మాదిగల నోట సర్కారు మట్టి!

438

సిలికా మాఫియా దెబ్బతో మాదిగలకు ఉపాథి గాయం
కృష్ణపట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ మూతకు నిర్ణయం?
అవకాశం కోల్పోనున్న 15 వేల మాదిగ సాంకేతిక నిపుణులు
వైఎస్ పోరాడి సాధించిన ప్రాజెక్టు జగన్ హయాంలో మూత?
ప్రాజెక్టు రద్దయినందున వెళ్లిపొమ్మని సిబ్బందికి ఆదేశాలు?
అధికార పార్టీ ప్రముఖుల సౌజన్యంతో అడ్డగోలు తవ్వకాలు
గ్రామంలో అడుగుపెట్టనీయకుండా కంపెనీకి ఆటంకాలు
గతంలో టీడీపీకి సేవ చేసిన ప్రముఖులే ఇప్పుడు వైసీపీలో
నాటి మంత్రి దన్నుతో ఇద్దరు జడ్పీటీసీలను స్పాన్సర్ చేసిన సిలికా వ్యాపారి
రెడ్డివర్గ మైనింగ్ వ్యాపారుల కోసమనేనన్న మాజీ ఎమ్మెల్యే సౌమ్య
మైనింగ్ తవ్వకాల కోసమే రద్దంటున్న టీడీపీ, మాదిగ సంఘాలు
మార్తి సుబ్రహ్మణ్యం)

మహానేత, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ ప్రాజెక్టు కోసం కేంద్రంపై పోరాడారు. ఆయన ఒత్తిడి ఫలించి కేంద్రం లెదర్ కాంప్లెక్స్‌ను మంజూరు చేసింది. కానీ.. అదే మహానేత తనయుడయిన జగన్మోహన్‌రెడ్డి హయాంలో, దానిని మూసివేయడానికి రంగం సిద్ధమవుతుండం  విస్మయం కలిగిస్తోంది. కారణం.. సొంత సామాజికవర్గ మైనింగ్ లాబీ ఒత్తిళ్లేనన్నది టీడీపీ, బీజేపీ, మాదిగ సంఘాల ఆరోపణ. ఇప్పుడు దానికోసం మాదిగలు రోడ్డెక్కనున్నారు. ఇంత జరుగుతున్నా.. అధికార పార్టీ లోని మాదిగ ప్రజాప్రతినిధుల నోట నుంచి మాట లేదు. పలుకులేదు. ఇదీ..అర్ధంతరంగా మూతపడేందుకు సిద్ధమవుతున్న,  నెల్లూరు జిల్లా కృష్ణపట్నం లోని అంతర్జాతీయ లెదర్ కాంప్లెక్ విషాద గాథ!

రాష్ట్రంలోని మాదిగ యువకులకు తోళ్ల పరిశ్రమకు సంబంధించి వృత్తి శిక్షణ- ఉపాథి కల్పించడం  ద్వారా, వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చాలని నాడు ైదివంగత నేత వెఎస్ రాజశేఖర్‌రెడ్డి భావించారు. ఆ మేరకు ఆయన, అప్పటి కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు చేశారు. ఫలితంగా కృష్ణపట్నంలో ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. నిజానికి ఈ ప్రాజెక్టును తమిళనాడులో ఏర్పాటుచేయాలని భావించిన సందర్భంలో.. వైఎస్ దానిని అడ్డుకుని, ఉమ్మడి రాష్ట్రమైన ఏపీకి తీసుకురావాలని చేసిన పోరాటం ఫలించింది. దానికోసం ఏపిఐఐసికి 531 ఎకరాలు కేటాయించ గా, తర్వాత 281  కోట్లతో ఏపిఐఐసి-లిడ్‌క్యాప్ సంయుక్త ప్రాజెక్టుగా  ‘కృష్ణపట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్’, స్పెషల్ పర్పస్ వెహికల్ కింద ఏర్పడింది. ఈ ప్రాజెక్టు ప్రారంభమయితే,  అక్కడ 15 వేల మంది మాదిగ యువకులు శిక్షణ పొందే అవకాశం ఉంటుంది.  మాంసం వ్యర్థాలను (తోళ్లు) వేరుచేసి, రకరకాల లెదర్ బ్యాగులను తయారుచేయడం ద్వారా, మాదిగ యువకులు ఉపాథి పొందడానికి ఈ ప్రాజెక్టు ఏర్పాటయింది.

పెట్టుబడులకు అపాచీ, టాటా  కూడా సిద్ధం..


దీనికోసం పెట్టుబడిదారులను ఆహ్వానించగా, ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలతో  పాటు, ప్రపంచ దిగ్గజ సంస్థ అపాచీ కూడా దరఖాస్తు చేసిందంటున్నారు. టాటా ఇంటర్నేషనల్ లెదర్ ప్రొడక్ట్స్ అండ్ ఫ్యాషన్ క్లబ్ గ్లోబల్ సంస్థతో సహా, 46 లెదర్ పరిశ్రమలు అక్కడ 2వేల కోట్ల పెట్టుబడితో వచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి. ఇక్కడ తయారయ్యే ఫ్యాషన్ లెదర్ ఉత్పత్తులు, దేశవిదేశాలకు ఎగుమతి చేయనున్నారు.  నిజానికి నెల్లూరు జిల్లా కోట మండలం, కొత్తపట్నంలో 2009న కేంద్ర సహకారంతో దీనిని ప్రారంభించేందుకు అమోదించబడింది. ఈ ప్రాజెక్టుకు 125 కోట్ల రూపాయలు కేంద్రమే గ్రాంట్ల రూపంలో ఇవ్వాలని నిర్ణయించింది. ఈ కంపెనీ క్యాంపు కార్యాలయాన్ని 11 మంది నిపుణులు, సిబ్బందితో నెల్లూరులోని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసం వద్దనే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వారిలో ఆరుగురే పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం కంపెనీని రద్దు చేస్తున్నందున, సోమవారం నుంచి రానవసరం లేదన్న సమాచారం సిబ్బందిని దిగ్భ్రమ పరిచింది. ఇక అక్కడి నుంచి కంపెనీ తెరవెనుక బాగోతం వెలుగుచూసింది.

అడుగడుగునా ఆటంకాలు..

ప్రాజెక్టుకు భూ కేటాయింపులు పూర్తయి ఇంతకాలం అవుతున్నా.. ఇప్పటివరకూ అక్కడ భూమి చుట్టూ ప్రహరీగోడ గానీ, కనీసం ఫెన్సింగ్ కూడా ఏర్పాటుచేయకపోవడం బట్టి, ప్రాజెక్టుపై పాలకుల చిత్తశుద్ధి ఏమిటన్నది స్పష్టమవుతుంది. అక్కడ తోళ్లను శుద్ధి చేసేందుకు వీలులేదని, దానివల్ల తమ గ్రామాలకు నష్టం జరుగుతుందని కొంతమంది గ్రామస్తులు చాలాకాలం నుంచి ఆందోళన చేస్తున్నారు. అయితే, దీని వెనుక సిలికా లాబీ ఉందన్న ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. చివరకు తాము తోళ్ల శుద్ధి ప్రతిపాదన విరమించుకుని, కేవలం ఉత్పత్తికే పరిమితం అవుతామని చెప్పినా, సిలికా లాబీ చేతిలో ఉన్న గ్రామస్తులు వినడం లేదంటున్నారు.

అక్కడ ప్రాజెక్టు ఏర్పాటయితే సిలికా తవ్వకాలకు ఆటంకం ఏర్పడుతుందన్న ముందుచూపుతోనే, సదరు సిలికా లాబీ గ్రామస్తులను రెచ్చగొడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సిలికా వ్యాపారులు ఆ  ప్రాంతమంతా మెనింగ్ చేస్తున్నారని, గ్రామంలోకి కొత్తవారిని రానీయకుండా అడ్డుకుంటున్నారని చెబుతున్నారు. నిజానికి ఈ ప్రాజెక్టు కోసం.. అంతకుముందు సిలికా కోసం ఇచ్చిన 50 ఎకరాల లీజు కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు రద్దయిన ఆ 50 ఎకరాలతోపాటు, లెదర్ ప్రాజెక్టు కోసం కేటాయించిన 531 ఎకరాల్లో.. కొత్తవారిని గ్రామంలోకి రానీయకుండా, వ్యూహాత్మకంగా అడ్డుకోవడం ద్వారా.. సిలికా తవ్వకాలకు అడ్డులేకుండా చూసుకుంటున్నారన్న వ్యాఖ్యలు నెల్లూరు జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

నాడు టీడీపీ.. నేడు వైసీపీ!

కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్న సిలికా లాబీ.. రాజకీయంగా కూడా తెలివిగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఇదే సిలికా లాబీ.. జడ్పీ చైర్మన్  ఎన్నికల సందర్భంగా.. ఇద్దరు జడ్పీటీసీలను, నాటి మంత్రి నారాయణ ఆధ్వర్యంలో టీడీపీకి అప్పగించినట్లు చెబుతున్నారు. అప్పుడు గూడూరు మునిసిపాలిటీ కూడా టీడీపీ అధీనంలోనే ఉండేది. అప్పుడు కూడా ఇదేవిధంగా తవ్వకాలు సాగించారంటున్నారు. ఎన్నికల ముందు, తర్వాత మారిన రాజకీయ పరిస్థితులలో.. అంతకుముందు టీడీపీని సమర్ధించిన అదే సిలికా లాబీ.. తర్వాత వైసీపీకి జైకొట్టింది. గత ఎన్నికల్లో వైసీపీకి నిధుల సాయాన్ని తన భుజనాకెత్తుకుందని, అందుకు ప్రతిఫలంగానే సిలికా తవ్వకాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంటే ఎవరు అధికారంలో ఉంటే వారి పక్షాన పనిచేస్తున్న ఈ సిలికా లాబీ, పనులు చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారంలో.. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ రాష్ట్ర ప్రముఖుడు, సీఎంకు సన్నిహితంగా ఉండే మరో ముఖ్యుడు, మరో ప్రజాప్రతినిధి, మరో స్థానిక మహిళా నేత  కీలకంగా వ్యవహరిస్తుండగా.. చిత్తూరు జిల్లాకు చెందిన మరో యువ ప్రజాప్రతినిధి, తెరవెనుక చక్రం తిప్పుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

మాదిగ నేతలు నోరు విప్పరేం..?

15 వేల మంది మాదిగ యువకులకు ఉపాథి కల్పించే కీలక మైన లెదర్ ప్రాజెక్టు రద్దయిపోయే ప్రమాదం కనిపిస్తున్నప్పటికీ, వైసీపీలోని మాదిగ ప్రజాప్రతినిధులు, నేతల నుంచి కనీస ప్రతిఘటన కనిపించకపోవడం చర్చనీయాంశమవుతోంది. అయితే, ఈ విషయం ఇంకా తమ దృష్టికి రాలేదని మరికొందరు మాదిగ నేతలు చెబుతున్నారు.  కాగా, గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ మాత్రం ప్రాజెక్టు అక్కడే ఉంచాలని పోరాడుతున్నారు. దానికోసం ఆయన సిలికా లాబీ నుంచి గ్రామస్తుల రూపంలో ప్రతిఘటన, నిరసనలు కూడా ఎదుర్కొంటున్నారు. అయితే.. లెదర్ ప్రాజెక్టును మూసివేయడం ద్వారా, మాదిల ఉపాథి అవకాశాలను సమాధి చేస్తున్నారంటూ, టీడీపీ మాజీ ఎమ్మెల్యే త ంగిరాల సౌమ్య మీడియా సమావేశం నిర్వహించి ఆందోళన వ్యక్తం చేయడంతో, ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రత్యామ్నాయాలు బోలెడు..

ఒకవేళ సిలికా లాబీ ఒత్తిళ్లకు తలొగ్గి, ప్రాజెక్టును రద్దు చేస్తే లెదర్ పార్కుకు ప్రత్యామ్నాయాలేమిటన్న ప్రశ్న తెరపైకొచ్చింది. అయితే.. తోళ్ల శుద్ధితో కలిపితే 500 ఎకరాలు, కేవలం ఉత్పత్తి వరకైతే 350 ఎకరాలు ఉండాలని కేంద్రం మార్గదర్శకాలు రూపొందించింది. దానికోసం కేంద్రం 125 కోట్లు గ్రాంట్లు ఇస్తుంది. కృష్ణపట్నం కాకపోతే.. నెల్లూరులో కియా వద్ద, పశ్చిమ గోదావరి కోవ్వూరు, కృష్ణా జిల్లా నందిగామ పెద్దవరం వద్ద 500 ఎకరాల ఏపిఐఐసి స్థలంలో ఏర్పాటు చేయవచ్చంటున్నారు.

ఇది రెడ్డివర్గ మైనింగ్ వ్యాపారుల కోసమే: సౌమ్య

కేంద్రం 125 కోట్ల నిధులిస్తున్నా, లెదర్ కాంప్లెక్స్ మూసివేత నిర్ణయం సీఎం జగన్ చేతకానితనమేనని టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విరుచుకుపడ్డారు. రెడ్డి వర్గ వ్యాపార ప్రయోజనాల కోసమే మాదిగల పొట్టకొడుతున్నారని ఆరోపించారు. దీనిపై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జగన్ తమ రెడ్డి సామాజికవర్గానికి చెందిన మైనింగ్ వ్యాపారులు శ్యాంప్రసాద్‌రెడ్డి, సజ్జల ప్రయోజనం కోసం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు.  ‘నాన్నే నా ప్రేరణ అని ట్వీట్ చేసిన జగన్, గతంలో కేంద్రంతో కొట్లాడి ఈ ప్రాజెక్టు కోసం వైఎస్ చేసిన పోరాటాన్ని కొడుకుగా మర్చిపోయి మూసివేయడం ఫాదర్స్‌డే నాడే కావడం విడ్డూరమని’ ధ్వజమెత్తారు. కేవలం రెడ్డి వర్గ మైనింగ్ వ్యాపారుల కోసమే 15వేల మంది మాదిగల పొట్టకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ కృష్ణపట్నంలో సాధ్యం కాకపోతే,  కృష్ణజిల్లా నందిగామ పెద్దవరం వద్ద 500 ఎకరాల ఏపిఐఐసి స్థలంలో అయినా లెదర్ కాంప్లెక్స్ ఏర్పాటుచేయాలని సౌమ్య డిమాండ్ చేశారు.

2 COMMENTS

  1. […] ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుని, మాదిగల మనసు గెలుచుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న మాదిగ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ తన పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరగా, ఆయనకు తిరిగి ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా, రాష్ట్రంలోని మాదిగల మనుసు గెలుచుకోవడంలో జగన్ విజయం సాధించినట్టయింది. ఫలితంగా.. వైసీపీ నాయకత్వం మాదిగకు ప్రాధాన్యం ఇవ్వదన్న అపవాదును చెరిపివేయగలిగారు. ఏపీలో మాల- మాదిగల మధ్య సంఖ్యాపరంగా కేవలం నాలుగులక్షల తేడానే ఉండటం గమనార్హం.ఇది కూడా చదవండి..: మాదిగల నోట సర్కారు మట్టి! […]

  2. […] ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుని, మాదిగల మనసు గెలుచుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న మాదిగ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ తన పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరగా, ఆయనకు తిరిగి ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా, రాష్ట్రంలోని మాదిగల మనుసు గెలుచుకోవడంలో జగన్ విజయం సాధించినట్టయింది. ఫలితంగా.. వైసీపీ నాయకత్వం మాదిగకు ప్రాధాన్యం ఇవ్వదన్న అపవాదును చెరిపివేయగలిగారు. ఏపీలో మాల- మాదిగల మధ్య సంఖ్యాపరంగా కేవలం నాలుగులక్షల తేడానే ఉండటం గమనార్హం.ఇది కూడా చదవండి..: మాదిగల నోట సర్కారు మట్టి! […]