‘దేశం’ పార్టీకి యాదవులు దూరం!

708

తెలంగాణలో మాదిరిగానే ఏపీలోనూ
ఇప్పటివరకూ ఒక్క యాదవుడికీ రాజ్యసభ ఇవ్వని టీడీపీ
యాదవులకు జగన్ పెద్దపీట
త్వరలో అనిల్‌కుమార్‌యాదవ్‌కు  డిప్యూటీ సీఎం?
సన్నిధి గొల్లలకు న్యాయం చేయలేని బాబు
ఏడాదిలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్
సన్నిధి గొల్లలకు వంశపారంపర్య హక్కులు
యాదవులకు తొలిసారి రాజ్యసభ సీటిచ్చిన కేసీఆర్
కేసీఆర్ దారిలోనే జగన్మోహన్‌రెడ్డి
              (మార్తి సుబ్రహ్మణ్యం)

తెలుగుదేశం పార్టీ.. ఇది వెనుకబడిన వర్గాలకు ఓ అస్త్రం. అది తమ పార్టీ అని ధైర్యంగా, గర్వంగా  చెప్పుకునే పరిస్థితి. అది ఒకప్పుడు. ఇప్పుడు ఆంధ్రప్రదే శ్‌లో అతిపెద్ద వెనుకబడిన వర్గాల కులమైన యాదవులు తెలుగుదేశం పార్టీకి క్రమంగా దూరమవుతున్నారు. తెలుగుదేశం పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకు, మద్దతుదారైన యాదవులను ఇప్పుడు వైసీపీ అధినేత, సీఎం జగన్ తన వైపు మళ్లించుకోవడంలో సఫలీకృతులవుతున్నారు. నెల్లూరు జిల్లా యాదవ సామాజికవర్గానికి చెందిన మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌కు, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఫలితంగా.. ఇన్నేళ్ల టీడీపీ చరిత్రలో ఆ పార్టీకి దన్నుగా ఉన్న యాదవులకు ఒక్క రాజ్యసభ సీటు కూడా ఇవ్వని చంద్రబాబునాయుడుకు, వైసీపీ అధినేత జగన్ ఝలక్ ఇవ్వనున్నారు.

ఏపీలో బీసీ వర్గాల్లో యాదవుల జనాభా ఎక్కువ. చిత్తూరు, నెల్లూరు, విశాఖ, ఒంగోలు వంటి నగరాల్లో బీసీలలో యాదవుల సంఖ్య ఎక్కువ. మిగిలిన నగరాలు, పట్టణాలలో రెండవ స్థానంలో వారే ఉంటారు. అలాంటి సామాజికవర్గం తొలి నుంచీ తెలుగుదేశం మద్దతుదారుగానే కొనసాగుతోంది. అయినా, ఆ పార్టీ ఇప్పటివరకూ ఒక్క యాదవుడికీ రాజ్యసభ సీటివ్వలేదు. ఉపుఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. ఆ అసంతృప్తి యాదవులలో బాగా నాటుకుపోయింది. నెల్లూరు వంటి రెడ్డి ఆధిపత్యం ఉన్న జిల్లాల్లో యాదవ వర్గానికి చెందిన బీద మస్తాన్‌రావును, ఓడిపోతాడని తెలిసినా టిడిపి నాయకత్వం ఎన్నికల్లో నిలబెట్టింది. రాజ్యసభ సీటు ఇస్తామని ఊరించి, చివరలో కమ్మ, వెలమ వర్గాలనే అందలమెక్కించడం.. యాదవ వర్గంలో ఆగ్రహానికి దారితీసింది. చివరకు మస్తాన్‌రావు వైసీపీలో చేరగా, కొన్ని సామాజికవర్గ సమీకరణల కారణంగా ఆయనకు రాజ్యసభ సీటు దక్కలేదు. అయితే, ఈసారి కచ్చితంగా రాజ్యసభ సీటు ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అనిల్‌కుమార్ యాదవ్‌కు ఉప ముఖ్యమంత్రి?

ఇద్దరు మంత్రుల రాజీనామా నేపథ్యంలో.. నెల్లూరు జిల్లాలో యాదవ సామాజికవర్గానికి చెందిన మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌కు, ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం. మరో ఏడాదిన్నర తర్వాత బీద మస్తాన్‌రావుకు రాజ్యసభ ఇచ్చేందుకు జగన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మస్తాన్‌రావు సోదరైడె న ఎమ్మెల్సీ బీద రవిచంద్రయాదవ్ టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఆయనను కూడా పార్టీలో చేరాలని వైసీపీ నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నట్లు సమాచారం. అయితే, రవిచంద్రయాదవ్‌కు టీడీపీ ఏపీ అధ్యక్ష పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఇద్దరూ రవిచంద్రకు బాగానే ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం రవిచంద్ర నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తుండగా, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఉమ్మడి తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.

యాదవ నేతలకు జగన్ ప్రాధాన్యం..

కాగా, రాష్ట్రంలో యాదవుల సంఖ్య, వారి ప్రాధాన్యం తెలిసిన సీఎం జగన్.. వారికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వచ్చే మంత్రివర్గ విస్తరణలో కృష్ణా జిల్లా నుంచి..  ఎమ్లెల్యే,  మాజీ మంత్రి కొలుసు పార్ధసారధికి మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి నుంచి నాగేశ్వరరావు, నెల్లూరు నుంచి మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, గుంటూరు జిల్లా నుంచి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి యాదవ్‌కు ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈసారి రాజ్యసభ సీటు బీద మస్తాన్‌రావుకు, ఈసారి పిల్లి సుభాస్‌చంద్రబోస్ స్థానంలో ఉప ముఖ్యమంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌కు ఇవ్వాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

తెలుగుదేశం పార్టీకి పెట్టనిగోడలా నిలిచిన యాదవులు..

ఈ పరిణామాలు సహజంగానే టీడీపీని ఇరుకున పెట్టనున్నాయి. టీడీపీ ఆవిర్భావం నుంచీ యాదవులు ఆ పార్టీనే అంటిపెట్టుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో యనమల రామకృష్ణుడు, తలసాని శ్రీనివాసయాదవ్, చెన్నబోయిన కృష్ణాయాదవ్‌కు మంత్రి పదవులిచ్చింది. వీరిలో తొలుత కృష్ణాయాదవ్ తెలుగుయువత ఇన్చార్జి హోదాలో పనిచేసినందున, ఏపీలోని యాదవ వర్గంతో  ఆయనకు విస్తృత సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత తలసాని శ్రీనివాసయాదవ్, ఏపీలోని యాదవ వర్గాలతో మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ముందు కృష్ణాజిల్లాకు వచ్చిన ఆయనకు, యాదవులు ఏపీ సరిహద్దు నుంచి  బ్రహ్మరధం పట్టారు. చంద్రబాబుకు కచ్చితంగా రిటర్న్‌గిఫ్టు ఇస్తామని హెచ్చరించి మరీ వె ళ్లారు. దానికి తగినట్లుగానే.. ఏపీలో ఎప్పుడూ టీడీపీ వైపు మొగ్గు చూపే యాదవులు, గత ఎన్నికల్లో వైసీపీకి జైకొట్టారు.

సన్నిధి గొల్లల హామీ నెరవేర్చిన జగన్..


కాగా, తాజాగా తిరుమలలో సన్నిధి గొల్ల యాదవులకు వంశపారంపర్య హక్కులు ఇవ్వడం ద్వారా, వైసీపీ అధినేత, సీఎం  జగన్.. రాష్ట్రంలోని లక్షలాదిమంది యాదవుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు. నిజానికి, సన్నిధి గొల్లలకు అర్చకుల మాదిరిగానే  వంశపారంపర్య హక్కులివ్వాలని, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ యాదవ నే తలు చెప్పులరిగేలా ఆయన చుట్టూ తిరిగారు. కానీ, అప్పుడు సీఎంఓలో ఉన్న ఐఏఎస్ అధికారి సతీష్‌చంద్ర, టీటీడీ జెఈఓ శ్రీనివాసరాజు  వైఖరి, ఆలస్యం వల్ల అది ఫలించలేదు. దానిపై అప్పట్లో యాదవ నేతలు, వారిద్దరి తీరుపై కారాలు మిరియాలు నూరారు. అయితే, తాను అధికారంలోకి వస్తే సన్నిధి గొల్లలకు వంశపారంపర్య హక్కులు కల్పిస్తానని అప్పట్లో జగన్ వారికి హామీ ఇచ్చారు.

ఆ హామీకి అనుగుణంగానే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే, తిరుమలలో స్వామివారికి సేవచేస్తున్న సన్నిధి గొల్లలకు వంశపారంపర్య హక్కులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక్క ఏపీలోనే కాదు. తెలంగాణ రాష్ట్రంలోని యాదవుల మనసులనూ జగన్ గెలిచినట్టయింది. సన్నిధి గొల్లలకు వంశపారంపర్య హక్కులు కల్పించినందుకు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కూడా జగన్‌కు కృతజ్ఞతలు చెప్పారు. యాదవులు మీ మేలు మర్చిపోలేరని జగన్‌ను అభినందించారు.

యనమల రామకృష్ణుడు ఉన్నా..

ఇలాంటి పరిణామాలు, జగన్ తీసుకుంటున్న మానవీయ నిర్ణయాలతో,  యాదవులు వైసీపీ వైపు మొగ్గుచూపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది సహజంగా తెలుగుదేశం పార్టీకి ప్రమాదఘంటికగానే మారింది. టీడీపీలో యాదవ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి రాజ్యసభ సీటు ఇవ్వకుండా, వ్యాపార వర్గానికి చెందిన సీఎం రమేష్‌కు ఇవ్వడం అప్పట్లో యాదవులను గాయపరిచింది. అయితే ఆయనకు మండలి నేతగా అవకాశం ఇచ్చారు. యనమల తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నేత . యాదవుల సంఖ్య అక్కడ అత్యల్పం. దానితో ఆయన అటు బీసీలలో శెట్టిబలిజలను ఇటు, కాపులలో నిమ్మకాయల చినరాజప్ప వంటి నేతలను ప్రోత్సహించాల్సి వస్తోంది. ఆయన తన వియ్యంకుడైన పుట్టా సుధాకర్‌యాదవ్‌కు టీటీడీ చైర్మన్ ఇప్పించుకున్నా, ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. డీఎల్ రవీంద్రారెడ్డి వంటి సీనియర్‌కు  అసెంబ్లీ సీటిచ్చేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నా, యనమల అడ్డుపడి తన వియ్యంకుడైన సుధాకర్‌యాదవ్‌కు సీటు ఇప్పించుకున్నా ఆయన గెలవలేకపోయారు. పైగా సుధాకర్‌యాదవ్ కంపెనీకి ఇరిగేషన్ కాంట్రాక్టులు, యనమల అల్లుడికి కార్పొరేషన్ చైర్మన్ ఎండి పదవి ఇప్పించుకున్నారన్న విమర్శలకు గురయ్యారు. కేవలం ఆయన వల్లనే ఆ జిల్లాలో కాపులు పార్టీకి దూరమయ్యారన్న విమర్శలున్నాయి. అయినప్పటికీ.. యనమల ఇప్పటికీ, ఎప్పటికీ పార్టీకి చెరగని ఆస్తి అన్నది సుస్పష్టం.ఇది కూడా చదవండి.. బీసీకే ‘దేశం’ పగ్గాలు!

తెలంగాణలో టీడీపీకి యాదవులు, గౌడ్లు దూరం..

ప్రస్తుతం యాదవుల విషయంలో జగన్ అనుసరిస్తోన్న వ్యూహం వల్ల.. ఏపీలో కూడా యాదవులు తెలంగాణలో మాదిరిగా,  టీడీపీకి దూరమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. తెలంగాణలో టీడీపీకి పెట్టని గోడలుగా ఉన్న కృష్ణాయాదవ్, శ్రీనివాసయాదవ్, జైపాల్‌యాదవ్, అరిగెల నాగేశ్వరావు యాదవ్, లింగయ్యయాదవ్ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడి, తెలంగాణ విడిపోయేంత వరకూ ఒక్క యాదవుడికీ రాజ్యసభ సీటవివ్వని పరిస్థితిలో..  యాదవ వర్గానికి చెందిన లింగయ్య యాదవ్‌కు, కేసీఆర్  ఏకంగా రాజ్యసభ సీటిచ్చి, యాదవుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.  వారిలో తలసానికి మంత్రి పదవి ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్‌లో తలసానికి మంచి ప్రాధాన్యం ఇస్తున్నారు. విపక్షాలపై విమర్శలకు ఆయననే తురుపుముక్కగా వాడుతున్నారు.  నల్లగొండ జిల్లాకు చెందిన లింగయ్యయాదవ్ టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసినా, కనీసం  ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ  టికెట్ కూడా ఇవ్వకపోతే, కేసీఆర్ ఏకంగా ఆయనకు రాజ్యసభ సీటే ఇచ్చారు. ఇక సీపీఎం నుంచి చేరిన నోముల నర్శిమయ్యను ఎమ్మెల్యేను చేశారు. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీకి సంప్రదాయ మద్దతుదారుగా ఉన్న యాదవ, గౌడ సామాజికవర్గ నేతలు టీఆర్ ఎస్, బీజేపీలో చేరిపోవడంతో, అక్కడ టీడీపీ బీసీ ఓటు బ్యాంకు ఖాళీ అయిపోయింది. ప్రస్తుతం పార్టీలోనే ఉన్న అరవిందకుమార్‌గౌడ్ వంటి సీనియర్లకు గుర్తింపు కరవయింది. ఆయనకు చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు, విభజిత రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడూ ఎలాంటి న్యాయం చేయలేకపోయారు.

కేసీఆర్ బాటలోనే.. జగన్!

యాదవుల జనాభా, వారి ప్రాధాన్యం తెలిసిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ సామాజికవర్గానికి పట్టం కట్టిన వ్యూహమే, ఏపీలో సీఎం జగన్ కూడా అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఏపీలో ఉన్న బీసీలలో అధిక జనాభా ఉన్న యాదవులను దరి చేర్చుకోవడం ద్వారా, టీడీపీని వారి నుంచి దూరం చేసే వ్యూహానికి పదునుపెడుతున్నారు. అనిల్‌కుమార్ యాదవ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం, అందులో భాగంగానే కనిపిస్తోంది. అనిల్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే, ఏపీలో ఉన్న యాదవులు గంపగుత్తగా వైసీపీ వైపు  మళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి యాదవ్‌కు టీటీడీ బోర్డు సభ్యత్వం ఇచ్చారు. ఇప్పటివరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్క యాదవుడికీ రాజ్యసభ సీటివ్వని నేపథ్యంలో.. ఆ వర్గానికి చెందిన లింగయ్యయాదవ్‌కు రాజ్యసభ సీటివ్వడం ద్వారా, కేసీఆర్ వారి పెదవులపై చిరునవ్వులు పూయించారు. అదే తరహాలో బీద మస్తాన్‌రావుకు వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో సీటిస్తానని జగన్ హామీ ఇచ్చారు. జగన్ హామీ ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తారన్న ప్రచారం ఉంది. మరి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. ఈ సామాజికవర్గ సమీకరణను ఏవిధంగా తిప్పికొట్టి, యాదవులను ఏవిధంగా తనవైపు ఉండేలా చూస్తారో వేచి చూడాలి.