రాజుగారు వైసీపీ సభ్యుడేనా?

554

రఘురామకృష్ణంరాజుకు పార్టీ సభ్యత్వం లేదా?
మరి సభ్యత్వం లేని వారిని సస్పెండ్ చేయడమెలా?
బి ఫారంలో కూడా ఆయన సభ్యుడేనని అధినేత ధృవీకరణ
మరి సభ్యుడు కాని వారికి బి ఫారమెలా ఇస్తారు?
దానిపై కోర్టుకెళితే చిక్కులు తప్పవా?
రాజుకు వై సెక్యూరిటీ ఇవ్వనున్నారా?
సెక్యూరిటీతో మారనున్న హస్తిన ‘రాజు’కీయం
జగన్ సర్కారుకు కేంద్రం మరో ఝలక్ ఇవ్వనుందా?
(మార్తి సుబ్రహ్మణ్యం)

వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి షోకాజు నోటీసులిచ్చారు. కానీ, తాను ఈసీ నిబంధనల ప్రకారం.. తాను ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ’కి చెందిన వాడినే తప్ప, విజయసాయి పంపిన లెటర్‌హెడ్‌లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎంపీని కాదని రాజు బదులిచ్చారు. రెడ్డిగారికి-రాజు గారికి పంచాయతీ అక్కడి నుంచే షురువయిపోయింది. ఇప్పుడు రాజుగారు మనుషులేమో మరీ లోతుల్లోకి వెళ్లి.. అసలు ఆయనకు వైఎస్సార్‌సీపీలో సభ్యత్వమే లేదని, సభ్యత్వం లేని ఎంపీకి షోకాజ్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. అటు పార్టీ నాయకత్వాలు ఇచ్చే బి ఫారంలో కూడా ‘తమ అభ్యర్ధి తమ పార్టీ సభ్యుడే’నని ధృవీకరిస్తూ, అధ్యక్షులు సంతకం కూడా పెడతారు. అంటే.. రాజుగారి మనుషులు చెబుతున్న దాని ప్రకారం.. రాజు పార్టీ సభ్యుడు కాకపోయినా.. ఆయన తమ పార్టీ సభ్యుడే అని అధ్యక్షుడి హోదాలో, జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల సంఘాన్ని తప్పుదోవపట్టించారా? రేపు ఎవరైనా ఇదే అంశంపై కోర్టుకు వెళితే పరిస్థితి ఏమిటి?.. ఇదే ఇప్పుడు వైసీపీ పెద్దతలల అంతర్మథనం.

‘నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్’.. ఎటుపోతోంది?

వైసీపీలో భూకంకం సృష్టిస్తున్న ‘నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్’ కనుమూరి రఘురామకృష్ణంరాజు.. అసలు సాంకేతికంగా ఆ పార్టీ సభ్యుడేనా? కాదా? ఇప్పుడు ఇదీ, జగన్‌పార్టీకి మిలియన్ డాలర్ల ప్రశ్న! అమరావతి లోనే ఆగి, స్టేషన్ మాస్టర్ జగన్మోహన్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇస్తే తప్ప, కదలడానికి వీలులేని నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ రఘురాముడు.. స్టేషన్ మాస్టర్ జగనన్న సిగ్నల్‌తో పనిలేకుండా, ప్రత్యేకంగా లైను వేసుకుని మరీ ఢిల్లీకి వెళ్లిన వైనం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో తనకు రక్షణ లేదని ఫిర్యాదు చేసిన రాజుకు.. వై లేదా వై ప్లస్ సెక్యూటిరీటీ ఇచ్చి, జగనన్న సర్కారుకు ఝలక్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదే ప్రకారంగా.. ఎన్నికల సంఘం రూపంలో, మరో ఝలక్ ఇచ్చేందుకు రె‘ఢీ’ అవుతోందా? ఎలాగంటే… అసలు రఘురామకృష్ణంరాజు అనే ఎంపికి, వైఎస్సార్‌సీపీ సభ్యత్వం ఉందా? లేదా? ఇప్పుడు అర్ధమవుతోందా? ‘గోదావరి కథ’ ఎక్కడ నుంచి ఎక్కడకు చేరి, ఎక్కడ ముగింపుదశకు చేరుతుందో?

సభ్యత్వమే పెద్ద సమస్య..

అవును.. షోకాజు నోటీసు ఇచ్చిన పార్టీకే లాజిక్కులతో ప్రశ్నలు వేసి చికాకు కలిగిస్తున్న, నర్సాపురం వైస్సార్‌సీపీ ఎంపి రఘురామకృష్ణంరాజుకు అసలు ఆ పార్టీ సభ్యత్వం ఉందా? అంటే ఆయనను పార్టీలో చేర్చుకునే సందర్భంగా వంద రూపాయలు తీసుకుని, పార్టీ సభ్యత్వం ఇచ్చారా? అన్నదే ఇప్పుడు వైఎస్సార్‌సీపీ నాయకత్వాన్ని వేధిస్తున్న ప్రశ్న. నిజానికి ఒక అభ్యర్ధి ఎన్నికల్లో పోటీ చేసేముందు.. అధికారులకు సమర్పించే బి ఫారంలో.. సదరు అభ్యర్ధి మా పార్టీ సభ్యుడేనని ఆ నాయకత్వం బ ఫారాలలో ధృవీకరించింది. అయితే.. రఘురామకృష్ణంరాజుకు అసలు వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వమే లేదని, ఆయన అనుచరుల వాదన. బీజేపీ, తర్వాత టీడీపీలో ఉన్నప్పుడు సభ్యత్వ కార్డు ఇచ్చారని, వైసీపీలో మాత్రం ఎలాంటి కార్డు లేదా, రశీదు ఇవ్వలేదని ఆయన వ్యవహారాలు చూసే ఓ నేత చెప్పారు. పార్టీలో చేరి, జగన్‌తో కండువా కప్పించుకున్న తర్వాత, ఆయన నేరుగా నియోజకవర్గానికే వెళ్లారని, ఆయనకు ఇప్పటికీ పార్టీ ఆఫీసు ఎక్కడుందో కూడా తెలియదని, రాజు అనుచరులు చెబుతున్నారు.

ఆ ప్రకారంగా.. నిజంగా రాజుకు వైఎస్సార్‌సీపీ సభ్యత్వం లేకపోతే.. పార్టీ సభ్యుడు కాని వ్యక్తికి షోకాజ్ నోటీసు ఇవ్వడం, సస్పెండ్ చేయడం చెల్లదన్నది.. రాజు అనుచరులు ఇప్పుడు తెరపైకి తీసుకువచ్చిన కొత్త లాయింట్! పోనీ అలా కాదూ.. రాజుకు పార్టీ సభ్యత్వం ఉందని వైసీపీ నాయకత్వం వాదించిందనుకోండి. అప్పుడు ఆ మేరకు.. ఆయన సభ్యత్వకార్డు, రశీదు బయటపెట్టవలసి ఉంటుంది. ఆ పని ఇంతవరకూ చేయకపోవడం, మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. అందులో నిజంగా రాజు సంతకం ఉంటే ఫర్వాలేదు.

రాజు సభ్యత్వం బయటపెట్టకపోతే..

అలాకాకుండా, దానిపై ఆయన సంతకం లేకపోయినా సమస్యనే. ఒకవేళ సంతకం ఉండి, అది తనది కాదని రాజు వాదించినా సమస్యనే! మరి ఇప్పుడు వైసీపీ నాయకత్వం, ఆయన సభ్యత్వం రశీదును బయటపెడుతుందా? లేదా? అన్నది చూడాలి. నిజానికి ఒక పార్టీ అభ్యర్ధి గెలిచిన తర్వాత, దానిని ఎన్నికల సంఘం ఆయన గెలుపును ధృవీకరిస్తూ ఈసీ వెబ్‌సైట్‌లో సమాచారం అందిస్తుంది. ఆ తర్వాత సభ్యుల పేర్లతో గెజిట్ నోటిఫికేషన్ ఇస్తుంది. ఆ తర్వాతనే పార్లమెంటుసభ్యులు ప్రమాణం చేస్తారు.లోక్‌సభకు తన రక్షణ, ఎన్నికల నిబంధల విషయంలో.. డీజీపీని కాదని కేంద్ర మంత్రి రాజ్‌నాధ్‌సింగ్, ఎన్నికల కమిషనర్ వరకూ వెళ్లారంటే, వైసీపీతో అటో ఇటో తేల్చుకునేందుకు రాజు సిద్ధమవుతున్నట్లే లెక్క. కాబట్టి.. రాజు సభ్యత్వాన్ని బయటపెట్టకపోతే, వైసీపీ మరిన్ని చిక్కులు ఎదుర్కోవడం ఖాయమని న్యాయనిపుణులు చెబుతున్నారు.

బి ఫారం సంతకంపై కోర్టుకెళితే చిక్కులు తప్పవా?

నిజంగా రాజు తనకు పార్టీ సభ్యత్వం లేదని చెప్పినా, లేక పార్టీ నాయకత్వమే తన వద్ద ఉన్న రాజు సభ్యత్వ రశీదును బయటపెట్టకపోయినా.. ఈ వ్యవహారం వైసీపీ నాయకత్వానికి చిక్కులు తెచ్చే ప్రమాదం తప్పదనిపిస్తోంది. ఎందుకంటే.. అభ్యర్ధుల బి ఫారాలపై అధ్యక్షుడు సంతకం పెట్టే సందర్భంలో, సదరు అభ్యర్ధి తమ పార్టీ సభ్యుడేనని ధృవీకరిస్తారు. రఘురామ కృష్ణంరాజు బి ఫారంపైనా, జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షుడి హోదాలో అలాగే సంతకం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజు తనకు పార్టీ సభ్యత్వం లేదని చెబితే.. బి ఫారం ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు జగన్ న్యాయపరంగా-సాంకేతికంగా చిక్కుల్లో పడక తప్పదంటున్నారు. ఇదే అంశంపై ఎవరైనా కోర్టులో కేసు వేస్తే, అప్పుడు అది పార్టీ అస్తిత్వానికే ప్రమాదమని చెబుతున్నారు. అసలు పార్టీ సభ్యుడు కాకపోయినా.. ఆయన సభ్యుడని ధృవీకరిస్తూ, ఎన్నికల సంఘాన్ని కావాలని తప్పుదోవపట్టించారని, ఎవరైనా కేసు వేస్తే అది సాంకేతికంగా ప్రమాదకరమేనని న్యాయనిపుణులు కూడా చెబుతున్నారు.

వై లేదా వై ప్లస్ భద్రత?


ఇక తన రక్షణ విషయంలో రాష్ట్ర పోలీసులను కాదని, నేరుగా కేంద్రం నుంచి భద్రత తీసుకునేందుకు రాజు చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్లు తెలుస్తోంది. అలా రాజు కేంద్రమంత్రి రాజ్‌నాధ్‌సింగ్ ను కలవడం, ఆయన స్పందించి సెక్యూరిటీ ఏర్పాటుచేస్తానని హామీ ఇవ్వడం, బీజేపీ పెద్దల సూచనల మేరకు అంతకంటే ముందు.. కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలవడం వాయువేగంతో జరిగిపోయినట్లు తెలిసింది. ఆ ప్రకారంగా ఆయనకు వై లేదా వై ప్లస్ భద్రత కల్పిస్తారని భావిస్తున్నారు. వై ప్లస్ సెక్యూరిటీ ఇస్తే.. అందులో 1ప్లస్ 4 సాయుధ పోలీసులు ఇంటివద్ద కాపలా కాస్తారు. ఇద్దరు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు మూడు షిఫ్టుల్లో పనిచేస్తారు. అంటే మొత్తం బుల్లెట్‌ప్రూఫ్ కారు సహా, 11 మంది భద్రతా సిబ్బంది ఆయనకు రక్షణగా ఉంటారన్నమాట. నిజంగా అదే జరిగితే ఈ విషయంలో కేంద్రం, జగనన్న సర్కారుకు ఝలక్ ఇచ్చినట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఈ విషయంలో కేంద్రం, సంప్రదాయం ప్రకారం రాష్ట్ర పోలీసుల నుంచి నివేదక కూడా తెప్పించుకున్నట్లు కనిపించడం లేదు. కేవలం ఐబి నుంచి మాత్రమే నివేదిక తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. అటు ఎన్నికల కమిషనర్ గడప ఎక్కిన రాజు, తనకు వచ్చిన షోకాజ్ నోటీసు వెనుక ఉన్న లొసుగులను తవ్వితీయడంలో బిజీగా ఉన్నారు. ఈసీ కూడా తన జవాబును లిఖితపూర్వకంగానే ఇవ్వనుంది. దీన్నిబట్టి.. రాజుకు కేంద్రంలో ఏ స్ధాయిలో పలుకుబడి ఉందో, ఈపాటికి జగన్ సర్కారుకూ అర్ధమయి ఉండాలి.

సరే.. ఇప్పుడు రాజు గారు వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుడా కాదా? ఆయనకు ఆ పార్టీ సభ్యత్వం ఉందా? లేదా?.. తేల్చి, బయటపెట్టాల్సిన బాధ్యత, షోకాజు నోటీసు ఇచ్చిన విజయసాయిదే! నారు పోసిన వాడే నీరు పోయాలి కాబట్టి, షోకాజ్ ఇచ్చిన అదే చేత్తో, సభ్యత్వం సత్యాలు కూడా ఆయనే చెప్పాలి మరి!