కన్నబాబు,అనిల్‌కు డిప్యూటీ సీఎంలు?

254
హోంమంత్రిగా విశ్వరూప్
క్యాబినెట్‌లోకి జోగి రమేష్, సతీష్?
సుచరిత, ఆళ్ల నాని అవుట్?
(మార్తి సుబ్రహ్మణ్యం)

త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల స్థానంలో మరో ఇద్దరు రానున్నారు. అందులో ఒకరు యాదవ కాగా మరొకరు కాపు వర్గానికి చెంది వారుండవచ్చుంటున్నారు. బీసీ అయిన ఉప ముఖ్యమంత్రి మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ స్థానంలో, అదే బీసీ వర్గానికి చెందిన అనిల్‌కుమార్ యాదవ్, పశ్చిమ గోదావరి జిల్లా కాపు వర్గానికి చెందిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని స్థానంలో, అదే వర్గానికి చెందిన తూర్పు గోదావరి జిల్లా నుంచి,  వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం.

మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌చంద్రబోస్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో, ఖాళీ అయిన పదవులను భర్తీచేయనున్నారు. అందులో  జరిగే కొద్దిపాటి పునర్‌వ్యవస్థీరకణలో భాగంగా అనిల్‌కుమార్ యాదవ్, కన్నబాబుకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ మేరకు హోంమంత్రి సుచరిత, వైద్యశాఖ మంత్రి ఆళ్ల నానిని తొలగిస్తారంటున్నారు.
ఇక శెట్టిబలిజ అయిన పిల్లి స్థానంలో  గౌడ వర్గానికి చెందిన కృష్ణాజిల్లా నేత  జోగి రమేష్‌కు,   మోపిదేవి వెంకటరమణ స్థానంలో  తూర్పుగోదావరిజిల్లా మత్స్యకారవర్గానికి చెందిన  ముమ్మడివరం ఎమ్మెల్యే సతీష్‌కు, మంత్రివర్గంలో స్థానం కల్పించవచ్చంటున్నారు. ఇక హోంమంత్రిగా ఉన్న సుచరిత స్థానంలో, అదే సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి పినిపె విశ్వరూప్‌కు హోంమంత్రి పదవి ఇవ్వవచ్చని చెబుతున్నారు. ఆళ్ల నాని, సుచరిత పనితీరుపై జగన్ సంతృప్తిగా లేరని చాలాకాలం నుంచి పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

తొలగించిన వారి స్థానాల్లో  తిరిగి అదే వర్గానికి చెందిన వారికి పదవులు ఇవ్వడం ద్వారా, ఆయా వర్గాలలో వ్యతిరేకత రాకుండా చూసుకుంటున్నారు. ప్రధానంగా, ఇటీవలి కాలంలో కన్నబాబు చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. విపక్షాలపై ఎదురుదాడి చేయడంతోపాటు, వ్యవసాయ శాఖకు సంబంధించిన అంశాల్లో కూడా వేగంగా పనిచేస్తున్నారన్న పేరు సంపాదించారు. ఆళ్ల నాని వ్యక్తిగతంగా వివాద రహితుడయినప్పటికీ, ఆయన శాఖాపరంగా కూడా చురుకుగా వ్యవహరించలేపోతున్నారని, కరోనా విషయంలో ఆయన వేగంగా పనిచేయలేకపోయారన్న విమర్శ కూడా లేకపోలేదు. సుచరితపై సొంత నియోజకవర్గంలోనే విమర్శలు పెరుగుతున్నాయంటున్నారు. ఇక  సీనియర్ ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా విపక్షాల దాడిలో ముందువరసలోనే ఉన్నారు. ఆయనకు సమాచార శాఖ ఇవ్వవచ్చంటున్నారు. పేర్ని నానికి వైద్య, ఆరోగ్య శాఖ ఇవ్వవచ్చన్న ప్రచారం జరుగుతోంది.