లాయర్ జంధ్యాల రవిశంకర్ దాదా..!

418
విపక్షాలకు ఆయనే అస్త్రం
రఘురాముడి లేఖాస్త్రం వెనుక కరణం గారు
ఆజానుబాహుడి ఆట వెనుక లీగల్ కోచ్
 వైసీపీ నాయకత్వం ఉక్కిరిబిక్కిరి
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలుగు రాష్ట్రాల్లో సర్కారుపై సమరం సాగించే విపక్షాలకు ఆయనో అస్త్రం. పాలకుల ఒంటెత్తు పోకడలు, ఏకపక్ష నిర్ణయాలను కోర్టులో సవాల్ చేసే శస్త్రం ఆయన. అప్పుడు అధికారపక్షానికి, ఇప్పుడు విపక్షాలు కష్టాల్లో ఉన్నప్పుడు ఠక్కున గుర్తుకొచ్చేది ఆయన పేరే!  ప్రత్యర్ధుల ఊహకందని లాజిక్కులను తెరపైకి తెచ్చి, ఆయువుపట్టుపై దెబ్బకొట్టే ఆ కరణం గారి బుర్ర పేరు జంధ్యాల రవిశంకర్. బీకాం.బీఎల్! తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైసీపీ తనకు ఇచ్చిన షోకాజ్‌కు..‘గుంటూరు మిర్చి’లాంటి ఘాటైన జవాబు ఇచ్చి, జగనన్నపైనే  జంగ్ మొదలెట్టిన నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజు లేఖ వెనుక.. కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఈ లాయర్ జంద్యాల రవింశకర్ దాదాదే!
దేశచరిత్రలో 151 అసెంబ్లీ.. 23 లోక్‌సభ స్థానాలు.. 52 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీ అధినేతను,  తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టిన ఓ ఎంపీ గడగడలాడిస్తున్నారు. తన వ్యాఖ్యలతో ఊపిరాడకుండా చేస్తున్నారు. తనకు షోకాజు నోటీసులిచ్చినందుకు  ఎక్కడలేని లాజిక్కులను తెరపైకి తెచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఫలితంగా.. అనవసరంగా ఆయనను రెచ్చగొట్టామేమోనని అంత పెద్ద అధినేతనే ఇప్పుడు నాలిక్కరచుకోలసిన పరిస్థితి కల్పించారు. ఎవరిమాటా వినని మొండివాడిగా పేరున్న ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికే సవాలు విసిరిన ఆ ఎంపీ గోదావరి గండరగండడు రఘురామకృష్ణంరాజయితే.. ఆయన సంధిస్తున్న అస్త్రాల వెనుక న్యాయ-చట్టపరమైన శస్త్రాలు అందిస్తున్నది ‘గుంటూరు మిర్చి’,  ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్. ఈ ఇద్దరూ ఇప్పుడు ఏపీ సర్కారుకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు.
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు.. నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విజయసాయిరెడ్డి షోకాజు నోటీసు జారీ చేయడం కలకలం సృష్టించింది. తనకు వారం రోజుల వ్యవధి అవసరం లేదని, ఒక్కరోజు చాలంటూ.. సరిగ్గా ఒక్కరోజులోనే తిరుగులేని జవాబును, చెప్పలేని జవాబును సొంత పార్టీపై సంధించిన రఘురాముడి దెబ్బకు,  ఏం చేయాలో అర్ధం కాక  వైసీపీ శిబిరం తలపట్టుకోవలసి వచ్చింది.ఇది కూడా చదవండి: వైఎస్సార్ కాంగ్రెస్‌లో రాజుగారి రచ్చ!
రఘురాముడు పార్టీ నాయకత్వంపై ఎదురు సంధించిన అస్త్రాలు.. వైస్సార్ కాంగ్రెస్‌పార్టీ అస్తిత్వానికే సవాలుగా మారింది. క్రమశిక్షణ కమిటీ తీర్మాలను బయటపెట్టాలని ఒక మెలిక, అసలు లెటర్‌హెడ్‌లో వాడిన పార్టీ తమది కాదన్న మరో మెలికపెట్టడం ద్వారా, రఘురాముడు జగన్ పార్టీ ఆయువుపట్టుమీదనే దెబ్బకొట్టడం షాక్‌కు గురిచేసింది. హటాత్తుగా ఊడిపడిన ఈ ప్రశ్నలతో సతమతమవుతున్న వైసీపీకి, పులిమీదపుట్రలా.. ‘అన్న వైఎస్సార్’ పార్టీ అధినేత తెరపైకి వచ్చి, అసలు పార్టీ తనదేననడం జగనన్న అండ్ కోకు  శరాఘాతంలా పరిణమించింది. ఈ మెలికలు కలిపి  రఘురాముడు సంధించిన ప్రశ్నాస్త్రాల వెనుక.. ఆయన రూపొందించిన లేఖ వెనుక, ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ఉండటం విశేషం. గత కొద్దినెలల నుంచి ఏపీ సర్కారును వేధిస్తున్న నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంలో, ఆయన పక్షాన కేసు వేసిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తరఫున వాదించిన జంధ్యాల వాదనను హైకోర్టు అంగీకరించి, నిమ్మగడ్డనే ఎస్‌ఈసీగా నియమించింది. గతంలో అసెంబ్లీ న్యాయసలహాదారుగా పనిచేసిన జంధ్యాల, తనకున్న న్యాయ-చట్టపరమైన విజ్ఞానంతో తనకంటూ ఓ ప్రత్యేకత సృష్టించుకున్నారు. ప్రస్తుతం జంధ్యాల ఏం చెప్పనున్నారన్న ఆసక్తి, ఉత్కంఠ టీవీ న్యూస్ చానెళ్లు చూసే వారిలో ఏర్పడిందంటే, ఆయన ఇమేజ్ ఏ స్థాయిలో పెరిగిందో ఊహించుకోవడం పెద్ద కష్టం కాదు. ఒక న్యాయవాదికి ఈ స్థాయిలో ఫాలోయింగ్ ఉండటమే విశేషం.
రఘురామకృష్ణంరాజు ద్వారా జంధ్యాల సృష్టించిన రాజకీయ తుపాన్‌లో, వైసీపీ అస్తిత్వమే ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఏర్పడింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు అసలు ఏ పార్టీ నుంచి ఎంపికయ్యారు? రేపు మళ్లీ ఎవరైనా పార్టీ పేరుపై కోర్టుకు వెళితే, వారి భవిష్యత్తేమిటి?  క్రమశిక్షణ కమిటీని ఏర్పాటుచేస్తూ  ఇప్పటివరకూ ఈసీకి లేఖ పంపించకపోవడం ఏమిటి?  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, అన్న వైఎస్సార్ పార్టీకీ తేడా ఏమిటి? వైఎస్సార్‌సీపీ పూర్తి పేరుతో లెటర్‌హెడ్‌పై తయారుచేయాలన్న కనీస స్పృహ కూడా జగనన్న న్యాయ సలహాదారులకు లేదా? అసలు ఇలాంటి మౌలిక విషయాలు కూడా పరిశీలించి, సమీక్షించుకునే యంత్రాంగం జగనన్నకు లేదా? అన్న ప్రశ్నలు వైసీపీ ప్రజాప్రతినిధులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
సాధారణంగా ఒక నేతను పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత, ఆతను తిరుగుబాటు చేస్తారు. ఆ సందర్భంలో న్యాయపరమైన, రాజ్యాంగపరమైన ప్రశ్నలు తమను బహిష్కరించిన నాయకత్వంపై  సంధిస్తారు. గతంలో నాదెండ్ల భాస్కరరావు ప్రజాస్వామ్య తెలుగుదేశం, హరికృష్ణ అన్న తెలుగుదేశం, పార్టీ చీలిన తర్వాత ఎన్టీఆర్ తె లుగుదేశం స్థాపించారు. కానీ, ఒక ఎంపి పార్టీలోనే ఉంటూ.. పార్టీ చీలిపోయేందుకు కారణమయ్యే మౌలిక ప్రశ్నలు, పార్టీ అస్తిత్వాన్నే ప్రశ్నించే న్యాయపరమైన సందేహాలు తెరపైకి తీసుకువచ్చి, అధినేత కంటిమీద కునుకులేకుండా చేయడం ఇదే తొలిసారి. అందుకు పాత్రధారి రఘురాముడయితే, తెరవెనుక సూత్రధారి న్యాయవాది జంధ్యాల రవిశంకర్!!  చూద్దాం.. రఘురాముడు సంధించిన ప్రశ్నాస్త్రాలకు విజయసాయి ఏం బదులిస్తారో?!