యాండోయ్ జగన్ గారూ. బోన్నారా.?

425

ఆంధ్రాలో కొత్తజిల్లాల ఏర్పాటు అని ఇప్పుడే వార్తల్లో చూసేనండీ. మంచిది. సంతోషం!

కానీ మధ్యలో బంగారంలాంటి మా గోదారిజిల్లాల పేర్లు ఏం చేసినియ్యండి బాబా. మనపేరు ముందు పక్కింటోడి ఇంటిపేరు తగిలించినట్టు. కాకినాడ జిల్లా, రాజమండ్రి జిల్లా, అమలాపురం జిల్లా, ఏలూరు జిల్లా, నరసాపురం జిల్లా ఏంటండీ అసలా.!


అటు హనుమాన్ జంక్షన్ బోర్డర్ నుంచి ఇటు తుని తాండవ నది దాకా,ఇటేపు చింతూరు అడవుల్నుంచి ఆ మూల పాపికొండల్లో దాక్కునున్న పేరంటాలపల్లి దాకా అంతా గోదారిజిల్లాలే కదండీ.
ఈ ప్రాంతాల జనం స్టేటుమొత్తంలో ఎక్కడికెళ్లినా మమ్మల్ని గోదారిజిల్లావోళ్ళుగానే పిలిపిచ్చుకోడం అన్నది వేడేడి అన్నంలో కొత్తావకాయ బద్ద, అంత నేతి చుక్కా ఏసి, అరచేతికి కూడా అంటేలా కలిపినంత సంబరమండీ మాకు.!

ఓ దీర్ఘం ఎక్కువో తక్కువో, ఓ వొత్తు అటో ఇటో అయ్యుండొచ్చు గానీ మా మాటలో యాస చూసి, కొత్తాపాతా లేని ఎటకారానికి మురిసి, మీది గోదారి జిల్లాగానీనా ఏంట్రా అబ్బూ అని అడిగేవోళ్ళు కుప్పలండీ బాబూ. అంతేతప్ప నువ్వు కాకినాడోడివా లేక రాయిమండ్రి పక్కనా, ఏలూరు మిలట్రీ రాజుగారి ఎదురుసందోడివా అని లెక్క లెయ్యరండి.అదీ. మా ఓన్ ఐడెంటిటీ.!

అలాంటిది ఇప్పటికిప్పుడొచ్చి ఉన్నపళంగా మీరు గోదారిజిల్లా పేరునే తీసి పడేసి, ఊరి పేర్లు తగిలింతానంటుంటే ఎక్కడో సురుక్కుమంటందండీ నిజంగా.! సొంపుల్తో ఎన్ని పేర్లెట్టినా సరే గోదారిజిల్లాల్లో ఉన్న ఒంపులు, అందం ఆ కొత్తపేర్లకొస్తాయేంటండీ.? ఆయ్.

మోమాటంతో కూడిన కలివిడితనం, కడుపులోది తీసి పెట్టే మమకారం, ఒళ్ళంతా ఎటకారాలతో వరల్డ్ ఫేమస్సయిపోయినియ్యండీ గోదారి జిల్లాల పేర్లు. కాబట్టి బ్బాబ్బాబూ. జిల్లాని మీరెన్ని ముక్కలు చేసినా పర్లేదుగానీ, దయచేసి ఆ పేర్లని మాత్రం అలాగే ఉంచేద్దురూ. అలా పిలిపించుకోడానికి ఇష్టపడే సెంటిమెంటల్ ఫూల్సుమండీ మేము.

మా జిల్లాలనే కాదండీ.!

మా కాకినాడనుంచి బయదెళ్లే ఫేమస్ బండి సర్కార్ ఎక్స్ప్రెస్ స్లీపర్ బోగీలో కిటికీ పక్కన కూకున్న యే పెద్దావిడిని పలకరించినాగానీ, మద్రాసెళ్తున్నామనే చెప్తారు తప్ప అప్పుడెప్పుడో పేరుమార్చిన ‘చెన్నై’ అని మాత్రం చెప్పరండీ.!

అలాగే ఎవరెన్ని కథలు పడ్డా కోల్కతా చాలామందికిప్పటికీ కలకత్తాయే.

ముంబై అని ముక్కుతో పలికేకంటే ఒకప్పటి బొంబాయే బోందని ఇప్పటికీ అలాగే ముద్దుగా పిలుచుకుంటాం కదండీ బొంబాయిలో అంతే, బొంబాయిలో అంతే అని..

పైన చెప్పిన ఊళ్ళ పేర్లన్నింటినీ ఏయేయో చెప్పి రికార్డుల్లో మార్చగలిగేరేమోగానీ గుండెల్లో ప్రింటడిపోయిన ఆ పాతపేర్లని మార్చగలిగేరేంటండీ ఆయ్.

అన్నట్టు మనలో మనమాటండీ.!

సంవత్సరం క్రితం అధికారంలోకొచ్చిన మీరు ముచ్చటపడి వేసుకున్న రంగుల్ని కోర్టువాళ్ళు తీసేయ్యమన్నందుకే మీ అభిమానులకి అంతంత కోపాలొచ్చాయ్ కదండీ. మరి శతాబ్దాల తరబడి సంస్కృతితో మమేకమైపోయిన గోదారి జిల్లా పేర్లని తీసిపారేస్తానంటే మాకు ఆ మాత్రం బాధ కలగ దేంటండీ.?

ఆలోచించండి
ఓ పాలి!