘రాజులు’..

ఏపీలో క్షత్రియ సమాజం సంఖ్య ఎంత తక్కువో, నాలుగు జిల్లాల్లో  ప్రభావం చూపే స్థాయి మాత్రం ఎక్కువ. ప్రధానంగా  పశ్చిమ-తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో రాజకీయ-వ్యాపార రంగాల్లో రాజులదే పైచేయి. ఆక్వా, రియల్ ఎస్టేట్, నిర్మాణ, విద్యారంగాల్లో వారిది ప్రముఖపాత్ర. ఫైనాన్స్ వ్యాపారాల్లో కూడా వీరు కనిపిస్తుంటారు. భీమవరం, పాలకొల్లు, ఆచంట, ఉంగుటూరులో అధికంగా; నర్సాపురం, తణుకు, చింతలపూడిలో ఒకమాదిరిగా వీరి ప్రభావం ఉంది. తూర్పు గోదావరిలో ముమ్మడివరం, రాజోలులో అధికంగా; అమలాపురం, పి.గన్నవరం, పిఠాపురం, రంపచోడవరం; కడపలో రాజంపేట,  రాయచోటిలో ఒక మాదిరి ప్రభావం చూపిస్తారు. ఇక విశాఖ నార్త్, యలమంచిలిలో రాజుల ప్రాబల్యం బలంగా ఉంది. విజయనగరంలో చీపురుపల్లి, విజయనగరం, కృష్ణా జిల్లాలో కైకలూరు, గుంటూరులో బాపట్ల, చిత్తూరులో నగరి,  నియోజకవర్గాల్లో రాజుల ప్రభావం అధికంగా ఉంటుంది. ప్రస్తుత లోక్‌సభలో రఘురామకృష్ణంరాజు, శాసనసభలో ప్రసాదరాజు, మంతెన రామరాజు, మంత్రి రంగరాజు, కన్నబాబురాజు; మండలిలో మంతెన సత్యనారాయణరాజు (పాందువ శ్రీను), వామపక్ష సభ్యుడు రఘువర్మ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

పరకాల శేషావతారం పుణ్యాన.. ఆక్వాలో రా‘రాజు’లయిన వైనం..

నర్సాపురం పార్లమెంటు స్థానంలో క్షత్రియపుత్రులను కాదని గెలిచిన వారు బహు తక్కువ. బాబు హయాంలో సుబ్బారాయుడు, హరిరామజోగయ్య, కోట్ల హయాంలో శేషగిరిరావు మాత్రమే రాజులకు వ్యతిరేకంగా నిలిచారు.  కాపుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ, రాజు అభ్యర్ధి పోటీ చేస్తే విజయలక్ష్మి వరించేది మాత్రం క్షత్రియ పుత్రుడినే. ఆ ప్రకారం చూస్తే.. రాజుల ప్రాధాన్యం ఏమిటన్నది సుస్పష్టం. ఇక పశ్చిమ-తూర్పు గోదావరి జిల్లాలలో  కూడా ఖరీదైన ఆక్వా ఎగుమతులు, చేపలు, రొయ్యల చెరువుల సాగు, దానికి సంబంధించిన వ్యాపారాలలో క్షత్రియులే ముందున్నారు. దానికి కారణం ప్రభుత్వ మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్ తండ్రయిన,  నాటి మంత్రి దివంగత పరకాల శేషావతారం! ఆయన హయాంలో గంగపుత్రులకు రొయ్యలు, చేపల సాగు కోసం.. నాటి కలెక్టర్ దానం ద్వారా భూములు, రుణాలు ఇప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, ఆ సామాజికవర్గం వారెవరూ ముందుకురాకపోవడంతో, క్షత్రియులే ముందుకొచ్చారు. దాని ఫలితమే రాజులు అనుభవిస్తున్న ఈ సంపద!

అక్కడ రాజులే దిక్కు..

ఏ ఎన్నికలొచ్చినా రాజకీయపార్టీలకు రాజులే కల్పతరువు. వారికి పార్టీ నిధులు ఇవ్వాల్సిన అవసరం లేకపోగా, మిగిలిన అభ్యర్ధులకూ వారే నిధులు సర్దుబాటు చేస్తుంటారు. కేవలం కొన్ని నియోజకవర్గాలను కేంద్రంగా చేసుకుని, రెండు జిల్లాలలో రాజకీయాలను శాసించే సామాజికవర్గమైన క్షత్రియులకు, ఢిల్లీతో చాలాకాలం నుంచి సత్సంబంధాలున్నాయి. ఈ వర్గం నుంచి కేంద్రమంత్రిగా పనిచేసిన తొలి నేత, సినీ హీరో కృష్ణంరాజు కావడం విశేషం. అయితే.. సహజంగా  క్షత్రియులకు ఉండాల్సిన ఆవేశం,  పోరాటతత్వం గోదావరి జిల్లాల రాజుల్లో కనిపించదు. మాటకారితనం, చతురత, లౌక్యం, భేషజాలకు పోకుండా నలుగురితో సులభంగా కలసిపోయే గుణాలున్న గోదావరి రాజులు ఎవరితో ఘర్షణలకు దిగరు. అందుకే వారికి కాపులు తప్ప, అన్ని సామాజికవర్గాలు మద్దతునిస్తుంటాయి.  కమ్మసామాజికవర్గం మాదిరిగా క్షత్రియులలో  వ్యాపారదృక్పథమే ఎక్కువ. ఏదైనా ఒక సమస్య వస్తే పార్టీలకు అతీతంగా వ్యవహరించే క్షత్రియులు, ఇప్పుడు రఘురామకృష్ణంరాజు విషయంలో కూడా, ఒక్కతాటిపైకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

రాయలసీమలోనూ మెరుస్తున్న రాజులు..

ఉభయ గోదావరి  జిల్లాలలో సూర్య వంశ, నెల్లూరు నుంచి రాయలసీమ వరకూ చంద్రవంశ రాజుల సంఖ్య బాగానే ఉంది. ప్రధానంగా సీమలో బలిజలకు కొంచెం అటు ఇటుగా.. అంటే దాదాపు 25 నియోజకవర్గాల్లో విజయాన్ని నిర్దేశించే స్ధాయిలో చంద్రవంశ రాజుల సంఖ్య ఉంటుంది. నెల్లూరులో ఉండే చంద్రవంశ క్షత్రియులు మాత్రం బీసీలుగా చలామణి అవుతున్నారు. అయితే, తెలంగాణలో మున్నూరు కాపు, ఏపీలో కాపులకు సంబంధాలున్నట్లే.. రాజులలో కూడా సూర్య-చంద్ర వంశ రాజుల మధ్య సంబంధాలున్నాయి. ఇక అగ్నికుల క్షత్రియులు ఓసీ రాజులు కాకున్నా, విశాఖ నగరం, తూర్పు గోదావరిలో కాకినాడ, రాజమండ్రి, పశ్చిమ గోదావరిలో నర్సాపురం, భీమవరం, ఉండి, ఏలూరు అధికంగా, గుంటూరు జిల్లాలో బాపట్ల, రేపల్లె, -కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ కొన్ని నియోజకవర్గాల్లో వారిదే హవా. గంగపుత్రులుగా పిలిచే వీరు బీసీలు కావడంతో… గోదావరి జిల్లాలలో క్షత్రియులు-కాపుల మధ్య ఉన్న వర్గవిబేధాల నేపథ్యంలో, గంగపుత్రులు ఎన్నికల్లో క్షత్రియులకే మద్దతు పలుకుతుంటారు. నర్సాపురంలో వైసీపీ అభ్యర్ధి ప్రసాదరాజుకు, గత ఎన్నికల్లో కాపులు వ్యతిరేకంగా నిలిస్తే, గంగపుత్రులు క్షత్రియులకు దన్నుగా నిలిచారు.

నాడు సత్యం రామలింగరాజునూ అవమానించారు..

ఈ నేపథ్యంలో, రఘురామకృష్ణంరాజును పార్టీ నుంచి వెలి వేసి, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయించేందుకు.. వైసీపీ నాయకత్వం చేస్తోన్న ప్రయత్నాలపై క్షత్రియ సామాజికవర్గం గుర్రుగా ఉంది. తగిన సమయంలో వైసీపీకి గుణపాఠం చెబుతామని, ఆ సామాజికవర్గ నేతలు హెచ్చరిస్తున్నారు. జగన్ తొలిసారి పార్టీ స్థాపించి, ఎన్నికల్లోకి దిగిన సమయంలో… సత్యం రామలింగరాజును మోసం చేసి, ఆయన జైలుకు వెళ్లడానికి జగనే కారణమయ్యారన్న ఆగ్రహంతో, క్షత్రియ సామాజికవర్గం గోదావరి జిల్లాల్లో వైసీపీని ఓడించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రఘురామకృష్ణంరాజును కూడా అదే విధంగా అవమానిస్తున్నందుకు త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.

కేసులున్న వారికి అపాయింట్‌మెంట్లు ఇస్తారా?

‘మా రాజుగారికి జగన్‌గారు ఎందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వరండీ? ఆయనేం అందరిలాగా ప్రభుత్వాల చుట్టూ తిరిగి పైరవీలు చేసుకునేవారు కాదు కదా? జగన్ అపాయింట్‌మెంట్ కోసం ఎన్నాళ్లని ఓపిక పడతారు? మేమూ రాజులమే. వాళ్లకు ఎంత ఉందో మాకూ అంత ఉంది. ఆత్మాభిమానం, గౌరవం కోసమే మేం రాజకీయాల్లో ఉన్నాం. అయినా, విశాఖలో 13 మందిని మింగేసిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రతినిధులకు జగన్‌గారు అపాయింట్‌మెంట్ ఇస్తారు. హైదరాబాద్‌లో పోలీసులపై కుక్కులు వదిలిన  పీవీపీ గారికి అపాయింట్‌మెంట్ ఇస్తారు. కానీ, పార్టీ ఎంపి రఘురామకృష్ణంరాజుకు మాత్రం అపాయింట్‌మెంట్ ఇవ్వరా? ప్రభుత్వంపై ప్రజలు అనుకునేవే రాజుగారు చెప్పారు. వాటిని సరిదిద్దుకోవలసింది పోయి, ఆయనపై చర్యలు తీసుకుంటారా? మేం చాలామందిని చూశాం. కానీ ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదండీ. అన్నగారు ఇలా వ్యవహరించే  దెబ్బతిన్నారు. ఈయనెంత? అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. మేం ఇప్పుడు నోరు మెదపదడం లేదని ఏమీ కాదనుకోవద్దండి. మా వాళ్లు మాట్లాడితే కేసులు పెడతారు. వ్యాపారాలు దెబ్బతీస్తారు. అయినా ఎవరితో గొడవలు పెట్టుకోవడం మా నైజం కాదు. అవన్నీ ఆ రోజుల్లో. మాకూ సమయం వస్తుంది. సత్తా చూపిస్తాం’ అని భీమవరం  క్షత్రియ సేవా సమాజానికి చెందిన ఓ నాయకుడు వ్యాఖ్యానించారు.