కరోనా వ్యాప్తి నియంత్రణకు కఠినంగా కంటైన్మెంట్ చర్యలు చేపట్టాలి

274

ఫీల్డ్ లెవల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు మూడు కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు

60 ఏళ్ళు, 60 ఏళ్ల పైబడిన వారికి, ఇతర జబ్బులున్నవారికి తప్పనిసరిగా టెస్టింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు

అనంతపురం, జూన్ 27:

కరోనా వైరస్ మరింత పెరగకుండా అరికట్టేందుకు కంటైన్మెంట్ కఠినంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో డీఐజీ కాంతిరాణా టాటా, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబులతో కలిసి కోవిడ్ 19 కు సంబంధించి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా ను నియంత్రించేందుకు కంటైన్మెంట్ అన్నది చాలా ముఖ్యమని, పకడ్బందీగా, జాగ్రత్తగా కంటైన్మెంట్ చర్యలు అమలు చేయాలన్నారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా నగరంలో 20 వార్డులను గుర్తించి 60 ఏళ్ళు, 60 ఏళ్ల పైబడిన వారికి, వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉండి, ఇతర జబ్బులున్నవారికి తప్పనిసరిగా శాంపుల్స్ సేకరించి టెస్టింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు మూడు కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు :


కరోనా వైరస్ కు సంబంధించి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు మూడు కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. అందులో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారితో మాట్లాడి ,వారు ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు ఒక కంట్రోల్ రూమ్, కోవిడ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళిన వారితో మాట్లాడేందుకు ఒకటి, కరోనా లక్షణాలతో హాస్పిటల్లో ఉన్న వారితో మాట్లాడేందుకు ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలన్నారు. వారందరితో మాట్లాడేందుకు ఫోన్ నెంబర్లు తీసుకొని వివరాలు తెలుసుకోవాలని, ఇందుకు సంబంధించి కంట్రోల్ రూమ్ లో ఉండే వారికి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. హాస్పిటల్ ప్రిపేర్డ్నెస్ కు సంబంధించి కోవిడ్ పేషెంట్లకు చికిత్స చేసేందుకు గుంతకల్ ఆసుపత్రిని సిద్ధం చేయాలన్నారు. అలాగే ప్రతిరోజు ఎంతమందికి శాంపుల్ సేకరించాలి, టెస్టింగ్ నిర్వహించాలనే దానిపై అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కోవిడ్ నేపథ్యంలో అవసరమైన సిబ్బందిని నియమించుకోవడం కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా డీఐజీ కాంతిరాణా టాటా మాట్లాడుతూ, కరోనా వైరస్ మరింత విస్తరించకుండా అవసరమైన జాగ్రత్త చర్యలు చేపట్టాలని, అధికారులు అంతా బాగా పని చేయాలని సూచించారు. కంటైన్మెంట్ అన్నది సక్రమంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, డీఐజీ, జిల్లా ఎస్పీ లు కోవిడ్ 19 కు సంబంధించి అమలు చేయాల్సిన వ్యూహంపై చర్చించారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ( గ్రామ వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) ఏ.సిరి, డీఎంహెచ్వో డా.అనిల్ కుమార్, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డా.రామస్వామి నాయక్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. నీరజ, నగరపాలక సంస్థ కమిషనర్ పివిఎస్ఎన్ మూర్తి, డి సి హెచ్ ఎస్ రమేష్ నాథ్, నోడల్ ఆఫీసర్ వరప్రసాద్, ఆర్డీవో గుణ భూషణ్ రెడ్డి, తహసీల్దార్ అనుపమ, తదితరులు పాల్గొన్నారు.