జగన్ నిర్లిప్తతకు కారణం అదేనా?

623

తొమ్మిదేళ్లు నిరంతరం జనంలోనే
విపక్షాలు వీకవడం వల్లేనా?
కేంద్రంతోనూ సత్సంబంధాలు
విజయసాయి, వైవి, సజ్జలకు పార్టీ బాధ్యతలు
అందుకే ఏడాది కాలాన్ని ఎంజాయ్ చేస్తున్నారా?
ఈ కారణాల వల్లనే పార్టీని పట్టించుకోవడం లేదా?
రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ జగన్‌కు గుణపాఠమేనా?
( మార్తి సుబ్రహ్మణ్యం)


పట్టుదల, మొండితనానికి ఆయన మారుపేరు. సీమబిడ్డ కదా మరి?! తండ్రిని పోగొట్టుకున్న తర్వాత, తొమ్మిదేళ్లపాటు నిరంతరం జనం మధ్యలోనే. ఎండా-వానాలోనే నడక. మధ్యలో 16 నెలల జైలు జీవితం. కేసులతో చిక్కులు చికాకులు. ఎమ్మెల్యేల తిరుగుబాటు.. ఎన్నికల ముందు మహాపాదయాత్ర. పాదాలు పగిలిపోయి, వేళ్ల మధ్య చీము,రక్తం వచ్చినా, ఆ నొప్పిని పంటిబిగువున భరిస్తూ నడక పూర్తి చేసిన ధీశాలి. మధ్యలో పెత్తనం కోసం కుటుంబ కలహాలు. ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొని, విజయప్రస్థానానికి చేరిన ఆయన.. ఇప్పుడు వేటినీ పట్టించుకోకపోవడానికి కారణం.. తొమ్మిదేళ్ల కష్టాన్ని మర్చిపోయి, రిలాక్సవుతుండటమేనా? అందుకేనా పార్టీని, ప్రభుత్వాన్ని లైట్ తీసుకుంటున్నారా? నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజు లేవనెత్తిన క్రమశిక్షణ కమిటీ ఉందా అన్న ప్రశ్న.. పార్టీని నిర్లక్ష్యం చేస్తున్న ఆ అధినేతకు, నిజంగా గుణపాఠమేనా? ఏపీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి మానసిక పరిస్థితి ఇదేనా అంటే… అవునన్నదే ఆయన గురించి బాగా తెలిసిన వారి సమాధానం.

పార్టీ సమావేశాలేవీ..?

పార్టీని తెలంగాణ నేత శివకుమార్ నుంచి టేకోవర్ చేసుకున్న తర్వాత, ఇప్పటివరకూ ప్లీనరీ తప్ప, వైఎస్సార్‌సీపీ పార్టీపరంగా నిర్వహించిన సమావేశాలంటూ పెద్దగా లేవు. పార్టీ వ్యవస్థ, నిర్మాణంపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. నచ్చిన వారికి పదవులిస్తున్నట్లు సాక్షిలో ప్రకటనలు మాత్రమే వస్తుంటాయి. జిల్లా పార్టీ అధ్యక్షుల సమావేశాలు గానీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు గానీ, జిల్లా నేతలతో జగన్ సమావేశాలు జరిగిన వార్తలుగానీ, ఆయన సొంత మీడియాలోభూతద్దం పెట్టి వెతికినా కనిపించవు. చివరకు జిల్లా స్ధాయిలో కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న దాఖలాలు లేవు.యధా రాజా తథా ప్రజ! అంతా జగనే. పార్టీలో ఎటు చూసినా ఆయనే. కాకపోతే విశాఖలో విజయసాయిరెడ్డి,అమరావతిలో సజ్జల రామకృష్ణారెడ్డి కనిపిస్తుంటారు. సరే మీడియాలో పార్టీ-ప్రభుత్వం కనిపిస్తుండాలి కాబట్టి, పార్టీ ఆఫీసులో పార్టీ నేతలు-ఎంపిక చేసిన మంత్రులు ప్రెస్‌మీట్లు కనిపిస్తుంటాయి. అయితే, వీరికి ప్రెస్‌మీట్ పెట్టే ముందు వరకూ సబ్జెక్టు ఏమిటనేది తెలియదు.

జగన్ కోరుకుంటేనే ఇంటర్వ్యూలు..

జగన్ కోరుకుంటే తప్ప, మంత్రులకయినా, ఎంపి-ఎమ్మెల్యేలకయినా ఆయన దర్శనభాగ్యం దొరకడం లేదు. అది కూడా అర్ధగంటకు మించదు. ఇక సీఎంఓలో ఆయన నమ్మినబంటయిన ఐఏఎస్ అధికారి, ధనుంజయరెడ్డి మీదనే చాలా శాఖల భారం. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో ఆయనే మాట్లాడుతున్నారు. గతంలో బాబు వద్ద సతీష్‌చంద్ర చేసిన పని ఇప్పుడు ధనుంజయరెడ్డి చేస్తున్నారు. కాకపోతే సతీష్‌చంద్ర మాదిరిగా అన్నింటికీ పుల్లలు వేయడం, నాన్చడం కాకుండా, వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఫోన్లు చేస్తున్నారు. దీనితో పనులు కాకపోయినా గౌరవం ఇచ్చినందుకు ప్రజాప్రతినిధులు సంతృప్తి చెందుతున్నారు.గతంలో బాబు వద్ద సతీష్‌చంద్ర పనిచేసినప్పుడు, మంత్రులను కూడా ఆయన గంటలపాటు వేచిచూసేలా చేసేవారు. తిరుమలలో సన్నిధి గొల్లలకు వంశపారంపర్య హక్కులు, మాదిగ కార్పొరేషన్‌తోపాటు అనేక కీలక సమస్య పరిష్కారంలో, బాబు సానుకూలంగా ఉన్నా, సతీష్‌చంద్ర వైఖరి వల్ల అవన్నీ పెండింగ్‌లో పడటంపై టీడీపీ ఎమ్మెల్యేలు,మంత్రులు ఆయనపై కారాలుమిరియాలు నూరేవారు.

సరే ఇక ప్రవీణ్ ప్రకాష్ సంగతి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంతమంచింది. సాయంత్రం భటులతో సచివాలయంలో ఈవినింగ్‌వాక్, అధికారులను ఎలా తీయాలి? ఎవరిని వేయాలన్న తీసివేత, కూడికలు. ఆ గొడవనే వేరు! సలహాదారులు డజన్ల మంది ఉన్నప్పటికీ, వారిలో అజయ్ కల్లం తప్ప మిగిలిన వారెవరూ కనిపించరు, వినిపించరు. పాపం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిమిత్తమాత్రురాలు. డీజీపీదీ అదే పరిస్థితి. వీరిద్దరూ ఏ సీఎంలు ఉన్నా వారి మాట వినాల్సిందే. లేకపోతే ఎల్వీ సుబ్రమణ్యం మాదిరిగా నిష్ర్కమించాల్సి ఉంటుంది. ఇదీ.. ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ-పార్టీ పరిస్థితి.

ఆ నిర్లక్ష్యమే కొంప ముంచుతోందా?

అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని నిర్లక్ష్యం చేయడం, సీఎంఓలో అనుభవజ్ఞులయిన సమర్థులను నియమించుకోనందుకే, జగన్ సమస్యలు ఎదుర్కోవలసి వస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జగన్‌కు ఫీడ్‌బ్యాక్ ఇచ్చేందుకు అటు అధికారులు, ఇటు పార్టీ సీనియర్లు, సలహాదారులు భయపడుతున్న పరిస్థితి. రఘురామకృష్ణంరాజు.. సీఎం అపాయింట్‌మెంట్ కోసం చాలాకాలం నుంచి ప్రయత్నిస్తున్నా, ఆ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లడంలో, అధికారులు విఫలమయ్యారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఫలితంగా అహం దెబ్బతిన్న రఘురామకృష్ణంరాజు, ఇప్పుడు కొరకరాని కొయ్యలా తయారయ్యారు. ఆయనను కూడా అందరి మాదిరిగా తేలిగ్గా తీసేయడమే ఇన్ని సమస్యలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ఈవిధంగా పార్టీలో ముఖ్యులెవరు? వారి ప్రాధాన్యం ఏమిటని తెలిసిన వారు జగన్ వద్ద లేకపోవడం మైనస్ పాయింట్ అంటున్నారు. తొలి నుంచి వైసీపీలో ఉన్న వారితో జగన్ కార్యదర్శి కెఎన్‌ఆర్ వంటి ఒకరిద్దరికి సంబంధాలున్నప్పటికీ, కొత్తగా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారి గురించి ఎవరికీ అవగాహన లేదంటున్నారు. పార్టీని కూడా తన ఎస్టేట్ మాదిరిగా నడిపిస్తున్నందుకే.. రఘురామకృష్ణంరాజు, ఆనంరామనారాయణరెడ్డి, ధర్మాన ప్రసాదరావు వంటి నేతలు అసంతృప్తి గళాలు విప్పుతున్నారని సీనియర్లు చెబుతున్నారు.

పార్టీని విస్మరిస్తే చిక్కులే మరి..

పార్టీని స్థాపించిన తర్వాత, దాని కొనసాగింపునకు సంబంధించిన ప్రక్రియను కూడా నిర్లక్ష్యం చేసిన ఫలితమే, ఇప్పుడు రఘురామకృష్ణంరాజు.. ‘పార్టీలో అసలు క్రమశిక్షణ కమిటీ ఉందా? అది ఈసీ వద్ద నమోదయిందా’ అని ప్రశ్నించే పరిస్థితి వచ్చిందంటున్నారు. ప్రతి ఏడాది ఈసీకి.. పార్టీకి సంబంధించిన సభ్యత్వాలు, రెన్యువల్, ఆడిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో ఈసీవద్ద అనేక న్యాయ-చట్టపరమైన సమస్యలు తలెత్తుతుంటాయి. వాటిని నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా పార్టీకి చాలా కీలక అంశాలు. పార్టీలో పేరున్న ఆడిటర్లు ఉన్నప్పటికీ.. వీటిపై కూడా నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లనే.. పార్టీలోక్రమశిక్షణ కమిటీ ఉందా? ఉంటే ఈసీ గుర్తించిన ఆ కమిటీ వివరాలివ్వండి అని రఘురామకృష్ణంరాజు..అసలు రాజుకు పార్టీలో సభ్యత్వమే లేదని, ఉంటే రశీదు చూపించాలని ఆయన అనుచరులు సవాల్ చేస్తున్నారు. సభ్యత్వం లేని వారిని ఎలా సస్పెండ్ చేస్తారని నిలదీసే పరిస్థితి ఏర్పడిందంటున్నారు.

ఇప్పుడు అలాంటి వారేరీ..?

పార్టీ స్థాపించిన సమయంలో దివంగత సోమయాజులు, భూమా నాగిరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు అనిల్‌రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఈసీకి సంబంధించిన వ్యవహారాలు చూసుకునేవారు. వారిని ఈసీ వ్యవహారాల్లో నిష్ణాతుడపైన సుప్రీంకోర్టు న్యాయవాది, గల్లా సతీష్ సమన్వయం చేసేవారు. కొన్నేళ్ల పాటు ఆయన ఢిల్లీలో పార్టీకి సంబంధించిన న్యాయపరమైన వ్యవహారాలు పర్యవేక్షించారు. ఆ సందర్భాల్లో జగన్‌తోకూడా భేటీ అయ్యారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత, యధావిధిగానే పదవులన్నింటిలో ‘రెడ్డి’కార్పెట్ వేయటంతో, అందరిమాదిరిగానే సతీష్ దూరమయ్యారు. సుప్రీంకోర్టులో రాష్ర్టానికి సంబంధించిన న్యాయవాదుల నియామకంలో, గల్లాకు చేయివ్వడమే దానికి కారణం. జగన్ అధ్యక్షుడిగా తొలిరోజుల్లో పెట్టిన యెడుగూరి సందుంటి రాజశేఖర్‌రెడ్డి పార్టీకి ఇప్పటికీ సతీష్ ప్రధాన కార్యదర్శితే, వైవి సుబ్బారెడ్డి సొంత సోదరుడు అధ్యక్షుడిగా కొనసాగుతుండటం మరో విశేషం.

గతంలో బాబు అలా ముందుకెళ్లారు..

గతంలో ఓసారి ఇలాగే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు, బీజేపీ నేత రాంమాధవ్ రెండుసార్లు బాబు కోసం ఫోన్‌లో ప్రయత్నించారు. అయితే ఆ విషయాన్ని అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లలేదు. ఆ విషయం ఆయనకు చాలాకాలం తర్వాత తెలిసిందట. ఫలితంగా రాంమాధవ్, టీడీపీ అంటే సహజంగానే వ్యతిరేకత పెంచుకున్నారని టీడీపీ వర్గాలు ఇప్పటికీ చెబుతుంటాయి. ఇలాంటి చిన్న విషయాల్లో కీలకమైన సందర్భాల్లో కొంపముంచుతుంటాయి. ముఖ్యమైన వ్యక్తులు, పార్టీ నేతల ప్రాధాన్యం తెలిసిన వారు, అనుసంధానం చేసే పార్టీ సమన్వయకర్తలు బాబు వద్ద ఉండటం వల్ల చంద్రబాబు.. నాయకులు, అధికారులు,ముఖ్యమైన వారితో సత్సంబంధాలు నెరిపేవారు. అయితే, ఆయన కూడా తమతో వన్‌టు వన్ మాట్లాడకపోవడంపై అప్పట్లో ఎమ్మెల్యేలలో అసంతృప్తి వ్యక్తమయ్యేది. సూటు బూటు వేసుకున్న వారికే ఆయన ఎక్కువ అపాయింట్‌మెంట్లు ఇచ్చేవారన్న విమర్శలుండేవి.

అసలు కారణం ఇదేనా..?

అయితే తనపై ఇన్ని విమర్శలొస్తున్నా జగన్ నింపాదిగా, నిర్లిప్తంగా ఉండటానికి కారణాలున్నాయని ఆయన సన్నిహితులు విశ్లేషిస్తున్నారు. తొమిదేళ్ల సుదీర్ఘ పోరాటంలో అలసిపోయిన జగన్.. ఇప్పుడు రిలాక్సవుతున్నారని చెబుతున్నారు. పదవిని ఎంజాయ్ చేసే మూడ్‌తోపాటు… గతంలో తన దుస్థితికి కారణమయిన వారిపై కక్ష సాధించేందుకే సమయం వెచ్చిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పైగా రాష్ట్రంలో తెలుగుదేశం సహా, విపక్షాలు బలహీనంగా ఉన్నాయి. జగన్ తలచుకుంటే టీడీపీ ఎమ్మెల్యేలు సగం మంది, వైసీపీలో జంపయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. బీజేపీలో చాలామంది నేతలు పైకి తనకు వ్యతిరేకంగా ప్రకటలిస్తున్నా, అంతర్గతంగా స్నేహ హస్తం అందిస్తూనే ఉన్నారు. పైగా కేంద్రంతో తెరచాటు స్నేహంకొనసాగుతూనే ఉంది.వీటికిమించి..నాయకులతో పనిలేకుండా, నేరుగా లబ్థిదారులకే డబ్బులు వేస్తుండటంతో,జగన్-జనానికి సంబంధాలు పెరుగుతున్నాయి.

ఎమ్మెల్యే, ఎంపీలను కలవకపోవడానికీ కారణాలు లేకపోలేదని మరికొందరు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సంక్షోభంలో ఉంది. ముఖ్యమైన పనులకు తప్ప, నిధులిచ్చే పరిస్థితి లేదు. వేలకోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పరిస్థితిలో ప్రజాప్రతినిధులను కలిస్తే, వారు తీసుకువచ్చే నిధులతో ముడిపడిన సమస్యలను పరిష్కరించాల్సి వస్తుంది. మాట ఇచ్చి నెరవేర్చకపోతే, స్థానికంగా ఆ ఎమ్మెల్యేల పరపతితో పాటు, తన ఇమేజ్ కూడా దెబ్బతింటుంది. అయినా పెద్ద ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గాలు తక్కువగానే ఉన్నాయి. డీఎస్పీ,సీఐ,ఎస్‌ఐ పోస్టింగుల వరకూ ఎమ్మెల్యేలు చెప్పిన వారినే నియమిస్తున్నారు. సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధిక సమయం పార్టీకి కేటాయించి, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల అవసరాలు చూస్తున్నారు. విశాఖ వ్యవహారాలు పార్టీని అప్రతిష్టపాలుచేసిన తర్వాత..పార్టీ బాధ్యతలను సజ్జల మరింత ఎక్కువగా చూడాల్సివస్తోందంటున్నారు. పార్టీ అనుబంధ సంస్ధలతో ఆయన తరచూ భేటీ అవుతున్నారు.హోంశాఖను దాదాపు ఆయనే సమీక్షిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి కీలక అంశాలు పర్యవేక్షిస్తున్నారు. నమ్మకస్తులైన నేతలకు ప్రాంతాల వారీగా ఇన్చార్జి బాధ్యతలు కట్టబెట్టినందున, నేతలు జగన్ కోసం అమరావతి వరకూ వచ్చే అవకాశం లేదు. కాబట్టి, ఇన్ని సమీకరణల దృష్ట్యా.. ప్రజాప్రతినిధులను కలిసినా ఉపయోగం లేదన్నది జగన్ మనోభావన అని విశ్లేషిస్తున్నారు.