జగనన్నా.. అరుణన్న ఏమన్నారో.. మీకర్ధమవుతోందా?

588

వైసీపీ పాలనపై ఉండవల్లి అరుణ్‌కుమార్ విసుర్లు
కక్షసాధింపు, ధిక్కారధోరణి వద్దని సుద్దులు
పాలనా పద్ధతులుపై స్నేహితుడి కుమారుడికి హితోక్తులు
వైసీపీ నేతల మనోభావాలు ఆవిష్కరించిన ఉండవల్లి
మరి అరుణన్న మాటలు జగనన్న ఆచరిస్తారా?
‘సూర్య’ తొలి నుంచీ చెబుతోందీ అదే..
          (మార్తి సుబ్రహ్మణ్యం)

‘వినదగునెవ్వరు సెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కని కల్ల నిజము తెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ’

– ఓ మంచి బుద్ధికలవాడా? ఎవరు చెప్పినా వినాలి. విని తొందరపడకుండా దానిలోని  సత్యాసత్యాలు తెలుసుకున్నవాడే నీతిపరుడన్నది సుమతీ శతకం చెప్పిన హితవు. మొండితనం, నియంతృత్వం, ఒంటెత్తుపోకడలతో అభాసుపాలవుతున్న నేటి పాలకులకు ఇది అక్షరాలా ఆచరణీయం.
* * *
ఉండవల్లి అరుణ్‌కుమార్ గుర్తున్నారా? దివంగత మహానేత వైఎస్‌కు కెవిపికి కనిపించే ఆత్మయితే, ఉండవల్లి కనిపించని ఆత్మ. వైఎస్ రాజకీయ పరమపద సోపానంలో, ఆది నుంచీ తుది వరకూ ఆయన వెంట నిలిచిన వైఎస్ హితైషి ఆయన!  బాబు గద్దెనెక్కినప్పుడు వైఎస్ సభలో-బయట సంధించే అస్త్రశస్త్రాల వెనుక సరుకూ సరంజామా అంతా అరుణ్‌కుమార్‌దే. ఒక్కముక్కలో చెప్పాలంటే వైఎస్ ఆత్మాహుతి దళానికి ఉండవల్లి ప్రధాన దళపతి!!  ఐదేళ్ల బాబు పాలనపై ఆధారాలతో విరుచుకుపడిన ఉండవల్లి… ఏడాది జగన్ పాలనపై మాట్లాడకపోవడం విమర్శలకు గురయింది. దానితో ఆయన తెరపైకొచ్చారు. తన స్నేహితుడి కుమారుడైన జగనంటే తనకు ఇష్టమేనన్న అరుణన్నకు.. అదే తన స్నేహితుడి కుమారుడైన జగనన్న పాలన ఎందుకో  రుచించడం లేదు. దానికి కారణాలు కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. 151 సీట్లతో గెలిచి చేస్తున్న పనులు ఇవా? అని తలంటుతున్నారు. మద్యం పాలిసీని ప్రశ్నిస్తున్నారు.  న్యాయవ్యవస్థ,రాజ్యాంగబద్ధ వ్యవస్థలతో పోరాటామేటని కడిగేస్తున్నారు. వైఎస్ పక్కన తన ఫొటో ఉండాలన్న జగన్‌బాబు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని హితువు పలుకుతున్నారు. జగనన్నా… మరి మీ కుటుంబ హితైషి అరుణన్న చెబుతోంది మీకర్ధమవుతోందా?ఇది కూడా చదవండి: నాలుగో నెంబరు సీఎంకు.. ఇదేం నగుబాటు?

మండేలాను చూసి నేర్చుకోవాలన్న ఉండవల్లి

వైఎస్ ఆప్తమిత్రుడైన మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్.. తాజాగా తన మిత్రుడి కుమారుడైన జగన్మోహన్‌రెడ్డి వ్యవహారశైలి, పాలనాతీరుపై చేసిన వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. కొంచెం కటువుగా, ముక్కుసూటిగా చెప్పినప్పటికీ… ఉండవల్లి చేసిన వ్యాఖ్యలన్నీ అక్షరసత్యాలేనని వైసీపీ వర్గాలు అంగీకరిస్తున్నాయి.ఇది కూడా చదవండి: మూడు అడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి! ఆవిధంగా ఆయనకు చెప్పేవారు లేకపోవడమే, ఈ దుస్థితికి ప్రధాన కారణమన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నెల్సన్‌మండేలా జైల్లో ఉన్నప్పుడు మంచినీరడిగితే, ముఖంపై మూత్రం పోసిన జైలర్‌ను.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత, మండేలా తన పక్కన కూర్చోబెట్టుకుని భోజనం పెట్టించిన ఘటనను ఉండవల్లి గుర్తు చేశారు. ఆ చరిత్రను జగన్ ఓసారి చదవాలని సూచించారు. ‘అంటే నాకు నల్లవాళ్లు,తెల్లవాళ్లు అంతా ఒకటేనని చెప్పడమే మండేలా ఉద్దేశం. నన్ను వేధించిన వాళ్లను కూడా గౌరవిస్తానని సంకేతాలివ్వడానికి, ఇంతకంటే మంచి సందర్భం ఏం ఉంటుందని చెప్పడానికే మండేలా ఆ పని చేశాడు. జగన్ అది చదవాలి’ అని ఉండవల్లి నర్మగర్భంగా..  సీఎం వ్యక్తిగత వ్యవహార శైలిని, వ్యక్తిగత కక్షలకు వెళ్లవద్దని చెప్పకనే చెప్పినట్టయింది.ఇది కూడా చదవండి: వైఎస్ జగన్‌ ఏడాది పాలన ఓకే..! పార్టీ , మీడియా సంగతి ఏంటీ..?!!!

దూషిస్తే… కోర్టులకు కోపం రాదా..?

ఆరకంగా సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్న వారిపైనా, తీర్పులిచ్చే న్యాయమూర్తలపైనా ఎదురుదాడి చేయడం మంచి పద్ధతికాదని హితవు పలికారు. న్యాయవ్యవస్థను ఎదిరించే పద్ధతి మానుకోవాలంటూ ఉండవల్లి చెప్పిన అనేక ఉదాహరణలు తమ అధినేతకు కనువిప్పు కావాలని, వైసీపీ వర్గాలు కూడా సూచిస్తున్నాయి. ‘వివి గిరి సైతం రాష్ట్రపతిగా ఉన్నప్పటికీ, నేరుగా సుప్రీంకోర్టుకు హాజరయి, న్యాయవ్యవస్థపై ఉన్న గౌరవం ప్రకటించారు. పివి నరసింహారావు కూడా తాను ఎప్పడంటే అప్పుడు కోర్టుకు హాజరవుతానని ఒక చిన్న న్యాయవాదిని పెట్టి కోర్టును అభ్యర్ధిస్తే, అప్పటివరకూ జైలుకు పంపించాలనుకున్న  కోర్టు, ఆయనకు బెయిల్ ఇచ్చింది. ప్రజల్లో క్రేజ్ ఉన్న వంగవీటి రంగా కూడా, కోర్టులో సగం తల దించి జడ్జి ముందు నిల్చున్నారు. అదే త ల ఎగరేసి ఉంటే, సాయంత్రం వరకూ వెయిట్ చేయించేవాళ్లు. కోర్టులతో పెట్టుకోవడం ఎందుకూ? వాళ్లూ మనుషులే కదా? జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిస్తున్న జడ్జిలపై పెడుతున్న పోస్టింగులు చూస్తే కోర్టులు ఊరుకుంటాయా? జడ్జిలకు కోపం రాదూ? ఒకాయనేమో అలాంటి వారిని మేం కాపాడతామంటారు. అంటే ఏంటి..  మేమే ఇవ్వన్నీ చేయిస్తున్నామనుకోవాలనా?’ అని ఉండవల్లి సీఎం జగన్ వ్యవహారశైలిని ఆక్షేపించారు. కోర్టులకు సంబంధించి జగన్ అనుసరిస్తున్న వైఖరిని చాలామంది నేతలు తప్పుపడుతున్నా, దానిని జగన్ ముందు వ్యక్తీకరించలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ సమయంలో ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు వారి అభిప్రాయాలను బలపరిచినట్టయింది.ఇది కూడా చదవండి: హవ్వ.. కోర్టు తీర్పులపైనా ఎదురుదాడా?

నిమ్మగడ్డపై ఉండవల్లి చెప్పిందే నిజమంటున్న నేతలు..

ఇంకా.. లిక్కరు, భూముల కొనుగోలులో అవినీతి, నిమ్మగడ్డతో పోరాటం అంశాలనూ ప్రస్తావించిన ఉండవల్లిని, వైసీపీ నేతలు మనసారా అభినందిస్తున్నారు. ప్రధానంగా నిమ్మగడ్డ వ్యవహారంపై ఉండవల్లి చెప్పిన లాజిక్కును వైసీపీ నేతలు సమర్ధిస్తున్నారు. ‘నిమ్మగడ్డను ఆ స్థానంలో ఉంచితే పోయేదేముంది? ఆయన కమిషనర్‌గా ఉంటే ఏం చేయగలరు? ఆ స్థానంలో చంద్రబాబును పెట్టినా ఏం చేయగలరు? కలెక్టర్లు, ఎస్పీలకు ఆర్డర్లిస్తారు. ఎన్నికలకు నాలుగేళ్ల సమయం ఉంది. అలాంటప్పుడు అధికారులు మీ మాట వింటారా? నిమ్మగడ్డ వింటారా? అయినా అసలు నేరుగా జగనే ఆయన మీద విమర్శలు చేయడం ఏమిట’ని ఉండవల్లి సంధించిన ప్రశ్న. పైగా.. ‘అంతా ఎల్వీ సుబ్రమణ్యం మాదిరిగా గోవిందా అనుకుని అంతా దేవుడే చూసుకుంటారనుకోరు. నిమ్మగడ్డలుంటారు. ఏబీ వెంకటేశ్వరరావులుంటారు. వాళ్లు పాలించారు. వాళ్లకు దన్ను ఉంది’ అని.. అందరూ ఎల్వీ సుబ్రమణ్యం మాదిరిగా మౌనంగా ఉండరన్న  ఓ హెచ్చరిక సంకేతం పంపించారు.ఇది కూడా చదవండి: కరోనా కల్లోలం లోనూ నిమ్మగడ్డ ఆలోచనలేనా?

అరుణ్‌కుమార్ వ్యాఖ్యలను పాజిటివ్‌గా తీసుకోవాలంటున్న సీనియర్లు..

నిజానికి.. ఉండవల్లి  వ్యాఖ్యలన్నీ  ఆగ్రహంతో చేశారా? అసంతృప్తితో చేశారా? లేక తన స్నేహితుడి కుమారుడు దారి తప్పుతప్పుతున్నారన్న ఆవేదనతో చేశారా? ఆయనను సక్రమమైన దారిలో నడవమని హితవు పలుకుతూ చేశారా? అన్నది పక్కకుపెడితే.. ఉండవల్లి చేసిన వ్యాఖ్యలన్నీ తమ అధినేతకు క నువిప్పు అయ్యేవేనన్న అభిప్రాయం మాత్రం, మెజారిటీ వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది.ఇది కూడా చదవండి: శహభాష్.. సీఎం జగన్! ఉండవల్లి చేసిన వ్యాఖ్యలను సానుకూలదృక్పథంతో చూడాలని, వ్యవస్థలో ఎక్కడ లోపాలున్నాయో చెప్పిన ఉండవల్లి సూచనలను పరిగణనలోకి తీసుకుంటే, జగన్మోహన్‌రెడ్డికి తిరుగుండదన్న భావన వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. నిమ్మగడ్డ, కోర్టులతో పోరాటం, సోషల్‌మీడియాలో పోస్టింగు చేసిన వారిపై కేసుల వంటి అనవసర వివాదాలు కొని తెచ్చుకోకుండా.. మరో 30 ఏళ్లు ఆయనే సీఎంగా ఉండేలా సానుకూల ధోరణి ప్రదర్శిస్తే మంచిదంటున్నారు. నిజానికి నిమ్మగడ్డ గురించి నేరుగా జగనే మీడియాలో మాట్లాడటం.. అప్పట్లో చాలామంది మంత్రులు, సీనియర్లకు నచ్చలేదు. ఆ పనేదో మిగిలిన వారికి అప్పగిస్తే సరిపోయేదన్న అభిప్రాయం అప్పట్లోనే వినిపించింది.ఇది కూడా చదవండి: ఫిరాయింపులపై బాబు-జగన్ దొందూ దొందే!

‘సూర్య’ చెబుతోంది కూడా అదే..

కాగా ఇప్పడు ఉండవల్లి చెప్పిన అంశాలనే… ఏడాది జగన్ పాలనపై ‘సూర్య’ వెబ్‌సైట్ వెలువరించిన కథనాలు కూడా  వ్యక్తీకరించింది. వ్యక్తుల విషయంలో  వైఎస్-చంద్రబాబు మాదిరిగా వ్యవహరించాలని, కక్షసాధింపు, కేసుల వల్ల అమూల్యమైన కాలాన్ని వృధా చేసుకుంటున్నారనే సూర్య కథనాలు హితవు పలికాయి. ప్రతి పేదవాటి ఇంట్లో తన తండ్రి ఫొటో పక్కన ఉండాలన్న జగన్ నడక ఈవిధంగా ఉండకూడదని సూర్య’ కథనాలు స్పష్టం చేశాయి. అధికారం శాశ్వతం కాదని సున్నితంగా హెచ్చరించింది.  వైఎస్ తన పాదయాత్రకు ముందు పార్టీలోని తన ప్రత్యర్ధులను సైతం సమన్వయం చేసుకుని, తనకు కోపం అనే ఆరోవేలు తెగిపోయిందని చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసింది.ఇది కూడా చదవండి: అప్పుడు ఆరోపణలు.. ఇప్పుడు కేసులా?
కొద్దికాలంలో ఆయనతంతట ఆయన దిగిపోయే నిమ్మగడ్డపైన, తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఏబి వెంకటేశ్వరరావు మీద, తనకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిందని అరవైళ్ల వృద్ధురాలిపైన, పీపీఈ కిట్లు లేవని చెప్పిన డాక్టర్‌పైన కేసులు పెట్టడానికా?.. పదేళ్లు పోరాటం చేసి, జైలుకు వెళ్లి విలువైన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి అధికారంలోకి వచ్చిందని.. ‘సూర్య’ వెబ్‌సైట్  తన కథనాల్లో హితవు పలికింది.ఇది కూడా చదవండి: ప్రశ్నిస్తే.. మీడియా గొంతు నొక్కుతారా?