కమలం-గులాబీదళాల కరోనా కదనం!

205

తొలిసారి తెరాసపై నద్దా విమర్శలు
ఈటల-బండి మాటల తూటాలు
గుజరాత్ సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కమిషన్ల కోసమేనా అని గర్జన
తొలిసారిగా బీజేపీపై తెరాస తిరుగుబాటు
కరోనా వైఫల్యంపై బీజేపీ ధర్నాలు, అరెస్టులు
వేడెక్కుతున్న తెలంగాణ
                                     (మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కారు విఫలమయింది. హిమాచల్‌ప్రదేశ్ వంటి చిన్న రాష్ట్రాల కంటే తక్కువ పరీక్షలు చేస్తోంది. తెలంగాణలో కరోనా మరణాల సగటు 3.8. ఇది జాతీయ సగటు కంటే తక్కువ. ఆయుష్మాన్‌భారత్‌ను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయనందుకే, లక్షలాదిమంది పేదలు నష్టపోతున్నారు. జర్నలిస్టు ఆక్సిజన్ కొరతతో చనిపోవడం కరోనాపై పోరులో, కేసీఆర్ ప్రభుత్వం విఫలమయిందనడానికి ఓ నిదర్శనం. ఏ ప్రాజెక్టులో అవినీతికి ఎక్కువ అవకాశం ఉంటుందో, కేసీఆర్ ఆ ప్రాజెక్టులే చేపడుతున్నారు. కాళేశ్వరం కూడా అంతే. తెలంగాణ ఒక్క అవినీతిలోనే ముందుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాను 45 వేల కోట్ల నుంచి 85 వేల కోట్లకు పెంచారు. దక్షిణ తెలంగాణకు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. 7 లక్షల డబుల్ బెడ్ రూములు కట్టిస్తానన్న కేసీఆర్, ఇప్పటిదాకా 50 వేల ఇళ్లు కూడా కట్టించలేకపోయారు. హిందూగాళ్లు బొందూగాళ్లని, హిందూసమాజాన్ని విమర్శించడం వెనక ఆంతర్యమేమిటి? అది కేసీఆర్ అహంకారానికి నిదర్శనం’’
– తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ దళపతి జెపి నద్దా ధ్వజం

‘‘నద్దావి గల్లీ మాటలు. శవాలపై పేలాలు ఏరుకునేలా బీజేపీ నీచరాజకీయాలు చేస్తోంది. గురువింద తన కింద నలుపు ఎరగదన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోంది. మర్కజ్ ఘటనపై కేంద్రాన్ని మేమే అప్రమత్తం చేశాం. గుజరాత్‌లో 1600 మంది  చ నిపోతే, అది ఆ రాష్ట్ర బిజెపి ప్రభుత్వ  వైఫల్యం కాదా? వెయ్యి వెంటిలేటర్లు అడిగే ముష్టివేసినట్లు 50 ఇచ్చారు. రోజుకు 5 వేల పరీక్షలు చేసే యంత్రాన్ని మేం తెప్పించుకుంటే, పీఎంఓ చెప్పిందని దానిని కోల్‌కతాకు తరలించారు. అయినా మేం హుందాగానే ఉన్నాం.  సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కూడా కమిషన్ల కోసమే కడుతున్నారా? కరోనా దేశంలో ప్రవేశించినప్పుడు పార్లమెంటు నడిపింది మీరే. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చాలని కుట్రలు చేసిందీ మీరే. అంతర్జాతీయ విమానాలు ఆపాలని సూచించిన తొలి నేత కేసీఆర్. బీజేపీకి  నాలుగు లోక్‌సభ సీట్లొస్తే కోతికి కొబ్బరిచిప్ప వచ్చినట్లు చేస్తోంది’’
– నద్దా వ్యాఖ్యలపై తెలంగాణ సీనియర్ మంత్రి ఈటల రాజేందర్ ఎదురుదాడి

‘‘ కరోనాపై రాష్ట్రాలను విమర్శించడం ఏం రాజనీతి? దేశ సరిహద్దులో చైనా, దేశంలో బీజేపీ వ్యవహారశైలి ఒక్కటే. కరోనా కట్టడిలో కేసీఆర్‌కు వస్తున్న పేరును సహించలేకనే, బీజేపీ అవాకులు పేలుతోంది. నద్దా వ్యాఖ్యలు వైద్యసిబ్బంది మనోస్ధైర్యం దెబ్బతీస్తున్నాయి’
– నద్దాపై తెలంగాణ సీనియర్ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం

‘కరోనా కేసులు ఈ స్థాయిలో పెరిగేందుకు కేసీఆర్ సర్కారే కారణం. అసలు తెలంగాణకు కరోనా రాదని శాసనసభలో  హేళనగా మాట్లాడింది ఆయనే. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లనే హైదరాబాద్ ప్రమాదకర స్థాయికి చేరింది. ఎక్కువ పరీక్షలు చేయకపోవడం వల్లే తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రాన్ని కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాలే పాలిస్తున్నాయి. వారి నుంచి తెలంగాణను విముక్తం చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది’’
– కేసీఆర్ సర్కారుపై, కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి ధ్వజం.

‘‘సీఎం, మంత్రులు జోకర్లుగా మారారు. కేసీఆర్‌కు చివరి మజిలీ జైలే. మజ్లిస్ కబంద హస్తాల్లో తెలంగాణ చిక్కుకుంది. పరామర్శకు గవర్నర్ వెళితే కేసీఆర్ ఫాంహౌస్‌లో పడుకున్నారు. ఈటల కరోనాకు భయపడుతున్నారా? బీజేపీకి భయపడుతున్నారా? కరోనా కట్టడికి 7 వేల కోట్లు ఇవ్వలేదా? ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలో ఎందుకు అమలుచేయడం లేదు? గాంధీ ఆసుపత్రిలో వైద్యుల ధర్నా, పీపీఈ కిట్లు ఇవ్వకపోవడం, జర్నలిస్టు మృతి కేసీఆర్ చేతకానితనానికి నిదర్శనాలే. కరోనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఈటల మా పార్టీపై దాడి చేస్తున్నారు’’
– బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, పెద్దిరెడ్డి, డాక్టర్ విజయరామారావు ఫైర్

* * *

కేసీఆర్ సర్కారుపై కమలం సమరం..

తెలంగాణ రాజకీయాలు మాటల యుద్ధంతో వెడెక్కుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస, కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా.. తెలంగాణ కేంద్రంగా రువ్వుకుంటున్న విమర్శన-ఆరోపణాస్త్రాలతో తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది.
ఇప్పటివరకూ కరోనా పరీక్షల్లో కేసీఆర్ సర్కారు విఫలమయిందంటూ బండి సంజయ్ నేతృత్వంలోని కమలదళాలు మాత్రమే విరుచుకుపడుతూ వస్తున్నాయి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా సందర్భానుసారంగా, తెరాస సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.  కరోనాపై కేసీఆర్ సర్కారు చర్యలను ఢిల్లీ నుంచి వచ్చిన బృందం అభినందిస్తే, ప్రత్యేక బృందాల తీరుపై కమలదళాలు కేంద్రానికి ఫిర్యాదు చేయడం ఆసక్తి కలిగించింది. అటు కమలదళాలు జిల్లా స్థాయిలో కూడా, కేసీఆర్ సర్కారుపై సమరనాదం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇప్పటివరకూ తెలంగాణ సర్కారు, తెరాస పార్టీపై విమర్శలు చేయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దా, ఉన్నట్లుండి కేసీఆర్ సర్కారు లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించడంతో.. తెలంగాణ రాజకీయం మారిపోయింది.

నద్దా వ్యాఖ్యలతో కమలంలో సమరోత్సాం..

బీజేపీ నిర్వహించిన వర్చువల్ ర్యాలీలో మాట్లాడిన నద్దా.. తొలిసారిగా కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడిన తీరు, కమలదళాలకు కొత్త ఉత్సాహం ఇచ్చింది. తమ దళపతి కూడా కేసీఆర్‌పై పోరాటానికి రంగంలోకి దిగడం కచ్చితంగా తమకు స్ఫూర్తి దాయకమేనని, ఆయన స్ఫూర్తితో తమ పోరాటాన్ని మరింత పదునెక్కిస్తామని బీజేపీ నగర నాయకుడు మేకల సారంగపాణి వ్యాఖ్యానించారు. కమలం క్యాడరంతా దాదాపు ఇలాంటి భావనతోనే కనిపిస్తోంది. ఎందుకంటే.. నద్దా పదవీ బాధ్యతలు స్వీక రించిన తర్వాత, ఒక్కసారి కూడా ఆయన కేసీఆర్ సర్కారుపై వ్యాఖ్యలు చేయలేదు. చివరకు టీడీపీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు ఆధ్వర్య్యాన వేల మందితో సభ నిర్వహించిన సందర్భంలోనూ కేసీఆర్ సర్కారుపై విమర్శల జోలికి వెళ్లలేదు. అలాంటిది.. వర్చువల్ ర్యాలీ సందర్భంగా, ఆయన హటాత్తుగా కేసీఆర్ సర్కారు విధానాలు, ముఖ్యంగా కరోనా పరీక్షల్లో వైఫల్యంపై గళమెత్తడం తెలంగాణ కమలదళాలు హుషారునిచ్చాయి. దీనితో.. రాష్ట్రస్థాయిలో బీజేపీతో వైరుధ్యాలున్నప్పటికీ, కేంద్రస్థాయిలో కేసీఆర్ బీజేపీ నాయకత్వంతో సన్నిహితంగా ఉన్నారంటూ.. ఇప్పటివరకూ జరుగుతున్న ప్రచారానికి  కమలదళపతి నద్దా తన విమర్శలతో తెరదించినట్టయింది.

కమలదళపతి దాడితో ఖంగుతిన్న తెరాస..

నిజానికి కేసీఆర్ కరోనా సీజన్‌లో కేంద్రంపై పల్తెత్తు విమర్శ చేయలేదు. పైగా ప్రధానిని విమర్శించిన వారిని సైతం అడ్డుకుని, వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానిని గౌరవించాలని క్లాసు పీకారు. ప్రధాని ఇచ్చిన ప్రతి పిలుపును పాటించారు. వీడియో కాన్ఫరెన్సులలో విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు. కానీ, రాష్ట్ర స్థాయిలో బీజేపీ నేతలు మాత్రం కేసీఆర్ సర్కారు వైఫల్యాన్ని ఎండగడుతూనే ఉన్నా, కేంద్రమంత్రులు గానీ, బీజేపీ జాతీయ నేతలు గానీ కేసీఆర్‌ను ఇప్పటిదాకా విమర్శించలేదు. పైగా హైదరాబాద్‌కు వచ్చిన కేంద్రబృందం ప్రభుత్వ చర్యలను ప్రశంసించింది. అయినా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దా ఊహించని విధంగా, తమపై దాడి చేయడం తెరాసను ఉక్కిరిబిక్కిరి చేసినట్టయింది. నద్దా నుంచి అలాండి దాడి ఎదురవుతుందని తెరాస ఊహించలేదు. కరోనా కాలంలో కేంద్రానికి సహకరిస్తున్నా, తమపై ఇలాంటి దాడి ఏమిటన్నది తెరాసకు అర్ధం కాలేదు.

‘సర్దార్ ప్రాజెక్టు’ పైనా  తెరాస ఆరోపణల సాహసం..

దానితో తేరుకున్న తెరాస నాయకత్వం.. మంత్రి ఈటలను ముందుంచి, విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టించింది. మోదీ రాష్ట్రమైన గుజరాత్‌లో వెల్లువెత్తుతున్న కరోనా చావులను కూడా, తెరాస  వేలెత్తి చూపడం కూడా ఆసక్తికలిగించింది. దీనితో తాము కూడా కేంద్రంలోని బీజేపీతో, యుద్ధానికి సిద్ధంగానే ఉన్నామన్న సంకేతాలిచ్చినట్టయింది. చివరకు దేశంలో ఏ ప్రతిపక్షం కూడా సంధించనన్ని అంశాలను బీజేపీపై ప్రయోగించడం  ఆశ్చర్యపరిచింది. ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న  సర్దార్ నర్మదా సరోవర్ ప్రాజెక్టును  కూడా.. కమిషన్ల కోసమే నిర్మిస్తున్నారా అని ప్రశ్నించడం ద్వారా, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని వేలెత్తిచూపిన నద్దాకు తెరాస ఘాటు జవాబు ఇచ్చినట్టయింది. నిజానికి ప్రతిరోజూ కమలంపై కస్సుమనే కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ వంటి పార్టీలు  కూడా.. ఇప్పటివరకూ ప్రధాని రాష్ట్రమైన గుజరాత్‌లోని, సర్దార్ ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందని విమర్శించలేకపోయారు. ఆ సాహసం చేయడం ద్వారా, తెరాస కేంద్రంపై యుద్ధానికి సిద్ధమవుతునట్లు సంతేతాలు పంపినట్టయింది.

అటు ఈ పరిణామాలు కమలనాధుల్లో కూడా హుషారునిచ్చినట్లుగానే కనిపిస్తోంది. ఇప్పటివరకూ కేసీఆర్-తెలంగాణ బీజేపీ సమరంగా ఉన్న వాతావరణం, నద్దా ప్రవేశంతో ఆసక్తికరంగా మారింది.  కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, సంజయ్, అరవింద్, రామచందర్‌రావు, రఘునందన్‌రావు, డికె అరుణ  వంటి కొద్దిమంది అగ్రనేతలు మాత్రమే ఇప్పటిదాకా కేసీఆర్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ వస్తున్నారు. ఇప్పుడు వారికి స్వయంగా పార్టీ జాతీయ దళపతినే తోడుగా నిలవడం,  భాజపా శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. కొత్తగా చోటు చేసుకున్న ఈ పరిణామాలు ఏ దిశగా పయనిస్తాయో చూడాలి.