వైఎస్సార్ కాంగ్రెస్‌లో రాజుగారి రచ్చ!

369

ఇంతకూ వైఎస్సార్ కాంగ్రెస్ ఎవరిది?
విజయసాయి పంపిన లెటర్‌హెడ్ చెల్లదన్న రాజు
అది మరో పార్టీదన్న వాదన
అసలు లెటర్‌హెడ్‌పై పూర్తి పేరు ఉండాలన్న ఈసీ
లేఖ వెనుక న్యాయవాది జంధ్యాల చాణక్యం
ఊహకందని లాజిక్కులతో విజయసాయికి రాజుగారి ప్రశ్నాస్త్రాలు
కోర్టులో సవాల్ చేస్తానన్న అన్న వైఎస్సార్ పార్టీ అధినేత బాషా
దమ్ముంటే చానెళ్లలో చర్చకు రమ్మని వైవి, విజయసాయికి సవాల్
                 (మార్తి సుబ్రహ్మణ్యం)

నర్సాపురం వైసీపీ ఎంపి రఘురామకృష్ణంరాజు పెట్టిన చిచ్చు రగులుతోంది. ఇది చినికి చినికి గాలి వానగా మారి, చివరకు ఆ పార్టీ రిజిస్ట్రేషన్‌కే నీళ్లు తెచ్చేలా కనిపిస్తోంది. ఎన్నికల సంఘం కూడా స్పందించక తప్పని పరిస్థితి సృష్టిస్తోంది.  ఇప్పటివరకూ ఈ వివాదం ఎంపి రఘురామకృష్ణంరాజు- వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి పరిమితం కాగా.. తాజాగా రఘురామకృష్ణంరాజు రాసిన లేఖ ఫలితంగా.. ‘అన్న వైఎస్సార్ పార్టీ’ అధినేత బాషా కూడా వచ్చి చేరడం ఆసక్తి కలిగిస్తోంది. ఆయన తనను జగన్ మామ మోసం చేసి, తన వద్ద ఉన్న డాక్యుమెంట్లు తీసుకుని అదే పేరుతో పార్టీ పెట్టించారని వెల్లడించారు. వైవి సుబ్బారెడ్డి, విజయసాయికి దమ్ముంటే, టివి చానెళ్లలో తనతో చర్చకు రావాలని ఎస్.ఎం. బాషా సవాల్ చేయడం ఈ పార్టీ పేరు వివాదం కొత్త మలుపు తిరిగినట్టయింది. దీనితో ఇప్పుడు అసలు వైఎస్సార్‌సీపీ ఎవరిది? జగన్ పెట్టిన వైఎస్సార్‌పార్టీ ఏమయింది? అన్న వైఎస్సార్ పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్నలు గజిబిజి గందరగోళంగా మారాయి.[pdf-embedder url=”http://35.226.7.53/wp-content/uploads/2020/06/Detailed-Profile-Shri-Y.-S.-Jagan-Mohan-Reddy-Members-of-Parliament-Lok-Sabha-Whos-Who-Government_-National-Portal-of-India.pdf” title=”Detailed Profile – Shri Y. S. Jagan Mohan Reddy – Members of Parliament (Lok Sabha) – Who’s Who – Government_ National Portal of India”]

పార్టీ పేర్లపై రఘురామరాజు లాజిక్కులతో కొత్త చిక్కులు

పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు, నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజుకు షోకాజ్ నోటీసు ఇచ్చిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎంపి రఘురామకృష్ణంరాజు ఘాటుగా స్పందించారు. దీనికి సంబంధించి పార్టీ పేరుతో వచ్చిన లెటర్‌హెడ్‌ను అస్త్రంగా సంధించడం కొత్త చిక్కులకు దారితీసినట్టయింది. అసలు తాను ఎన్నికల్లో పోటీ చేసే ముందు ఇచ్చిన బి-ఫారంలో ఇచ్చిన పార్టీ పేరుకు, తనకు విజయసాయిరెడ్డి పేరుతో ఉన్న లెటర్‌హెడ్‌లో ఇచ్చిన పార్టీ పేరుకు, ఎలాంటి సంబంధం లేదన్న లాజిక్కును తెరపైకి తీసుకురావడం, వైసీపీ నాయకత్వానికి షాక్ కలిగించింది. పైగా ఇది తన స్పందన, వివరణ ఎంతమాత్రం కాదన్నారు. ‘లెటర్‌హెడ్‌పై యువజన శ్రామికరైతు కాంగ్రెస్ పార్టీ బదులు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ ఎలా ఇస్తారు? రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీకి, జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఎలా ఉంటుంది? పార్టీలో క్రమశిక్షణ సంఘం ఉందా? ఉంటే ఆ సంఘానికి ఎన్నికల సంఘం గుర్తింపు ఉందా?క్రమశిక్షణ సంఘానికి చైర్మన్, సభ్యుల వివరాలు సహా, సంఘం మినిట్స్ ఉంటే నాకు పంపించండి. ఎన్నికల సంఘం ఆమోదించిన క్రమశిక్షణ సంఘం  ముందు వివరణ ఇచ్చేందుకు నేను సిద్ధమే’నని రఘురామకృష్ణంరాజు.. వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి స్పష్టం చేశారు.[pdf-embedder url=”http://35.226.7.53/wp-content/uploads/2020/06/raghu-shocase_.pdf” title=”raghu- shocase_”]

పార్టీ క్రమశిక్షణ సంఘం ఉందా..?

రఘురామకృష్ణంరాజు హటాత్తుగా, లెటర్‌హెడ్‌పై ఉన్న పార్టీ పేరు తనది కాదని, తాను ఆ పార్టీ పేరు మీద ఎన్నిక కాలేదని, తాను వైస్సార్‌కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానన్న లాజిక్కు జగన్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దానితోపాటు ఆయన కొత్తగా లేవనెత్తిన పార్టీ క్రమశిక్షణ సంఘం వ్యవహారం కూడా జగన్ పార్టీని చిక్కుల్లోకి నెట్టింది. ఎందుకంటే.. ఒక పార్టీ క్రమశిక్షణ సంఘం ఏర్పాటుచేసేముందు.. పార్టీ సర్వసభ్య సమావేశం జరిపి, అందులో 2/3 వంతు మందితో క్రమశిక్ష కమిటీని ఎన్నుకోవాలి. తర్వాత దానిని ఎన్నికల కమిషన్‌కు పంపాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటివరకూ పార్టీ అంతర్గత క్రమశిక్షణ కమిటీ తప్ప, ఈసీకి పంపిన క్రమశిక్షణ కమిటీ లేదంటున్నారు. పైగా… ప్రస్తుతం జగన్ అధ్యక్షుడిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, జాతీయ హోదా లేదు. రాష్ట్ర స్థాయి పార్టీగానే గుర్తింపు కొనసాగుతోంది కాబట్టి, షోకాజ్‌లో పేర్కొన్న ప్రకారం.. విజయసాయిరెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా చెల్లదన్నది రఘురామకృష్ణంరాజు వాదన. దీనితో, అనవసరంగా రాజకు షోకాజ్ ఇచ్చి, జగన్ పార్టీ తప్పులో కాలేసినట్లు అర్ధమవుతుంది.[pdf-embedder url=”http://35.226.7.53/wp-content/uploads/2020/06/Reply-Letter-dated-25th-June-2020.pdf” title=”Reply Letter dated 25th June, 2020″]

జగన్ వైఎస్సార్‌పార్టీ అధ్యక్షుడే.. తర్వాతనే వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలోకి..

ఈ వ్యవహారం లోతుల్లోకి వెళ్లే కొద్దీ ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. అసలు జగన్ అధ్యక్షుడు, బాజిరెడ్డి గోవర్దన్ ప్రధాన కార్యదర్శిగా యెడుగూరి సందుంటి రాజశేఖర్‌రెడ్డి పార్టీ పేరుతో, 2010 జులై2న ఈసీకి దరఖాస్తు దాఖలు చేశారు. అంతకంటే ముందు హైదరాబాద్‌కు చెందిన కె .శివకుమార్ వైఎస్సార్‌కాంగ్రెస్ పేరుతో 2009 జనవరిలో ఈసీ వద్ద దరఖాస్తు చేసుకున్నారు. అయితే..  5-9- 2009న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో కడపకు చెందిన, వైఎస్ సన్నిహితుడు ఎస్.ఎం.బాషా పార్టీ స్థాపించారు. దీనితో వారిద్దరి మధ్య పార్టీ పేరుపై చాలాకాలం వివాదం తలెత్తింది. అయితే, కోర్టు ఆదేశాల ప్రకారం.. అప్పటికే తాము పేరు రిజిస్టర్ చేసినందున.. తామే ముందు అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు, తాము ఒకరోజు ముందుగానే పత్రికలో ప్రకటన ఇచ్చినందున, బాషా పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవద్దని  శివకుమార్ చేసిన వాదనను  కోర్టు అంగీకరించింది.[pdf-embedder url=”http://35.226.7.53/wp-content/uploads/2020/06/note-to-ycp.pdf” title=”note to ycp”]

ఈ నేపథ్యంలో 2011 జనవరి 15న తాము వైఎస్సార్ కాంగ్రెస్ అనేది వ్యక్తిపేరు మీద ఉందని ఈసీ అభ్యంతరం చెప్పినందున..  దాని పేరు మార్చుకుని, ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ’ అని పెట్టుకుంటామని కె. శివకుమార్ ఈసీకి దరఖాస్తు చేసుకోగా, అందుకు ఈసీ అంగీకరించింది. ఆ తర్వాత  సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం..బాషా సారధ్యంలోని ‘అన్న వైఎస్సార్ పార్టీ’ని ఈసీ రిజిస్టర్ చేసింది. ఆ ప్రకారంగా అది 2011లో రిజస్టర్ అయింది. దీనికోసం బాషా తీవమైన న్యాయపోరాటం చేశారు. ఈ పరిణామాలతో పార్టీ పేర్ల  వివాదానికి అప్పటికి  తెరపడింది.[pdf-embedder url=”http://35.226.7.53/wp-content/uploads/2020/06/Scan-25-Jun-2020-2.pdf” title=”Scan 25-Jun-2020 (2)”] [pdf-embedder url=”http://35.226.7.53/wp-content/uploads/2020/06/Scan-25-Jun-2020.pdf” title=”Scan 25-Jun-2020″]

జగన్ తర్వాత.. సుబ్బారెడ్డి, సజ్జల, వైవీ సోదరులకు అధ్యక్ష పదవులు!

ఈ క్రమంలో..ఇన్ని  వివాదాలు ఎదుర్కొనే బదులు, శివకుమార్ అధ్యక్షుడిగా ఉన్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని తీసుకోవడమే మంచిదని జగన్ భావించారు. ఆ మేరకు శివకుమార్‌తో చర్చలు జరిపి, ఆ పార్టీకి అధ్యక్షుడిగా జగన్, గౌరవ అధ్యక్షురాలిగా  విజయమ్మను ఎన్నుకున్నారు. అయితే.. అప్పటివరకూ మొదట తాను అధ్యక్షుడిగా ఉన్న ‘యెడుగూరి సందుంటి రాజశేఖర్‌రెడ్డి పార్టీ’కి( వైఎస్సార్ పార్టీ)జగన్ రాజీనామా చేశారు. జగన్ రాజీనామా తర్వాత ఖాళీ అయిన అధ్యక్ష స్థానానికి వైవి సుబ్బారెడ్డి, సుప్రీంకోర్టు న్యాయవాది గల్లా సతీష్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయినట్లు ఈసీకి పంపించారు.  ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి కూడా రాజీనామా చేయగా.. ఆయన స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ తర్వాత సుబ్బారెడ్డి సోదరుడైన వైవి భద్రారెడ్డి, ఆ తర్వాత మరో సోదరుడైన వైవి హనుమారెడ్డి అధ్యక్షులుగా మారారు. ఇంతమంది అధ్యక్షులు మారినా, ప్రస్తుతం ఎన్నికల సంఘం దృష్టిలో ఆ పార్టీ అధ్యక్షుడు వైవి హనుమారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గల్లా సతీష్ కొనసాగుతున్నారు. శివకుమార్ పార్టీని తీసుకున్నప్పటికీ, ముందుజాగత్తగానే ఈ పార్టీ పేరు కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ వెనుక బోలెడు కసరత్తు..

కాగా శివకుమార్ ఆధ్వర్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. జగన్ చేతికి వచ్చే క్రమంలో బోలెడు సంఘటనలు చోటు చేసుకున్నాయి. పార్టీ పేరు కోసం దివంగత భూమా నాగిరెడ్డి, వైఎస్ అనిల్‌రెడ్డి, జగన్ పీఏ విశ్వనాధ్ శ్రమించారు. పార్టీ రాజ్యాంగం రాసిన సుప్రీంకోర్టు న్యాయవాది గల్లా సతీష్  వారికి సహకరించారు. ఆ తర్వాత మిగిలిన డాక్యుమెంట్లు, అధికారులతో రాయబారాల వ్యవహారాలు కొణతల రామకృష్ణ, దివంగత సోమయాజులు, కిరణ్‌కుమార్‌రెడ్డి చూసేవారు. ఈ ముగ్గురు గల్లా సతీష్‌తో సమన్వయం నెరిపారు. శివకుమార్ చేతిలో ఉన్న పార్టీ రాజ్యాంగాన్ని సవరించిన గల్లా సతీష్.. జగన్ అధ్యక్షుడయ్యాక పూర్తిగా మార్చివేశారు.

లెటర్‌హెడ్‌పై వైఎస్సార్‌సీపీ రాయడానికి లేదన్న ఈసీ

కాగా.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)ని తీసుకున్నప్పటికీ..  ఉత్తర ప్రత్యుత్తరాలలో గానీ, లెటర్‌హెడ్స్‌పై గానీ ఎక్కడా వైఎస్సార్‌సీపీ లేదా వైస్సార్‌కాంగ్రెస్ పార్టీ అని గానీ రాయడానికి, ముద్రించి చలామణి చేయకూడదని 2011 జనవరి 28న ఈసీ ఆదేశించింది. అందుకు అభ్యంతరం వ్యక్తం చేసిన ఆ పార్టీ.. కమ్యూనిస్టుపార్టీ ఆఫ్ ఇండియా సీపీఐ అని, అన్నాడిఎంకె, డిఎంకె, కేరళ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ అని చెలామణి అవుతుండగా లేనిది..  తామెందుకు ఆవిధంగా చెలామణి కాకూడదని మరో లేఖ రాసింది. అయినప్పటికీ ఈసీ దానిని త్రోసిపుచ్చింది. ఆ ప్రకారం చూస్తే.. ఎంపి రఘురామకృష్ణంరాజుకు తాజాగా విజయసాయిరెడ్డి పంపిన లెటర్‌హెడ్ కూడా, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం చెల్లదని స్పష్టమవుతోంది.

 జగన్ మామ మోసం చేశారన్న ‘అన్న వైఎస్సార్’ అధినేత బాషా

తొలుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తనను, జగన్ మామ హైదరాబాద్ పిలిపించి మోసం చేశారని అన్న వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, వైఎస్ మిత్రుడైన ఎస్.ఎం. బాషా ‘సూర్య’కు చెప్పారు. ‘‘నాకు వైఎస్‌తో 35 ఏళ్ల స్నేహం ఉంది. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉమేష్‌చంద్ర వంటి ఎస్పీలతో దెబ్బలు తిన్నాం. 1996 ఎన్నికల్లో రాజమోహన్‌రెడ్డిపై వైఎస్ 1400 ఓట్లతో గెలిచినప్పుడు చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. పార్టీ పెడదామన్న విషయాన్ని నేను వైఎస్‌కు చెప్పా. ముందు ఆయన వద్దు, సమస్యలు వస్తాయన్నారు. ఆ తర్వాత నీ ఇష్టమని చెప్పారు. ఆ తర్వాతనే పార్టీ స్థాపించా’నని బాషా వెల్లడించారు. అయితే, ఈ విషయంలో జగన్ మామ తనను మోసం చేశారని బాషా మండిపడ్డారు. ‘నన్ను జగన్ మామ  హైదరాబాద్ పిలిపించారు. నీ పార్టీ పేరు జగన్ కావాలంటున్నాడని చెప్పారు. నేను అంతకంటే కావలసిందేమిటని చెప్పా. కడపలో 3 అసెంబ్లీ, రాజంపేట ఎంపీ ఇవ్వమని అడిగా. ఆ రకంగా నా దగ్గర ఫీడ్‌బ్యాక్, డాక్యుమెంట్లు తీసుకుని.. ఆ తర్వాత అదే పేరుతో రిజిస్టర్ చేసి మోసం చేశారు. వైవి సుబ్బారెడ్డి కూడా నాపై ఒత్తిడి చేశారు. ఇప్పుడు చెబుతున్నా. వైవి సుబ్బారెడ్డి గానీ, విజయసాయిరెడ్డి గానీ దమ్ముంటే, టీవీలలో చర్చకు నాతో రావాలి. వాళ్ల బండారం బయటపెడతా’నని బాషా సవాల్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ తనదేనని, దానిని వాడే నైతిక హక్కు, అర్హత జగన్‌కు లేదన్నారు. రఘురామకృష్ణంరాజు తనను కూడా పార్టీ చేసినందున.. వైఎస్సార్‌సీపీని రద్దు చేయాలని కోర్టులో పోరాటం చేస్తానన్నారు. తనకు ఈ విషయంలో మద్దతునిచ్చేందుకు చాలామంది ముందుకువస్తున్నట్లు బాషా వెల్లడించారు.

లాయర్ జంధ్యాల చాణక్యంతో వైసీపీ బోల్తా

రఘురామకృష్ణంరాజుకు ఇచ్చిన షోకాజ్ నోటీసుపై కసరత్తు చేసిన ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ సంధించిన  ‘వివరణ లాంటి ప్రశ్నాస్త్రం’ వైఎస్సార్‌సీపీని బోల్తా కొట్టించింది. ఈ దశలో  రఘురామకృష్ణంరాజు క్రమశిక్షణ కమిటీ అంశాన్ని తెరపైకి తీసుకువస్తారని వైసీపీ ఊహించకపోవడమే దానికి కారణం. అదేవిధంగా, లెటర్‌హెడ్‌పై ప్రస్తావించిన పార్టీ పేరు కూడా రఘురామకృష్ణంరాజుకు ఒక ఆయుధంగా మారినట్టయింది. ఎన్నికల కమిషన్ నిబంధనలను వినియోగించుకున్న లాయర్ జంధ్యాల రవిశంకర్, వాటిని వైసీపీపై సంధించడంతో ఉక్కిరిబిక్కిరి కావలసివచ్చింది. మరి క్రమశిక్షణ కమిటీ వివరాలు విజయసాయిరెడ్డి, నర్సాపురం రాజుగారికి ఎప్పుడిస్తే.. అప్పుడే ఆయన షోకాజ్‌కు సమాధానం ఇచ్చేలా ఉన్నారు.