జగన్ సర్కారు ‘పది’ నసలు!

389

టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు
ముందు ససేమిరా, తర్వాత రద్దు
ఎందుకీ మొండిపట్టు?
సీఎంఓ ఏం చేస్తున్నట్లు?
మంత్రికి చెప్పే ధైర్యం లేదా? 
(మార్తి సుబ్రహ్మణ్యం)

అనుభవమైతే గానీ తత్వం బోధపడదని సామెత. కానీ.. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఎన్నిసార్లు అనుభవమయినా.. ఇప్పటికీ తత్వం బోధపడకపోవడమే ఆశ్చర్యం. కీలక అంశాలపై కూడా అనవసర ప్రతిష్ఠ, మొండితనం ప్రదర్శిస్తున్న వైనం, జగన్ వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీస్తోంది. కోర్టు తీర్పులను అటుంచితే.. తాజాగా పదవ తరగతి పరీక్షల వ్యవహారంపై సర్కారు వేసిన కప్పగంతులు.. ప్రభుత్వానికి ఒక నిర్ణయం తీసుకునే విషయంలో ఒక అంచనా లేదన్నది స్పష్టమయింది. రాష్ట్రంలో 6.3 లక్షల మంది విద్యార్ధులు పదవ తరగతి చదువుతున్నారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో.. పదవ తరగతి పరీక్షలు రద్దు చేసి, అందరినీ పాస్ చేయించాలన్న చర్చ గత నెల రోజుల నుంచి దేశవ్యాప్తంగా జరిగింది. ఆ తర్వాత తెలంగాణలో కేసీఆర్ వెంటనే స్పందించి, రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు రద్దు చేసి, అందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించారు.

అన్ని రాష్ట్రాలు రద్దు చేసినా… అదే మొండి వైఖరి

తెలంగాణతోపాటు.. తమిళనాడు, పుదుచ్చేరి, చత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాలు కూడా పదవ తరగతి పరీక్షలు రద్దు చేశాయి.  తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాలయితే పరీక్షలు రద్దుతో పాటు, విద్యార్థులకు గ్రేడ్లు ప్రకటించాయి. అయినా ఏపీ సర్కారు స్పందించలేదు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, లోకేష్, బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధిపతి పవన్, కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాధ్, సీపీఐ రామకృష్ణ కూడా పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేసినా, జగన్ సర్కారు స్పందించలేదు. పైగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ ..మొత్తం 11 పేపర్లను ఆరుకు తగ్గిస్తామని ప్రకటించి, ఆ మేరకు ఉత్తర్వు కూడా జారీ చేశారు. ఈ నిబంధన ఈ ఏడాదిలో పరీక్షలు రాసే రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలకు మాత్రమే వర్తిస్తాయని, ఈ ఏడాది మాత్రపే పరీక్ష పేపర్ల కుదింపు ఉంటుందని, వ చ్చే ఏడాది నుంచి యధావిథిగా 11 పేపర్లు ఉంటాయని కూడా పేర్కొన్నారు.

రద్దు లేదన్న నోటితో రద్దు ప్రకటన..

తాజాగా మళ్లీ మీడియా ముందుకు వచ్చిన అదే మంత్రి సురేష్.. ఏ ఈడాది పదవ తరగతి పరీక్షలు రద్దు చేస్తూ,  అందరినీ పాసయినట్లు ప్రకటిస్తున్నామని చెప్పారు. ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నామన్నారు. పదితోపాటు ఇంటర్‌లో ఫెయిల్, ఫస్టియర్, సెకండియర్ విద్యార్ధులంతా పాసయినట్లు ప్రకటించారు. జగన్ ఆదేశాల మేరకే ఈనిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణ, పుదుచ్చేరి, తమిళనాడులో కూడా ఇదే విధానం పాటించారని సెలవిచ్చారు.

పరీక్షలపైనా ప్రతిష్ఠనా..?

నిజానికి కొద్ది రోజుల నుంచి మీడియా, విపక్షాలు, విద్యార్ధి సంఘాలు కూడా ఇదే డిమాండ్ చేశాయి. సహజంగా ఇలాంటి విషయాలు పట్టించుకోని పార్టీల అధ్యక్షులు కూడా, ఈసారి కరోనాను దృష్టిలో ఉంచుకుని, పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేయడం విశేషం. అంటే ఆ అంశానికి ఎంత ప్రాధాన్యం ఉందన్న విషయాన్ని సర్కారు విస్మరించింది. అయినా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం దానిపై కనీస శ్రద్ధ కూడా చూపకపోగా, ప్రతిష్ఠగా తీసుకుంది. ఫలితంగా, 11 పేపర్ల బదులు 6 పేపర్లకు కుదిస్తామని ప్రకటించింది. అయితే, రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, చివరకు పరీక్షలు రద్దు చేయకతప్పలేదు.

ఆ పని అప్పుడే చేసి ఉంటే…

అదేదో  తెలంగాణ ప్రభుత్వం పరీక్షలపై నిర్ణయం తీసుకున్నప్పుడే ఏపీ కూడా ప్రకటించి ఉంటే, జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ ప్రతిష్ఠ పెరిగేది. పార్టీలు, విద్యార్ధి సంఘాలు కూడా హర్షించేవి. తాజాగా సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని, జనసేనాధిపతి పవన్‌కల్యాణ్ కూడా హర్షించారు. అలాకాకుండా..టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు, విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేసిన తర్వాత.. పరీక్షలు రద్దు చేశారు. దానితో  ఆ క్రెడిట్ అంతా వారికే వెళ్లినట్టయింది. ఎప్పటి నిర్ణయాలు అప్పుడు తీసుకోనందుకే తమ ప్రభుత్వానికి అప్రతిష్ఠ వస్తోందని, మంత్రులు కూడా నిమిత్తమాత్రంగా వ్యవహరిస్తూ, సమస్యను సీఎంకు చెప్పడంలో విఫలమవుతున్నారని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

సీఎంఓ ఏం చేస్తోంది..?

అయితే, ఇలాంటి కీలక అంశాలను పర్యవేక్షిస్తున్న సీఎంఓ అధికారులు.. ఇప్పటివరకూ ఏం చేస్తున్నారో అర్ధం కావడం లేదని, వైసీపీ ప్రజాప్రతినిధులు సైతం ప్రశ్నిస్తున్నారు. సీఎంఓలో పనిచేసేవారికి, గతంలో అక్కడ పనిచేసిన అనుభవం లేనందుకే.. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఏ అంశాన్ని సకాలంలో సీఎం వద్దకు తీసుకువెళ్లాలని తెలియడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.