నాడు సర్కారు అవినీతిపై సొంత మీడియా కథనాలు
ఇప్పుడు నేతల ఆరోపణలు ప్రచురించినందుకే కేసులా?
విస్తుపరుస్తున్న వైసీపీ విధానాలు
జర్నలిస్టు సంఘాలు చేవచచ్చిపోయాయా?
అధికారం ఎవరికీ శాశ్వతం కాదని తెలియదా?
                      (మార్తి సుబ్రహ్మణ్యం)

తాను చేస్తే సంసారం. ఎదుటివారు చేస్తే వ్యభిచారం అన్నట్లుంది ఆంధ్రాలో వైసీపీ సర్కారు వ్యవహారం. విపక్షంలో ఉండగా ప్రభుత్వంపై టన్నుల కొద్దీ ఆరోపణల బురద పోసిన వైసీపీ, ఇప్పుడు అధికారంలోకి రాగానే.. తనపై అదే విధానం పాటిస్తున్న విపక్షాలు, మీడియాపై కేసుల బనాయించడం ఆ పార్టీ నాయకత్వ ద్వంద్వ విధానాలను స్పష్టం చేస్తోంది. ఒక ప్రతిపక్ష నాయకుడు చేసిన ఆరోపణలను ప్రచురించినందుకు, పత్రికలకు అధికారులే నోటీసులిచ్చిన వైనం చరిత్రలో ఇప్పుడే చూస్తున్నాం. మరి దీనికి జర్నలిస్టు సంఘాలు, టీవీ చర్చల్లో కళ్లజోళ్లు సవరించుకుని.. కళ్లు ఆర్పుతూ మూస్తూ,  దీర్ఘాలు తీస్తూ తీరి కూర్చుని, తమ  అనుభవాలను గుర్తు చేస్తూ.. సుద్దులు పలికే ‘జర్నలిస్టు పెద్ద ముత్తయిదువలు’  ఏం  భాష్యం చెబుతారో?

బాబు చెప్పింది రాస్తే కేసులా..?

ఆంధ్రా సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి చెందిన సరస్వతీ పవర్ కంపెనీకి సున్నపురాయి గనుల లీజును.. 50 ఏళ్లపాటు పొడిగిస్తూ ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మీడియా సమావేశంలో విమర్శించారు. చంద్రబాబు ఈ విమర్శను, ఏ విలేకరి చెవిలోనో రహస్యంగా చెప్పలేదు. బహిరంగంగానే అన్ని పత్రికలు, చానెళ్లకూ చెప్పారు. దానిని అవి ప్రచురించాయి. ప్రసారం చేశాయి. కానీ, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, దానిపై తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు.  ‘సరస్వతీ పవర్’పై వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం చంద్రబాబుకు, వాటిని ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతికి లీగల్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించడం విస్మయం కలిగించింది. ‘అయ్యా.. చంద్రబాబు వ్యాఖ్యలను అన్ని మీడియా సంస్థలు ప్రచురించాయి కదా. మరి అందరికీ లీగల్ నోటీసులు పంపించారా’’ అన్న  అన్న ప్రశ్నకు సార్ వద్ద సమాధానమే లేదు. తమ వివరణను ఆ రెండు పత్రికలు ప్రచురించలేదన్నది ఆయన వాదన.

‘సరస్వతీ’ పనిని సర్కారు చేస్తుందా?

ఇక్కడ బుర్ర ఉన్న ఎవరైనా ఆలోచించాల్సింది ఏమిటంటే.. సరస్వతీ పవర్ లీజుల వ్యవహారంపై ఆంధ్రజ్యోతి గానీ, ఈనాడు గానీ, మరో పత్రిక గానీ పరిశోధనాత్మక కథనాలేమీ రాయలేదు. సున్నపురాయి గనుల్లోకి వెళ్లి ఫొటోలు తీయలేదు. జస్ట్. ప్రతిపక్ష నాయకుడు చెప్పింది రాశారంతే! దానికి మీడియాకు లీగల్ నోటీసులేమిటో అర్ధం కాదు. నిజానికి ఆ పనిచేయాల్సింది సరస్వతి పవర్ కంపెనీ కదా? తమను అప్రతిష్టపాలు చేశారని చంద్రబాబుపై కంపెనీ యాజమాన్యం కదా లీగల్ నోటీసులు ఇవ్వాలి? అందుకు విరుద్ధంగా ప్రభుత్వాధికారే స్పందించారంటే.. సరస్వతి పవర్ కంపెనీ ఇంతకూ ప్రభుత్వ సంస్థనా? ప్రైవేటు సంస్థనా? ప్రైవేటు సంస్ధను ప్రభుత్వం తీసుకుందా? ఒకవేళ అది ప్రైవేటు సంస్థ అయితే, దానిపై మరోకరు ఆరోపలు చేసినప్పుడు, వారికి ప్రభుత్వ అధికారులు లీగల్ నోటీసులిస్తామని చెప్పడమేమిటి?.. ఇలాంటి ప్రశ్నలే కదా,  మెడపై తల ఉన్న ఎవరికైనా వచ్చేది?! మరి ఆ పాటి ఆలోచన అధికారులకు రాకపోవడేమిటి చెప్మా?

నాడు సర్కారుపై..  ఇదే వైసీపీ-మీడియా ఆరోపణల దాడి..

మొత్తానికి సరస్వతి పవర్‌పై విపక్ష నేత చంద్రబాబు చేసిన ఆరోపణలు ప్రచురించడం, దానిపై గనుల శాఖ వివరణ ఇచ్చినా దానిని ప్రచురించకపోవడమే మీడియాకు నోటీసులిచ్చేందుకు కారణమని అర్ధమయింది. గోపాలకృష్ణ  కవి హృదయం అదేనని కూడా అర్ధమయింది. ఇలాంటి నోటీసు హెచ్చరికలు వింటే నవ్వాలో, ఏడవాలో అర్ధం కావడం లేదు. ఇదే సీఎం జగన్మోహన్‌రెడ్డి విపక్ష నేతగా ఉన్నప్పుడు.. ఆయన, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు నాటి ప్రభుత్వంపై విచ్చలవిడిగా ఆరోపణలు చేశారు. వైసీపీ అధికార సాక్షి మీడియాలో అయితే ఇరిగేషన్, మైన్స్, ఇసుక, ఇళ్ల కేటాయింపులు, మంత్రుల అవినీతిపై కథనాలే వెలువరించింది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం అంతర్గతంగా ఇచ్చిన సర్క్యులర్లు, రహస్య జీఓలను కూడా బయటపెట్టింది. అందులో ఏమాత్రం తప్పులేదు. తమ వద్ద ఉన్న సమాచారాన్ని వెలుగులోకి తీసుకురావడం పత్రికల ధర్మం, విధి కాబట్టి.. దానిని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం కూడా దానిని తప్పు పట్టినా, న్యాయం  వైసీపీ మీడియా వైపే కనిపించింది.

ఇరిగేషన్ కంపెనీల నుంచి కె టాక్స్ వరకూ..

ఎం.పి సీఎం రమేష్, టీటీడీ చైర్మన్‌గా ఉన్న పుట్టా సుధాకర్‌యాదవ్, నామా నాగేశ్వరరావు, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి  కంపెనీలకు ఇచ్చిన ఇరిగేషన్ ప్రాజెక్టులు, లిక్కర్ కంపెనీకి ఇచ్చిన నిధులపై జగన్ అండ్ కో.. టన్నుల కోద్దీ ఆరోపణలు చేసి, క్వింటాళ్లకొద్దీ  ప్రెస్‌నోట్లు విడుదల చేశారు. పోలీసు శాఖలో కమ్మ వర్గానికి చెందిన వారిని ఎక్కువగా కీలకపోస్టులో నియమించారని కూడా వైసీపీ నేతలు, సొంత మీడియా ఆరోపించింది. ఇసుకలో టీడీపీ నేతలు దోచుకుతింటున్నారని, ఇళ్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయని విలేకరుల సమావేశాలు పెట్టి ఆరోపించారు. వాటిని అన్ని పత్రికలు రాశాయి. చానెళ్లు చూపించాయి  అప్పటి స్పీకర్ కోడెల కుటుంబం నరసరావుపేట, సతె్తనపల్లిలో కె టాక్సు వసూలు చేస్తోందని స్వయంగా జగన్ ఆరోపించారు. పశుసంవర్ధకశాఖలో కోడెల ఫార్మాకంపెనీ నుంచి కోట్ల రూపాయలలో మందులు కొనుగోలు చేసిందని, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లకు టార్గెట్లు పెట్టి మరీ మందులు అమ్మిస్తోందని, గుంటూరులో కోడెల కుటుంబం తన భవనాలను ప్రభుత్వ శాఖలకు లక్షలరూపాయలకు అద్దెలకు ఇచ్చిందని సాక్షి కూడా కథనాలు రాసింది. అసెంబ్లీ ఫర్నీచర్ దొంగతనం విషయంలో.. సాక్షి కథనాలకు కోడెల, ఆయన కుటుంబం సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. బాబు తనయుడు లోకేష్ పైనయితే లెక్కలేనన్ని కథనాలు సంధించింది. నాడు విపక్షంలో ఉన్న వైసీపీ టీడీపీ నేతలు, మంత్రులపై చేసిన ఆరోపణలన్నీ మీడియా ప్రచురించింది. మరి ఆ లెక్కన అప్పుడు అదే బాబు సర్కారు కూడా, ఇప్పటిమాదిరిగా మీడియాకు లీగల్ నోటీసులివ్వలేదు. కొద్దికాలం క్రితం.. చంద్రబాబు నుంచి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ 20 కోట్ల లంచం తీసుకున్నారని, ఎంపి సుజనాచౌదరి బ్రోకరుగా వ్యవహరించారని వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణను మీడియా ప్రముఖంగా ప్రచురించింది. అలాగని, తనపై విజయసాయి తనపై చేసిన ఆరోపణను ప్రచురించినందుకు, కన్నా గానీ, సుజనా గానీ మీడియాకు లీగల్ నోటీసులు ఇవ్వలేదు కదా?

టీడీపీ నేతలపై లెక్కలేనన్ని ఆరోపణలు..

నెల్లూరు జిల్లాలో నారాయణ, విశాఖలో గంటా- అయ్యన్న, తునిలో యనమల, శ్రీకాకుళంలో అచ్చెన్న, కృష్ణాలో దేవినేని ఉమ, గురజాలలో యరపతినేని, చిలకలూరిపేటలో మంత్రి పుల్లారావు, పశ్చిమ గోదావరిలో మంత్రి పీతాని సత్యనారాయణ, కర్నూలులో కెఇ, అఖిలప్రియ, కడపలో సీఎం రమేష్ , అనంతలో జెసి కుటుంబం అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని వైసీపీ నేతలు, ఆ పార్టీ మీడియా ఆరోపించింది. అసెంబ్లీ, సెక్రటేరియేట్ నిర్మాణాల్లో జరిగిన అవినీతిలో నారాయణ పాత్ర, యనమల రామకృష్ణుడు అల్లుడు ఎండీగా ఉన్న సంస్థలో జరుగుతున్న కుంభకోణాలను సాక్షి బయటపెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా గుంటూరులో టీడీపీకి పార్టీ ఆఫీసు కోసం స్థలం కేటాయించారని ఆధారాలతో సహా సాక్షి వెల్లడించింది. గురజాలలో యరపతినేని ఆధ్వర్యంలో, చినబాబు కనుసన్నలలో అక్రమ మైనింగ్ జరుగుతోందని, ప్రత్యేక చెక్‌పోస్టులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని సాక్షిలో ఫొటోలతో సహా కథనాలు రాసింది. ఆ వ్యవహారం ఇప్పుడు సీబీఐ వద్దకు చేరింది. తూర్పుగోదావరి పత్తిపాడులో వరుపుల రాజా లాటరైట్ గనులను దోచుకుంటున్నారని,  ప్రకాశంలో టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, కరణం బలరాం, రామారావుకు చెందిన గ్రానైట్స్‌లో జరుగుతున్న అవినీతి, పెనాల్టీలు చెల్లించకపోవడంపైనా  కథనాలు రాసింది. సీఎంఓ కేంద్రంగా జరిగిన అవినీతిని బట్టబయలు చేసింది. అయితే.. నాటి చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పటిమాదిరిగా తమపై ఆరోపణలు చేసిన వైసీపీ నేతలపైగానీ, వారి ఆరోపణలను ప్రచురించిన మీడియాకు గానీ నోటీసులివ్వలేదు. ఇప్పుడు అలాంటి పనే ఇతర మీడియా సంస్థలు చేస్తుంటే మాత్రం,  సహించకపోవడం.. గతంలో తమ మాదిరిగానే ఇప్పుడు విపక్ష నేతలు చేసిన ఆరోపణలను ప్రచురించినందుకు, లీగల్ నోటీసులిస్తామనడం వైసీపీ ద్వంద్వ విధానాలను స్పష్టం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పింక్ డైమండ్ బాబు ఇంట్లోనే ఉందన్న విజయసాయి..అంతెందుకు? ఎన్నికల ముందు తిరుమల వెంకన్న పింక్ డైమండ్ మాయమయిందని, అది చంద్రబాబు నేలమాళిగల్లో ఉందని విజయసాయిరెడ్డి ఆరోపించారు.  సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దానికి వైసీపీ మీడియా అధిక ప్రాధాన్యం ఇచ్చింది. మళ్లీ ఇప్పటివరకూ ఆ ఊసేలేదు. దానిపై నాటి టిటిడి పాలకమండలి వారిద్దరిపై వేసిన పరుషవునష్టం దావా ఏమయిందో తెలియదు. చంద్రబాబునాయుడు పిరికివాడు కాబట్టే, దానిని ఖండించి సరిపెట్టారని, ఇప్పుడు అసలు పింక్ డైమండ్ లేదని ఆలయ అధికారులే చెప్పినా వారిపై కేసులు వేయలేక పారిపోతున్నారన్న వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లోనే వినిపిస్తుంటాయి. సరే.. చంద్రబాబు పిరికితనం గురించి ఇక్కడ అప్రస్తుతం! ‘చంద్రబాబుకు పోరాడే ధైర్యం లేక, మీడియాతో మనకెందుకులే అన్న నిర్లిప్తత వల్లనే  ఆనాడు జగన్ మీడియా రెచ్చిపోయినా కేసులు వేయలేదు. మా మీద ఎన్ని రాతలు రాసినా మేం ఖండించుకున్నామే తప్ప, ప్రభుత్వపరంగా చర్యలు తీసుకునేందుకు బాబు గారు భయపడ్డారు. పింక్ డైమండ్‌పై ఆయన మీద ఆరోపణలు వచ్చినా గమ్మున కూర్చున్న నాయకుడు ఆయన. ఇప్పుడు జగన్‌ను చూడండి. ఎలా చేస్తున్నారో? ఇప్పటికైనా మా సార్ జగన్‌ను చూసి నేర్చుకోవాల’ని ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. సరే.. టీడీపీ నేతల అంతర్మథనం, వైసీపీ సర్కారు మీడియాపై వ్యవహరిస్తున్న తీరును కాసేపలా పక్కకుపెడితే.. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని గ్రహించకపోవడమే విచారకరం. పాలకులు అశాశ్వతం. అధికారవ్యవస్థ శాశ్వతమని, ఇన్ని గతానుభవాలను చూసైనా అధికారులు గ్రహించకపోవడం విస్మయకరం.

జర్నలిస్టు నాయకులు పిడికిలి బిగించరేం..?

జర్నలిస్టు సంఘాల నాయకుల పేర్లతో ఫోజులు కొట్టే నాయకమ్మన్యులు, జర్నలిస్టు కోటాలో ప్రభుత్వ పదవులు పొందిన వీరవిక్రమ ధీర దిగ్గజ మాజీ జర్నలిస్టు లీడరు కామ్రేడ్లు.. ఒక నాయకుడు చేసిన ఆరోపణలు ప్రచురించినందుకు, అధికారులు మీడియాకు లీగల్ నోటీసులిస్తామని హెచ్చరించడాన్ని, ఇప్పటివరకూ ఖండించకపోవడమే ఆశ్చర్యం. సరే.. పాపం జర్నలిస్టుల కోటాలో పదవులు తీసుకుని, సుఖనిద్ర పోతున్న మాజీ కామ్రేడ్లకంటే, పాలకులతో మొహమాటాలు ఉంటాయనుకోవచ్చు. మరి రోజూ మీడియా రంగమే జీవనాధారంగా ఉన్న, జర్నలిస్టు సంఘాల నాయకులకు ఏమయిందన్నది ప్రశ్న. తమ సంఘాల జిల్లా సమావేశాలు, రాష్ట్ర సమావేశాలు ఎక్కడ పెట్టాలి? స్పాన్సర్లను ఎవరిని ఎంచుకోవాలి? అక్రెడిటేషన్ కమిటీల్లో తమ సంఘాల ప్రాతినిధ్యం ఏమిటి? మంత్రులు-అధికారులతో భేటీ అయి, ఆ ఫొటోలను వాట్సాప్, ఫేసుబుక్‌లో పెట్టి, వాటిని మార్కెటింగ్ చేసుకునే తపనలో.. కనీసం ఐదోవంతయినా, ఇలాంటి చర్యలను ఖండించడంలో చూపిస్తే.. పత్రికాస్వామ్యం పదికాలాలపాయినా పదిలంగా ఉంటుంది.

చర్చించినందుకు.. టీవీ-5పై  కేసా?

అవును.. ఆంధ్రాలో పత్రికాస్వేచ్ఛ పతనం అంచున కనిపిస్తోంది. ప్రశ్నించిన గొంతులను నొక్కివేసే ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయి.  ఇటీవల టీవీ-5 చానెల్‌లో ఒక చర్చ జరిగింది. దానికి హాజరయింది ఒక మాజీ న్యాయమూర్తి. చర్చ నిర్వహించిందని మూర్తి అనే జర్నలిస్టు. విశ్వవిద్యాలయాల్లో నియామకల్లో జరుగుతున్న సిఫార్సు రాజకీయాలు ఆ చర్చ సారాంశం! వైసీపీ నేతలు సిఫార్సు చేసిన వారికే యూనివర్శిటీలలో పదవులు దక్కాయని స్వయంగా మాజీ న్యాయమూర్తి వెల్లడించారు. ఆ విషయాన్ని ఆంధ్రజ్యోతి సహా అన్ని పత్రికలూ అప్పుడే ప్రచురించాయి. ఆ విషయాన్ని చర్చించినందుకు సదరు న్యాయమూర్తి, జర్నలిస్టు మూర్తి, ఆ చానెల్ యజమాని నాయుడుపై ఆంధ్రా పోలీసులు కేసులు పెట్టిన వైనం దిగ్భ్రమ పరిచింది. ఇంతకూ దానిపై ఫిర్యాదు చేసిందెవరో  తెలుసా?.. చంద్రబాబు హయాంలో, ఆయన పేషీలో చక్రం తిప్పిన ఐఏఎస్ అధికారి సతీష్‌చంద్ర!  ఆ యూనివర్శిటీ నియామకాలకు సంబంధించిన ఫైల్ ఎలా వచ్చిందన్నది ఆయన ఆ ముగ్గురిపై మోపిన అభియోగం. కేసుల పేరుతో తనను పోలీసులు ఎలా వేధిస్తున్నారో జర్నలిస్టు మూర్తి విడుదల చేసిన వీడియో పరిశీలిస్తే, ఆంధ్రాలో పత్రికాస్వామ్యం, జర్నలిస్టు సంఘాల నిస్సహాయత ఏమిటన్నది స్పష్టమవుతుంది.

రఫెల్ డీల్‌లో ఏం జరిగిందంటే..

సరే.. వారికి న్యాయవాది జంధ్యాల రవిశంకర్ కోర్టులో పోరాడి, బెయిల్ ఇప్పించారనుకోండి. ఈవిధంగా జర్నలిస్టులందరిపై  కేసులు పెట్టి, రోజుల తరబడి విచారణకు తిప్పిస్తే, ఎంతమంది జంధ్యాల రవిశంకర్లు కావల్సి ఉంటుంది? పార్లమెంటును అట్టుడించిన రఫెల్ డీల్ కేసు పత్రాలను ప్రచురించినందుకు, హిందూ రామ్‌పై ఇలాగే కేసులు పెట్టారు. అయితే, అందులోని అంశాలు నిజమైనవా? కావా? అన్న సుప్రీంకోర్టు ప్రశ్నకు ఫిర్యాదుదారు వద్ద సమాధానం లేదు. పైగా అంత ముఖ్యమైన పత్రాలను కాపాడుకోలేకపోవడం ప్రభుత్వం తప్పని సుప్రీం తేల్చింది.  ఆ ప్రకారంగా.. యూనివర్శిటీ నియామకాలపై వైసీపీ నేతల సిఫార్సులను చాలావరకూ ప్రభుత్వం ఆమోదించింది. పైగా ఇవన్నీ సహజమేనని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అలాగే చేస్తారని సర్కారు సలహాదారొకరు ఉన్నమాట చెప్పారు. ఆయన చెప్పింది అక్షరసత్యమే. గతంలో చంద్రబాబు హయాంలో, శ్రీనివాసనాయుడు చెప్పిందే యూనివర్శిటీ నియామకాలకు వేదంగా ఉండేది. దానిపై జగన్ మీడియా కథనాలు కూడా రాసింది. మరి ఉన్న విషయం వెలుగులోకి వస్తే, దానిపై దిద్దుబాటకు దిగాల్సింది పోయి, ఇలా కేసులపేరుతో వేధిస్తే పోయేది ప్రభుత్వం పరువే!

By RJ

Leave a Reply

Close Bitnami banner