పల్నాడు గ్రామాల్లో తీర్మానాలు
నో గుట్కా.. నో పేకాట
కాసు మహేష్ కృషితో పెరుగుతున్న ‘నిషేధాలు’

సూర్య – పల్నాడు ప్రతినిధి: పల్నాడు అంటేనే ఎవరి మాట వినని లెక్కలేనితనం. దూకుడు. ఆవేశం. చిన్న చిన్న వాటికే కట్టలు తెగే ఆగ్రహావేశం. వీటికి కేరాఫ్ అడ్రసయిన పల్నాడులో, ఇప్పుడు ప్రజలు ఒకేమాట మీద నిలబడి, తమంతట తాము వినిపిస్తున్న ‘స్వయం ప్రకటిత నిషేధ గీతాలు’  మార్మోగుతున్నాయి.

పల్నాడు ప్రాంతంలో సారా, నాటు సారా విచ్చలవిడిగా దొరుకుతుంటుంది. అందులోనూ తెలంగాణ సరిహద్దు కూడా అక్కడికి కూతవేటు దూరంలోనే ఉంటుంది. కిలోమీటరు దాటితే తెలంగాణ బ్రాండ్లన్నీ దొరుకుతాయి. దానితో కరోనా కాలంలో పల్నాడు ప్రాంత మందుబాబులు బండ్లు వేసుకుని, తెలంగాణకు వెళ్లి కావలసిన బ్రాండ్లు తెచ్చుకుంటున్నారు. ఇవి కాకుండా నిషేధంలో ఉన్న గుట్కా కూడా మస్తుగా దొరుకుతోంది. ఫలితంగా ఈ పరిణామాలు గ్రామ కుటుంబ జీవనాన్ని దెబ్బతీస్తుందని గ్రహించిన,  గురజాల యువ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి.. ఇకపై వాటికి దూరంగా ఉంటామని గ్రామాల్లో తీర్మానం చేయించేందుకు రంగంలోకి దిగారు. ఇది ప్రస్తుతం రాష్ట్రంలోనే తొలి ప్రయత్నం. ప్రయోగం!

పల్నాడు ప్రాంతంలో మందు, గుట్కా, పేకాటతో సామాన్యుడి జీవితం పతనమవుతోంది. పైగా కరోనా మహమ్మారి చిమ్మే వైరస్, వీటికి అదనపు ప్రమాదంగా మారింది. దీనితో రంగంలోకి దిగిన గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి..గ్రామ పెద్దలు, పోలీసులను పిలిపించారు. వాటి వల్ల జరిగే నష్టాన్ని గ్రామ ప్రజలకు వివరిస్తున్నారు. మద్యాన్ని తగ్గించేందుకే జగన్ ప్రభుత్వం వాటి ధరలు పెంచిందని చెబుతున్నారు. నలుగురైదుగురు పోగయి ఆడే పేకాట వల్ల, వైరస్ విస్తరిస్తుందని ఇప్పటివరకూ దానికి సంబంధించి జరిగిన అనేక ఘటనలను ఉదహరిస్తున్నారు. గుట్కా తిని  ఉమ్మేయడం వల్ల కూడా, వైరస్ విస్తరిస్తుందని నచ్చచెబుతున్నారు. వాటికి దూరంగా ఉంటే, దానివల్ల  మిగిలే ఆదాయాన్ని కుటుంబానికి, పిల్లల చదువుకు ఖర్చు పెట్టవచ్చని హితవు చెబుతున్నారు. ఇంట్లో సంపాదించే మనిషి అనారోగ్యంతో ఆసుపత్రి పాలువుతే, అతని కుటుంబ ఆర్ధిక పరిస్థితి తలకిందులవుతోందని కొన్ని ఉదాహరణలు చెబుతున్నారు.

యువకుడు, విద్యావంతుడైన కాసు చెబుతున్న ఈ ఉదాహరణలు, గ్రామ ప్రజల మనసులను తాకుతున్నాయి. ఫలితంగా తమ గ్రామాల్లో ఇకపై మద్యం తాగమని, పేకాట ఆడమని, గుట్కా తినమని తీర్మానాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇతర గ్రామాలకు స్ఫూర్తిగా మారుతున్నాయి.ఉత్తిగా మాటలు చెప్పి వెళ్లిపోకుండా.. ఈ మొత్తం వ్యవహారాలను పర్యవేక్షించేందుకు గ్రామ వాలంటీర్లు, గ్రామ పోలీసులకు కాసు బాధ్యతలు అప్పగించారు. నిరంతరం వీటిపై పర్యవేక్షణ జరగాలని ఆదే శిస్తున్నారు. వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, పోలీసులతో కలసి  ప్రతి గ్రామానికి వెళ్లాలని మహేష్ నిర్ణయించుకున్నారు. ఆ మేరకు గురజాల పోలీసులతో కలసి తమ కార్యాచరణను ప్రకటించారు. సామాజిక చైతన్యం కోసం కాసు చేస్తున్న కృషి ఫలిస్తే.. పల్నాడు మద్యరహితంగా మారడమే కాదు. ప్రజల్లో క్రమశిక్షణ కూడా అలవడుతుందనడంలో సందేహం లేదు. కాసు.. కీపిటప్!

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner