విశాఖలో విజయసాయిపై కుట్ర?

185

పెత్తనం తప్పించేందుకు పావులు
ఓ ప్రజాప్రతినిధి నేతృత్వంలో వ్యూహం
ఏకమవుతున్న కమ్మ సామాజికవర్గం
ఓ ‘రాష్ట్ర ప్రముఖుడి’ కుర్చీ కింద మహిళానేత నీళ్లు?
వేధిస్తున్నందుకు  మహిళా నేత ఆత్మహత్యాయత్నం?
జగన్ వద్దకు విశాఖ పంచాయతీ?
 వైసీపీలో ‘వివాద విశాఖ’
                            (మార్తి సుబ్రహ్మణ్యం)

వేణుంబాక విజయసాయిరెడ్డి.. వైసీపీలో నెంబర్‌టూ.. జగనన్న తర్వాత అంతా ఆయనే.. జగన్ సర్కారు పదికాలాల పాటు ఉండేందుకు విజయసాయి పడని కష్టమంటూ లేదు. రాజకీయ ప్రత్యర్ధులపై ట్వీట్లు.. మాటల యుద్ధాలతో సమరం సాగించడంలో బిజీగా ఉన్నారు. అమరావతిలో సీఎం జగన్ కోసం ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, అధికారులు పడిగాపులు కాస్తుంటారు. విశాఖలో కూడా అదే స్థాయిలో విజయసాయి కోసం ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, అధికారులు ఎదురుచూస్తుంటారు. ఆయన విశాఖకు వస్తే, స్వాగతం చెప్పేవారి సంఖ్యకు లెక్క ఉండదు. పార్టీ-ప్రభుత్వంలో ఆ స్థాయిలో చక్రం తిప్పే, విజయసాయి వంటి అసాధారణ నేతపై సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందా? ఆయనను విశాఖ రాజకీయాల నుంచి తప్పించేందుకు, ఏడాదిపాటు విజయసాయి పెంచి పోషించిన కమ్మ సామాజికవర్గమే ఆయన పెత్తనంపై తిరుగుబాటు చేయనుందా? ఈ మొత్తం ఎపిసోడ్‌లో కొత్తగా తెరపైకి వచ్చిన ఓ మహిళా నేతపై వేధింపుల వ్యవహారంలో, ఒక రాష్ట్ర ప్రముఖుడి పదవి  కిందకు నీళ్లు తీసుకురానున్నాయా?.. ఇదీ విశాఖ వైసీపీ వర్గాలలో ఇప్పుడు హాట్‌టాపిక్.

విజయసాయికి బ్రేకులు వేస్తున్న ఆ ప్రజాప్రతినిధి..

విశాఖ నగరం కేంద్రంగా,  ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసిస్తోన్న వైసీపీ కీలక నేత.. విజయసాయిరెడ్డి హవాకు చెక్ పెట్టేందుకు, విశాఖకు చెందిన కమ్మ సామాజికవర్గం, రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  గత ఏడాది నుంచి ఆ సామాజికవర్గాన్ని పెంచి పోషించిన విజయసాయి, ఈ పరిణామాలను గమనిస్తున్నారంటున్నారు.  కరోనా నేపథ్యంలో పేదవారికి విజయసాయి తన సొంత  ట్రస్టు ఆధ్వర్యాన,  నిత్యావసర వస్తువులు అందించడం ద్వారా ఆయన విశాఖ ప్రజలకు మరింత చేరువయ్యారు. ఆ కార్యక్రమంలో నగర నేతలంతా భాగస్వాములయ్యారు. దానితో ఆయనకు అక్కడ బాగా క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం ఆయనను పార్టీ నేతలు ఉత్తరాంధ్ర సీఎం అని పిలుస్తున్నారు. విశాఖలో విజయసాయి హవాకు చెక్ పెట్టే వ్యూహానికి,  ఓ ప్రజాప్రతినిధి నాయకత్వం వహిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా, గత ఏడాది నుంచి అదే ప్రజాప్రతినిధి విజయసాయి వెంట నమ్మినబంటుగా ఉండి, నగరంపై పట్టు సాధించిన తర్వాత.. విజయసాయిపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్న వైనం పార్టీ వర్గాలను విస్మయపరుస్తోంది.

సదరు ప్రజాప్రతినిధికి..  నగర ంలో కమ్మ సామాజికవర్గానికే చెందిన ఓ ప్రముఖ ఆడిటర్ దన్నుగా నిలిచారని, సదరు ఆడిటర్‌కు సీఎం జగన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. వీరంతా కలసి జగన్ వద్దకు వెళ్లి, విజయసాయి వ్యవహారంపై తేల్చుకోవాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తమ సామాజికవర్గానికి చెందిన వారి భూములపై జోక్యం చేసుకుంటున్నందుకే, సదరు ప్రజాప్రతినిధి విజయసాయిపై తిరుగుబాటుకు తెరలేపారని, ఇదంతా 22ఏ భూముల కథలో భాగమేనని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సదరు ప్రజాప్రతినిధికి 22ఏలో కింద ఎకరాల భూములున్నాయన్న ప్రచారం జరుగుతోంది.

క్రైస్తవ ట్రస్టు భూముల కోణమేనా..?

విశాఖ కమిషనర్ బంగ్లా సమీపంలోని, క్రైస్తవ ట్రస్టుకు సంబంధించిన భూమి వ్యవహారం వివాదంగా మారిన విషయం తెలిసిందే. బెంగళూరులో నివసించే సదరు ట్రస్టీ.. కొంతకాలం క్రితం విశాఖ వచ్చి ఆ స్ధలం తనదే అయినందున, తనకు ఇప్పించాలని కోరుతూ జిల్లా యంత్రాంగానికి  లేఖ రాశారని తెలుస్తోంది. ఈ స్థలంపైనే సదరు ప్రజాప్రతినిధి కన్నేశారని, ఆ మేరకు కొంత అడ్వాన్సు కూడా చెల్లించారన్న ప్రచారం జరిగింది. దాని విలువ ఎకరం 150 కోట్ల రూపాయలంటున్నారు.

కమ్మ వర్గ నేతల కదనం..

ఆ తర్వాత మారిన విశాఖ వైసీపీ అంతర్గత రాజకీయాల నేపథ్యంలో.. విశాఖకు రాజధాని వచ్చే అవకాశం ఉన్నందున, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆ భూమిని అమ్మవద్దని, విజయసాయి కలెక్టర్‌కు లేఖ రాసినట్లు సమాచారం. అక్కడ నుంచి కమ్మసామాజికవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ ప్రజాప్రతినిధి.. జగన్‌కు సన్నిహితుడైన కమ్మ వర్గానికే చెందిన ఒక ఆడిటర్ ద్వారా పావులు కదిపి, విజయసాయిని విశాఖ రాజకీయాలను నుంచి  పంపించే వ్యూహాలకు పదునుపెడుతున్నారన్న ప్రచారం, విశాఖ వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
గత ఏడాది కాలం నుంచి అదే సామాజికవర్గ ప్రముఖులు విజయసాయి చుట్టూ చేరి, పనులు చేయించుకున్నారు.  విజయసాయి చివరకు.. విశాఖలో ఉన్న రెడ్డి సామాజికవర్గ ప్రముఖులను కూడా పక్కనపెట్టి.. కమ్మ సామాజికవర్గ ప్రముఖులనే ప్రోత్సాహించారని,  ఇప్పుడు అదే సామాజికవర్గ ప్రముఖులు ఆయన చాపకింద నీళ్లు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది.

వైసీపీ మహిళా నేత ఆత్మహత్యాయత్నం?

ఇదిలాఉండగా.. ఈ ఎపిసోడ్ మధ్యలో.. విశాఖలో ఓ వైసీపీ మహిళా నేతపై ఉత్తరాంధ్రకు చెందిన ఓ ‘రాష్ట్ర ప్రముఖుడు’ వేధింపులకు పాల్పడిన వైనం, గత కొద్దిరోజుల నుంచీ విశాఖ వైసీపీ వర్గాలలో హల్‌చల్ చేస్తోంది. విజయసాయి వర్గంగా భావిస్తోన్న ఆమెను సదరు ‘రాష్ట్ర ప్రముఖుడు’ గత కొద్దిరోజుల నుంచి సతాయిస్తున్నారని చర్చ జరుగుతోంది.  దానికి సంబంధించి ఆమె..  సదరు రాష్ట్ర ప్రముఖుడి ఫోన్ కాల్స్‌ను, రికార్డు కూడా చేశారన్న ప్రచారం జరుగుతోంది. దానిని సర్కారుపై సమరం సాగిస్తోన్న ఓ చానెల్ ప్రతినిధి, వారం రోజుల క్రితమే చేజిక్కించుకుని, ఆడియో బయటకు రాకుండా బేరసారాలు ఆడారన్న గుసగుసలు అటు జర్నలిస్టు వర్గాల్లోనూ వినిపిస్తోంది.

జగన్ వద్దకు చేరిన మహిళా నేత పంచాయితీ..?

సదరు రాష్ట్ర ప్రముఖుడి వేధింపులకు తాళలేక ఆ మహిళా నేత ఆత్మహత్యాప్రయత్నానికి పాల్పడితే, ఆ విషయాన్ని బయటకు లీక్ చేయవద్దని సదరు ‘రాష్ట్ర  ప్రముఖుడు’ ఆసుపత్రి వర్గాలపై ఒత్తిళ్లు చేసినట్లు చెబుతున్నారు. అయితే, ఆసుపత్రి యాజమాన్యం మాత్రం, ముందు జాగ్రత్తగా  పోలీసులకు ఫిర్యాదు చేశారన్న ప్రచారం జరుగుతోంది.  ఆ కేసు వెలుగుచూడకుండా సదరు సచివుడు నానా పాట్లు పడుతున్నారని, చివరకు  ఈ వ్యవహారమంతా రికార్డు చేసిన ఆడియోలతో సహా జగన్ వద్దకు చేరిందని, వైసీపీ వర్గాల్లో విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. నిజం ‘జగన్నా’దుడికెరుక?