రక్షణ కోసం కేంద్ర హోంమంత్రి వద్దకు
ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు
కేంద్ర దళాల భద్రతకు వినతి
                        (మార్తి సుబ్రహ్మణ్యం)

ఇప్పటివరకూ సాంకేతికంగా అధికార వైసీపీ.. మానసికంగా బీజేపీ  అనధికార ఎంపీగా ఉన్న నర్సాపురం పార్లమెంటుసభ్యుడు లాజిక్కుల రఘురామకృష్ణంరాజుకు కొంచెం తిక్కుంది. కానీ దానికో లెక్కుంది. రక్షణ కోసం  ఏపీ డీజీపీ వద్దకు వెళ్లకుండా.. కేంద్ర హోంమంత్రి వద్దకు వెళ్లాలనుకోవడమే ఆ లెక్క అన్నది.. ఆలస్యంగా, ఆ లెక్కకు అర్ధమని అందరికీ  తెలిసింది. కొంపదీసి.. ఆంధ్రా పోలీసులపై మాకు నమ్మకం లేదని అప్పుడెప్పుడో జగనన్న అండ్ కో చేసిన ప్రకటన, రాజుగారికి ఇప్పుడు గుర్తొచ్చినట్లుంది కామోసు!

రామ-కృష్ణుడితో వైసీపీకి చికాకులు..

రఘురామ కృష్ణంరాజులోని రాముడు మంచిబాలుడే. కానీ ఎటొచ్చీ జగనన్నకు చిక్కులు, చికాకులు తెచ్చిపెడుతున్నదంతా ఆయనలోని ఆ కృష్ణుడే! స్వపక్షంలో విపక్షంలా విభీషణ పాత్ర పోషిస్తున్న రఘురామకృష్ణుడి చిలిపితనం  వైసీపీ శిబిరాన్ని చిర్రెత్తిస్తోంది. సొంత పార్టీ సర్కారుపై సెంటీమీటర్ల  కొద్దీ విమర్శల జడివాన కురిపిస్తున్న రఘురాముడిపై, ఆ పార్టీ వీరాభిమానులు కారాలూమిరియాలూ నూరుతున్నారు. తమ అభిమాననేతపై యుద్ధం చేస్తున్న రఘురాముడి దిష్టిబొమ్మలను, పగలు రాత్రి తేడా లేకుండా  జగనన్న వీరాభిమానులు టీవీ సీరియళ్ల మాదిరి వరసగా దగ్ధం చేస్తున్నారు. మరికొందరు విదేశాల నుంచి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. సరే.. ఇప్పుడంటే కరోనా కాలం. ఎప్పటికైనా సొంత నియోజకవర్గానికయితే వెళ్లాలి కదా? మరి వెళ్లాలంటే జగనన్న వీరాభిమానులు ఊరకనే ఉంటారా?.. ఆ భయంతోనే తనకు రక్షణ కావాలని రఘురాముడు ఢిల్లీ ఫైటెక్కి, హోంమంత్రి అమిత్‌షాను కలసి, తన ప్రాణభయం వెళ్లబోసుకునేందుకు సిద్ధమవుతున్నారట. ఈపాటికే ఆయన పిఎస్, స్థానిక పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కానీ..ఆంధ్రా పోలీసులపై తమకు నమ్మకం లేదని అప్పుడెప్పుడో జగనన్న అండ్ కో చెప్పినట్లే.. ఇప్పుడు రఘురాముడు కూడా బహుశా అదే సూత్రం పాటిస్తూ, కేంద్ర హోం శాఖ తలుపుకొట్టేందుకు సిద్ధమవుతుండటం ఆసక్తికరంగా లేదూ?!

అమరావతిని కాదని అమిత్‌షా వద్దకు..

వైసీపీ కార్యకర్తల నుంచి తన ప్రాణాలకు హాని ఉందని ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్‌సభ స్పీకర్‌కు రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు. తనను చంపేస్తామని కొందరు వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, కాబట్టి అక్కడ తనకు రక్షణ లేనందున కేంద్ర బలగాలతో తనకు రక్షణ కల్పించాలని తన లేఖలో ఫిర్యాదు చేశారు. పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, ఈ విషయంలో నలుగురు ఎస్సైలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే విషయాన్ని ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి సైతం ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఫిర్యాదు చేసేందుకు, అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కేంద్రహోం శాఖ మంత్రి అమిత్‌షాను కోరారు. మరో రెండురోజుల్లో అక్కడి నుంచి పిలుపు వస్తుందని భావిస్తున్నారు.

నాడు నిమ్మగడ్డ కూడా అంతే..

ఇదంతా చూస్తుంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వ్యవహారానికి కాపీ పేస్టులా కనిపించడం లేదూ? నిమ్మగడ్డ కూడా అంతే కదా?! అధికార పార్టీ నేతల నుంచి తనకు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని, తన ప్రాణాలకు వారి నుంచి భయం ఉన్నందున తనకు కేంద్ర బలగాల రక్షణ కల్పించాలని నిమ్మగడ్డ హోంశాఖకు లేఖ రాశారు. ఆ మేరకు కేంద్రం నుంచి స్పందన రావడం, ఏపీ డీజీపీ కూడా స్పందించి.. నిమ్మగడ్డ హైదరాబాద్‌లో ఉంటున్నందున ఆయనకు రక్షణ కల్పించాలని, తెలంగాణ డీజీపీకి కోరడం జరిగిపోయింది. నిమ్మగడ్డ లేఖ రాసిన వెంటనే కేంద్ర బలగాలు, విజయవాడలోని ఆయన కార్యాలయం వద్ద మోహరించాయి.

నిమ్మగడ్డకు  సేమ్ టు సేమ్..

ఇప్పుడు సేమ్ టూ సేమ్.. రఘురాముడు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. సాధారణంగా అయితే ఎంపి అయిన రాజుగారు, తన భద్రతకేమైనా అనుమానం వస్తే ముందు రాష్ట్ర డీజీపీకి లేఖ రాయాలి. అప్పటికీ స్పందించకపోతే, అప్పుడు చివరి అస్త్రంగా కేంద్రానికి లేఖ రాయాల్సి ఉంది. అందులోనూ ఆయన పరాయి పార్టీ వాడేమీ కాదు.  సాంకేతికంగా అధికారపార్టీ ఎంపీగారేనాయె! ఆ ప్రకారంగా డీజీపీ కూడా స్పందించి ఉండేవారు. కానీ, ఎందుకో రాజుగారికి రాష్ట్ర పోలీసులపై డౌటనుమానాలు వచ్చినట్లున్నాయి. అందుకే ఏకంగా ఢిల్లీ తలుపులు తట్టినట్లున్నారు. అలాగయినా కాగల కార్యం కేంద్ర గంధర్వులు తీరుస్తారని భావించారేమో?

ఏదేమైనా.. సాక్షాత్తూ.. ఒక అధికార పార్టీ ఎంపీ, తన పార్టీ ప్రభుత్వంపైనే నమ్మకం లేక, లోకసభ స్పీకర్, కేంద్ర హోంశాఖ మంత్రిని శరణువేడటం ప్రతిపక్షాలకు అస్త్రాలిచ్చినట్లే. ‘మీ సొంత పార్టీ ఎంపీనే మీ పాలనలో భద్రతపై నమ్మకం లేక కేంద్రానికి ఫిర్యాదు చేస్తే, ఇక సామాన్యులకు మీ సర్కారు ఏం రక్షణ కల్పిస్తుందని’  జగనన్న సర్కారును  కడిగేయడానికి, రాజుగారు విపక్షాల చేతికి అస్త్రం అందించారన్నమాట!  గోదారోళ్లు కదా? ఆ నీళ్ల తెలివే వేరప్పా!!

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner