ఫాఫం.. ‘ఆంధ్రజ్యోతి’లో జగన్ యాడ్ అలా వచ్చింది!

422

నాట్కో చౌదరి సౌజన్యంతో జ్యోతిలో సర్కారు యాడ్
ఏడాది నుంచీ జ్యోతికి ప్రకటనలివ్వని జగన్
తెలంగాణలోనూ కనిపించని సర్కారు ‘జ్యోతి’ ‘వెలుగు’
నచ్చిన వారికే సర్కారీ ప్రకటనలు
(మార్తి సుబ్రహ్మణ్యం)

తెలుగు రాష్ట్రాల పాలకులిద్దరూ పత్రికలకు ప్రకటనల విషయంలో దాదాపు ఒకే పాలిసీతో వెళుతున్నారు.తమకు నచ్చిన పత్రికలకు మాత్రమే ప్రకటనల హారతినిస్తున్నారు. నచ్చని వారి మొహమే చూడటంలేదు. కారణం.. తమను ప్రసన్నం చేసుకోకపోగా, వ్యతిరేక కథనాలు వండి వారుస్తున్నారన్న ఆగ్రహం. ఇలాంటి విధానం అమలుచేయడంలో కేసీఆర్-జగన్ రామలక్ష్మణుల మాదిరిగానే వ్యవహరిస్తున్నారు. అదెలాగో చూడండి..

ప్రకటనల తీరు మారుతోంది బాసూ..

పదేళ్ల క్రితం ఉన్న పార్టీలు-ప్రభుత్వాలకు, ఇప్పటి ప్రభుత్వాలకు బోలెడు తేడా. ఉమ్మడి రాష్ట్రం ఉన్నంతవరకూ.. అంటే నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి చిట్టచివరి సీఎంగా ఉన్నంత వరకూ, కాంగ్రెస్ వ్యతిరేక వార్తలు రాసిన పత్రికలకు సైతం ప్రకటనలిచ్చేవారు. తొలుత వైఎస్ సీఎం అయిన తర్వాత,ఆంధ్రజ్యోతికి ప్రకటనలు నిలిపివేస్తే , కోర్టుకు వెళ్లి తెచ్చుకున్న రాధాకృష్ణ… ఆ సాహసాన్ని ఆయన కొడుకుపై చేయకపోవడమే ఆశ్చర్యం. అసలు తనది కాంగ్రెస్ వ్యతిరేక విధానమని విస్పష్టంగా ప్రకటించిన, మీడియా మొఘల్ రామోజీ ముద్దుల ఈనాడుకు సైతం బీభత్సంగా కాంగ్రెస్ పాలకులు ప్రకటలిచ్చేవారు. ఆ ప్రకారంగా.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు సీఎంలుగా ఉన్నా, సమాచారశాఖ ప్రకటనల్లో ఈనాడుదే సింహభాగం. సర్క్యులేషన్, యాడ్ టారిఫ్ కూడా దానికి ప్రధాన కారణమే అనుకోండి!

ఈటీవీ, ఏబీఎన్‌కు అసెంబ్లీ హక్కులిచ్చేసిన టీడీపీ..

టీడీపీ హయాంలో అయితే, శాసనసభ లైవ్ టెలికాస్ట్ హక్కులు కూడా ఈటీవీకే ధారదత్తం చేశారు. మిగిలిన చిన్నా,చితకా పత్రికలకు తృణమో, ఫణమో, వాటి ప్రాణాన్ని బట్టి..ఒక్కోసారి కమిషనర్ల మనసుబట్టి అంతకంటే ఎక్కువ కూడా ఇచ్చారు. చివరకు తెలంగాణ ఉద్యమ సమయంలో పాలకులకు వ్యతిరేకంగా రాస్తున్న టీఆర్‌ఎస్ అధికార నమస్తే తెలంగాణ పత్రికకూ అందరిమాదిరిగానే ప్రకనలిచ్చేవారు. దానికి యాడ్స్ ఇవ్వకపోతే, తెలంగాణ పత్రికకు అన్యాయం చేస్తారేమోనన్న భయంతో ఎక్కడా పక్షపాతం చూపకుండా జాగ్రత్త పడేవారు. మొత్తానికి కాంగ్రెస్ గానీ, టీడీపీ గానీ పత్రికలకు ప్రకటనల విషయంలో పట్టువిడుపులు ప్రదర్శించేవి. విభజిత ఏపీలో తనపై వ్యతిరేక కథనాలు రాస్తున్నప్పటికీ సాక్షికి ఎంతోకొంత ప్రకటనలిచ్చేవారు. తమ ప్రభుత్వాలపై వ్యతిరేకంగా గళం విప్పడమే కాకుండా, రోజూ ఆందోళనలు నిర్వహించే వామపక్షాలకు చెందిన పత్రికలకు సైతం ధారాళంగా ప్రకటనలిచ్చేవారు.

ఈనాడు దారే వేరు..!

రాష్ట్రం విడిపోయిన తర్వాతనే పత్రికలకు, చానెళ్లకు ప్రకటనలిచ్చే వ్యవహారంలో మార్పులొచ్చాయి. తెలంగాణలో అధికార తెరాసకు చెందిన టీ న్యూస్, నమస్తే తెలంగాణకు ప్రకటనల ప్రవాహం కొనసాగుతోంది. దానిపై అప్పుడెప్పుడో విజిలెన్స్‌కు ఫిర్యాదు కూడా వెళ్లింది. ఈనాడు అధినేత రామోజీరావు.. తన జీవితంలో ఎప్పుడూ తనను కలిసేవారికి తన సౌధంలోనే దర్శనం ఇవ్వడం తప్ప, ఎప్పుడూ సచివాలయం గడప తొక్కిన దాఖలాలు లేవు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు బేగంపేట లోని ఆయన రామోజీ విలాసానికి వెళ్లే సలహాలు తీసుకునేవారు. అలాంటి రామోజీని కూడా సచివాలయానికి రప్పించిన మొనగాడు కేసీఆర్. అలాగని ఈనాడు.. తెలంగాణలో సర్కారుపై ఏపీలో మాదిరిగా యుద్ధమేమీ చేయడంలేదు. పైగా రామోజీ ఫిలింసిటీలో నిర్మించతలపెట్టిన ఓంసిటీని కేసీఆర్ వేనోళ్లా పొగిడారాయె. గతంలో, ఇప్పుడు.. ఈనాడు విధానం ఒకటే విధంగా కనిపిస్తుంది. టీడీపీ అధికారంలో ఉంటే సీఎం చంద్రబాబును తప్ప..మిగిలిన మంత్రులు,నేతలు, ప్రభుత్వ శాఖలపై వ్యతిరేక వార్తలు రాసేది. ఇప్పుడూ తెలంగాణలో సేమ్ టు సేమ్ పాలిసీ! కాబట్టి తెలంగాణలో ఈనాడుకు ప్రకటనల విషయంలో పెద్దగా అవరోధాలేవీ లేవు.

తెలంగాణలో ఆంధ్రజ్యోతి నుంచి వెలుగు వరకూ..

ఆంధ్రజ్యోతికి గతంలో ప్రకటనలు ఆపేశారు. మడమ తిప్పకుండా కేసీఆర్ సర్కారుపై యుద్ధం చేస్తున్న ఆ పత్రిక ఎండి రాధాకృష్ణకు ఓఫైన్ మార్నింగ్ సీఎం కేసీఆర్ నుంచి పిలుపురావడంతో, సీఎం నిర్వహించిన చండీయాగానికి హాజరయ్యారు. ఇక ఆ తర్వాత ప్రకటనలు మామూలే. మళ్లీ ఎన్నికల ముందు, రాధాకృష్ణ తోకజాడించి, టీడీపీ-కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా వ్యవహరించారని ఆగ్రహించిన కేసీఆర్, దానికి ప్రకటనలివ్వడం ఆపేశారు. అయితే, విచిత్రంగా కొన్ని చిన్న పత్రికలకు మాత్రం ప్రకటనలిస్తోంది.

ఇప్పుడు బీజేపీలో చేరిన మాజీ ఎంపి వివేక్‌కు చెందిన, వెలుగు పత్రికకు ప్రకటనలు నిలిపివేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. కారణం.. ఇటీవలి కాలంలో ‘వెలుగు’లో పుంఖానుపుంఖాలుగా కేసీఆర్ సర్కారు వ్యతిరేక కథనాలు వస్తుండటమే. ప్రధానంగా సాగునీరు, వ్యవసాయ,వైద్య, మున్సిపల్ శాఖలపై వస్తున్న కథనాలు, సర్కారును అప్రతిష్ఠపాల్జేసేలా ఉన్నాయి. ఫలితంగా కన్నెర్ర చేసిన కేసీఆర్ సర్కారు.. కీలెరిగి వాత పెట్టిన చందంగా.. ప్రకటనలు నిలిపివేసింది. ఈ వైఖరిని విపక్షాలు ఖండించాయి. ఉద్యమ సమయంలో నమస్తే తెలంగాణ, టీ న్యూస్‌కు నాటి ప్రభుత్వం ప్రకటనలివ్వలేదా? అని ప్రశ్నిస్తూ, నిలదీసే గొంతులను అణచివేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఏపీలోనూసేమ్ టు సేమ్..

సీన్‌ట్ చేస్తే.. ఏపీలో కూడా దాదాపు ఇదే సీన్! జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఇప్పటివరకూ ఆంధ్రజ్యోతికి ఒక్క ప్రకటన ఇస్తే ఒట్టు! బహుశా దానిని ఉడికించాలనో ఏమో గానీ, విశాలాంధ్ర,ప్రజాశక్తి, ఆంధ్ర భూమి, ఆంధ్రప్రభ వంటి తక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికలకూ ‘అప్పుడప్పుడూ’ ప్రకటనలిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో ఆంధ్రజ్యోతి మాత్రమే ప్రతిపక్షం మాదిరిగా వ్యవహరిస్తూ, తన సర్కారును భ్రష్టు పట్టిస్తోందని ఆగ్రహిస్తున్న జగన్.. ఆ పత్రికకు ప్రకటనలు నిలిపివేయమని ఇచ్చిన ఆదేశాలు, విజయవంతంగా అమలవుతున్నాయి. అసలు ఆ రెండు పత్రికలకు జగన్ సీఎంగా ప్రమాణం చేసిన రోజునే హెచ్చరికలు జారీ చేశారాయె!

అప్పుడు నాగలిపట్టి దున్నేసిన ‘జ్యోతి’

అయితే.. ఆంధ్రజ్యోతి ఈ ఒక్క ఏడాది ప్రకటనల రూపంలో నష్టపోయినప్పటికీ… టీడీపీ ఐదేళ్ల కాలంలో ప్రకటనలను నాగలిపట్టి దున్నేసింది. సమాచారశాఖ బడ్జెట్‌ను ఈనాడు, ఆంధ్రజ్యోతి సింహభాగం పంచుకున్నాయి. ఐఅండ్‌పీఆర్ వేసే అక్రెడిటేషన్ కమిటీల్లో ప్రభుత్వం నియమించిన సభ్యుల్లో కూడా, ఒకరు ఈనాడుకు చెందిన వారయితే, మరొకరు ఆంధ్రజ్యోతికి చెందిన వారుండేవారు. అంతేకాదు.. తమ స్వగోత్రీకులయిన జర్నలిస్టులను, ఏ సంస్థ అయినా తొలగిస్తే, వెంటనే వారిని ‘తమవారి’ సంస్థల్లో చేర్పించి ఆదుకునే ఉదారగుణం ఇప్పటికీ తెలుగుదేశీయుల్లోనే కనిపిస్తుంటుంది. ఆ రకంగా తమ గోత్రీకులకు సంబంధించి, చంద్రబాబు పాపం ఎక్కడా అన్యాయం చేయలేదు! పైగా.. అసెంబ్లీ లైవ్‌టెలికాస్ట్ కోసం ఏబీఎన్‌కు ఇచ్చిన బడ్జెట్ అదనం.

కోడెల గారయితే బాబుగారి మనసెరిగి, లైవ్‌టెలికాస్టుకు టెండర్లు కూడా పిలవకుండా, ఏబీఎన్‌ను ఎంపిక చేసి దొడ్డమనుసు చూపించారు. ‘సమాచారశాఖ ఏబీఎన్‌కు ఇచ్చిన బడ్జెట్‌తో ఆంధ్రజ్యోతి సంసారం మొత్తాన్ని లాగిస్తున్నారన్న’ జోకులు వినిపించేవి. సార్ హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తే, ఆయనకు కమిషనర్ స్ధాయి అధికారులే, ఎయిర్‌పోర్టులో ఎదురెళ్లి స్వాగతం పలికేవారు మరి! తెలంగాణలో కేసీఆర్‌తో సఖ్యతగా ఉన్నప్పుడు కూడా, తెలంగాణ సర్కారు బాగానే ప్రకటనలిచ్చింది. కాకపోతే ఇప్పుడు రింగు రివర్సయింది కాబట్టి.. అప్పుడు సంపాదించింది, ఇప్పుడు ఖర్చు పెట్టాల్సివస్తోందంతే!

చౌదరి గారి పుణ్యాన ‘జ్యోతి’లో తొలి జగన్ యాడ్…

ఈ విషమ పరిస్థితిలో.. ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో, జగన్ ఫొటోతో ఒక ప్రకటన నిపించడం ఆశ్చర్యపరిచింది. అబ్బో.. ఫర్వాలేదు. జగన్ తీరు మారి, ఆయనకు జ్ఞానోదయయి జ్యోతికి కూడా యాడ్ ఇచ్చారనుకున్నారు. ఎందుకంటే సమాచారశాఖనే ఆంధ్రపభ, ప్రజాశక్తి పత్రికలకు ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చింది. అందువల్ల వాటితో పోలిస్తే పెద్ద పత్రికయిన జ్యోతికి ఇచ్చారనుకున్నారు. కానీ.. కొంచెం జాగ్రత్తగా ఆ యాడ్‌ను పరిశీలిస్తే.. అది సమాచారల శాఖ ఇచ్చిన యాడ్ కాదు సుమా! ఏపీ నాట్కో కేన్సర్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా.. విచ్చేయనున్న జగన్‌ను స్వాగతిస్తూ, నాట్కో ఓటీఎస్ యాడ్ ఏజెన్సీ ద్వారా ఇచ్చిన ప్రైవేటు యాడ్ అది. ప్రభుత్వమే ప్రకటన ఇస్తే.. కింద సమాచారశాఖనో, లేదా అది జారీ చేసిన శాఖ పేరు ఉంటుంది. కానీ జ్యోతికి ఇచ్చిన ఆ యాడ్‌లో ఓటీఎస్-నాట్కో అని మాత్రమే ఉంది. నాట్కో అంటే తెలుసుగా..మన పొన్నూరు నన్నపనేని ‘చౌదరి’గారిదే! అలా.. ఫాఫం.. తొలిసారి జగన్ ఫొటో యాడ్‌తో ఆంధ్ర జ్యోతి ముందుకుపోయిందన్నమాట!