మాదిగల మనసు గెలిచిన జగన్

517

మళ్లీ డొక్కాకే ఎమ్మెల్సీ ఇచ్చిన వైసీపీ
నైతిక విలువకు దక్కిన గౌరవం
రాజీనామా చేసిన తొలి ఎమ్మెల్సీ డొక్కా
మాట నిలబెట్టుకున్న జగన్
మాదిగలలో వైసీపీపై పెరిగిన నమ్మకం
                         ( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుని, మాదిగల మనసు గెలుచుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న మాదిగ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ తన పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరగా, ఆయనకు తిరిగి ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా, రాష్ట్రంలోని మాదిగల మనుసు గెలుచుకోవడంలో జగన్ విజయం సాధించినట్టయింది. ఫలితంగా.. వైసీపీ నాయకత్వం మాదిగకు ప్రాధాన్యం ఇవ్వదన్న అపవాదును చెరిపివేయగలిగారు. ఏపీలో మాల- మాదిగల మధ్య సంఖ్యాపరంగా కేవలం నాలుగులక్షల తేడానే ఉండటం గమనార్హం.ఇది కూడా చదవండి..: మాదిగల నోట సర్కారు మట్టి!

రాజకీయాల్లో మాణిక్యం.. డొక్కా!

నైతిక విలువలు పాటించడం, హుందాతనంగా వ్యవహరించే నేతగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు పేరుంది. ప్రత్యర్ధులు సైతం ఆయనను ఆ విషయంలో గౌరవిస్తారు. ఏ పార్టీలో ఉన్నా అంకితభావం, విశ్వాసంతో పనిచేసే డొక్కాకు, వివాదరహిత నేతగా కూడా గుర్తింపు ఉంది. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఆయనకు చంద్రబాబు తగిన ప్రాధాన్యమే ఇచ్చారు. చర్చలు, అభిప్రాయాల్లో ఆయనకు పెద్దపీట వేశారు. పార్టీ సీనియర్లు ఆయనను సమావేశాల్లో ‘మేధావి డొక్కా గారు దీనిపై అభిప్రాయం చెప్పమని’ అడిగేవారు. ఆయన మౌనంగా ఉన్నప్పుడు ‘మేధావుల మౌనం సమాజానికి మంచిదికాదని’ అనేవారు. ఆరకంగా ఆయనను టీడీపీ నాయకులు మేధవిగానే గుర్తించారు. అలాగే ఆయన కూడా తన మేధస్సును పార్టీకి అందించారు. కానీ, పార్టీపరంగా ఆయనకు సరైన స్థానం కల్పించలేదన్న విమర్శ కూడా లేకపోలేదు.

బలవంతంగా బరిలోకి డొక్కా..

అయితే, ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు అసెంబ్లీకి పోటీ చేయటం ఇష్టం లేకపోయినా, తన వద్ద డబ్బు కూడా లేనందున  ఓడిపోతానని చెప్పినా..  తాము అన్నీ చూసుకుంటామని హామీ ఇచ్చి, పార్టీ నాయకత్వం బలవంతంగా ప్రత్తిపాడు నుంచి పోటీ చేయించింది. ఎంపి అభ్యర్ధి కూడా.. డొక్కా ఉంటేనే అక్కడ తాను గెలుస్తానని చెప్పడంతో, పార్టీ  నాయకత్వం డొక్కా వైపు మొగ్గు చూపింది. ఆ సమయంలో ఆయన తన భార్య బంగారం, పొలం తాకట్టు పెట్టడంతోపాటు, మరో మూడుకోట్ల రూపాయలు అప్పు చేసి ఎన్నికల బరిలో దిగాల్సి వచ్చింది. ఆ సమయంలో కేంద్రంలోని  బీజేపీ ఒత్తిళ్ల కారణంగా,  టీడీపీ నాయకత్వానికి రావలసిన ఆర్ధిక వనరులన్నీ ఆగిపోయాయి. విరాళాలిచ్చే వారిపై ఐటి, ఈడీ దాడులు చేసింది. ఆ క్రమంలో, ‘మీరు డబ్బు సర్దుబాటు చేసుకుంటే, తర్వాత  ఇస్తామని చెప్పడంతో’.. మిగిలిన అభ్యర్ధుల మాదిరిగా, డొక్కా కూడా వడ్డీకి డబ్బు అప్పు చేయాల్సి వచ్చింది. కానీ ఏడాది గడిచినా నాయకత్వం నయాపైసా ఇవ్వకపోవడం, అప్పులిచ్చిన వాళ్లు ఇంటి చుట్టూ తిరగడంతో.. ఒత్తిళ్లకు భరించలేని డొక్కా, ఓ దశలో వారిని చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లినట్లు ప్రచారం జరిగింది. కానీ అక్కడ కూడా ఎలాంటి హామీ రాకపోవడం ఆయనను అసంతృప్తికి గురిచేసింది. మిగిలిన నేతల మాదిరిగా పెద్ద స్థితిమంతుడు గాని డొక్కాకు, అప్పుడే వైసీపీ నుంచి ఆహ్వానం అందింది. పార్టీలో చేరితే, తిరిగి ఎమ్మెల్సీ ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు.ఇది కూడా చదవండి.. మాదిగలకు ఏపీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్?

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్..

అయితే, వైసీపీలో చేరిన సందర్భంలో డొక్కా.. తనకు టీడీపీ నుంచి సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం ద్వారా, నైతిక విలువలు పాటి ంచి అందరి ప్రశంసలు పొందారు. టీడీపీ నుంచి కరణం బలరాం, వంశీ, మద్దాలి గరి వంటి ఎమ్మెల్యేలు వైసీపీకి జైకొట్టినా, వారు తమ పదవులకు రాజీనామా చేయలేదు. వైసీపీకి జైకొట్టిన మరికొందరు ఎమ్మెల్సీలు కూడా, తమ పదవులకు రాజీనామా చేయకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో.. తాను చెప్పిన నైతిక సూత్రాలు పాటించి పదవికి రాజీనామా చేసిన డొక్కాకు, జగన్ తిరిగి ఎమ్మెల్సీ సీటివ్వడం ద్వారా.. ఇచ్చిన మాట తప్పనన్న సంకేతాలు పంపించారు.

మాదిగలకు ఇదో సంకేతం..

కాగా వైసీపీలో మాలలకు తప్ప, మాదిగలకు ప్రాధాన్యం, గౌరవం ఉండదన్న ప్రచారం, అభిప్రాయం చాలాకాలం నుంచి ఉంది. ఈ క్రమంలో మాల వర్గ నేత జూపూడి ప్రభాకర్… డొక్కా కంటే ముందుగానే చేరినప్పటికీ, మాదిగలకు ప్రాతినిధ్యం వహిస్తున్న డొక్కాకు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా.. వైసీపీ మాదిగలకూ గుర్తింపు, గౌరవం ఇస్తుందన్న సంకేతాలిచ్చినట్టయింది. డొక్కా టీడీపీలో ఉన్నప్పుడు, మాదిగ కార్పొరేషన్ కోసం తీవ్రంగా కృషి చేసి, చంద్రబాబుపై ఒత్తిళ్లు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆయనతో పాటు మంత్రి జవహర్, నక్కా ఆనంద్‌బాబు, వర్లరామయ్య కూడా ఒత్తిడి చేశారు.  మాదిగలకు కార్పొరేషన్ ఇస్తే, మాదిగలు ఎక్కడ దూరమవుతారన్న భయంతో బాబు వెనుకడుగువేశారు. అయితే, తాను అధికారంలోకి వస్తే మాదిగ కార్పొరేషన్ ఏర్పాటుచేస్తానన్న జగన్.. ఏడాదిలోనే కార్పొరేషన్ ఏర్పాటుకు ఉత్తర్వులిచ్చి, వారి మనసు గెలుచుకున్నారు.

1 COMMENT