ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో నేను, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ , ఇటీవల వరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా వుండి, తనను ప్రభుత్వం తొలగించడంపై కోర్టుకెళ్లిన సీనియర్ ఐఎఎస్ అధికారి రమేష్ కుమార్  రహస్యంగా సమావేశమైనట్టు కొన్ని టీవీ ఛానళ్లలో ప్రసారాలు చేశారు. సదరు హోటల్లోని సిసి టివి ఫుటేజ్ ని కూడా ప్రసారం చేశారు. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్న చందంగా పలువురు వైసిపి నేతలు కూడా దీనిపై వారి స్థాయిలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

అసలు వాస్తవమేంటంటే..
లాక్ డౌన్ తరువాత నా అధికార, వ్యాపార కార్యకలాపాలను బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ నుంచి నిర్వహిస్తున్నాను. అక్కడే వివిధ రంగాలకు చెందిన అనేకమంది వ్యక్తులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు నన్ను కలుస్తున్నారు. అవి ఎంతమాత్రం కూడా రహస్య సమావేశాలు కాదు. నా కార్యకలాపాలను, సమావేశాలను రహస్యంగా నిర్వహించాల్సిన అవసరం కూడా నాకు లేదు.

ఈ నెల 13న కామినేని శ్రీనివాస్  నన్ను కలవడానికి అపాయింట్ మెంట్ తీసుకున్నారు. అదే రోజు రమేష్ కుమార్ కూడా నన్ను కలవాలని అడిగారు. వారిద్దరు వేర్వేరు సమయాల్లో, వేర్వేరు విషయాలపై నాతో సమావేశమయ్యారు. అవి ఎంతమాత్రం రహస్య సమావేశాలు కాదు. కామినేనితో ఎపి పార్టీ వ్యవహారాలు మాట్లాడ్డం జరిగింది. ఆయన వెళ్లాక రమేష్ కుమార్ కలిశారు. ఆయన మా కుటుంబానికి ఎంతో కాలంగా మిత్రులు. ఆయనతో ప్రత్యేకించి ఇటీవల పరిణామాలు గానీ, ఆయన విధి నిర్వహణకు సంబంధించిన విషయాలు కానీ చర్చించలేదు.

అయితే కొన్ని మీడియా సంస్థలు, కొందరు రాజకీయ నాయకులు సిసి ఫుటేజ్ చూపించి మేము ముగ్గురం సమావేశమయ్యామని, ఏదో గూడుపుఠాని వ్యవహారం నడిపామని, చట్టవిరుద్ధ చర్యలు చేపట్టామన్నంతగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రసారాలు చేశాయి. చాలా తెలివిగా గడుసుగా ప్రజలకు భ్రమ కల్పించే ప్రయతం చేసాయి.

వారిద్దరితో నా సమావేశాలు సాధారణమైనవే. అవి చట్ట వ్యతిరేకంగానో, లేదా కొన్ని మీడియా సంస్థలు, రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నట్టు ఎవరినో ఏదో చేయడానికో కాదు.

దీనికి, రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడేవారు, వారి నేలబారు మనస్తత్వాలను బయటపెట్టుకున్నట్టే. నలుగురు కలిసి మాట్లాడుకుంటే కుట్రలు చేయడమే అనుకోవడం వారి దిగజారిన స్థాయిని తెలుపుతుంది.

ఈ రకమైన బురద రాజకీయాలు చేసేవారితో గుంటలోకి దిగి వారితో కలబడి కుస్తీ పట్టడం నాకు అలవాటు లేదు, అది నా స్థాయి కాదు.

నేనెప్పుడూ ఓపెన్ గానే వుంటాను. నా రాజకీయాలు పారదర్శకంగా వుంటాయి. రహస్య కార్యకలాపాలు నేను చెయ్యను, చేయాల్సిన అవసరం నాకు లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner