అవును.. ఆ నలుగురు ఇష్టపడ్డారు!

226

కేసీఆర్,జగన్,బాబు.. ఓ మోదీ!
పెట్రోధరలు పెంచినా పెదవి విప్పని పెద్దలు
ప్రాంతీయ పార్టీల జాతీయ అధ్యక్షులేమయ్యారు?
మరి మోదీని సమర్ధిస్తున్నట్లా? వ్యతిరేకిస్తున్నట్లా?
ప్రశ్నించే పవనన్న పడుకున్నారా?
పెరుగుతున్న పెట్రోధరలపై జనం ఫైర్
                                 (మార్తి సుబ్రహ్మణ్యం)

తెలుగు రాష్ట్రాల్లోని అధికార -ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలు మోదీని ఇష్టపడుతున్నట్లున్నాయి. అందుకేమో… కేంద్రం ప్రతిరోజూ పెట్రోల్-డీజిల్ ధరలు పెంచుతున్నా పెదవి విప్పడం లేదు. కనీసం ఈ విషయాన్ని జనం గమనిస్తున్నారని కూడా తెలుసుకోకుండా..  ధరల పెరుగుదల అంశం అనేది ఒకటుందని, దానివల్ల సామాన్యుడు సమస్యలు ఎదుర్కొంటున్నారని గ్రహించకలేపోతున్నారు. మరి నిజంగా తెలుగు రాష్ట్రాల్లో అధికార ప్రాంతీయ పార్టీలకు జనం గోడు తెలియదా అంటే తెలుసు! కానీ కేంద్రాన్ని ప్రశ్నించాలంటే భయం. ఎందుకంటే.. ఒక కేసీఆర్, మరో జగన్, ఇంకో చంద్రబాబు, మరో పవన్‌కల్యాణ్ అంతా కలసి మోదీని ఇష్టపడుతున్నారు కాబట్టి. దానికి ఎవరి కారణాలు వారివి!! పైగా.. ఆ పెంపు వల్ల అధికారంలో ఉన్న రెండు ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాల బొక్కసం కూడా నిండుతుంది కాబట్టి! అదీ వారి మౌనానికి, మోడీపై భక్తి-అనురక్తికి అసలు కారణం!

లాక్‌డౌన్ కాలంలో సామాన్యుడి ఆర్ధిక పరిస్థితి విషాదంగా మారింది. అందుకే 20లక్షల కోట్ల ప్యాకేజీ ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆ ప్యాకేజీ ఎవరికి ప్రయోజనం చేకూర్చిందన్నది అదో పెద్ద చర్చ. పులిమీద పుట్రలా 20 రోజుల నుంచి శరంపరంపరగా కేంద్రం పెట్రోల్,డీజిల్ ధరను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరగదీస్తోంది. చమురురెరగడంతో డీజిల్ ధర తొలిసారి 80 రూపాయలు దాటింది. ఢిల్లీ సర్కారు డీజిల్‌పై వ్యాట్ పెంచడమే దీనికి కారణం. ఫలితంగా హైదరాబాద్‌లో పెట్రోల్ కంటే డీజిల్ ధర 4 రూపాయల 46 పైసలు ఎక్కువయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటరు పెటల్ ధర రు. 82.79 కాగా, డీజిల్ ధర రూ. 78.06.

జనం జేబులకు బదులు కేంద్ర ఖజానాకు..

నిజానికి ఈ నెల 7వ తేదీ నుంచి కేంద్రం పెట్రో ధరలు పెంచుతూపోతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతుంటే, మనదేశంలో మాత్రం పెట్రో ధరలు రోజురోజుకూ పెంచడంపై కాంగ్రెస్ సహా, అన్ని రాజకీయ పక్షాలు మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. వాస్తవానికి బిజెపి అధికారంలోకి వచ్చాక, 2014లో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు బ్యారెల్ ధర 100 డాలర్లు. ప్రస్తుతం 40 డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. దీనివల్ల కేంద్రానికి దాదాపు 10 లక్షల కోట్లు రాబట్టిందన్నది ఒక అంచనా. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర తగ్గనందున.. ఆ లాభాన్ని ప్రజలకు అందించాల్సిన కేంద్రం, ఎక్సైజ్ డ్యూటీ పెంపు పేరుతో సామాన్యుడికి మిగిలాల్సిన లాభాన్ని కూడా జేబులో వేసుకుంటోంది.

ఎక్సైజ్  సుంకంతో వీర బాదుడు..

ఆ ప్రకారంగా గత నెల పెట్రోల్‌పై 10 రూపాయలు, డీజిల్‌పై 13 రూపాయల సుంకం పెంచి 2 లక్షల కోట్ల అదనపు ఆదాయం అర్జించింది. అమెరికాలోని వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ చమురు ధరలు, మైనస్ 37.63 డాలర్లకు పడిపోయాయి.  దానితోపాటు బ్రెంట్ క్రూడాయిల్ ధర, ఏప్రిల్ 21 నాటికి 20 డాలర్ల కంటే తక్కువకు పడిపోయాయి. కానీ లాక్‌డౌన్ సమయంలో పడిపోయిన చమురు అమ్మకాలతో లాభాలు కోల్పోయిన కేంద్రం.. వాటిని పూడ్చుకునేందుకు, అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన ధరలను వినియోగదారులకు అందించకుండా.. ఎక్సైజ్ సుంకం పేరుతో వీరబాదుడు బాదేస్తోంది.

మోదీ వచ్చినా తగ్గని ధరలు..

ఈ దేశంలో మోదీ అధికారంలోకి వచ్చే సమయానికి పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ 9 రూపాయల 48 పైసలు. డీజిల్‌పై 3 రూపాయల 56 పైసలు. అప్పటినుంచి అది పెరుగుతూ, ఇప్పుడు పెట్రోల్‌పై 32 రూపాయల 98 పైసలు, డీజిల్‌పై 31 రూపాయల 83 పైసలకు చేరింది. రాష్ట్రాలు విధించే పన్నులు వీటికి అదనం! అసలు పెట్రోల్ అసలు ధర 18 రూపాయల 28 పైసలు. ఎక్సైజ్ డ్యూటీ 32.98 పైసలు. డీలర్ కమిషన్ 3 రూపాయల 56 పైసలు. రాష్ట్రాలు విధించే వ్యాట్ 16 రూపాయల 44 పైసలు. ఆ ప్రకారంగా ఒక లీటర్ పెట్రోల్ ధర, 71 రూపాయల 21 పైసలు. ఇది జూన్ 11 నాటి పరిస్థితి. ఇప్పుడు పెట్రోల్ ధర లీటరు  82 రూపాయల 79  పైసలు. అంటే ఆ ప్రకారంగా పన్నుల భారం ప్రజలపై వేయడం వల్ల, కేంద్ర-రాష్ట్రాలు తమ ఖజానాను ఏ స్థాయిలో నింపేసుకుంటున్నాయో స్పష్టమవుతోంది. అసలు తగ్గిన చమురు ధరల ప్రయోజనాన్ని వినియోగదారులకే ఇస్తే.. లీటరు పెటల్ 29 రూపాయలకే లభిస్తుందన్నది మేధావుల వాదన. దీనితో సోషల్‌మీడియాలో మోదీ సర్కారుపై విమర్శలు పెరుగుతున్నాయి. ‘మోదీజీ. మీరు సామాన్యులకు 20 లక్షల కోట్లు ఇచ్చారా? తీసుకుంటున్నారా?’ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటే, వాటిని జవాబు చెప్పలేని పరిస్థితిలో భాజపా నేతలున్నారు.

మరి కేసీఆర్, జగన్, బాబు, పవన్ మోదీని నిలదీయరేం?

అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా, దేశంలో మాత్రం రోజురోజుకూ పెట్రో ధరలు  పెంచుతున్న తీరును..  తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ వ్యతిరేకించకపోవడం, దానికి కారణమైన మోదీని ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులుగా విమర్శించకపోవడమే ఆశ్చర్యం. పైగా అటు జగన్, ఇటు ఇద్దరూ ‘జాతీయ పార్టీ’కి అధ్యక్షులు మరి!  నిజానికి ఏపీ-తెలంగాణ సీఎంలు ప్రాంతీయ పార్టీ నేతలు. వారికి సాంకేతికంగా బిజెపితో ఎలాంటి పొత్తు లేదు. పైగా తెలంగాణలో బిజెపి బలమైన ప్రతిపక్షం. మరి అలాంటిది.. కేసీఆర్-జగన్ ఇద్దరూ మోదీ విధానాలపై విరుచుకుపడకుండా, మౌనవ్రతం పాటించడంపై సహజంగా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

ఎవరి మొహమాటం.. ఎవరి భయం వారిది!

సరే.. జనసేన కల్యాణ్‌బాబు కంటే.. బీజేపీతో బాదరాయణ సంబంధాలు, పొత్తు లాంటి మొహమాటాలున్నందున.. ప్రశ్నించడానికే తన పార్టీ పుట్టిందని చెప్పిన జనసేన, ఇప్పుడు పెట్రో ధరల పెంపును ప్రశ్నించడానికి భయపడుతుందనుకోవచ్చు. కానీ, బీజేపీతో ఎలాంటి పొత్తు లేకపోయినా, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విషయంలో మోదీని ఎందుకు నిలదీయలేకపోతున్నారన్నది ప్రశ్న.

గత ఎన్నికల్లో బీజేపీ వల్లనే పుట్టిమునిగిన టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు  పెదవి విప్పి, మోదీని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఆయనకు మోదీపై ఉన్న మొహటామాటాలేమిటో ఎవరికీ అర్ధం కాదు. అసలు దేశవ్యాప్తంగా ధరలు పెంచిన మోదీని విమర్శించాల్సిన చంద్రబాబు, రాష్ట్రంలో పెట్రో ధరలపై వ్యాట్ ఆదాయం పొందే, జగన్ సర్కారును విమర్శించడమే విడ్డూరం. తాను సీఎంగా ఉన్నప్పుడు 2 రూపాయలు తగ్గించానని చెప్పిన చంద్రబాబు.. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గితే, దేశంలో ధరలు ఎందుకు పెంచుతున్నారని మోదీని అడిగే ధైర్యం లేకపోవడమే విచిత్రం.

అలాగే జగన్ పార్టీకీ బీజేపీకి పొత్తు లేదు. మరి ఆయన కూడా పెట్రో ధరలను ఎందుకు ఖండించలేకపోతున్నారు? తాను కూడా బాబు మాదిరిగా వ్యాట్‌ను తగ్గిస్తానని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ధరలు పెంచిన మోదీని ప్రశ్నించాల్సింది పోయి, ఆయనను చూస్తే ఎందుకు నిలువెల్లా వణికిపోతున్నారన్నది అర్ధం కాని ప్రశ్న. ఎందుకంటే.. కేద్రంలో ఉన్న పార్టీకీ- తెలంగాణ కేసీఆర్, ఆంధ్రా జగన్ పార్టీకీ ఎలాంటి పొత్తు లేకపోయినా.. వారిద్దరి ప్రభుత్వాలు కూడా, పెట్రోధరలపై విధించే వ్యాట్‌తోనే ఖజానా కడుపు నింపుతున్నారు కాబట్టి! అందుకే మౌనమునులయిపోయారన్న మాట!! వినియోగదారులూ.. మీకు అర్ధమవుతోందా?

1 COMMENT

  1. Hiya, I’m really glad I’ve found this information. Nowadays bloggers publish just about gossips and net and this is really frustrating. A good blog with exciting content, that’s what I need. Thanks for keeping this web-site, I’ll be visiting it. Do you do newsletters? Can’t find it.