ఓ సారూ.. ఇప్పుడు కిషన్‌రెడ్డి, బాబు మీద కేసులు పెడతారా?

420

జగన్ సర్కారుపై కిషన్‌రెడ్డి, చంద్రబాబు ఆరోపణలు
వాటిని ప్రచురించిన మీడియా
పోలీసురాజ్యంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై ఫైర్
108 కొనుగోళ్లపై బాబు ఆరోపణలు
మరి రఘురామకృష్ణంరాజు, ఆనం, మంత్రి శ్రీరంగనాధరాజుకూ నోటీసులివ్వరేం?
ఏపీలో ‘నోటీసుల రాజ్’పై రచ్చ రచ్చ
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో ప్రశ్నించిన వారిని, నేతల మాటలను ప్రచురించి ప్రసారం చేసిన మీడియాకు నోటీసులిచ్చి.. బెంబేలెత్తించే కొత్త సంప్రదాయానికి తెరలేపిన జగన్మోహన్‌రెడ్డి సర్కారు ముందు ఇప్పుడో చిక్కొచ్చిపడింది. విమర్శించిన వారందరిపైనా కేసులు పెట్టి హడలెత్తిస్తున్న సర్కారు దెబ్బకు విపక్షాలు, మీడియా బేజారెత్తుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నిర్వహించిన వర్చువల్ ర్యాలీలో పాల్గొన్న, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రధానంగా ఆయన పోలీసులను లక్ష్యంగా చేసుకుని చేసిన ఆరోపణలు జగనన్న సర్కారును ఇరుకునపెట్టాయి. జగన్ పాలన అవినీతిమయమని దుయ్యబట్టడం కలకలం రేపింది.

కిషన్‌రెడ్డిపైనా కేసులు పెడతారా?


ఇలాంటి విమర్శలే చేస్తున్న విపక్ష నేతలు, వాటిని వెలుగులోకి తెస్తున్న మీడియాకు సీఐడీ నోటీసులిస్తోంది. పిలిచి విచారిస్తోంది. సోషల్‌మీడియాలో పోస్టింగులు పెడుతున్న వారిపై కేసులు పెడుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్‌రెడ్డి నేరుగా పోలీసు తీరుపైనే విమర్శలు కురిపిస్తే, మరి ఆ లెక్కన ఆయనకూ సీఐడీ నోటీసులిస్తుందా? అన్న ఆసక్తికర ప్రశ్నలు తెరపైకొచ్చాయి. ‘ఏపీలో పోలీసు, అభివృద్ధి వ్యతిరేక పాలన సాగుతోంది. అవినీతి, అహంకారం, అబద్ధాలు రాజ్యమేలుతున్నాయి. మద్యం, ఇసుక, భూ మాఫియా రాజ్యమేలుతోంది. అరాచకాలు, దౌర్జన్యాలకు అడ్డులేకుండా పోతోంది. పోలీసులే తమను వేధిస్తున్నారని మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. పోలవరానికి కేంద్రమే వంద శాతం నిధులిస్తున్నా ఆ ప్రాజెక్టు నత్తనడక సాగుతోంది’ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కిషన్‌రెడ్డి విమర్శలను బీజేపీ సోషల్‌మీడియా విభాగం విస్తృతంగా వైరల్ చేస్తోంది. మరి విమర్శించే వారికి నోటీసులిచ్చే జగనన్న సర్కారు సంప్రదాయం ప్రకారం.. ప్రభుత్వంపై నిప్పులు కురిపించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి, వాటిని ప్రచురించి, ప్రసారం చేసిన మీడియాకు, ఆయన వీడియోను వైరల్ చేస్తున్న బీజేపీ సోషల్‌మీడియాకూ నోటీసులిస్తుందా? లేదా అన్న ప్రశ్నలు ఆసక్తిక రంగా మారాయి.

108పై బాబుకు నోటీసులిస్తారా?

అటు మాజీ సీఎం చంద్రబాబు కూడా 108 వాహ నాల కొనుగోలులో జరిగిన అవినీతిని ప్రశ్నించారు. అందులో 408 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని, అంబులెన్స్‌ల కాంట్రాక్ట్ విజయసాయిరెడ్డి అల్లుడి కంపెనీకి ఇచ్చారని విరుచుకుపడ్డారు. వైసీపీ ఎంపీ ప్రాణాలకే రక్షణ లేకుండా పోతే, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని నిలదీశారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోంది, కేసులతో వేధిస్తున్నారని స్వయంగా కేంద్ర హోం మంత్రినే ఆరోపించడం చూస్తే, రాష్ట్రంలో శాంతిభ ద్రతలు ఏ స్థాయిలో దిగజారిపోయాయో అర్ధమవుతోందని మండిపడ్డారు. బాబు ఆరోపణలకు మీడియా ప్రాధాన్యం ఇచ్చింది. మరి సర్కారు సంప్రదాయం ప్రకారం.. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకూ నోటీసులిచ్చి, కేసులు పెడతారా అన్నది మరో ప్రశ్న.

రాజు గారి నుంచి రాజు గారి వరకూ..

ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్న వారిని, నోటీసులతో హడలెత్తిస్తున్న సీఐడి.. ఇటీవలి కాలంలో సర్కారు విధానాలపై విరుచుకుపడి, తనకు ప్రాణనష్టం ఉందని, ఒక సామాజికవర్గానికి చెందిన నేతలు తను బెదిరిస్తున్నారన్న వైసీపీ ఎంపి రఘురామకృష్ణంరాజు, పేదల ఇళ్ల స్థలాల కొనుగోలులో అవినీతి జరుగుతోందని తానే ముందు చెప్పానన్న మంత్రి శ్రీరంగనాధరాజు, ఆవ భూముల కొనుగోలులో అక్రమాలు జరిగాయని ఆరోపించిన వైసీపీ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, నీళ్లు అమ్ముకుంటున్నారా అని ప్రశ్నించిన మాజీ మంత్రి, వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికీ సీఐడీలు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వారి వ్యాఖ్యలను అన్ని పత్రికలూ ప్రచురించాయి. చానెళ్లు ప్రసారం చేశాయి. కాబట్టి గోపాలకృష్ణ ద్వివేదీ సూత్రం ప్రకారం.. ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు మీడియాకు నోటీసులివ్వాలి. సీఐడీ సంప్రదాయం ప్రకారం కేసులు పెట్టితీరాల్సి ఉంది. మరి ఈ అంశాలపై మాట్లాడిన వారందరిపైనా ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి.