ప్రాజెక్టులకు పొక్కలు..సర్కారుకు చుక్కలు!

506

ఇరిగేషన్ ప్రాజెక్టుల లీకుతో తెరాసకు ఇక్కట్లు
ఏకమై ఎదురుదాడి చేస్తున్న కాంగ్రెస్-బీజేపీ
సీబీఐ విచారణకు రేవంత్ డిమాండ్
(మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న ప్రాజెక్టులకు పడుతున్న వైనం సర్కారును ఇక్కట్ల పాలుచేస్తోంది. దీనిపై భాజపా, కాంగ్రెస్ సహా విపక్షాలు సర్కారు అసమర్ధతపై విరుచుకుపడుతూ, ఎదురుదాడి చేస్తున్న వైనం అధికార తెరాసను ఆత్మరక్షణలోకి నెట్టింది. ఇప్పటికే కరోనా విఫలంపై విపక్షాల నుంచి దాడులు ఎదుర్కొంటున్న కేసీఆర్ సర్కారుకు, కొద్దిరోజుల నుంచి లీకవుతున్న కాల్వల రచ్చ అదనపు తలనొప్పిలా పరిణమించింది. కొండపోచమ్మ కాల్వకు గండ్లు పడి, 30 ఎకరాల పంట నష్టపోవడం, ఈ ఘటన కేసీఆర్ ఫాం హౌస్‌కు సమీపంలోనే జరగడం విపక్షాలకు బ్రహ్మాస్త్రంగా మారింది. కాల్వను అంగరంగ వైభవంగా ప్రారంభించిన నాలుగో రోజునే గండిపడటం.. కేసీఆర్ ప్రారంభించిన నెలరోజుల్లోనే రెండుసార్లు.. నాలుగుచోట్ల గండ్లు పడటం.. దానిపై రంగంలోకి దిగిన విపక్షాలు, కేసీఆర్ సర్కారును కాంట్రాక్టర్లతో అనుబంధాన్ని లింకు పెట్టి ఆరోపణాస్ర్తాలు సంధించటం ఆసక్తికరంగా మారింది.

గండ్లతో జనం కడగండ్లు..


కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన.. కొండపోచమ్మసాగర్ ఎడమ కాల్వలోని, జగదేవ్‌పూర్ కాల్వకు రెండు గండ్లు పడిన వైనం స్థానికులను బెంబేలెత్తించింది. ప్రధానంగా కేసీఆర్ ఫాంహౌస్‌కు సమీపంలోని వెంకటాపూర్ గ్రామ శివార్లలో, అండర్‌బ్రిడ్జిపై ఏర్పడిన లీకేజీలు బుంగలుగామారి, పంట పొలాల మీదుగా గ్రామంలోకి చేరి, అక్కడినుంచి ఇళ్లకు చేరింది. ఫలితంగా మొత్తం 30 ఎకరాలు దెబ్బతిన్నాయి. అయితే ట్రయల్న్ చేసేముందు ఇవన్నీ సహజమేనని దానిని పర్యవేక్షిస్తున్న అధికారి సమర్ధించుకుంటున్నారు. అయితే మిడ్‌మానేరు, కొండపోచమ్మ కాల్వ, తాజాగా కేసీఆర్ ఫాంహౌస్ సమీపంలోని, గ్రామాల కాల్వలకు గండ్లు పడటం విపక్షాల చేతికి అస్ర్తాలిచ్చినట్టయింది.

నిఘా..నిద్రోతోందా?

చిన్న చిన్న ప్రవాహాలకే కాల్వలు కొట్టుకుపోతే, ఇక భారీ వరదలొస్తే పరిస్థితి ఏమిటి? చిన్న కాల్వల పరిస్థితే ఈవిధంగా ఉంటే, ఇక 15 టీఎంసీల కొండపోచమ్మసాగర్, గంధమల ప్రాజెక్టు, 50 టీఎంసీ మల్లన్నసాగర్ గతేమిటన్నది విపక్షాలు సంధిస్తున్న ప్రశ్న. నిజానికి భారీ ప్రాజెక్టు నుంచి, చిన్న రోడ్డు వరకూ విజిలెన్స్, క్వాలిటీకంట్రోల్ విభాగాలు, థర్డ్‌పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. శాంపిల్ తీసుకుని ఆ ప్రకారం పనులు నిర్దేశిస్తాయి. ఒకవేళ ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రకారం పనులు జరగకపోతే బిల్లులు నిలిపేయడమో, కోత విధించడమో చేస్తాయి. అదే పెద్ద ప్రాజెక్టులు చేసే కాంట్రాక్టర్లు ఇలాంటి నాణ్యత లేని పనులు చేస్తే, వారి లైసెన్సు రద్దు చేసి, చర్యలు తీసుకుంటారు. పనులు జరుగుతున్న సమయంలో ఏదైనా ఘటన జరిగితే అందుకు ఆ కంపెనీ నుంచి రికవరీ చేస్తుంది. ఎక్కడైనా,ఏ రాష్ట్రంలోయినా సహజంగా జరిగే ప్రక్రియనే ఇది. కానీ, స్వయంగా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులకు, కొద్దికాలంలోనే గండ్లు పడినవైనం ప్రభుత్వానికి అప్రతిష్టగానే భావించక తప్పదంటున్నారు. కాల్వకు వేసిన లైనింగ్ నాణ్యత లేకపోవడం, కాంక్రీట్ తక్కువ మందంతో వే యడంవల్ల పొక్కలు పడ్డాయని స్థానికులు చెబుతున్నారు.

కేసీఆర్..కింకర్తవ్యం?


మరి ఇంత నిర్లక్ష్యం చేసిన ఆ కాంట్రాక్టరుపై కేసీఆర్ సర్కారు ఏం చర్యలు తీసుకుంటుందన్న ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. విపక్షాలన్నీ కట్టకట్టుకుని.. కాంట్రాక్టరుతో కేసీఆర్‌కు అనుబంధం ఉందని ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలే బినామీ కాంట్రాక్టర్ల అవతారమెత్తారని ధ్వజమెత్తుతున్నాయి. రేవంత్‌రెడ్డి అయితే ఓ అడుగు ముందుకేసి.. పనులు చేస్తున్న మేఘా కంపెనీ వైఫల్యాన్ని ఎండగట్టారు. తాజాగా జరిగిన ఘటన వల్ల 30ఎకరాలు పూర్తిగా నష్టపోయాయి. గ్రామస్తుల ఇళ్లలోకి నీరు చేరి,మానసిక వేదన చెందారు. మరి పడిన గండిని పూడ్చి, మళ్లీ అదే కాంట్రాక్టరు నుంచి పనులు చేయించడం, లేదా రకవరీ చేయటం ఇప్పుడు కేసీఆర్ సర్కారు ముందున్న మార్గాలు.

పైగా తన ఫాంహౌస్ సమీపంలోనే ఈ ఘటన జరిగినందున, సీఎంగా కేసీఆర్ ఈ వ్యవహారాన్ని ఇంకా సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ ప్రకారంగా..విపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లు, ఆ కాంట్రాక్టర్ లైసెన్సును రద్దు చేయాల్సి ఉంటుంది. మరి కేసీఆర్ ఆ దిశగా నిర్ణయం తీసుకుని,విపక్షాల నోళ్లకు తాళం వేస్తారా? లేక, వేగంగా పనులు జరుగుతున్నప్పుడు ఇలాంటి గండ్లుపడటం సహజమేనని సాగునీటి అధికారి చెప్పినట్లు, బీజేపీ అధికారంలో ఉన్న బెంగళూరులో ఏం జరిగిందో మీకు తెలియదా?అని తెరాస నేత వేణుగోపాల్‌రెడ్డి చెప్పినట్లు..యధావిథిగా విపక్షాలపై ఎదురుదాడి చేస్తారో చూడాలి.

గండ్ల లీకులపై విపక్షాల గరం గరం..

గండ్లకు పొక్కలు పడి జనం బేజారెత్తిన దృశ్యాలు మీడియా ద్వారా తెలియడంతో విపక్షాలు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. రాత్రి వేళ్ల తాము పడిన ఇబ్బందులను స్థానికులు వారికి మొరపెట్టుకున్నారు. కొంండపోచమ్మసాగర్ కాల్వకు గండ్లు పడుతున్న వైనంపై కాంగ్రెస్,బీజే పీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బినామీ కాంట్రాక్టర్ల అవతారమెత్తిన ప్రభుత్వ పెద్దల అసమర్థతే దీనికి కారణమని విరుచుకుపడ్డారు. కేసీఆర్ తన చిత్తశుద్ధి, కాంట్రాక్టర్లతో తనకెలాంటి లాలూచీ లేదని నిరూపించుకోవాలంటే.. తక్షణం కాంట్రాక్టరు లైసెన్స్ రద్దు చేసి, నష్టంరికవరీ చేయాలని గళమెత్తాయి.
‘‘కేసీఆర్ ఫాంహౌస్‌కు నిర్మించుకున్న కాల్వకు గండిపడి వెంకటాపురం మునిగింది. ఇది మేఘా కంపెనీ మేత ఘనతే. కెనాల్‌ను ‘జాతి జలగ‘ మొదలుపెట్టి వారమే అయింది. ఇంతలోనే కాల్వకు రెండు గండ్లు పడ్డాయి. ఇక రాష్ట్రంలో కాల్వలు, రిజర్వాయర్ల క్వాలిటీ ఏమిటోదీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు’’- రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, టీపీసీసీ


‘‘ కేసీఆర్ స్కాముల కోసమే స్కీములు అమలుచేస్తున్నారు. కొండపోచమ్మసాగర్ కెనాల్‌కు గండి పడటమే దానికి సాక్ష్యం. సీఎం సొంత నియోజకవర్గంలోనే పనులు ఇంత అధ్వానంగా ఉంటే, ఇక రాష్ట్రంలోని ప్రాజెక్టుల సంగతేమిటి? అప్పుడు మిడ్‌మానేరు, మల్లన్నసాగర్, కాళేశ్వరం ప్రాజెక్టులోనూ ఇలాంటి పరిస్థితే కనిపించింది. కాంట్రాక్టర్లతో కేసీఆర్ సర్కారు కుమ్మక్కవడంవల్లనే.. ప్రాజెక్టుల్లో నాసిరకంపనులు జరుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు కొందరు బినామీ కాంట్రాక్టర్ల అవతారమెత్తడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. వారిపై చర్యలు తీసుకుని, సొమ్ము రికవరీ చేసి,కాంట్రాక్టు రద్దు చేసేదమ్ము కేసీఆర్‌కు ఉందా?’’-బండి సంజయ్‌కుమార్, ఎంపి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు.


‘‘కమిషన్ల కోసం ప్రాజెక్టుల ఖర్చును అడ్డగోలుగా పెంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుల్లో క్వాలిటీ ఘోరంగా ఉంది. ప్రాజెక్టును కమిషన్ల కోసం 36 వేల కోట్ల నుంచి లక్ష కోట్లకు పెంచినా, క్వాలిటీ లేకుండా చేస్తున్నారు. సీఎం ఫాంహౌస్‌కు ఎక్కువ నీళ్లు తెచ్చుకోవడానికే కొండపోచమ్మ సాగర్‌ను కట్టారు. ఆ కాంట్రాక్టర్లపై కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి’’-తెలంగాణ బీజేపీ నేత,మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి.