పోలీసులపై కుక్కలతో దాడే ఇతివృత్తం
బహుభాషలలో విడుదలయ్యే అవకాశం
కృష్ణా జిల్లా తెగువ చూపిన చౌదరి గారు
(మార్తి సుబ్రహ్మణ్యం)

పొట్లూరి వరప్రసాద్ గుర్తున్నాడా? అదేనండి.. వైఎస్ హయాంలో రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్ భూములు… విదేశీబ్యాంక్.. ఆ.. ఇప్పుడు గుర్తుకొచ్చాడా? ఇంకా రాలేదా? సరే అయితే.. గత లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేశాడే.. ఏంటీ.. ఇంకా గుర్తు రాలేదా?.. హబ్బా.. సరే.. మొన్నీమధ్య బంజారాహిల్స్‌లో తన ఇంటికి వచ్చిన పోలీసుల మీద కుక్కులు వదిలాడే.. ఆ.. ఇప్పుడు గుర్చొచ్చిందా? హమ్మయ్య.. ఆయనే ఈయన అన్నమాట! సినీ నిర్మాత కూడా అయిన పీవీపీ తానే హీరో కమ్ విలన్‌గా ఒక సినిమా తీయబోతున్నారట. ఆ సినిమా పేరేంటో తెలుసా? ‘ది డాగ్’. టైటిల్ చూసి ఇదేదో హాలీవుడ్ సినిమా అనుకునేరు! కాదండీ.. ఇప్పటికయితే ఆరణాల తెలుగు సినిమా. తర్వాత తమిళ్, కన్నడ, మలయాళీ, కొంకణిలో తీస్తారేమో చూడాలి. ఈ సినిమాకు ఒక్క హీరోనే కాదు. కథ, మాటలు, పాటలు అన్నీ ఆయనేనట. షూటింగ్ లోకేషనంతా ఆయన ఇల్లేనట. కాకపోతే.. రియాలిటీ కోసం ఒక్క పోలీసుస్టేషన్ సీను మాత్రమే ఒరిజినల్ బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ ఉండవచ్చు. అవసరాన్ని బట్టి, కోర్టు సీన్లు కూడా ఒరిజినల్‌వే ఉండవచ్చని సినిమా వర్గాలు చెబుతున్నాయి.నిజ జీవితంలో జరిగిన కను తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అప్పుడే టాలీవుడ్‌లో భారీ అంచనాలు కనిపిస్తున్నాయట! ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటే, ఇక అసలు సినిమా విడుదైతే ఎన్ని రికార్డులు బద్దలవుతాయో చూడాలి.

ఇంతకూ కథేమిటంటే.. మన హీరో ప్రసాదంటే ఆ కాలనీవాళ్లకు హడల్. గళ్లలుంగీ, బొడ్లో కత్తి, ముఖాన కత్తిగాట్లు వంటి పాత విలన్ల గెటప్ మాదిరి కాకుండా, సూటు,బూటు వేసుకునే క్యారక్టర్ అన్నమాట. ఆయన ఇంటి కంటే ఎత్తుగా ఆ కాలనీలో ఎవరు ఇల్లు కట్టుకున్నా సహించలేని పాత్ర. ఆడ లేడీసులు వచ్చినా, మగముండాకొడుకులతో మాట్లాడినట్లు వారితో కూడా బూతులు మాట్లాడటమే ఈ సినిమాలో ఆయన మేనరిజమ్. అంటే ముత్యాలముగ్గులో రావుగోపాల్రావులా అన్నమాట. కాకపోతే రావుగోపాల్రావు చుట్ట తాగితే, మన ప్రసాద్ చేతిలో సిగార్ ఉంటుందంతే. ఆ పాత్ర బాగా పండుతుందని, ఇకపై ఆ డైలాగులు జనసామాన్యంలో నానుతుంటాయని సినీ రచయితలు జోస్యం చెబుతున్నారు. సరే కైమాక్స్‌లో కాలనీవాళ్లంతా పోలీసులకు ప్రసాదు మీద ఫిర్యాదు చేస్తే, పోలీసులొస్తారు.

అక్కడే కథ మాబాగా రక్తి కడుతుంది. ప్రసాద్‌ను పట్టునేందుకు పోలీసులు గేటు తీసి లోపలికి రావడం, ప్రసాద్ పెంపుడు కుక్కలు ఒక్కసారిగా పోలీసులపై దాడి చేసేందుకు సిద్ధపడటం, లోపల ఇవన్నీ సీసీ టీవీ కెమెరాలో చూస్తున్న ప్రసాద్ వికటాట్టహాసం చేయడం, దానితో పోలీసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుజీవుడా అని పరారవడం జరిగిపోతుంది. ఆ తర్వాత విజయగర్వంతో బయటకొచ్చిన మన హీరో కమ్ విలన్ ప్రసాద్, కుక్కలను దగ్గరకు తీసుకుని ముద్దాడటం జరిగిపోతుంది. తర్వాత ప్రసాద్ చేతిలో అటు ఇటు గొలుసులతో కట్టేసి ఉన్న కుక్కలను వెంటేసుకుని, లోపలికి పోవడంతో శుభం కార్డు పడుతుంది. ఇందులో చివరి సీనులో ప్రసాద్ జీవించారని, కుక్కలను గొలుసులతో కట్టి తనతో తీసుకువెళుతున్న షాడో సీన్ బాగా రక్తికట్టిందని, వీడియోగ్రాఫర్ తన పనితనాన్ని అధ్బుతంగా చూపించారంటున్నారు. పోలీసులంటే సమాజం భయపడుతుంటే, తనను చూసి పోలీసులు భయపడాలన్న మనస్తత్వం ఉన్న ప్రసాద్ చేసే విన్యాసాలే ఈ సినిమాకు హైలెట్ అవుతాయని సినీ జీవులు చెబుతున్నారు. అసలు సినిమా షూటింగ్ పూర్తికాకుండానే, బయ్యర్లు ఈ సినిమా హక్కుల కోసం పోటీ పడుతున్నారట. ఇది టాలీవుడ్ చరిత్రలోనే ఒక రికార్డంటున్నారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి రెండు రాష్ర్టాలు ఏర్పడినా, హైదరాబాద్‌లో మాత్రం ఇంకా పొట్లూరి వరప్రసాద్‌చౌదరి గారి హవా తగ్గలేదు. ఇలాంటి వరప్రసాద్ చౌదర్లు ఇంకా పెత్తనం సాగిస్తూనే ఉన్నారు. పోలీసులపైనే కుక్కలు వదిలేంత దమ్ము ఎవరికి ఉంటుంది? డబ్బు, పలుకుబడి ఉన్న ఇలాంటి వారికి తప్ప! రాష్ర్టం విడిపోకముందు… రాయలసీమ రెడ్లు చేసిన భూ కబ్జాల వల్లనే, తెలంగాణ వారిలో సీమాంధ్రులపై ద్వేషం రిగిలిందని, అందుకే ఉద్యమం వచ్చిందనే ప్రచారం ఉండేది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత.. రాయలసీమ రెడ్ల పాత్రను కృష్ణా జిల్లా చౌదర్లు తీసుకున్నారని, పీవీపీ తీరును చూస్తే అర్ధమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒక మామూలు ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో చలానాపై వాదిస్తేనే సహించలేని హైదరాబాద్ పోలీసులపై, ఏకంగా కుక్కలనే వదలిన గండరగండయిన పీవీపీది గుండె కాదు. నిజంగా చెరువే మరి! కృష్ణా జిల్లా తెలివి, తెగువ, సమయస్ఫూర్తి చూపించిన పీవీపీకి వీరతాళ్లు వేయాల్సిందే!! రాస్కోరా సాంబా?!

By admin

Leave a Reply

Close Bitnami banner